పిల్లలతో సెక్స్ వ్యాపారం చేయిస్తున్న ‘మేడమ్స్’: రహస్యంగా చిత్రీకరించిన వీడియోలలో బయటపడిన కార్యకలాపాలు

న్యాంబూర్, చిప్టూ
ఫొటో క్యాప్షన్, న్యాంబూర (ఎడమ), చిప్టూ (కుడి) తాము పిల్లలను ఎలా వ్యభిచారంలోకి దింపుతామనే విషయాన్ని అండర్‌కవర్ ఇన్వెస్టిగేటర్స్‌కు చెప్పారు.
    • రచయిత, ఎన్‌జెరి మ్వాంగీ, టమాసిన్ ఫోర్డ్
    • హోదా, బీబీసీ ఆఫ్రికా ఐ

కెన్యాలో 'మేడమ్స్'గా వ్యవహరించే మహిళలు 13 ఏళ్ల పిల్లలను వ్యభిచారంలోకి ఎలా దింపుతున్నారనే విషయాన్ని ‘బీబీసీ ఆఫ్రికా ఐ’ ఇన్వెస్టిగేషన్ బయటపెట్టింది.

కెన్యాలో రవాణా కేంద్రమైన మాయ్ మహియులో సరకులను చేరవేస్తూ రాత్రీపగలూ లారీలు, ట్రక్కులు వీధుల్లో తిరుగుతూనే ఉంటాయి. ఇవి యుగాండా, రువాండా, దక్షిణ సూడాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలకు సరకులు, ప్రజలను చేరవేస్తుంటాయి.

కెన్యా రాజధాని నైరోబీకి తూర్పున కేవలం 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ కీలక రవాణా కేంద్రం వ్యభిచారానికి పేరుపడటమే కాదు, పిల్లలపై లైంగిక వేధింపులకూ కేంద్రంగా ఉంది.

‘మేడమ్స్‌’గా మారడం ఎలా అనే విషయం నేర్చుకోవాలనుకుంటున్నామంటూ సెక్స్‌వర్కర్లుగా నటిస్తున్న ఇద్దరు అండర్‌కవర్ ఇన్వెస్టిగేటర్లు ఈ ఏడాది మొదట్లో ఆ పట్టణంలోని సెక్స్‌ వ్యాపార అడ్డాల్లోకి వెళ్లారు.

వారు రహస్యంగా తీసిన వీడియోలో ఇద్దరు వేరువేరు మహిళలు.. ఇది చట్టవిరుద్ధమని తమకు తెలుసని చెబుతూనే సెక్స్ ఇండస్ట్రీలోని బాలికలను ఇన్వెస్టిగేటర్లకు పరిచయం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Maai Mahiu

‘కండోమ్‌లు వాడతారా?’

బీబీసీ తన సాక్ష్యాధారాలన్నింటినీ మార్చి నెలలో కెన్యా పోలీసులకు అందజేసింది.

అప్పటి నుంచి మేడమ్‌లు ఆ ప్రాంతం విడిచివెళ్లిపోయారని బీబీసీ భావిస్తోంది.

బీబీసీ రహస్యంగా తీసిన వీడియోలో కనిపిస్తున్న మహిళలు, బాలికలను పట్టుకోలేకపోయినట్టు పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు అక్కడ ఎలాంటి అరెస్ట్‌లు జరగలేదు.

కెన్యాలో శిక్షలు చాలా అరుదు. నేరం నిరూపించడానికి పోలీసులకు పిల్లలనుంచి సాక్ష్యాలు కావాలి. కానీ నిస్సహాయులైన పిల్లలు సాక్ష్యం చెప్పడానికి చాలాసార్లు భయపడుతుంటారు.

సమ్మతితో పెద్దలు చేసే వ్యభిచారం కెన్యా జాతీయ చట్టాల ప్రకారం నేరం కాదు. కానీ అనేక మున్సిపాల్టీలలో దీనిని నిషేధించారు.

అయితే నకురు కౌంటీలో భాగమైన మాయ్ మహియులో మాత్రం దీనిపై నిషేధం లేదు.

వ్యభిచారం ద్వారా వచ్చే సొమ్ముతో జీవించడం కెన్యా శిక్షాస్మృతి ప్రకారం చట్టవిరుద్ధం. అంటే సెక్స్ వర్కర్‌గానీ, మధ్యవర్తిగానీ, లేదంటే వ్యభిచారం నుంచి లబ్ధి పొందడం చట్టవిరుద్దం. 1

8 ఏళ్లలోపు మైనర్ల అక్రమ రవాణా, విక్రయం వంటి నేరాలకు పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధిస్తారు.

