ఇండిగో విమానంలో చెంపదెబ్బ వ్యవహారం: అసలేమైంది? అదృశ్యమైన బాధితుడు ఇంటికి చేరుకున్నారా?

సహ ప్రయాణికుడిని చెంప దెబ్బ కొడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది

ఫొటో సోర్స్, Social Media

ఫొటో క్యాప్షన్, సహ ప్రయాణికుడిని చెంప దెబ్బ కొడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది
    • రచయిత, విశ్వకల్యాణ్ పురకాయస్థ
    • హోదా, బీబీసీ కోసం

ముంబయి నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఒక వ్యక్తిని సహ ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దాడి చేసిన ప్రయాణికుడు భవిష్యత్‌లో తమ విమానాల్లో ప్రయాణించకుండా ఇండిగో సంస్థ నిషేధించింది.

కోల్‌కతాలో విమానం దిగిన అనంతరం బాధితుడు కనిపించకుండా పోయినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, ఆయన ఇంటికి చేరుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు.

విమానంలో ఒక వ్యక్తి, సహ ప్రయాణికుడిని చెంపదెబ్బ కొడుతున్నట్లు కనిపిస్తున్న వీడియో శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఘటనలో బాధితుడిని అస్సాంలోని కఛార్ జిల్లా లాథిమారా గ్రామానికి చెందిన వ్యక్తి (32)గా గుర్తించారు.

జులై 31న ఇండిగో విమానం 6E138లో ఈ ఘటన జరిగింది. దీనిపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందించారు.

వైరల్‌గా మారిన వీడియో చూసి బాధితుడు తమ కుమారుడే అని గుర్తించినట్లు బీబీసీతో ఆయన తండ్రి చెప్పారు.

మీడియా కథనాల ప్రకారం, విమానంలో ఒక ప్రయాణికుడు అనారోగ్యానికి గురయ్యాడు. క్యాబిన్ సిబ్బంది ఆయనకు సహాయం చేస్తుండగా అకస్మాత్తుగా మరొక ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టారని కథనాలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది

ఫొటో సోర్స్, Getty Images

వీడియోలో ఏం కనిపిస్తోంది?

చెంపదెబ్బ తిన్న వ్యక్తి చాలా కలవరపడినట్లు, ఏడుస్తున్నట్లుగా వైరల్ అయిన వీడియోలో కనిపిస్తోంది. 'మీరు అతన్ని ఎందుకు కొట్టారు? మీకు ఎవరినీ కొట్టే హక్కు లేదు' అని మరో ప్రయాణికుడు నిలదీస్తున్నట్లుగా వీడియోలో మాటలు వినిపిస్తున్నాయి.

బాధితుడికి ఇద్దరు క్యాబిన్ సిబ్బంది సహాయం చేస్తున్నట్లు, విమానం నుంచి ఆయన బయటకు వెళ్లడానికి సహాయపడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది.

అదే సమయంలో, పక్కన కూర్చున్న ఒక ప్రయాణికుడు అకస్మాత్తుగా ఆ వ్యక్తిని బలంగా చెంపదెబ్బ కొట్టారు. వెంటనే స్పందించిన ఫ్లైట్ అటెండెంట్, 'సర్, ప్లీజ్ అలా చేయకండి' అని అన్నారు.

'మీరు అతన్ని ఎందుకు కొట్టారు' అని వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి అడగగా, 'ఆయన వల్ల మేం ఇబ్బంది పడ్డాం' అని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి అంటున్నట్లుగా వీడియోలో ఉంది.

''హా, ఇబ్బంది ఉన్నంత మాత్రాన మీరు అతన్ని అలా కొట్టకూడదు'' అని మరో ప్రయాణికుడు అన్నారు.

'ఆయనకు ప్యానిక్ అటాక్ వచ్చింది. దయచేసి ఆయనకు కొన్ని నీళ్లు ఇవ్వండి' అని వీడియో రికార్డు చేసే వ్యక్తి, విమాన సిబ్బందితో అన్నారు.

ఇండిగో ప్రకటన

ఇండిగో సంస్థ ఏం చేసిందంటే..

కోల్‌కతాలో దిగిన వెంటనే చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని అధికారులకు అప్పగించినట్లు శుక్రవారం రాత్రి ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ట్వీట్ చేసింది.

నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం, సంబంధిత విమానయాన భద్రత సంస్థలకు ఈ ఘటన గురించి సమాచారం అందించామని ట్వీట్‌లో పేర్కొంది.

నిబంధనల ప్రకారం, ఆ వ్యక్తిని ఇండిగో విమానాల్లో ప్రయాణించకుండా సస్పెండ్ చేశామని ప్రకటించింది.

