మూడు కీలక కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల, అసలు దోషులను గుర్తించలేకపోవడానికి కారణమేంటి ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినాయక్ హోగడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మాలేగావ్ బాంబుపేలుళ్ల కేసు నిందితులందరినీ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం(జూలై 31) నిర్దోషులుగా తేల్చింది.
ముంబైలో జరిగిన 7/11 బాంబు పేలుళ్ల కేసులో నిందితుల శిక్షలను కొన్ని రోజుల కిందట బాంబే హైకోర్టు కూడా రద్దు చేసింది.
అంతకుముందు, నాందేఢ్ బాంబు పేలుడు కేసులో నిందితులు కూడా జనవరిలో నిర్దోషులుగా విడుదలయ్యారు..
ఈ మూడు ముఖ్యమైన కేసుల్లో నిందితులు 2025 సంవత్సరంలో నిర్దోషులుగా విడుదల కావడంతో, ఈ బాంబు పేలుళ్లకు కారణమైన అసలు నిందితులను ఎప్పుడు పట్టుకుంటారనే ప్రశ్న వినిపిస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
కోర్టు తీర్పులు, సమాధానం లేని ప్రశ్నలు
మూడు బాంబు పేలుళ్ల కేసుల్లో తగిన ఆధారాలు లేకపోవడంతో నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు.
మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ అదనపు డిప్యూటీ కమిషనర్ శిరీష్ ఇనామ్‌దత్‌తో దీనిపై బీబీసీ మాట్లాడింది.
నిందితులను గౌరవంతో విడుదల చేశారా లేదా తగినంత ఆధారాలు లేకపోవడం వల్ల విడుదల చేశారా అనే అంశం ముఖ్యమైనదని శిరీష్ ఇనామ్‌దత్ అంటున్నారు.
"రెండింటి మధ్య తేడా ఉంది. సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల నిందితులు నిర్దోషులుగా విడుదలైతే, దర్యాప్తు సంస్థలు బలమైన ఆధారాలను ఎందుకు సేకరించలేదు? లేదా వారు వాటిని సరైన పద్ధతిలో కోర్టుకు ఎందుకు సమర్పించలేదు?" అనే ప్రశ్న తలెత్తుతుంది.
"ముంబై, మాలేగావ్ కేసుల్లో నిందితులు వరుసగా నిర్దోషులుగా విడుదలవుతుండడంతో, సామాన్య ప్రజల మనస్సుల్లో మిగిలి ఉన్న ఏకైక ప్రశ్న 'న్యాయం' అనే పదం ఉందా లేదా?" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు
2008 సెప్టెంబర్ 29న, మాలేగావ్‌లోని ఒక మసీదు సమీపంలో మోటార్‌సైకిళ్లకు అమర్చిన పేలుడు పదార్థాలు పేలి, ఏడుగురు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
ఈ కేసును గతంలో మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) దర్యాప్తు చేసింది. కానీ 2011లో, ఈ కేసు దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించారు.
ఈ కేసులో నిందితులుగా బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్ (రిటైర్డ్), అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ఉన్నారు.
నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసు విచారణ 17 సంవత్సరాల తర్వాత పూర్తయింది. నిందితులందరూ జూలై 31, 2025న నిర్దోషులుగా విడుదలయ్యారు.
దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా దర్యాప్తులో తప్పులు చేసిందని, ఉద్దేశపూర్వకంగా తగినంత సాక్ష్యాలను సేకరించలేదని న్యాయవాది నితిన్ సత్పుటే ఆరోపించారు.
ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముంబై బాంబు పేలుళ్ల కేసు
మాలేగావ్ పేలుడుకు ముందు, జూలై 11, 2006న, ముంబైలోని 7 స్థానిక రైళ్లలో 7 పేలుళ్లు సంభవించాయి. ఈ భయానక దాడిలో 189 మంది మరణించగా, 824 మంది గాయపడ్డారు.
ముంబైపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఇది ఒకటి. ప్రజలు దీనిని '7/11 పేలుళ్లు' అని పిలుస్తారు.
2015లో, ప్రత్యేక సెషన్స్ కోర్టు ఈ పేలుళ్లకు సంబంధించి ఐదుగురికి మరణశిక్ష, మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. పదమూడవ నిందితుడు అబ్దుల్ వాహీద్ 2015లో నిర్దోషిగా విడుదలయ్యారు.
దోషులుగా తేలిన 12 మంది నిందితులలో ఒకరైన కమాల్ అహ్మద్ మొహమ్మద్ వకీల్ అన్సారీ 2021లో మరణించారు.
ఇప్పుడు, దాడి జరిగిన 19 సంవత్సరాల తరువాత, సెషన్స్ కోర్టు తీర్పు వెలువడిన 10 సంవత్సరాల తరువాత, జూలై 21, 2025న బాంబే హైకోర్టు 12 మంది నిందితుల శిక్షలను రద్దు చేసింది.
అయితే, ఈ కేసులో తీర్పు అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది.