చీకటిగా ఉన్న ఓ వీధిలో చిత్రీకరించిన బీబీసీ వీడియోలో తన పేరు న్యాంబురా అని చెప్పిన ఒక మహిళ.. ‘‘వారు ఇంకా పిల్లలు. అందుకే కేవలం స్వీట్లు ఇచ్చి వారిని తేలికగా మోసం చేయవచ్చు’’ అన్నారు.

‘‘మాయ్ మహియులో ఇదో డబ్బు సంపాదన మార్గం. ట్రక్కు డ్రైవర్లు ఎక్కువగా ఈ వ్యాపారంలో కస్టమర్లు. దీనివల్ల మాకు ప్రయోజనం చేకూరుతుంది. మాయ్ మహియులో ఇదంతా సాధారణం’’ అని ఆమె చెప్పారు. తనకూ ఓ 13 ఏళ్ల కూతురు ఉందని, తను ఆరునెలల నుంచి 'పనిచేస్తోందని' ఆమె వివరించారు.

''మైనర్లతో వ్యవహారం చాలా ప్రమాదకరం. మీరు వారిని పట్టణంలో బహిరంగంగా తీసుకురాలేరు. రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తీసుకువస్తాను'' అని న్యాంబురా తెలిపారు.

వారి దగ్గరకు వచ్చేవారు కండోమ్‌ ధరిస్తారా అని అడిగినప్పుడు.. ఒకరో ఇద్దరో తప్ప సాధారణంగా అందరూ కండోమ్ వాడుతారని చెప్పారు.

‘‘డబ్బులు ఎక్కువ సంపాదించాలని కోరుకునే కొంతమంది పిల్లలు (వాటిని ఉపయోగించరు), కొంతమందేమో వాటిని వాడొద్దని బలవంతం చేస్తారు’’ అని ఆమె చెప్పారు.

మరోసారి కలిసినప్పుడు ఆమె అండర్ కవర్ ఇన్వెస్టిగేటర్‌ను ఒక ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ముగ్గురు యువతులు సోఫాలో, మరొకరు కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత అమ్మాయిలతో ఒంటరిగా మాట్లాడే అవకాశం కల్పిస్తూ న్యాంబురా గది నుంచి వెళ్లిపోయారు.

రోజూ సెక్స్ కోసం పదేపదే వేధింపులకు గురవుతున్నట్లు అక్కడున్న యువతులు చెప్పారు.

‘‘కొన్నిసార్లు మీరు చాలా మందితో సెక్స్ చేస్తారు. ఊహించని పనులు చేయమని క్లయింట్లు మిమ్మల్ని బలవంతం చేస్తారు’’ అని ఓ అమ్మాయి తెలిపింది.

కెన్యాలో సెక్స్ ఇండస్ట్రీ

ఎన్నివేలమంది ఉన్నారు?

కెన్యా సెక్స్ ఇండస్ట్రీలో బలవంతంగా తీసుకొచ్చిన పిల్లలకు సంబంధించిన ఇటీవలి డేటా ఏదీ అందుబాటులో లేదు.

కెన్యాలో మానవ హక్కులు ఎలా అమలవుతున్నాయనే విషయంపై 2012లో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కెన్యా ప్రభుత్వం, గతంలో బాలల వ్యభిచార నిర్మూలన కోసం పనిచేసిన ఓ స్వచ్ఛంద సంస్థ నుంచి సేకరించిన డేటా ప్రకారం ఆ సంఖ్య 30 వేలు.

పర్యటక రిసార్టులకు పేరుపొందిన దేశంలోని తీరప్రాంతంపై ఇతర అధ్యయనాలు దృష్టిసారించాయి.

‘గ్లోబల్ ఫండ్ టు ఎండ్ మోడర్న్ స్లావరీ’ అనే స్వచ్ఛంద సంస్థ 2022లో విడుదల చేసిన నివేదికలో కిలిఫీ, క్వాలే కౌంటీలలో దాదాపు 2,500మంది పిల్లలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపారని తెలిపింది.

చెప్టూ అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ మహిళ నమ్మకాన్ని రెండో అండర్‌కవర్ ఇన్వెస్టిగేటర్ చూరగొన్నారు. ఆమెతో అనేకసార్లు సమావేశమయ్యారు.

