ఏ2 నెయ్యి: సాధారణ నెయ్యి కంటే మూడురెట్లు ఖరీదైన ఈ నెయ్యి ప్రత్యేకత ఏంటి, నిజంగా ఆరోగ్యానికి ప్రయోజనకరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఏ1, ఏ2 లేబుల్‌తో పాలు, నెయ్యి భారీగా అమ్ముడవుతున్నాయి. ప్రత్యేకించి ‘ఏ2’ నెయ్యి సాధారణ దేశీ నెయ్యి కంటే ఆరోగ్యకరమని చెబుతూ మార్కెటింగ్ చేస్తున్నారు.
సాధారణ దేశీ నెయ్యి కిలో వెయ్యి రూపాయలకు అమ్ముడవుతుంటే.. ఈ ‘ఏ2’ నెయ్యి కిలో 3 వేల రూపాయలకు అమ్ముతున్నారు.
దేశీయ ఆవుల నుంచి వచ్చిన పాలతో ఏ2 నెయ్యి తయారు చేస్తున్నామని, దీనివల్ల అధిక ప్రయోజనాలున్నాయని ఈ పాల ఉత్పత్తులను అమ్ముతున్న కంపెనీలు చెబుతున్నాయి. ఇందులో ఏ2 బీటా కేసీన్ ప్రోటీన్ సహజంగానే ఉంటుందని వారు చెబుతున్నారు.
ఈ ప్రోటీన్ సాధారణ పాలలో కనిపించే ఏ1 ప్రోటీన్ కంటే సులభంగా జీర్ణమవుతుంది, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుందని అంటున్నారు.

ఒమేగా -3 లాంటి ఫ్యాటీ యాసిడ్స్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ), విటమిన్ ఏ, డీ, ఈ, కే లాంటి పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు. పైగా జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుందని, రోగనిరోధకశక్తిని పెంచుతుందని, చర్మం రంగును మెరుగుపరుస్తుందని కూడా ప్రకటిస్తున్నారు.
వాటితో పాటు గుండె జబ్బులకు ఈ నెయ్యి మంచిదని, ఈ నెయ్యి వాడితే గాయాలు త్వరగా నయమవుతాయని కూడా డెయిరీ కంపెనీలు చెబుతున్నాయి.
దీన్నొక కొత్త సూపర్‌ఫుడ్ పేరుతో విక్రయిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Food Safety and Standards
ఏ1, ఏ2 పేరుతో అమ్మకాలు సరైనవేనా?
భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇలాంటి లేబుల్స్‌లో పాలు, నెయ్యి, వెన్నను అమ్మడం నిషేధించింది. ఏ2 లేబుల్‌తో నెయ్యి విక్రయించడం తప్పుదోవ పట్టించడం అవుతుందని తెలిపింది.
ఏ1, ఏ2 పేరుతో పాలు, పాల ఉత్పత్తులు విక్రయించడమనేది తప్పుదోవ పట్టించడమే కాకుండా, 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టాన్ని, దాని కింద రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించడమేనని కిందటేడాది ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీచేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న ఏ1, ఏ2 ఉత్పత్తులను ఆరు నెలల్లోపు దశలవారీగా తొలగించాలని కంపెనీలను కోరింది.
కానీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ వారం రోజుల్లోనే తన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంది.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. ఏ1, ఏ2 లేబుల్స్‌తో ఉన్న పాల ఉత్పత్తులు నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తాయా?
నిజంగానే, ఏ2 నెయ్యితో సాధారణ నెయ్యి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయా? అందులో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
ఏ1, ఏ2 పాలు లేదా నెయ్యి అంటే ఏంటి?
ఏ1, ఏ2 మధ్య తేడా బీటా- కేసీన్ ప్రొటీన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ బీటా కేసీన్ అనేది పాలలో అధిక మోతాదులో కనిపించే ప్రోటీన్. ఈ తేడా ముఖ్యంగా పాలిచ్చే ఆవు ఏ జాతికి చెందినది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది.
పాలలో కనిపించే ప్రధాన ప్రోటీన్లలో బీటా-కేసీన్ ఒకటి అని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (ఎన్ఎఎఎస్)కు చెందిన ఓ పరిశోధనా పత్రం తెలిపింది.
ఆవుపాలలోని మొత్తం ప్రోటీన్‌లో 95 శాతం కేసీన్, పాలవిరుగుడు ప్రోటీన్లతోనే తయారవుతుంది. బీటా-కేసీన్‌లో అమైనో ఆమ్లాల సమతుల్యత బావుంటుంది.
ఈ బీటా-కేసీన్‌లో రెండు రకాలు ఉన్నాయి. యూరోపియన్ జాతి ఆవు పాలలో ఏ1 బీటా కేసీన్ ఎక్కువగా కనిపిస్తే, భారతీయ దేశీ ఆవు పాలలో సహజంగా ఏ2 బీటా కేసీన్ లభిస్తుంటుంది.
అమైనో ఆమ్లాల స్థాయిలలో ఏ1, ఏ2 బీటా కేసీన్ ప్రోటీన్లు భిన్నంగా ఉంటాయి. ఇవి ప్రొటీన్ జీర్ణప్రక్రియను ప్రభావితం చేస్తాయి.
ఏ2 పాలు తేలికగా జీర్ణమవుతాయని, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై మరింత పరిశోధన అవసరం. తగినంత పరిశోధన లేకపోవడం వల్ల, ఇది ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుందని నిరూపితం కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
డెయిరీ నిపుణులు ఏం చెబుతున్నారు?
