పాటలపై సర్వహక్కులు సంగీత దర్శకుడివేనా, నాడు బాలూతో, నేడు వనితా విజయ్ కుమార్‌తో ఇళయ రాజాకు వివాదం ఎందుకు?

ఫొటో సోర్స్, Facebook/Ilaiyaraaja
‘‘ఇళయరాజా స్వరపరిచిన 4,850 పాటలను సోని మ్యూజిక్ కంపెనీ కొనుగోలు చేసింది. మేం ఓ పాటను ఆ కంపెనీ నుంచి కొని, సినిమాలో వాడాం. ఇది కాపీరైట్ ఉల్లంఘన కాదు’’ అని నటి వనితా విజయ్‌కుమార్ మద్రాస్ హైకోర్టుకు చెప్పారు.
అనుమతి లేకుండా తన పాటను సినిమాలో వాడారంటూ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాసు హైకోర్టులో ఓ కేసు దాఖలు చేశారు.
ఈ కేసులో సోని మ్యూజిక్ కంపెనీని కూడా మద్రాస్ హైకోర్టు ప్రతివాదిగా చేర్చింది.
ఇంతకీ ఈ కేసులో తరువాత ఏం జరగనుంది?
ఇళయరాజాకు తన పాటలపై కాపీరైట్ తనదే అని చెప్పే హక్కు ఉందా?
నటి వనితా విజయకుమార్ కుమార్తె జోవికా ‘‘మిసెస్ అండ్ మిస్టర్’’ అనే సినిమాను నిర్మించి విడుదల చేశారు.
ఈ సినిమాలో ‘రాత్రి శివరాత్రి’ అనే పాటను వాడినట్టు సినిమా బృందం చెబుతోంది. ఈ పాట గతంలో వచ్చిన ‘మైకేల్ మదన కామరాజు’ సినిమాలోనిది.
అయితే ఈ పాటను తననుంచి సరైన అనుమతి తీసుకోకుండా వాడుకున్నారంటూ స్వరకర్త ఇళయరాజా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘‘ఈ పాటను వాడుకోవడం కాపీరైట్ ఉల్లంఘనే. సినిమా నుంచి ‘రాత్రి శివరాత్రి’ పాటను తొలగించాలి’’ అని ఆయన ఆ పిటిషన్‌లో కోరారు.
జులై 23న ఈ కేసు న్యాయమూర్తి సెంథిల్ కుమార్ రామ్మూర్తి ఎదుట విచారణకు వచ్చింది. ఆ సమయంలో ఇళయరాజా న్యాయవాది శరవణన్ ‘‘కేవలం ఈ పాటను ఇళయరాజా అనుమతి లేకుండా వాడటమే కాకుండా, ఆయన పేరు కూడా వేయలేదు’’ అని వాదించారు.
అయితే, దీనిపై వనితా విజయకుమార్ న్యాయవాది శ్రీధర్ వాదనలు వినిపిస్తూ ‘‘సోని మ్యూజిక్ నుంచి తగిన అనుమతులు తీసుకున్న తరువాతే మేమీ పాటను వాడాం’’ అని అన్నారు.
దీంతో ఈ కేసులో సోని మ్యూజిక్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాలని ఆదేశాలు జారీచేస్తూ న్యాయమూర్తి కేసును ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేశారు.


ఫొటో సోర్స్, Vanitha Vijaykumar/FB
‘‘ఈ కేసులో మూడు పార్టీలు ఉన్నాయి: పాట అమ్మిన వ్యక్తి, ఆ పాటను డబ్బు పెట్టి కొనుక్కున్న వ్యక్తి, యాజమాన్య హక్కులు కోరుతున్న వ్యక్తి. ఇది ఇతర కేసుల్లాంటి కేసు కాదు. ఇళయరాజా ఈ పాటకు నష్టపరిహారం కోరుతున్నారు’’ అని వనితా విజయకుమార్ తరపు న్యాయవాది శ్రీధర్ చెప్పారు.
‘‘ఇళయరాజా తన పాటను వినియోగించుకున్నవారికి వ్యతిరేకంగా కేసు వేయడంపై చాలామంది ఇందులో తప్పేముంది? అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన తన పాటలను మరొకరికి అమ్మేశారు. అలాంటప్పుడు ఆయన నష్టపరిహారం కోరలేరు’’ అన్నారు శ్రీధర్.
ఎకో కంపెనీకి ఇళయరాజా 4850 పాటలను అమ్మేశారు. ‘‘ఎకోను సోనీ మ్యూజిక్ కొనుగోలుచేసింది’’ అని శ్రీధర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Facebook
ఎవరు నిర్ణయించాలి?
