Age of Consent: లైంగిక సంబంధాలకు అంగీకారం తెలిపే వయసు ఎంత ఉండాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
"నాకు 11 ఏళ్లకే పెళ్లి చేశారు. 14 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక పిల్లవాడు కూడా పుట్టేశాడు. మీ అమ్మ పుట్టేటప్పటికి నాకు 18" ఇప్పటికి రెండు తరాల ముందు ఇలాంటి మాటలు చాలా మంది తమ నానమ్మలు, అమ్మమ్మల దగ్గర నుంచి వినే ఉంటారు.
అంత చిన్నప్పుడే మీకు పెళ్లిళ్లు చేసేశారా అని ఆశ్చర్యపోవడం మన వంతు అయ్యేది. మారుతున్న కాలంతోపాటే పెళ్లిళ్లు చేసుకునే వయసు కూడా మారుతూ వచ్చింది.
ఆధునిక తరంలో 30లు వస్తేనే కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.
హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్ళి చేసుకోవడానికి అబ్బాయిల వయసు 21, అమ్మాయిల వయసు 18 ఉండాలి. భారతదేశంలో పెళ్లిని, లైంగిక సంబంధాలను వేర్వేరుగా చూడటం చాలా అరుదు.
2012వరకు లైంగిక సంబంధాలకు అంగీకారం (ఏజ్ ఆఫ్ కన్సెంట్ ) తెలిపేందుకు 16 ఏళ్ళు ఉన్న వయసు పోక్సో చట్టం ద్వారా 18కి మారింది. ఇది 1860లో 10 ఏళ్ళు ఉండేది. 1891లో 12 ఏళ్లకు పెరిగింది. 1925లో 14కి, 1940లో 16ఏళ్లకు పెంచారు.
ప్రస్తుతం పోక్సో చట్టాన్ని ఆధారంగా చేసుకుని లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపే వయసు 18.
వివాహానికి, లైంగిక సంబంధాల్లో ప్రవేశించేందుకు సామర్ధ్యం ఉన్న వయసును "అంగీకారం తెలిపే వయసుగా (ఏజ్ ఆఫ్ కన్సెంట్)" నిర్వచిస్తారు.


ఫొటో సోర్స్, Getty Images
అమికస్ క్యురీ నిర్ణయం ఏంటి?
నిపుణ్ సక్సేనా, యూనియన్ ఆఫ్ ఇండియా 2012 కేసులో నమోదైన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ను అమికస్ క్యురీగా నియమించింది.
ఏదైనా కేసులో ఒక నిర్ణయానికి రావడానికి అందులో దాగిన అంశాలను పరిశీలించేందుకు కోర్టు నియమించిన వ్యక్తిని లేదా సంస్థను అమికస్ క్యురీ అని అంటారు. ఒక మాటలో చెప్పాలంటే 'కోర్టుకు స్నేహితులు' అని అర్ధం.
ఈమె అనేక అంశాలను పరిశీలించి లైంగిక సంబంధాలకు అంగీకారం తెలిపే వయసును 18 నుంచి 16 కి తగ్గించాలని సూచించారు.
ఇద్దరు మైనర్లు ఇష్టపూర్వకంగానే లైంగిక చర్యలో పాల్గొన్నప్పటికీ పోక్సో చట్టం వారిని నేరస్తులుగానే పరిగణిస్తుంది. ఇది ఇద్దరు వ్యక్తుల రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అని ఆమె అభిప్రాయం. వాళ్ళ స్వతంత్రం, ఆలోచనా పరిపక్వత, అంగీకారం తెలిపే సామర్ధ్యం - చట్టం వీటిని అర్ధం చేసుకోవటం లేదని ఆమె వాదన.
అసలు అంగీకారం తెలిపే వయసును 16 నుంచి 18కి పెంచడానికి సమర్ధించగలిగే కారణాలు లేవని ఆమె అంటారు.
18 కంటే తక్కువ వయసు ఉన్న వారికి లైంగిక సంబంధాలకు అంగీకారం తెలిపే మానసిక పరిణితి ఉండదని కోర్టు అభిప్రాయం.
విశాఖపట్నానికి చెందిన ఐవీఎఫ్ నిపుణులు ప్రొఫెసర్ రామరాజు ఈ విషయాన్ని సమర్ధించారు. ఓటు హక్కు సంపాదించుకోవడానికి 18 ఏళ్ళు రావాలన్నప్పుడు, 16 ఏళ్లకే లైంగిక సంబంధాలకు అంగీకారం తెలపడమెందుకని ప్రశ్నించారు. శారీరకంగా పరిణితి చెందినప్పటికీ మానసిక పరిణితి ఉండదని, గర్భం దాలిస్తే శరీరానికి తట్టుకునే శక్తి ఉండదని అన్నారు.