సాధారణ నెయ్యి కంటే, ఏ2 నెయ్యి నిజంగా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందా? లేక దాని గురించి అతిశయోక్తులు చెబుతున్నారా? అనే విషయంపై నిపుణుల నుంచి మరింతగా తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
దీనిపై అమూల్ మాజీ ఎండీ, ప్రస్తుతం ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ సోధి మాట్లాడుతూ, ''నేనీ మార్కెట్ తీరును గమనిస్తున్నా. ప్రత్యేకించి ఆన్‌లైన్ మార్కెట్ తీరుని. అక్కడ ప్రసిద్ధి చెందిన సహహకార సంఘాలు, కంపెనీలు తమ ఉత్తమ నెయ్యి ఉత్పత్తిని కిలో 600 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు. అదే సమయంలో, ఏ2 అనే ముద్ర వేసి అదే నెయ్యిని 2 వేల రూపాయల నుంచి 3వేల రూపాయలకు అమ్ముతున్నారు. దీనిని వివిధ మార్గాలలో ప్రమోట్ చేస్తున్నారు. కొంతమంది దానిని బిలౌనా నెయ్యి పేరుతో అమ్ముతుంటే, మరికొందరు దానిని దేశీయ ఆవు పాలతో తయారుచేసిన ఆరోగ్యకరమైన నెయ్యి అని అమ్ముతున్నారు'' అని అన్నారు.
‘‘ఏ1, ఏ2 అనేవి ఓ రకమైన ప్రోటీన్లు. ఇవి ఫ్యాటీ యాసిడ్ చైన్‌కు అనుసంధానమై ఉంటాయనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. ప్రస్తుతం ఏది మంచిదనే చర్చ జరుగుతోంది, ఏది మంచిదనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నేనంటాను. ఇది ఎంతమాత్రమూ చర్చిందగిన అంశం కాదు. అయితే, ఏ2 బెటర్ అంటున్నారు. కానీ, అది తప్పు. ఇవి బీటా-కేసీన్‌లోని రెండురకాల ప్రోటీన్లు. వీటిలో తేడా ఈ ప్రోటీన్ గొలుసులోని 67 వ అమైనో ఆమ్లంలో మార్పు కారణంగా ఉంటుంది’’ అని ఆర్ఎస్ సోధీ చెప్పారు.
ఏ2 నెయ్యిలోని పోషక విలువలు, ఔషధ గుణాల గురించి అతిశయోక్తులు చెబుతున్నారని ఆయన అన్నారు.
"కానీ, నెయ్యి కొవ్వు తప్ప మరేమీ కాదని గుర్తుంచుకోవాలి. ఇందులో 99.5 శాతం కొవ్వు ఉంటుంది. మిగిలినవి వేరే విషయాలు. ఇందులో ప్రోటీన్ లేదు. మరి అలాంటప్పుడు మా నెయ్యిలో ఏ2 ప్రోటీన్ ఉందని, ఇది శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఎలా చెప్పగలరు?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఇది ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరోటి కాదు. ఇలాంటి మార్కెటింగ్ కారణంగా ప్రజలు మోసపోతున్నారు.
అయితే, ఏ2 నెయ్యి అమ్మే చాలా బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చి, అలానే వెళ్లిపోయాయని ఆయన చెప్పారు. ''మార్కెట్‌లో మనుగడ సాగించడం వారికి కష్టం. ఎందుకంటే, ఈ కంపెనీలు మార్కెటింగ్ కోసం చాలా ఖర్చు చేస్తాయి. దానివల్లే అవి మార్కెట్ నుంచి నిష్క్రమిస్తాయి.''

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?
సాధారణ నెయ్యి కంటే, ఏ2 నెయ్యి పేరుతో విక్రయించే నెయ్యి ఎక్కువ ప్రయోజనకరమన్న వాదనను ఆరోగ్య నిపుణులు కూడా ప్రశ్నిస్తున్నారు.
దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ సీనియర్ డైటీషియన్ డాక్టర్ విభూతి రస్తోగి బీబీసీతో మాట్లాడుతూ, "సాధారణ నెయ్యి కంటే ఏ2 నెయ్యి పేరుతో విక్రయించే నెయ్యి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందనే వాదన శాస్త్రీయంగా నిరూపితమయ్యే వరకు ఈ నెయ్యి మంచిదని ఎలా చెప్పగలం?" అని ప్రశ్నించారు.
"రెండో విషయం ఏంటంటే, ఈ రకమైన నెయ్యిని యంత్రం ద్వారా తీయలేదని మీరు చెప్పుకుంటే, పాల నుంచి ఏ2 ప్రోటీన్ ఎలా తీస్తారనేది మరో ప్రశ్న. అలా చేయడం సాధ్యం కాదు. అసలు విషయం ఏంటంటే, సాధారణ నెయ్యి కంటే ఏ2 నెయ్యి ఎక్కువ ప్రయోజనకరమని శాస్త్రీయంగా నిరూపితమయ్యే వరకు దీన్ని మార్కెటింగ్ గిమ్మిక్కు అంటారు. ఏ2 ప్రోటీన్ మంచిదని చెప్పడానికి ఆధారాలు లేవు.’’
ప్రోటీన్ కోసం ఎవరూ నెయ్యి తినరని డాక్టర్ రస్తోగి కూడా చెప్పారు. ఏ2 ప్రొటీన్ పేరుతో నెయ్యిని విక్రయిస్తున్నారు. నెయ్యిలో నామమాత్రపు ప్రోటీన్ మాత్రమే ఉంటుంది.
ఆయుర్వేదం ప్రకారం, ఏ2 నెయ్యి ఎక్కువ ప్రయోజనకరమని కంపెనీలు చెబుతున్నాయి. అయితే, ఏ2 నెయ్యిని తినడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం కూడా చెప్పలేదు అని డాక్టర్ రస్తోగి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














