ట్రంప్ అసలు పేరేమిటో తెలుసా? ఆయన తల్లి ఎక్కడి నుంచి వలస వచ్చారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టీవెన్ బ్రోకల్‌హస్ట్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు స్కాట్లాండ్‌తో ఒక ప్రత్యేక బంధం ఉంది. ట్రంప్ తల్లి మేరీ యేనీ మైక్లియోడ్ ఇక్కడి లూయిస్‌లోని ద్వీపసమూహం హెబ్రిడియన్‌లో పుట్టారు.
బాల్యాన్ని ఇక్కడే గడిపారు మేరీ. తర్వాత ఆమె న్యూయార్క్ వెళ్లిపోయారు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి అమెరికా, కెనడాకు తరలివెళ్లిన వేలమంది స్కాటిష్ ప్రజల్లో మేరీ యేనీ ఒకరు.
1930లో, సుమారు 18 ఏళ్ల వయసులో ఆమె డొమెస్టిక్ హెల్పర్( పని మనిషి) పని వెతుక్కుంటూ న్యూయార్క్ చేరుకున్నారు.
ఆరేళ్ల తర్వాత ఫ్రెడరిక్ ట్రంప్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. జర్మన్ వలసదారుడి కొడుకైన ఫ్రెడరిక్ ట్రంప్‌కు అప్పట్లో న్యూయార్క్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకరిగా పేరుంది.

మేరీ యేనీ, ఫ్రెడరిక్ ట్రంప్ దంపతులకు అయిదుగురు పిల్లలు. వారిలో నాలుగోవాడు డోనల్డ్ జాన్. తర్వాత ఆయన పేరు డోనల్డ్ ట్రంప్‌గా మారారు. లూయిస్ ద్వీపంలో ఇప్పటికీ ఆయన్ను డోనల్డ్ జాన్ అనే అంటుంటారు.
ట్రంప్ తల్లి మేరీ యేనీ 1912లో టోంగ్ అనే ఊళ్లో జన్మించారు. లూయిస్ ద్వీపంలోని ప్రధాన పట్టణం స్టోర్నోవే నుంచి ఈ గ్రామం దగ్గరదగ్గర 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మేరీ తండ్రి మాల్కం ఒక పోస్టాఫీసు నడిపేవారని జీనియాలజిస్ట్ బిల్ లాసన్ చెప్పారు. మేరీ యేనీ మైక్లియోడ్ కుటుంబ నేపథ్యం గురించి పరిశోధించిన వ్యక్తి ఆయన.
మాల్కం తన జీవిత చరమాంకంలో ఒక చిన్న దుకాణాన్ని నడిపినట్లు ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తొలినాళ్ల జీవితం
బిల్ లాసన్ పేర్కొన్న వివరాల ప్రకారం, గ్రామంలోని ఇతర కుటుంబాలతో పోల్చితే మేరీ యేనీ కుటుంబం ఆర్థికంగా కాస్త మెరుగైన స్థితిలో ఉంది.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, ఆ తర్వాత జీవితం చాలా కఠినంగా మారింది. ఆ యుద్ధంలో లూయిస్ ద్వీపానికి చెందిన దాదాపు వెయ్యి మంది చనిపోయారు. ఆ సమయంలో చాలా మంది యువకులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లడానికి ఇదే కారణం.
1919లో సంభవించిన ఐయోలైయర్ విపత్తు వల్ల కూడా ద్వీపం తీవ్రంగా ప్రభావితమైంది.
''మేరీ యేనీ మైక్లియోడ్ ఒక పెద్ద కుటుంబానికి చెందినవారు. ఆమెకు తొమ్మిదిమంది తోబుట్టువులు. ద్వీపాన్ని తిరిగి స్థిరపరచడానికి కొందరు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. యువత నిలదొక్కుకునే అవకాశాలు అక్కడ మిగల్లేదు'' అని బిల్ లాసన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా పయనం
ఈ రోజుల్లో వలసలు ఎక్కువగా అమెరికా మెయిన్‌ల్యాండ్‌కు జరుగుతున్నాయనీ, కానీ అప్పట్లో ఎక్కువమంది కెనడాకు వెళ్తుండేవారని బిల్ లాసన్ అన్నారు.