యువతులను అమ్మడమంటే ‘‘జీవనోపాధి పొందడం, సౌకర్యవంతంగా జీవించడమని అర్థం’’ అని ఆమె చెప్పారు.

''ఈ వ్యాపారం అక్రమమైనది కాబట్టి, దీనిని మీరు అత్యంత రహస్యంగా చేయాలి'' అని ఆమె అన్నారు.

''ఎవరైనా అమ్మాయి కావాలని చెబితే నాకు డబ్బులు ఇవ్వమని అడుగుతాను. వారి కోసం క్రమం తప్పకుండా తరచూ వచ్చేవారు కూడా ఉంటారు''

చెప్టూ తన వద్ద ఉన్న నలుగురు అమ్మాయిలను కలవడానికి అండర్ కవర్ ఇన్వెస్టిగేటర్‌ను ఒక క్లబ్ కు తీసుకెళ్లారు. తన వయసు 13 ఏళ్లు అని ఆ నలుగురిలో చిన్నమ్మాయి చెప్పింది. మిగతా వారు 15 ఏళ్లు అని చెప్పారు.

వారి నుంచి వచ్చే లాభం గురించి ఆమె మాట్లాడుతూ.. బాలికలు సంపాదించే 3,000 కెన్యా షిల్లింగ్స్‌లో (భారతీయ కరెన్సీలో సుమారు 2,500 రూపాయలు) తన వాటా 2,500 షిల్లింగ్‌ (సుమారు 1700 రూపాయలు) అని చెప్పారు .

మరో సమావేశంలో , మాయ్ మహియులోని ఒక ఇంట్లో.. చెప్టూ అండర్ కవర్ ఇన్వెస్టిగేటర్‌ను ఇద్దరు బాలికలతో ఒంటరిగా విడిచిపెట్టారు. రోజుకు సగటున ఐదుగురితో సెక్స్‌లో పాల్గొంటున్నట్లు వారిలో ఒకరు ఆమెకు చెప్పారు. కండోమ్ లేకుండా సెక్స్ చేయడానికి నిరాకరిస్తే ఏమవుతుందని ప్రశ్నించగా తనకు గత్యంతరం లేదని చెప్పారు.

‘నేను (కండోమ్ లేకుండా) సెక్స్ చేయాల్సిందే. లేదంటే నన్ను తరిమికొడతారు. నేనో అనాథను... నాకు పరిగెత్తడానికి చోటే లేదు’ అన్నారామె.

బేబీ గర్ల్
ఫొటో క్యాప్షన్, లైంగిక వేధింపులనుంచి తప్పించుకున్న బాలికలకు 'బేబీ గర్ల్' అనే మాజీ సెక్స్‌వర్కర్ ఆశ్రయం కల్పిస్తున్నారు.

‘వేధింపులు, హింస, నిర్లక్ష్యం’

కెన్యా సెక్స్ పరిశ్రమ ఒక సంక్లిష్టమైన, చీకటి ప్రపంచం. ఇక్కడ పురుషులు, మహిళలు బాలలతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు.

మాయ్ మహియులో ఎంత మంది పిల్లలు బలవంతంగా సెక్స్ వర్కర్లుగా మారుతున్నారో తెలియదు కానీ, సుమారు 50,000 మంది జనాభా ఉన్న ఈ చిన్న పట్టణంలో వారిని కనుక్కోవడం తేలిక.

లైంగిక వేధింపులనుంచి తప్పించుకున్న బాలికలకు ''బేబీ గర్ల్'' అనే మాజీ సెక్స్‌వర్కర్ ఆశ్రయం కల్పిస్తున్నారు.

ఈ 61 ఏళ్ల మహిళ 40 ఏళ్లు సెక్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. తన 20 ఏళ్ల వయసులో ఆమె వీధులలోకి వచ్చారు. భర్త హింసలు భరించలేక పారిపోయి వచ్చిన ఆమె అప్పుడు నిండుగర్భిణి. ఆమెతోపాటు ఆమె ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

ఆమె తన ఇంటిముందున్న పార్లర్‌లో వంటశాల చెక్క బల్ల వద్ద నలుగురు యువతులను బీబీసీకి పరిచయం చేశారు. వారంతా బాలికలుగా ఉన్న సమయంలో మాయ్ మహియులో మేడమ్‌లు వారిని బలవంతంగా సెక్క్‌వర్క్‌లోకి దించారు. వీరందరిదీ దాదాపు ఒకేవిధమైన కుటంబ నేపథ్యం.