పూర్వకాలంలో 16 ఏళ్ల లోపే పెళ్లిళ్లు అవుతూ ఉండేవి కదా అని ప్రశ్నించినప్పుడు, "1940లలో భారతదేశంలో సగటు ఆయు: ప్రమాణం 40- 45 మధ్య ఉండేది. ప్రస్తుతం అది 74 వరకు పెరిగింది. దీనిని బట్టి ప్రస్తుత కాలంలో లైంగిక సంబంధాలకు అంగీకారం తెలిపే వయసు ఎంత ఉండాలి’’ అని ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
పోక్సో నిబంధనలు ఏం చెబుతున్నాయి
ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతోనే లైంగిక సంబంధాల్లో ప్రవేశిస్తున్నప్పటికీ కేవలం వయసు నెపంతో వారిపై కేసులు పెడుతున్న ఉదాహరణలు చాలా ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల్ అన్నారు.
చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టే POCSO చట్టం (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) కూడా ఇందుకు ఒక కారణమని అంటారు.
ఇటీవల ఒక నిందితుడికి పోక్సో కేసు నుంచి శిక్ష తప్పించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కేసులో అబ్బాయి షెడ్యూల్డ్ కులానికి చెందినవాడు. అమ్మాయి తెలుగు రాష్ట్రాల్లో ఒక అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి. అమ్మాయి వయసు 17 సంవత్సరాల 9 నెలలని చెప్పారు. పోలీసులకు కూడా ఈ విషయం తెలుసు కానీ, కేవలం ఒత్తిడి కారణంగా కేసులు నమోదు చేసే పరిస్థితి వస్తోందని శ్రీకాంత్ చెప్పారు.
"చాలాసార్లు తమ మైనర్ అమ్మాయి ఎవరితోనైనా పారిపోయినప్పుడు, లేదా ఇతర సామాజిక వర్గాలకు చెందినవారితో లైంగిక సంబంధాలకు పాల్పడినప్పుడు తల్లితండ్రులు అవతలి వ్యక్తులపై పోక్సో కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తారు. ప్రేమించుకుని విడిపోయిన తర్వాత కూడా చాలా మంది అమ్మాయిలు తమ ప్రేమికుడిపై రేప్ కేసు పెడతారు’’ అని శ్రీకాంత్ అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆయన అభిప్రాయపడ్డారు.
2024 ఎన్.సి.ఆర్.బి లెక్కల ప్రకారం 2019 నుంచి మే 2024 వరకు దేశవ్యాప్తంగా 2,99,759 పోక్సో కేసులు నమోదు కాగా, తెలంగాణలో 2,731, ఆంధ్రప్రదేశ్‌లో 11,774 కేసులు నమోదయ్యాయి.
గత ఐదు సంవత్సరాలలో చిన్నారులపై లైంగిక దాడుల కేసులు సుమారు 20 శాతం పెరిగినట్లుగా చెబుతున్న లెక్కలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి.
2017-2021 మధ్యలో 16-18 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిపై మైనర్లపై పెట్టిన పోక్సో కేసులు 180 శాతం పెరిగాయని ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు.
‘‘పోక్సో చట్టంలోని నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇందులో సెక్షన్ 29, అనుమానితులను దోషిగానే చూస్తుంది. తప్పు చేయలేదని అనుమానితుడే నిరూపించుకోవాలి. దీంతో ఇందులో శిక్ష పడే కేసులు ఎక్కువగా ఉంటాయి. శిక్ష కేవలం బాధితుల ఫిర్యాదు ఆధారంగా వేస్తారు. మరో ఆధారం లేకపోయినా కూడా చాలా మంది ఈ చట్టాన్ని కక్షలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు’’ అని శ్రీకాంత్ అన్నారు.
ఇందిరా జైసింగ్ వాదన కూడా ఇదే. ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా ఏర్పర్చుకునే లైంగిక సంబంధాలను నేరంగా పరిగణించడం వల్ల రహస్యంగా సంబంధాలు పెట్టుకుంటారని ఆమె అంటారు. ఈ వయసు తగ్గిస్తే పోక్సో, ఐపీసీ కింద తప్పుడు కేసులు పెట్టే అవకాశాలు తగ్గిపోతాయని ఆమె అంటారు.
ఇలా ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా ప్రవేశించే సంబంధాలను నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె అభిప్రాయం. లైంగిక దాడికి, అంగీకారంతో పెట్టుకునే లైంగిక సంబంధాల మధ్య తేడాను కూడా చట్టం పరిగణించాలని ఇందిరా జైసింగ్ అంటారు.