ఇండిగో

ఘటన తర్వాత కనిపించని బాధితుడు

ఈ ఘటన జరిగినప్పటి నుంచి బాధితుడు కనిపించకుండా పోవడంతో వారి కుటుంబం తొలుత ఆందోళన చెందింది.

'మేం ఆ వీడియో చూశాం. కానీ ఆ తర్వాత ఏమైందో మాకు తెలియదు. ఆయన ఇంటికి తిరిగొచ్చాకే నిజం ఏంటో తెలుస్తుందని అనుకున్నాం'' అని బీబీసీతో వారి కుటుంబీకులు చెప్పారు.

అయితే, బాధితుడు ఆ తర్వాత కోల్‌కతా నుంచి రైలులో అస్సాం చేరుకున్నారు. కుటుంబాన్ని కలిశారు.

''బాధితుడు ముంబయిలోని ఒక హోటల్‌లో పనిచేస్తున్నారు. గత ఏడేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఎన్నోసార్లు ప్రయాణించాడు. కానీ, మొన్న జరిగింది ఇంతకుముందెన్నడూ జరగలేదు. వైరల్ వీడియో చూసిన తర్వాత ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాం. కానీ, మొబైల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మేం విమానాశ్రయానికి వెళ్లాం. అక్కడ దిగుతారని అనుకున్నాం. కానీ, రాలేదు'' అని బాధితుడి తండ్రి చెప్పారు.

పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

అస్సాం పోలీసులు ఏం చెప్పారు?

బాధితుడిని జులై 31న కోల్‌కోతా ఎయిర్‌పోర్ట్ నుంచి పంపించినట్లు కోల్‌కతా పోలీసులను ఉటంకిస్తూ బీబీసీకి అస్సాంలోని కఛార్ జిల్లా ఎస్‌ఎస్‌పీ నుమల్ మహత్తా చెప్పారు.

'బాధితుడు, ఆయన్ను కొట్టిన వ్యక్తికి మధ్య సీఐఎస్‌ఎఫ్ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇద్దరి వాంగ్మూలాలను తీసుకొని వారిని వెళ్లడానికి అనుమతించారు. బాధితుడు మరుసటి రోజు ఉదయం కోల్‌కతా నుంచి సిల్చార్‌కు వెళ్లే విమానం ఎక్కాల్సి ఉంది. కానీ, ఆయన బహుశా విమానాన్ని ఎక్కలేకపోయారు. ముంబయిలో ఉన్నప్పుడే ఆయన ఫోన్ పోయిందని కుటుంబసభ్యులు చెప్పారు. అందుకే వారు అతన్ని సంప్రదించలేకపోయారు. ఆయన వేరే మార్గంలో సిల్చార్‌కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని మేం భావిస్తున్నాం'' అని మహత్తా వివరించారు.

సోషల్ మీడియాలో పెల్లుబికిన ఆగ్రహం

ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

ఆ వ్యక్తిని నో- ఫ్లై జోన్‌లో ఉంచి ఇండిగో చాలా బలహీనమైన చర్య తీసుకుందంటూ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రముఖ న్యాయవాది సంజయ్ హెగ్డే ట్వీట్ చేశారు.

''విమానం ల్యాండ్ అయిన తర్వాత పోలీసులు, సంబంధిత అధికారులకు ఇండిగో ఫిర్యాదు చేసిందా? దాడి చేసిన ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించినట్లయితే, చట్టం ప్రకారం అతనిపై ఎలాంటి అభియోగాలు మోపారు?'' అని ట్వీట్‌లో ఆయన ప్రశ్నించారు.

''ప్రయాణికుడు అసౌకర్యానికి లోనై విమానం నుంచి దిగాలని అనుకున్నారు. అప్పుడే ఒక సహ ప్రయాణికుడు ఆయన చెంపపై కొట్టారు. ఇద్దరూ ఒకే మతానికి చెందినవారు'' అని హిందూ పత్రిక ఏవియేషన్ జర్నలిస్ట్ జాగృతి చంద్రను ఉటంకిస్తూ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ ట్వీట్ చేశారు.

''ఇండిగో ఫ్లైట్ వీడియో చూసి షాకయ్యాను. అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుడిని ఎయిర్‌హోస్టెస్ బయటకు తీసుకెళ్తుండగా, ఒక వ్యక్తి అతన్ని చెంపదెబ్బ కొట్టాడు. కేవలం గడ్డం, టోపీ కారణంగానే చెంపదెబ్బ కొట్టారా లేదా ఇంకేమైనా గొడవ జరిగిందా? ఏదేమైనా ఇలా చేయడం తప్పు'' అని శివరాజ్ యాదవ్ అనే మరో యూజర్ రాసుకొచ్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)