అనంతపురం-మియావాకీ: కరువు ప్రాంతంలో పచ్చని అడవులు, ఎలా సాధ్యమైంది?

అనంతపురం-మియావాకీ
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అనంతపురం అనగానే చాలామందికి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంగానే తెలుసు. అక్కడ వ్యవసాయం ఎంత కష్టమో కూడా తెలుసు.

కానీ, అటువంటి ప్రాంతంలో ఒక పచ్చని అడవినే పెంచే అరుదైన ప్రయత్నం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బొటానిక్ గార్డెన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రవి ప్రసాద్ రావు చేస్తున్నారు.

జపాన్ నుంచి ప్రపంచంలోని పలుప్రాంతాలకు వ్యాప్తి చెందిన మియావాకీ తరహా మొక్కల పెంపకం శుష్క భూముల (ఎరిడ్) నిలయమైన అనంతపురంలో చేపట్టారు ప్రొఫెసర్. దాదాపు ఆరేళ్ల ఈ ప్రయత్నం ఫలించి ఇప్పుడు ఆకుపచ్చగా కనిపిస్తోంది. మియావాకీతో పాటు మొత్తం బొటానిక్ గార్డెన్ వైవిధ్యభరితంగా రూపొందించారాయన.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అనంతపురం-మియావాకీ

ఎప్పుడు మొదలైంది?

విశాలమైన ఎస్కే యూనివర్సిటీ ప్రాంగణంలో ఒకప్పుడు చెట్లు చాలా తక్కువ ఉండేవి. ఈ క్రమంలో వృక్ష శాస్త్ర విభాగం ప్రొఫెసర్ అయిన రవి ప్రసాద్ రావు 2013లో క్యాంపస్‌లో నర్సరీ ప్రారంభించారు. ఏపీ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ఆర్థిక సాయంతో మోడల్ నర్సీరీ ప్రోగ్రామ్ కింద బొటానికల్ గార్డెన్ మొదలుపెట్టారు. 2017 వరకూ 3 ఎకరాల్లో విస్తరించారు.

2018లో ఏపీ గ్రీనరీ కార్పొరేషన్ రాష్ట్రంలో మూడు చోట్ల ప్రయోగాత్మకంగా మియావాకీ అడవులను పెంచే ప్రయత్నం చేసింది. అందులో ఎస్కేయూ భాగస్వామి అయింది. 2019లో రూ. 17.5 లక్షల ఖర్చుతో ఈ మియావాకీ అడవి ప్రయోగం మొదలైందని ప్రొఫెసర్ చెప్పారు.

మియావాకీ పద్దతి, చెట్లు నాటడం

ఫొటో సోర్స్, Gateshead Council

ఫొటో క్యాప్షన్, మియావాకీ అడవుల పద్దతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

అసలేంటీ మియావాకీ?

1980లలో జపాన్‌లో మియావాకీ అకీరా అనే వ్యక్తి ఈ తరహా ప్రయోగం చేశారు. ఆయన పేరిట ఇది ప్రచారం పొందింది. పారిశ్రామిక ప్రదేశాల్లో, బాగా దెబ్బతిన్న అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో అలాగే నగరాల్లో దట్టంగా మొక్కలు పెంచడానికి ఉద్దేశించినది ఈ ప్రయోగం.

''సాధారణంగా మియావాకీలో దాదాపు అర మీటరుకు అంటే 50 సెంటీమీటర్లకు ఒక చెట్టు చొప్పున నాటుతారు. అలా ఒకటి లేదా రెండెకరాల్లో మియావాకీని పెంచుతారు. అందులో స్థానిక జాతులనే పెంచాలి. అడవి జాతి లేదా స్థానిక జాతులకే ప్రాధాన్యత ఇవ్వాలి. అలా పెంచితే, ఒక ఎకరాకి 3 వేల చెట్లు వస్తాయి. వీటినే మ్యాన్ మేడ్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. 2014-16 మధ్య భారతదేశంలో మియావాకీ గురించి బాగా అధ్యయనాలు జరిగాయి'' అని ప్రొఫెసర్ రవి ప్రసాద్ రావు బీబీసీకి వివరించారు.