ఫొటో సోర్స్, Getty Images
నాందేఢ్ బాంబు పేలుడు కేసు
ఏప్రిల్ 6, 2006న, నాందేఢ్ నగరం, పట్బంధరే నగర్ ప్రాంతంలోని నరేశ్ రాజ్‌కోండ్వార్ ఇంట్లో పెద్ద పేలుడు సంభవించింది.
ఈ పేలుడులో నరేశ్ రాజ్‌కోండ్వార్, హిమాన్షు పాంసే అక్కడికక్కడే మృతి చెందగా, మారోతీ వాఘ్, యోగేశ్ దేశ్‌పాండే, గురురాజ్ టాప్తివార్, రాహుల్ పాండే తీవ్రంగా గాయపడ్డారు.
మొదట్లో, పేలుడు బాణాసంచా వల్ల జరిగిందని భావించారు. కానీ మరుసటి రోజు ఇంట్లో సోదాలు చేసిన తర్వాత, కేసును ఏటీఎస్‌కి అప్పగించారు.
తరువాత దర్యాప్తును ఏటీఎస్ నుంచి సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో, నిందితులకు పూర్ణ, పర్భణీ, జాల్నాలో జరిగిన బాంబు పేలుళ్లతో సంబంధం ఉందని తేలింది.
ఈ నిందితులందరికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హిందూత్వ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో, సీబీఐ 2,000 పేజీల చార్జ్ షీట్‌ను రూపొందించింది. పన్నెండు మందిని నిందితులుగా చేర్చింది.
ఈ కేసులో జనవరి 4, 2025న నాందేఢ్ కోర్టులో తీర్పు వెలువడింది. నరేశ్ రాజ్‌కోండ్వార్ ఇంట్లో బాంబు పేలుడు జరిగిందని సీబీఐ నిరూపించలేకపోయింది.
ఆ ప్రదేశంలో బాణాసంచా పేలిందని అంగీకరిస్తూ కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.

ప్రశ్నార్థకంగా మారిన ఏటీఎస్ దర్యాప్తు
మాలేగావ్ పేలుళ్ల కేసును గతంలో మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) దర్యాప్తు చేసింది. 2011లో ఈ కేసు దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించారు.
ముంబై పేలుళ్ల కేసును కూడా ఏటీఎస్ దర్యాప్తు చేసింది. నిందితులపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (ఎంసీఓసీఏ) కింద విచారణ జరిగింది.
నాందేఢ్ బాంబు పేలుడు కేసును కూడా మొదట ఏటీఎస్‌కి అప్పగించారు.
2025 సంవత్సరంలో తీర్పు వచ్చిన ఈ మూడు ముఖ్యమైన కేసులను రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) దర్యాప్తు చేసింది.
మాలేగావ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని అడ్వకేట్ నితిన్ సత్పుటే స్పష్టం చేశారు.
"విచారణ సంస్థ ఉద్దేశపూర్వకంగా దర్యాప్తులో తప్పులు చేసింది. మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితులకు సహాయం చేయడానికి, వారిని రక్షించడానికి వీలుగా తగిన ఆధారాలను ఉద్దేశపూర్వకంగా సేకరించలేదు. దర్యాప్తు సంస్థ లోపభూయిష్ట చార్జ్ షీట్ దాఖలు చేసింది'' అని ఆయన అన్నారు.
దీంతో ఏటీఎస్ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు.
‘‘ఎవరి సూచనల మేరకో నిందితులందరినీ కాపాడటానికి సరైన దర్యాప్తు నిర్వహించని పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఈ దర్యాప్తు యంత్రాంగం మీద నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తా" అని కూడా సత్పుటే అన్నారు.

సాక్షుల వాంగ్మూలం
ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో సవాలేమిటంటే సాక్షుల వాంగ్మూలం.
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం కోర్టులో మార్చినా లేదా తిరస్కరించినా, ఆ వాంగ్మూలానికి సంబంధించి సేకరించిన ఇతర సందర్భోచిత ఆధారాలు కూడా చెల్లకుండా పోతాయి.
''ఈ కేసుల్లో కూడా, సాక్షుల సాక్ష్యాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టులో తిరస్కరించారు. దీంతో నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడం తప్ప కోర్టుకు వేరే మార్గం లేకుండా పోయింది'' అని ఆయనన్నారు.
మరోవైపు, ముంబై పేలుళ్ల కేసులో 2015లో నిర్దోషిగా విడుదలైన నిందితుడు అబ్దుల్ వాహీద్, పోలీసులు నిందితులపై 'థర్డ్ డిగ్రీ' ప్రయోగించి నేరాంగీకార వాంగ్మూలం రాబట్టారని ఆరోపించారు.
7/11 బాంబు దాడి కేసులో తనను హింసించి, బలవతంగా నేరాంగీకార వాంగ్మూలం తీసుకున్నారని వాహీద్ ఆరోపించారు. విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు ఈ ఆరోపణలను ఖండించారు.
‘‘నేరాంగీకార పత్రంపై సంతకాలు తీసుకోవడానికి హింసను ఆయుధంగా ఉపయోగించారని తీర్పులో కూడా ఉంది. కానీ వాళ్లు దీనిని తిరస్కరిస్తున్నారు" అని ఆయన బీబీసీతో చెప్పారు.
