సీనియర్ జడ్జి వేధిస్తున్నారని ఆరోపిస్తూ రాజీనామా చేసిన మహిళా జడ్జి అదితి శర్మ, ఆమె ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, MP High Court
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు మహిళా న్యాయమూర్తులను తొలగించడం తప్పు అని వారిని తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు కొన్ని నెలల క్రితం ఆదేశించిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఈ ఆరుగురు న్యాయమూర్తులలో ఒకరు అదితి శర్మ, ఆమె జూలై 28న తన పదవికి రాజీనామా చేశారు.
''నేను ఈ వ్యవస్థ చేతిలో ఓడిపోయినందుకు కాదు, ఈ వ్యవస్థే విఫలమైనందుకు జ్యుడీషియల్ సర్వీసుకు రాజీనామా చేస్తున్నా'' అని అదితి శర్మ అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత 2025 మార్చిలో, అదితి శర్మ మళ్లీ మధ్యప్రదేశ్‌లోని శహ్‌డోల్ జిల్లాలో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె విధుల్లో చేరి ఐదు నెలలు మాత్రమే అయింది.
''ఒకరికి అనుకూలంగా నిర్ణయం వచ్చినప్పటికీ, ఓడిపోయిన వ్యక్తి తన వాదనలు వినిపించి, సంతృప్తి చెందే అవకాశం కల్పించడానికి కోర్టులు అవసరం. నాకు న్యాయం జరగలేదు, విచారణ కూడా జరగలేదు'' అని ఆమె బీబీసీతో అన్నారు.

జిల్లా జడ్జి రాజేశ్ కుమార్ గుప్తా మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన రోజే ఆమె రాజీనామా చేశారు. అదితి శర్మ వేధింపుల ఫిర్యాదులు చేసింది ఆయనపైనే.
రాజేశ్ కుమార్ గుప్తా పదోన్నతిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆమె రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు కొలీజియంకు కూడా ఆమె లేఖ రాశారు.
''ఓ వ్యక్తిపై తీవ్రమైన, పరిష్కారం కాని ఆరోపణలు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి పదోన్నతి కల్పించడం ... వ్యవస్థపై అపనమ్మకాన్ని సృష్టిస్తుంది'' అంటూ అదితి రాసిన లేఖను బీబీసీ ప్రతినిధి చూశారు.

ఫొటో సోర్స్, MP High Court
న్యాయమూర్తి రాజేశ్ కుమార్ గుప్తా ఏమన్నారు?
నూతనంగా నియమితులైన హైకోర్టు న్యాయమూర్తి రాజేశ్ కుమార్ గుప్తా, మధ్యప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌తో ఈ విషయమై మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారు స్పందించలేదు.
"వీళ్లు ఎప్పుడూ ఇలాగే మాట్లాడతారు, కానీ నా మీద ఎప్పుడూ, ఎలాంటి ఫిర్యాదు రాలేదు. నా జీవితమంతా ఒక సాధువులా గడిపాను. నేను 35 ఏళ్లుగా సర్వీసులో ఉన్ను. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు లేదు. నా పదవీ విరమణ కూడా దగ్గరలో ఉంది. ఇంకేదైనా సమాచారం కావాలంటే, హైకోర్టు నుంచి పొందవచ్చు. ఈ విషయంలో హైకోర్టు నుంచి నాకెలాంటి సమాచారం ఇంకా అందలేదు'' అని హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే ముందు బార్ అండ్ బెంచ్ అనే లీగల్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ప్రకటనలో జడ్జి రాజేశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసు ఎలా మొదలైంది?
శిక్షణా కాలంలో పనితీరు సరిగ్గా లేదంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2023 జూన్‌లో, అదితి శర్మతో సహా ఆరుగురు మహిళా న్యాయమూర్తులను తొలగించింది.
దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ అనంతరం, మధ్యప్రదేశ్ హైకోర్టు నలుగురు మహిళా న్యాయమూర్తులను తిరిగి నియమించింది.
ఆ తర్వాత ఇద్దరు న్యాయమూర్తులు అదితి శర్మ, సరితా చౌధరిని తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2025 మార్చిలో, అదితి శర్మ శహ్‌డోల్‌లో సివిల్ జడ్జిగా తిరిగి నియమితులయ్యారు.