''దీనికి అన్ని రకాల పర్యావరణ సూత్రాలూ పాటించాలి. అయితే ఇది చాలా పెద్ద విస్తీర్ణంలో పెంచడం కుదరదు. నగర ప్రాంతాలకు బాగా పనికివస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పరిశ్రమలు కార్బన్ క్రెడిట్ కోసం ఈ తరహా అడవులను పెంచడమో లేదా వాటి పెంపకానికి నిధులివ్వడమో చేస్తుంటాయి'' అని అన్నారు ప్రొఫెసర్.

అనంతపురం-మియావాకీ
ఫొటో క్యాప్షన్, మొక్కల గురించి బీబీసీ ప్రతినిధి బళ్ళ సతీశ్‌కు వివరిస్తున్న ప్రొఫెసర్ రవి ప్రసాద్ రావు.

అనంతలో కాస్త భిన్నంగా

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడల్ కాకుండా, అనంతపురంలో కాస్త భిన్నంగా ప్రయత్నిచారు రవి ప్రసాద్ రావు.

ఇక్కడ అర మీటరు కాకుండా, మీటరు దూరానికి ఒక చెట్టు చొప్పున పెట్టారు.

''ఒక ఎకరాలో 1,534 మొక్కలు పెట్టాను. ‌12 కంపార్టుమెంట్ల కింద పెట్టాను. 4 లేన్లు గనిమలు తవ్వాం. వైవిధ్యమైన మొక్కలు పెంచాం. అడవి రకాలు, మామూలు రకాలు కలిపి 154 రకాల మొక్కలు ఈ ఒక్క ఎకరాలోనే పెంచాను. మియావాకీ తరహా ఒకే చోట ఎక్కువ చెట్లు కాకుండా మీడియంగా పెంచాను. ఒక రకంగా ఇది పూర్తి మియావాకీ ఫారెస్ట్ కాదు'' అన్నారాయన.

‘‘జపాన్ పద్ధతి ఉన్నదున్నట్టు మనకు సరిపోదు. అందుకే ఇక్కడ మార్చాను’’ అన్నారు ప్రొఫెసర్.

ప్రతిఫలాలు ఆశించి ఈ తరహా అడవులు పెంచకూడదు అంటారు ప్రొఫెసర్ రవి ప్రసాద రావు.

''వీటి నుంచి పూలు, పండ్లు తీసుకోకూడదు. గ్లోబర్ వార్మింగ్ తగ్గించడం, మంచి ఎకో సిస్టం ఏర్పాటు చేయడం కోసం వీటిని పెంచాలి. వీటికి మొదటి మూడేళ్ళూ నీరు ఇవ్వాలి. తరువాత అవసరం లేదు. వేసవిలో మరీ ఇబ్బంది అయితేనే ఒకట్రెండు సార్లు నీరు ఇస్తాం. ప్రారంభంలో కాస్త ఖర్చు పెట్టాలి'' అని వివరించారాయన.

''కొత్త అంనతపురం జిల్లాలో 2 శాతమే అడవి ఉంది. ఇలాంటి చోట్ల పచ్చదనం పెంచడానికి ఈ పద్ధతి పనికి వస్తుంది. ఒక రకంగా మేము ఈ ప్రాంతానికి తగిన కొత్త మోడల్ సిద్ధం చేస్తున్నాం. ఇక్కడ నేల మంచిది. చెట్లపై శ్రద్ధ పెట్టాలి'' అని ఆయన వివరించారు.

అనంతపురం-మియావాకీ

'కొన్ని జాతుల్లో రికార్డు పెరుగుదల'

అనంతపురం ఎరిడ్ జోన్‌లో ఉండటం, నేల స్వభావం రీత్యా ఈ ప్రయత్నం చేసినట్టు ప్రొఫెసర్ చెప్పారు.