మైక్లియోడ్ కుటుంబానికి చెందిన 8 మంది సభ్యులు అమెరికాకు వలస వెళ్లారని లాసన్ చెప్పారు. మేరీ యేనీ సోదరి కేథరీన్ మొదట కెనడాకు, తర్వాత న్యూయార్క్ వెళ్లారు.
కేథరీన్ 1930లో లూయిస్ ద్వీపానికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె 18 ఏళ్ల సోదరి మేరీ యేనీ కూడా పని కోసం ఆమె వెంట న్యూయార్క్ వెళ్లారు.
న్యూయార్క్ శివారులోని ఒక సంపన్న కుటుంబానికి నానీగా (డొమెస్టిక్ హెల్పర్) మేరీకి ఉద్యోగం వచ్చినట్లుగా చెబుతుంటారు. కానీ, వాల్‌స్ట్రీట్ పతనం తర్వాత అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడంతో ఆమె ఉద్యోగం పోయింది.
1934లో మేరీ యేనీ స్కాట్లాండ్‌కు తిరిగి వచ్చి కొన్నాళ్లు గడిపారు. కానీ, అప్పటికే ఆమె, ఫ్రెడరిక్ ట్రంప్‌ను కలిశారు. ఆ తర్వాత ఆమె శాశ్వత నివాసం (పర్మినెంట్ రెసిడెన్సీ) కోసం న్యూయార్క్ తిరిగి వెళ్లారు.
క్వీన్స్‌లోని ఒక సంపన్న ప్రాంతంలో ఈ జంట నివసించింది. మేరీ యేనీ, సామాజిక సేవలో చురుకుగా పాల్గొనేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ కజిన్స్
డోనల్డ్ ట్రంప్ కజిన్లలో ముగ్గురు ఇప్పటికీ లూయిస్ ద్వీపంలో నివసిస్తున్నారు. వారిలో ఇద్దరు, ట్రంప్ పూర్వీకుల ఇంటిలో ఉంటున్నారు.
ఈ ముగ్గురు మీడియాకు దూరంగా ఉంటుంటారు.
''నాకు, వాళ్ల కుటుంబం గురించి బాగా తెలుసు. వారు చాలా మంచివారు. శాంత స్వభావులు. మీడియా ముందుకు రావాలనుకోరు. ఈ విషయం గురించి వారు మాట్లాడాలని అనుకోవట్లేదనే విషయం నాకు తెలిసింది'' అని స్థానిక కౌన్సిలర్, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన జాన్ ఎ మెక్‌ఐవర్ 2017లో డోనల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు బీబీసీతో చెప్పారు.
మేరీ యేనీ ఎప్పుడు ఇంటికి వచ్చినా కచ్చితంగా చర్చికి వెళ్లేవారని కూడా ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మేరీ యేనీ పూర్వీకులు
ట్రంప్ తల్లి మేరీ యేనీ మైక్లియోడ్ 1942లో అమెరికా పౌరసత్వం పొందారు. 2000లో తన 88వ ఏట ఆమె మరణించారు.
జాన్ మెక్‌ఐవర్ ప్రకారం, ఆమె జీవించి ఉన్నప్పుడు తరచుగా లూయిస్ ద్వీపానికి వెళ్తుండేవారు. స్కాట్లాండ్ సంప్రదాయ భాష గెలిక్ మాట్లాతుండేవారు.
ఈ ద్వీపాల్లోని ప్రజలు ఇంటిపేరు పెట్టుకోవడం ఇటీవల ఏర్పడిన సంప్రదాయమని జీనియాలజిస్ట్ బిల్ లాసన్ అన్నారు. 19వ శతాబ్దం తొలినాళ్ల నుంచి మాత్రమే అధికారిక రికార్డులు అందుబాటులో ఉన్నాయి.
మేరీ యేనీ ట్రంప్ పూర్వీకులైన మైక్లియోడ్ కుటుంబ మూలాలు వెటిస్కర్ ప్రాంతంలో ఉన్నాయి. టోంగ్‌కు కొన్ని మైళ్ల దూరంలో వెటిస్కర్ ఉంటుంది.