‘‘తన సినిమాకు పాటలు స్వరపరిచినందుకు సంగీత దర్శకుడికి నిర్మాత డబ్బులు చెల్లిస్తారు. అదే పాటను ఆ సంగీత దర్శకుడు పది సినిమాలకు అమ్ముకోలేరు’’ అన్నారు శ్రీధర్.
‘‘సంగీత దర్శకుడు అందించిన పాటను సినిమాలో వాడాలా వద్దా అనేది దర్శకుడు, నిర్మాత ఇష్టం. సంగీతమనేది సంగీత దర్శకుడి కష్టానికి ఫలితమైనప్పటికీ, దానిని అమ్మేసిన తరువాత యాజమాన్య హక్కులు కోరలేడు’’ అని అన్నారు శ్రీధర్.
ఇటీవల విడుదలైన కమల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’ సినిమాను ఉదహరిస్తూ...ఆ సినిమా కోసం ‘ముత్తమాలై’ అనే పాటను సిద్దం చేశారు. కానీ సినిమాలో ఆ పాట లేదు. అలా అని ఆ పాటను ఎ.ఆర్.రెహమాన్ మరో సినిమాకు అమ్మలేరు. ఇదే సూత్రం ఇళయరాజాకూ వర్తిస్తుంది’’ అని శ్రీధర్ వివరించారు.

ఫొటో సోర్స్, Facebook
ఇళయరాజా తరఫు వాదనేంటి?
‘‘కోర్టులో ఎకో కంపెనీపై ఇళయరాజా ఇంజక్షన్ ఉత్తర్వులు కోరారు. ఆ కేసులోని ఇంజక్షన్ ఉత్తర్వులు, ఎకో కంపెనీని కొనుగోలు చేసిన సోనీ కంపెనీకి కూడా వర్తిస్తాయి’’ అని బీబీసీకి చెప్పారు ఇళయరాజా న్యాయవాది శరవణన్.
‘‘మ్యూజికల్ వర్క్ అంటే ఏమిటో సరైన అవగాహన లేకుండా నిర్మాత పెట్టిన పెట్టుబడి గురించి చర్చ జరుగుతోంది. సినిమా మొత్తాన్ని వాడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకు భిన్నంగా పాటలు స్వరకర్త ఆస్తి’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘వనితా విజయకుమార్ తన చిత్రంలో 'రాత్రి శివరాత్రి' పాటను అనుమతి లేకుండా ఉపయోగించడం ఇండియన్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 57 ఉల్లంఘనగా భావిస్తున్నాం’’ అని శరవణన్ చెప్పారు.
అయితే దీనిని మనం అలా చూడలేమని, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 57 సృష్టికర్తకు నైతిక హక్కులు కల్పించాలని చెబుతోందని వనితా విజయకుమార్ న్యాయవాది శ్రీధర్ చెప్పారు.
‘‘నటభైరవి' రాగంలో 'రాతిరి, శివరాత్రి' అనే పాటను కంపోజ్ చేశారు. ఇళయరాజా తన అనేక పాటల్లో ఈ రాగాన్ని ఉపయోగించారు’’ అని శ్రీధర్ పేర్కొన్నారు.
‘‘ఆ రాగాన్ని కనిపెట్టింది ఇళయరాజా కానప్పుడు ఆ రాగం ఆధారంగా ఆ పాటను తమదిగా ఎలా చెప్పుకుంటారు’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఈ పాటను కంపోజ్ చేసినందుకు ఆయనకు క్రెడిట్ ఇచ్చాం. తర్వాత దాన్ని తొలగించాం’’ అని తెలిపారు.
‘‘క్యాసెట్లను విడుదల చేసే హక్కును ఇళయరాజా ఎకోకు ఇచ్చారు. వారు దానిని వేరే విధంగా ఉపయోగించినందున ఆయన దావా వేశారు’’ అని ఇళయరాజా తరఫు న్యాయవాది శరవణన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఎకో' కంపెనీపై కేసు ఏమిటి?
'ఇళయరాజాకు తన పాటలపై ఎలాంటి హక్కులు పొందే వీలు లేదు' అంటూ ఎకో కంపెనీ గత ఏడాది జూన్ 13న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తన మ్యూజిక్ నుంచి సుమారు 4,500 పాటలను ఉపయోగించడానికి సంగీత సంస్థలు ఎకో, అకి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అయితే కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా వాటిని ఉపయోగించడం కొనసాగించాయని ఇళయరాజా గతంలో దావా వేశారు. కాపీరైట్ పొందకుండా తన పాటలను వాడుకుంటున్నారని ఆరోపించారు.