''ఇందుకోసం 2 అడుగుల మట్టి తొలగించాం. స్థానిక మట్టితో ట్రీట్మెంట్ చేశాం. ఆర్గానిక్‌గా చేశాం. వర్మీ కంపోస్ట్, కోకోపిట్, పేడ, వరి పొట్టు, ఎండుగడ్డి వంటివీ వాడాం. వేసిన 6 నెలల్లో అన్ని మొక్కలూ పెరిగాయి. కానీ, ఏడాది తరువాత కొన్ని పోటీ తట్టుకోలేకపోయాయి. మరికొన్ని బాగా పెరిగాయి. 154 రకాల్లో 20 రకాలు చనిపోయాయి. మట్టి, వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా జరిగింది. 50 రకాల జాతుల్లో 100 శాతం పెరుగుదల కనిపించింది.'' అని ఆయన అన్నారు.

అదే సమయంలో సాధారణంగా ఆయా జాతులు పెరగనంత ఎత్తు, కాండంతో కొన్ని రకాల మొక్కల పెరుగుదల కనిపించిందన్నారాయన. కొన్ని జాతులయితే రికార్డు పెరుగుదల చూపించాయని ప్రొఫెసర్ రవి ప్రసాద్ చెప్పారు.

ఈ మియావాకీకి సంబంధించి ఐదేళ్లుగా ప్రత్యేక రికార్డు నిర్వహిస్తూ, సూక్ష్మమైన వివరాలతో సహా నమోదు చేస్తున్నారు రవి ప్రసాద రావు బృందం. విశ్వవిద్యాలయ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఆయనకు సహకారం అందిస్తున్నారు.

''ఇది భారతదేశానికి ఎలా ఉపయోగపడేలా చేయాలి, ముఖ్యంగా నీటి ఎద్దడి ప్రదేశాలకు ఎలా ఉపయోగపడుతుంది అనే కోణంలో మేం అధ్యయనం చేస్తున్నాం'' అన్నారు ప్రొఫెసర్ రవి ప్రసాద రావు.

అనంతపురం-మియావాకీ

'పక్షులు చేరుతున్నాయి'

''గర్త్, ఫ్లవరింగ్ అన్నీ బావున్నాయి. ఏడాది తరువాత 10 కొత్త రకాలు వేశాం. కొత్తవి మళ్లీ పెరిగాయి. మొత్తంగా 144 జాతుల మొక్కలు నిలబడ్డాయి. చాలా మొక్కలు వాటి సాధారణ సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎదిగాయి. కొన్ని మొక్కలు బాగా ఎదిగినా వాటి పక్కవి ఎదగలేదు'' అని ప్రొఫెసర్ రవి ప్రసాద్ వివరించారు.

ఈ అడవిలోకి మొత్తం 4 రకాల పాములు, వందల పక్షులు చేరుకున్నాయనీ, గొప్ప జీవ వైవిధ్యం ఉందనీ చెబుతున్నారు ప్రొఫెసర్.

ప్రస్తుతం ఈ అడవి ఎంత కార్బన్ శోషించుకుంటుందనే అంశంపై కార్బన్ స్టడీ జరుగుతోంది. చెట్లు పెంచినప్పటి నుంచీ ప్రతి ఏటా రిపోర్టులు తీస్తున్నారు. ఈ ఒక ఎకరా అడవి ఐదేళ్లలో 100 టన్నుల కర్బన్ ఉద్గారాలను న్యూట్రల్ చేసి ఉండొచ్చని ప్రాథమిక అంచనా. అంటే సుమారు 300 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ శోషించుకున్నట్టు.

''స్థానిక రకాలు పెంచాలి. అప్పుడే ఇది విస్తృతంగా ఈ ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటుంది'' ఆయన అన్నారు.