‘‘లైంగిక స్వతంత్రత మనిషి హుందాతనానికి సంబంధించిన అంశమని అంటూ ఒకరి శరీరంపై హక్కును కాదనడం ఆర్టికల్ 14, 15, 19, 21కి వ్యతిరేకం’’ అని ఇందిరా జైసింగ్ అన్నారు.
కానీ, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ పుట్టడానికీ, వయసుకు సంబంధం లేదని అంటూ ప్రస్తుత కాలంలో యుక్త వయసు త్వరగా వస్తోందని ఆమె అన్నారు.
హైదరాబాద్‌కి చెందిన హైదరాబాద్ రెయిన్‌బో హాస్పిటల్‌లో క్లినికల్ న్యూట్రిషనిస్ట్‌గా చేస్తున్న కిరణ్మయి అడ్డు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.
ఆధునిక కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు యుక్తవయసులోకి వచ్చే వయసు తగ్గిందని అన్నారు.
"వాతావరణ మార్పులు, ప్రాసెస్డ్ ఫుడ్, ఎరువులతో కూడిన ఆహారం, లైఫ్ స్టైల్ మార్పులు కూడా అమ్మాయిల్లో 8 ఏళ్లకు, అబ్బాయిల్లో 9 ఏళ్లకు ముందే యుక్త వయసు లక్షణాలు మొదలవుతున్నట్లు చాలా అధ్యయనాలు కూడా వెలువడ్డాయి. ఊబకాయం లాంటివి కూడా హార్మోన్ల పని తీరుపై ప్రభావం చూపిస్తున్నాయి’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టీనేజ్ పిల్లలున్న తల్లులు ఏమంటున్నారు
ఏజ్ ఆఫ్ కన్సెంట్ గురించి నేను కొంత మంది టీనేజ్ పిల్లలున్న తల్లులతో మాట్లాడాను.
‘‘నిజమే! 16 ఏళ్లకు శారీరక ఎదుగుదల ఉంటుంది. కోరికలు కలగడం సహజం. కాదనలేం. కానీ, చట్టం చెబుతోంది కదా అని మానసిక పరిణితి లేనిదే లైంగిక సంబంధాలకు ఎలా అంగీకరిస్తాం’’ అని వారు ప్రశ్నించారు.
"నాకు 18 ఏళ్లకే పెళ్లి అయింది. 20 ఏళ్లకే ఇద్దరు పిల్లలు పుట్టారు. నా పరిస్థితులు వేరు. కానీ, ప్రస్తుతం నేను చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా" అని హైదరాబాద్‌కి చెందిన నిహారిక అన్నారు.
"వయసులో కలిగే కోరికలు నియంత్రించాలంటే వాళ్ళు పూర్తిగా తమ చదువు, కెరీర్ ఇతర హాబీలపై దృష్టి పెట్టేలా చూడాలి. సంగీతం, డాన్స్, యోగ లాంటివి చాలా ఉపయోగపడతాయి. పెద్దవాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. ఏది సరైంది అనే విషయంపై అవగాహన కలిగించాలి" అని నిహారిక అన్నారు.
భారత ప్రభుత్వం మాత్రం లైంగిక సంబంధాలకు అంగీకారం తెలిపే వయసును తగ్గించేది లేదని కచ్చితంగా చెప్పింది. ఈ నిబంధనలు మైనర్ పిల్లలపై దాడి జరిగినప్పుడువారిని రక్షిస్తుందని అంటారు.
మహిళా, శిశు మంత్రిత్వ శాఖ 2007లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 53.22% మంది పిల్లలు ఏదో ఒక రకమైన లైంగిక దాడికి గురవుతూ ఉన్నారని, లైంగిక దాడులకు పాల్పడిన వారిలో 50% మంది అధికారంలో ఉన్న వ్యక్తులే ఉంటారని పేర్కొంది.
ముఖ్యంగా ఇలాంటి దాడులకు పాల్పడినవారిలో బంధువులు, తల్లితండ్రులు, ఇరుగు పొరుగువారు, స్కూలు సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. దాడికి పాల్పడినవారు పేరున్న వ్యక్తులైనప్పుడు, వీటిని రిపోర్ట్ చేయనివ్వకుండా భయపెట్టి నోరు మూయించే అవకాశాలున్నాయని పేర్కొంది.
'ఏజ్ ఆఫ్ కన్సెంట్'పై ఆగస్టు 20న సుప్రీం కోర్టులో విచారణ ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