ఆమె ముత్తాత అలెగ్జాండర్ రాయ్ మైక్లియోడ్, ఆయన కుమారుడు మాల్కం 1850లలో చేపలు పడుతుండగా నీటిలో మునిగి చనిపోయారని చెబుతుంటారు.

ఫొటో సోర్స్, Media
మేరీ యేనీ తల్లి తరఫువారు
లూయిస్ ద్వీపంలోని లాక్స్ ప్రాంతం నుంచి 1826లో తరలి వెళ్లిపోయిన వారిలో మేరీ యేనీ తల్లి తరఫు వారైన స్మిత్ కుటుంబీకులు కూడా ఉన్నారు.
1815లో వాటర్లూ యుద్ధం తర్వాత, ద్వీపంలోని కొంత సారవంతమైన భూమిని గొర్రెల మేత కోసం ఖాళీ చేయించారు. అక్కడ అద్దెకు ఉన్నవారిని బయటకు పంపించారు.
నిరాశ్రయులైన ఈ అద్దెదారులను ద్వీపంలోని ఇతర ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు.
అలా మేరీ యేనీ తల్లి తరఫు కుటుంబంలోని వారు లూయిస్ నుంచి స్టోర్నోవేకు వచ్చారని బిల్ లాసన్ తెలిపారు.
1868 అక్టోబర్‌లో వెటిస్కర్ పాయింట్ సమీపంలో భారీ తుపాను కారణంగా పడవ బోల్తా పడి డోనల్డ్ స్మిత్ మరణించినట్లు లాసన్ పరిశోధనలో తెలిసింది.
ముగ్గురు పిల్లలతో డోనల్డ్ స్మిత్ భార్య ఒంటరి అయ్యారు. ఆ పిల్లల్లో చిన్న కుమార్తె పేరు మేరీ (డోనల్డ్ ట్రంప్ అమ్మమ్మ).

ఫొటో సోర్స్, Getty Images
తల్లి మరణం తర్వాత మేరీ కుటుంబం, టోంగ్ గ్రామంలో స్థిరపడింది. తర్వాత మాల్కం మైక్లియోడ్‌ను మేరీ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు, స్మిత్ కుటుంబానికి చెందిన వారసత్వ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దంపతులకు 10 మంది సంతానం. వారిలో అందరికంటే చిన్నవారు మేరీ యేనీ. ఆమే డోనల్డ్ ట్రంప్ తల్లి.
2008లో ట్రంప్ తన తల్లి చిన్నతనంలో టోంగ్‌లో నివసించిన ఇంటిని సందర్శించారు.
తనకు మూడు, నాలుగేళ్ల వయస్సున్నప్పుడు ఒకసారి లూయిస్‌కు వచ్చినట్లు ఆ సమయంలో ట్రంప్ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
97 సెకన్ల పాటు అమ్మమ్మ ఇంట్లో...
లూయిస్‌ను సందర్శించినప్పుడు డోనల్డ్ ట్రంప్ తన పూర్వీకుల ఇంట్లో కేవలం 97 సెకన్లు గడిపారని అంచనా.
''నేను చాలా బిజీగా ఉన్నా. నేను ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను సృష్టించే పనిలో ఉన్నాను. మళ్లీ ఇక్కడికి మళ్లీ రావడానికి సమయం చిక్కడం చాలా కష్టం. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరోసారి నేను ఇక్కడకు వస్తాను'' అని ఆ పర్యటన సందర్భంగా ట్రంప్ అన్నారు.
అప్పుడు ఆయనతోపాటు ఆయన పెద్దక్క మరియాన్ ట్రంప్ బారీ కూడా ఉన్నారు. అమెరికాలో ఆమె ఒక ఫెడరల్ జడ్జి. 2023లో చనిపోయారు. చనిపోయేంతవరకు మరియాన్ బారీ తరచూ లూయిస్‌లోని తన పూర్వీకుల ఇళ్లకు వెళ్లేవారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