ప్రస్తుతం ఈ అధ్యయనంపై జర్నల్‌లో ప్రచురించేందుకు పత్రాలను సిద్ధం చేస్తున్నారు ప్రొఫెసర్ రవి ప్రసాద్.

''అనంతపురం వంటి చోట్ల ఈ తరహాలో దట్టంగా చెట్లను పెంచడం ద్వారా ఇక్కడ వ్యవసాయ రంగంతో పాటు, వాతావరణంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది'' అన్నారాయన.

అనంతపురం-మియావాకీ
ఫొటో క్యాప్షన్, ఎస్కే యూనివర్సిటీ ప్రాంగణంలోని బొటానిక్ గార్డెన్

మియావాకీని మించిన బొటానిక్ గార్డెన్

ఈ విశ్వవిద్యాలయంలో కేవలం మియావాకీ తరహా అడవే కాకుండా, ఇతర అనేక మొక్కలను ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. ఫైకటోరియం, నక్షత్ర వనం, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నారు.

విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 12 ఎకరాల్లో ప్లాంటేషన్ ఉంది. అందులో దాదాపు 1200 రకాలు పెంచుతున్నారు. ఒకప్పుడు 10 శాతం పచ్చదనం ఉన్నచోట ఇప్పుడు 30 శాతం క్యాంపస్ పచ్చగా మారింది.

కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లో దొరికే 25 రకాల మర్రి చెట్ల రకాలతో ఫైకటోరియంను ఏర్పాటు చేశారు. మనకు తెలిసిన మర్రితో పాటు, రాష్ట్రంలో దొరికే, పెరిగే అన్ని రకాల మర్రి జాతుల చెట్లనూ ఒకే చోట చూడవచ్చు. హిందువులు విశ్వసించే జ్యోతిష్య శాస్త్రంలోని నక్షత్రాల ప్రకారం, ఎంపిక చేసిన మొక్కలతో నక్షత్రవనం ఉంటుంది. ఈ వనాలు పూర్తిగా పెరిగితే, అనంతపురం వంటి చోట్ల పచ్చదనానికి ప్రత్యేక అధ్యయనశాలగా ఈ విశ్వవిద్యాలయం నిలవబోతుంది.

‘‘అనంత ప్రాంతం ఎరిడ్, డ్రై ఏరియా, ఇక్కడ చెట్లు మొలవవు, నేల మంచిది కాదు అంటారు. దీంతో ప్రయోగం చేపట్టి కష్టపడి పనిచేశాం. ఇప్పుడు ఆరేడేళ్లలో 4 వేల చెట్లను పెంచాం. ఒక ఎకో సిస్టమ్ తయారు చేశాం. అడవులు తక్కువ ఉన్నచోట ఇది బాగా ఉపయోగపడుతుంది’’ అని వివరించారు ప్రొఫెసర్ రవి ప్రసాద రావు.

''2014 నుంచీ మా దగ్గర బొటానికల్ గార్డెన్ ఉంది. 12 ఎకరాలు ఇచ్చాం. బోటనీ డిపార్టుమెంటు, అందునా ప్రొఫెసర్ బి రవి ప్రసాద రావు ప్రత్యేక శ్రద్ధతో దాన్ని ఈ స్థాయికి తెచ్చారు. 25 చెట్ల నుంచి 4 వేల చెట్ల స్థాయికి వచ్చింది గార్డెన్. వాటిలో 80 శాతం మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. నీటి ఎద్దడిని తట్టుకుని నిలబెట్టాం. పాతికేళ్ళ క్రితం ఈ క్యాంపస్ చూసిన వారు ఇప్పుడు చూస్తే నమ్మలేరు. చుట్టుపక్కల గ్రామాలకు ఉచితంగా మొక్కలు ఇస్తున్నాం'' అని బీబీసీతో చెప్పారు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంచార్జి వైస్ చాన్స్‌లర్ ఆచార్య బి అనిత.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)