విడిపోయిన కుటుంబాలు, ఇంట్లో వేధింపుల నుంచి తప్పించుకోవడానికి వారు మాయ్ మహియుకు వచ్చారు. కానీ అక్కడ మళ్లీ హింసాత్మక వేధింపులకు గురయ్యారు.

హెచ్‌ఐవీ కారణంగా తన తల్లిదండ్రులను కోల్పోయానని, తనను వీధుల్లోకి గెంటివేశారని, అక్కడ తనకో వ్యక్తి పరిచయమయ్యారని, తనకు కొద్దిగా సాయం చేసి లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని మిషెల్ తెలిపారు. రెండేళ్ల తరువాత ఓ ‘మేడమ్‌’ తనను కలిశారని, తనను సెక్స్‌వర్క్‌లోకి బలవంతంగా దించారని చెప్పారు.

లిలియన్ అనే 19 ఏళ్ల యువతి కూడా చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ఆమె తన అంకుల్‌తో కలిసి వెళ్లారు. ఆయన ఆమె స్నానం చేస్తుండగా ఫోటోలు తీసి తన స్నేహితులకు అమ్మారు. ఈ అఘాయిత్యం ఆపైన అత్యాచారంగా మారింది.

''అది నా జీవితంలో అత్యంత చెత్త రోజు. అప్పుడు నా వయసు 12 ఏళ్లు''

అక్కడి నుంచి ఆమె తప్పించుకోగానే ఆమెను మాయ్ మహియుకు తీసుకువచ్చిన ట్రక్కు డ్రైవర్ అత్యాచారం చేశాడు. మిషెల్ వద్దకు వచ్చినట్టే ఓ మహిళ లిలియన్ దగ్గరకు వచ్చి, ఆమెను బలవంతంగా సెక్క్‌వర్క్‌లోకి దింపింది.

ఈ ఇద్దరి యువతుల జీవితాలు హింస, నిర్లక్ష్యం, వేధింపులకు గురయ్యాయి. ప్రస్తుతం బేబీ గర్ల్ వద్ద ఆశ్రయం పొందుతున్న వీరిలో ఇద్దరు ఫోటోగ్రఫీ స్టూడియోలోనూ, మరో ఇద్దరు బ్యూటీ సెలూన్‌లో కొత్త నైపుణ్యాలు పెంచుకుంటున్నారు.

నకురు కౌంటీ కెన్యాలోనే అత్యధిక హెచ్ఐవీ సంక్రమణ రేటు ఉన్న ప్రాంతం. యూఎస్ సహాయ సంస్థ యూఎస్ఎఐడి మద్దతుతో బేబీ గర్ల్ అసురక్షిత శృంగారం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

నైవాషా సరస్సు సమీపంలోని కరాగిటా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు కార్యాలయం ఉంది. అక్కడ ఆమె కండోమ్‌లు, సలహాలను అందిస్తారు.

యూఎస్ఏఐడీ నిధులను ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో ఆమె కార్యక్రమాలు ఆగిపోనున్నాయి.

"సెప్టెంబర్ నుండి మేం నిరుద్యోగులమవుతాం." అని ఆమె బీబీసీ వరల్డ్ సర్వీస్‌తో అన్నారు, తనపై ఆధారపడిన యువతులు, బాలికల గురించి తాను ఎంత ఆందోళన చెందుతున్నానో చెప్పారు.

''ఈ పిల్లలు ఎంత దుర్భరంగా ఉన్నారో మీరు చూశారు. వీరు సొంతంగా ఎలా బతగలరు? వాళ్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు''

నిధుల కోత ప్రభావం గురించి ఈ దర్యాప్తులో వచ్చిన వ్యాఖ్యలపై అమెరికా ప్రభుత్వం స్పందించలేదు. గత నెలలో యుఎస్ఎఐడిని అధికారికంగా మూసివేశారు.

ప్రస్తుతానికి, లిలియన్ ఫోటోగ్రఫీ నేర్చుకోవడం, వేధింపుల నుండి కోలుకోవడంపై దృష్టి పెట్టారు.

"నేను ఇక భయపడను, ఎందుకంటే నాకు తోడుగా బేబీ గర్ల్ ఉంది" అని ఆమె చెప్పారు "మా గతాన్ని మరిచిపోవడానికి ఆమె మాకు సాయం చేస్తున్నారు''

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)