''వాంగ్మూలం స్వచ్ఛందంగా, బహిరంగ వాతావరణంలో ఇవ్వాలి. అది అక్కడికక్కడే ఆకస్మికంగా ఇవ్వాలి. వాంగ్మూలం ఇచ్చే సమయంలో నిందితుడి తరఫు న్యాయవాది, బంధువులు అక్కడ ఉండాలి. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బలమైన సాక్ష్యాలున్నా...
నాందేఢ్ బాంబు పేలుడు కేసులో, నిందితుడి ఇంట్లో బాంబు తయారు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని సీబీఐ కేసు నమోదు చేసింది.
అయితే, ఈ విషయాన్ని కోర్టులో సీబీఐ నిరూపించలేకపోయింది. బలమైన ఆధారాలు లేకపోవడంతో నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు.
''మేం చాలా బలమైన కేసును సిద్ధం చేశామని నేను అనుకున్నా. ఈ కేసు ఆధారంగానే ట్రయల్ కోర్టు నిందితులను దోషులుగా నిర్ధరించింది'' అని ముంబై పేలుళ్ల నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువడిన తర్వాత ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ మాజీ ఏటీఎస్ చీఫ్ కేపీ రఘువంశీ చెప్పారు.
''దర్యాప్తును మేం సరిగ్గా నిర్వహించామని, తగిన సాక్ష్యాలను సేకరించామని మాకు నమ్మకం ఉంది. అందుకే ట్రయల్ కోర్టు గతంలో నిందితులను దోషులుగా నిర్ధరించింది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తులో ఏ లోపాలు జరిగి ఉండవచ్చు?
ఈ కేసుల దర్యాప్తులో సరిగ్గా ఏం తప్పు జరిగిందో శిరీష్ ఇనామ్‌దత్ విశ్లేషించారు.
''దర్యాప్తు సరిగ్గా జరగలేదనే మాట నేను అనను. సరైన దర్యాప్తు నిర్వహించడం కష్టం'' అని ఆయన అంటున్నారు.
''మన చట్టం ప్రకారం, వంద మంది నేరస్థులు తప్పించుకున్నా, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. నిందితుడి ఏకైక పని కోర్టు మనసులో చిన్న డౌట్‌ను సృష్టించడం, ఆ ప్రయోజనాన్ని అందుకోవడం. కాబట్టి, ఈ దర్యాప్తులో లొసుగులను గుర్తించడం సులభం'' అని ఆయన అన్నారు.
‘‘దీంతో పాటు, ప్రత్యేక చట్టాల కింద నేరాంగీకార వాంగ్మూలం ప్రక్రియను కూడా వారు ప్రస్తావించారు. టాడా, మకోకా, ఉపా వంటి ప్రత్యేక క్రిమినల్ చట్టాలు దర్యాప్తు అధికారి ముందు చేసిన నేరాంగీకార వాంగ్మూలాన్ని ముందే ఊహిస్తాయి.
ఈ చట్టాలు నిందితుడికి అలాంటి నేరాంగీకారాన్ని తిరస్కరించే హక్కు ఉందని కూడా పేర్కొంటున్నాయి. అలాంటి అంగీకారాన్ని తిరస్కరిస్తే, దాని ఆధారంగా సేకరించిన ఆధారాలు కూడా ఆమోదయోగ్యం కావు. అందువల్ల, మొత్తం సాక్ష్యాధారాలు పనికిరాకుండా పోతాయి. ఈ కేసుల్లో అదే జరిగింది'' అని శిరీష్ ఇనామ్‌దత్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తు, న్యాయ ప్రక్రియకు భారీ సమయం
ఈ మూడు బాంబు పేలుళ్లు 2006 , 2008 మధ్య జరిగాయి. అంటే, ఈ సంఘటనలు జరిగి కనీసం 16 నుంచి 18 సంవత్సరాలు గడిచాయి.
ముంబై పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ వాహిద్ 2006లో అరెస్టయ్యారు. 2015లో విడుదలయ్యారు.
మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితులు కూడా 17 సంవత్సరాల తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇంత కాలం గడిచినప్పటికీ, నిందితులపై నేరాలు నిరూపితం కాలేదు.
ఇంత సున్నితమైన కేసుల న్యాయ ప్రక్రియకు ఎందుకు ఇంత సమయం పడుతుంది? సాధ్యమైనంత తక్కువ సమయంలో దీన్ని చేయడం సాధ్యమేనా?
ఈ ప్రత్యేక చట్టాలలోని నిబంధనల దుర్వినియోగాన్ని తొలగించవచ్చా? వ్యవస్థకు ఎక్కువ అధికారం ఇవ్వకుండా, మానవ హక్కులను ఉల్లంఘించకుండా ఈ చట్టాలను ఎలా మరింత ప్రభావవంతంగా చేయవచ్చో పరిగణనలోకి తీసుకోవాలని శిరీష్ ఇనామ్‌దత్ సూచిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