అదితి శర్మను తొలగించడానికి ప్రధాన కారణం ఆమె పనితీరు, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టుల్లో (ఏసీఆర్), తుది నివేదికలో పేర్కొన్న రెండు దర్యాప్తులు.
అదితి శర్మపై జరిగిన రెండు దర్యాప్తుల్లోనూ, అప్పటి జిల్లా న్యాయమూర్తి రాజేశ్ కుమార్ గుప్తా దర్యాప్తు ఫలితాల్లో 'పేలవమైన పనితీరు' గురించి రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టులో విచారణ ఏమిటి?
వాస్తవానికి, మధ్యప్రదేశ్‌లో ఆరుగురు మహిళా న్యాయమూర్తుల తొలగింపును 2023లో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణ జరిపింది.
విచారణ సందర్భంగా, ఈ చర్య కేవలం పరిపాలనాపరమైనది కాదు, దండించదగినదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మహిళా న్యాయమూర్తులను తొలగించడానికి ఆధారంగా చేసుకున్న వార్షిక రహస్య నివేదికలు (ఏసీఆర్‌లు) సకాలంలో ఇవ్వలేదని లేదా వారి వివరణ వచ్చిన తర్వాత కూడా ప్రతికూల భాగాన్ని తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
''న్యాయ వ్యవస్థల్లో కూడా న్యాయం జరిగేలా చూడాలి, ముఖ్యంగా మహిళా న్యాయమూర్తుల కేసులలో మరింత సున్నితత్వం అవసరం'' అని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్. కోటేశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ ఆరుగురు న్యాయమూర్తులలో ఒకరు అదితి శర్మ. రెండు వేర్వేరు దర్యాప్తులలో అదితి శర్మ పేలవమైన పనితీరు గురించి ప్రస్తావించారు. ఈ రెండింటిలో దర్యాప్తు అధికారి ఇటీవల హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన రాజేశ్ గుప్తా.
''పేలవమైన పనితీరు'' అని నిరంతరం ఉదహరించే నివేదికలు హైకోర్టు స్వయంగా సమర్పించిన రికార్డుతో సరిపోలడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నివేదికల్లో అంతర్గత వైరుధ్యాలున్నాయని తెలిపింది.
ఈ మహిళా అధికారులపై వచ్చిన ఫిర్యాదులు తొలగింపునకు ఆధారమైతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 సంబంధిత ప్రవర్తనా నియమాల ప్రకారం విచారణ కోసం వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘వ్యక్తిగత పరిస్థితులు పట్టించుకోరా’
అదితి శర్మ కేసుపై సుప్రీంకోర్టు ప్రత్యేక వ్యాఖ్యలు చేసింది. ఏసీఆర్‌లో ఆమెపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలు ఆ సమయంలో ఆమె వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండానే జరిగాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
విచారణ జరిపిన ఆ కాలంలో.. ఆమెకు కోవిడ్ సోకిందని, గర్భస్రావం అయిందని, ఆమె అన్నయ్యకు క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్టు నిర్ధరణ అయిందని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆమె పనితీరు లేదా ఆరోగ్యం ఇంతకు ముందెప్పుడూ విధులకు అడ్డంకిగా లేదని కోర్టు పేర్కొంది.
అదితి ఏసీఆర్‌ని 2021లో 'చాలా బాగుంది' నుంచి 'బాగుంది'కి తగ్గించింది, కేవలం పెండింగ్ కేసులు, పరిష్కారాల ఆధారంగా మాత్రమే. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి వ్యక్తిగత జీవితం, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పెండింగ్ కేసులను, పరిష్కార గణాంకాలను విశ్లేషించలేమని తెలిపింది.
ఈ పరిస్థితులన్నింటినీ అదితి నివేదికలో స్పష్టం చేసినప్పటికీ, వాటిని పట్టించుకోలేదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఇదంతా రికార్డులో ఉన్నప్పటికీ, ఆమె సర్వీసును రద్దు చేయాలనే నిర్ణయం, సున్నితత్వం లేకపోవడం మాత్రమే కాదని 'న్యాయ వ్యవస్థలోనే న్యాయాన్ని తిరస్కరించడంతో సమానం' అని కోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
రాజీనామా లేఖలో అదితి శర్మ ఏం చెప్పారు?
''మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తి రాజేశ్ కుమార్ గుప్తాపై కనీసం ఆరుసార్లు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాను" అని రాజీనామాకు ముందు అదితి శర్మ బీబీసీకి చెప్పారు.
న్యాయమూర్తి రాజేశ్ కుమార్ గుప్తా ''నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపడం లేదని, న్యాయాధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని" ఆ ఫిర్యాదుల్లో ఆమె ఆరోపించారు.
''మనం నిజాయితీగా పనిచేస్తే, చట్టాన్ని పాటిస్తే, ఈ కోర్టు మనతో ఉంటుందని.. ముఖ్యంగా క్లిష్టపరిస్థితుల్లో అండగా నిలుస్తుందని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను'' అని న్యాయవ్యవస్థపై తనకున్న నమ్మకం గురించి రాజీనామా లేఖలో అదితిశర్మ రాశారు.
''కానీ, ఇవాళ నేను మోసపోయిన బాధతో ఇది రాస్తున్నా. నాకు ఈ గాయం ఏ నేరస్థుడి వల్లో నిందితుడి వల్లో జరగలేదు. నేను సేవ చేస్తానని ప్రమాణం చేసిన అదే వ్యవస్థ వల్ల జరిగింది'' అని ఆమె రాశారు.
''నాపై వేధింపులకు పాల్పడిన వారిని ఎలాంటి ప్రశ్నలూ అడగలేదు, దర్యాప్తు చేయలేదు, వివరణ కోరలేదు. తన కుమార్తెలకు ఈ న్యాయవ్యవస్థ ఎలాంటి సందేశం పంపుతోంది? వారిని అవమానించవచ్చు, అణచివేయొచ్చు, సంస్థాగతంగా తుడిచిపెట్టవచ్చు'' అని అదితి శర్మ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
''నేను ఎలాంటి ప్రత్యేక హక్కూ కావాలని కోరడం లేదు, ఒక విధానం ఉండాలని అడుగుతున్నాను'' అని అదితి శర్మ అన్నారు.
తన న్యాయవాదితో మాట్లాడి తదుపరి కార్యచరణ చేపడతానని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2023లో సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించినా...
రాజేశ్ గుప్తాను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలనే ప్రతిపాదనను 2023లో సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించింది.
అదితి శర్మతో పాటు, మరో ఇద్దరు అధికారులు కూడా గతంలో రాజేశ్ కుమార్ గుప్తాపై ఫిర్యాదులు చేశారు. బీబీసీ ప్రతినిధి ఈ రెండు ఫిర్యాదులను చదివారు. మధ్యప్రదేశ్ హైకోర్టు వీటిపై ఎలాంటి దర్యాప్తు జరిపినట్టు ప్రస్తావించలేదు.
న్యాయశాఖ అధికారుల కుటుంబ సభ్యులు, న్యాయ శాఖ మాజీ అధికారులపై రాజేశ్ గుప్తా నిరాధారమైన, అవమానకరమైన, పరువు నష్టం కలిగించే తప్పుడు ప్రకటనలు చేశారని, అసభ్యకరమైన భాషను బహిరంగంగా ఉపయోగించారని మరో ఇద్దరు న్యాయమూర్తులు తమ ఫిర్యాదులో ఆరోపించారు.
రాజేశ్ కుమార్ గుప్తాను మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ అదితి శర్మ చేసిన నిరసనపై న్యాయవాది టి. ప్రశాంత్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు. ఈయన జిల్లా న్యాయవ్యవస్థపై ఒక పుస్తకం రాశారు.
''హైకోర్టు న్యాయమూర్తులు కింది స్థాయి న్యాయవ్యవస్థపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులకు దిగువ కోర్టుల న్యాయమూర్తుల రహస్య నివేదికలు, బదిలీలు, పోస్టింగ్‌లపై పూర్తి అధికారం ఉంటుంది. ఈ ప్రక్రియ అంత పారదర్శకంగా ఉండదు. ఇది జిల్లా న్యాయ అధికారుల ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛపై ప్రభావం చూపుతుంది'' అని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














