అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 'నా తల్లి శవపేటికలో ఇతరుల అవశేషాలున్నాయి'

ఫొటో సోర్స్, Miten Patel
- రచయిత, సిమా కోటేచా, మైయా డేవిస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన తన తల్లి మృతదేహాన్ని పంపిన శవపేటికలో ఇతరుల అవశేషాలు ఉన్నాయని మృతురాలి కుమారుడు బీబీసీకి చెప్పారు.
ఈ ప్రమాదంలో మీతెన్ పటేల్ తల్లితోపాటు తండ్రి కూడా మరణించారు. తన తల్లి శవపేటికలో ఇతరుల అవశేషాలు ఉన్నట్టు శవపరీక్షాధికారి గుర్తించడం తనను ఆవేదనకు గురిచేసిందని ‘‘ఇంకా ఎంతమందివి అందులో ఉన్నాయో?’’ అని మీతెన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో 260 మంది మరణించారు. ఈ ప్రమాదం తర్వాత కొన్ని కుటుంబాలకు మృతదేహాలను తప్పుగా అందించారని డైలీ మెయిల్ వార్తాసంస్థ బుధవారం రిపోర్టుచేసింది.
అయితే, అన్ని అవశేషాలను అత్యంత వృత్తి నైపుణ్యంతో, గౌరవంగా నిర్వహించినట్లు, ఈ ఆందోళనలను పరిష్కరించడానికి యూకే అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది.

'బాధ్యత ఉండాలి కదా?'
జూన్ 12న అశోక్, శోభనా పటేల్ గాత్విక్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. అయితే ఆ విమానం నిమిషంలోపే కూలిపోవడంతో ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ఆ తర్వాత, యూకేకు ముందుగా వీరి మృతదేహాలే చేరాయి.
అయితే ‘‘ఇతరుల అవశేషాలు కలగలసిపోవడం తీవ్ర వేదన కలిగించిందని’’ మీతెన్ అన్నారు. అయితే, తప్పులు జరగడం సహజమేనని ఆయన అర్థం చేసుకున్నారు.
"ప్రజలు అలసిపోయారు, చాలా ఒత్తిడిలో ఉన్నారు. కానీ, సరైన మృతదేహాలను యూకేకు పంపేలా చూసుకోవాల్సిన ఒక స్థాయి బాధ్యత ఉండాలి. నా తల్లి శవపేటికలో ఇతరుల అవశేషాలు లేవని నేను ఎలా నిర్ధరించుకోగలను?" అని మీతెన్ ప్రశ్నించారు.
కనీసం రెండు సందర్భాల్లో, ఇతరుల అవశేషాలను యూకేలోని కుటుంబాలకు ఇచ్చారని భావిస్తున్నట్లు డైలీ మెయిల్ రిపోర్టు చేసింది. ఒక కేసులో ఒక కుటుంబానికి పూర్తిగా మరో మృతదేహాన్ని ఇచ్చారని, మరో కేసులో అనేక మంది వ్యక్తుల అవశేషాలను ఒకే పేటికలో ఉంచారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'సరైన విధానాలనే పాటించాం'
అయితే, ఈ రిపోర్టుల గురించి తమకు సమాచారం ఉందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది.
"ఈ ఆందోళనలు, సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చిన క్షణం నుంచి యూకేతో కలిసి పనిచేస్తున్నాం" అని తెలిపింది.
ప్రమాదం తర్వాత, బాధితులను గుర్తించడానికి సంబంధిత అధికారులు సరైన విధానాలను అనుసరించారని మంత్రిత్వ శాఖ అంటోంది.
"అన్ని మృతదేహాలను అత్యంత వృత్తి నైపుణ్యంతో, మరణించిన వారి పట్ల తగిన గౌరవంతో నిర్వహించాం. దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించడానికి మేం యూకే అధికారులతో కలిసి పని చేస్తూనే ఉన్నాం" అని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