అయితే, 'నిర్మాత అనుమతితో పాటలను వాడుకునే హక్కు మ్యూజిక్ కంపెనీలకు ఉంది' అని సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు.
దీనిపై ఇళయరాజా దాఖలు చేసిన కేసులో మ్యూజిక్ కంపెనీలపై మధ్యంతర ఆంక్షలు విధించింది కోర్టు. ఎకో గత ఏడాది ఈ కేసును అప్పీల్ చేసింది.
ఆ సమయంలో 'ఎకో' తరపు న్యాయవాది వాదిస్తూ, ‘‘ఒక సంగీత దర్శకుడు ఒక సినిమాకు నిర్మాత నుంచి పారితోషికం అందుకుంటే రాయల్టీ పొందే హక్కు మినహా అన్ని హక్కులను కోల్పోతాడు’’ అని వాదించారు.
ఇళయరాజా కేసులో 'ఎకో' కంపెనీపై నిషేధం కొనసాగుతోందన్న న్యాయవాది శరవణన్ బీబీసీతో మాట్లాడుతూ..‘‘పాటలు ఇళయరాజా ఆస్తి. మేధో సంపత్తిని పరిరక్షించేందుకు ఆయన విశేష కృషి చేస్తున్నారు’’ అని అన్నారు.
'ఎకో' కంపెనీపై నిషేధం ఉంటే, ఆ సంస్థను కొనుగోలు చేసిన సోనీ మ్యూజిక్ కు కూడా ఇది వర్తిస్తుంది’’ అని శరవణన్ పేర్కొన్నారు.
సోనీ మ్యూజిక్ నుంచి వనితా విజయకుమార్ లక్షలాది రూపాయలు చెల్లించి 'రాత్రి శివరాత్రి' పాటను వాడుకునే హక్కులను కొనుగోలు చేశారని న్యాయవాది శ్రీధర్ తెలిపారు.
‘‘మొదట్లో ఈ పాటను వాడొద్దని చెప్పి ఉంటే దాన్ని వాడకుండా ఉండేవాళ్లం. అలా ఎందుకు చేసి దావా వేయలేదు’’ అని ప్రశ్నించారు.
దీనిపై సోనీ మ్యూజిక్ కంపెనీ లాయర్ తాన్యాను బీబీసీ సంప్రదించగా, 'నేను అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేను' అని బదులిచ్చారు. తాన్యా ఎటువంటి సమాచారం షేర్ చేసినా ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

ఫొటో సోర్స్, FB/SPB/GettyImages
గతంలో బాలూతోనూ ఇళయరాజా వివాదం...
ఇళయరాజా, దివంగత గాయకుడు ఎస్పీ బాలు మధ్య కూడా కాపీరైట్ వివాదం నడిచింది. దీనిపై ఎస్పీ బాలు అప్పట్లో స్పందించారు. ఫేస్‌బుక్ వేదికగా ఇకపై తన కచేరీలలో ఇళయరాజా పాటలు పాడనంటూ ఓ పోస్టు పెట్టారు.
చట్టం గురించి తనకు తెలియకపోవడం వల్ల కచేరీలలో ఇళయరాజా పాటలు పాడానని, ఇకపై షోలలో ఆయన పాటలు పాడలేనని, అదృష్టవశాత్తూ తాను ఇతర సంగీత దర్శకులకు చాలా పాటలు పాడానని, వాటిని షోలలో పాడతానంటూ 2017లో ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.
అంతకు కొన్నిరోజుల కిందట తన పాటలను వేదికలపై పాడొద్దంటూ ఎస్పీబాలు, చిత్ర, ఎస్పీ చరణ్‌లకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. ఆ సమయంలో బాలు విదేశాలలో కచేరీలు చేస్తున్నారు.
నోటీసులు అందుకోగానే ఆయన ఇళయరాజా పాటలు పాడటం మానేసి, ఫేస్‌బుక్ ద్వారా ఆ విషయం తెలియజేశారు.
ఇలాంటి కాపీరైట్ సమస్యలు క్లిష్టమైనవని సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు ఆర్.ఎస్. ఆనందన్ అభిప్రాయపడ్డారు.
‘‘సోనీ మ్యూజిక్ నుంచి కాకుండా, ఇళయరాజా నుంచి ఈ పాట హక్కులను కొనుగోలు చేస్తే సోనీ మ్యూజిక్ నుంచి లీగల్ నోటీసులు వస్తాయి. అప్పుడు సోనీ మ్యూజిక్‌కు కూడా హక్కులు ఉన్నాయని భావించాలి. ఇలాంటి కేసుల్లో వచ్చే కోర్టు తీర్పులే పరిష్కారం’’ అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














