జపాన్: అణుబాంబును మేఘాలు అడ్డుకున్నాయా, అందుకే నాగాసాకి నగరంపై వేయాల్సి వచ్చిందా? - హిస్టరీ

ఫొటో సోర్స్, Bettmann Archive/Getty Images
- రచయిత, ఫెర్నాండో డ్యుయార్టే
- హోదా, బీబీసీ గ్లోబల్ జర్నలిజం
కొకురా.
ఈ నగరం ఇప్పుడు లేదు.
ఇది 1963లో మరో నాలుగు జపనీస్ నగరాలతో విలీనమై కితాక్యూషూ అనే పేరుతో కొత్త నగరంగా ఏర్పడింది. దక్షిణ జపాన్‌లోని ఈ నగర జనాభా పది లక్షల లోపే.
కానీ, కొకురా జపనీయుల మది నుంచి తొలగిపోదు. ఆ పేరు ఇంకా ప్రజల మనసుల్లో నాటుకుపోయి ఉండడానికి కారణం, ప్రభుత్వాల నిర్ణయాలు కాదు. ఒక ఘోరమైన విషాదం నుంచి త్రుటిలో తప్పించుకోవడం వల్లే ప్రజలకు అది గుర్తుండిపోయింది.
1945లో అమెరికా అణుబాంబు వేయడానికి ఎంచుకున్న జపాన్ నగరాల్లో కొకురా కూడా ఒకటి. కానీ, రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో ఈ నగరం అదృష్టవశాత్తూ రెండుసార్లు విధ్వంసం నుంచి తప్పించుకుంది.
నిజానికి, ఆగస్టు 9న కొకురాపై అణుబాంబు వేయాలని అమెరికా ప్లాన్ చేసింది. అప్పటికి మూడు రోజుల క్రితమే ఆగస్టు 6న హిరోషిమాపై అణుబాంబు వేసింది అమెరికా.
కానీ, కొన్ని కారణాల వల్ల అమెరికా వైమానిక దళం కొకురాకు బదులుగా నాగాసాకిపై అణుబాంబు వేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో కొకురా భారీ విధ్వంసం నుంచి తప్పించుకుంది.
అణుబాంబు దాడుల వల్ల హిరోషిమాలో 1,40,000 మంది, నాగాసాకిలో 74,000 మంది మరణించారని అంచనా వేశారు. వేల మంది సంవత్సరాల తరబడి రేడియేషన్ ప్రభావాలకు గురవుతూనే ఉన్నారు.
'కొకురా లక్' అనే పదం ఇప్పుడు జపాన్ సామెతగా మారింది. ఆ విధ్వంసాన్ని త్రుటిలో తప్పించుకోవడమే దానికి కారణం.
అసలేం జరిగింది?


ఫొటో సోర్స్, AFP via Getty Images
దట్టమైన పొగమేఘాలు
1945 జూలై మధ్య నాటికి, అమెరికన్ సైనికాధికారులు అణుదాడి చేయడానికి జపాన్‌లోని 12 నగరాలను ఎంపిక చేశారు. ఈ నగరాల్లో సైనిక స్థావరాలు, కర్మాగారాలు వంటి ప్రదేశాలు ఉన్నాయి.
మొదట అణుబాంబు వేయడానికి ఎంపిక చేసిన నగరాల్లో కొకురాది హిరోషిమా తర్వాతి స్థానం. ఈ నగరం ఆయుధ తయారీకి కేంద్రంగా ఉండేది. జపాన్ సైన్యానికి ఇక్కడ పెద్ద ఆయుధ డిపో ఉంది.
ఏ కారణం చేతైనా అమెరికన్ సైన్యం ఆగస్టు 6న హిరోషిమాపై అణుబాంబు వేయకపోయుంటే, కొకురానే మొదటి లక్ష్యమయ్యేది.
మూడు రోజుల తరువాత, ఆగస్టు 9న, తెల్లవారుజామున, B-29 బాంబర్లు కొకురా వైపు బయలుదేరాయి. ఈ విమానాల్లో ఒకటి బాక్స్‌కార్ 'ఫ్యాట్ మ్యాన్' అనే ప్లూటోనియం బాంబును మోసుకెళ్తోంది. ఇది హిరోషిమాపై వేసిన యురేనియం బాంబు కంటే కూడా శక్తివంతమైనది.
కానీ, ఆ ఉదయం కొకురాపై దట్టమైన పొగమేఘాలు కమ్ముకున్నాయి. కొకురాకు పొరుగున ఉన్న యావాటా నగరంపై ఆ ముందురోజు బాంబు దాడి జరగడంతో ఆకాశంలో చాలా పొగ కమ్మేసింది. ఈ కారణంగా కొకురా ఎక్కడుందో స్పష్టంగా కనిపించలేదు.
కొకురాలోని కర్మాగారాలు ఉద్దేశపూర్వకంగానే బొగ్గును కాల్చి ఎక్కువ పొగ సృష్టించాయని, నగరాన్ని పొగతో కప్పి.. తరచుగా జరిగే వైమానిక దాడుల నుంచి రక్షింకోవాలనుకోవడమే దీనికి కారణమని కొంతమంది చరిత్రకారులు చెబుతారు.
అమెరికా మిలిటరీ డాక్యుమెంట్స్, ఆగస్టు 9 మిషన్‌లోని ఒక విమానంలో ఉన్న న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ విలియం లారెన్స్ నివేదిక ప్రకారం, B-29 విమానాలు కొకురా మీదుగా మూడుసార్లు చక్కర్లు కొట్టాయి.
ఎక్కువ విధ్వంసం జరగాలంటే.. లక్ష్యాలను కళ్లతో స్పష్టంగా చూడగలిగినప్పుడు మాత్రమే అణుబాంబులను వేయాలని అమెరికా వైమానిక దళాన్ని ఆదేశించారు.
కానీ, లక్ష్యాలను కచ్చితంగా నిర్ధరించేలోపే, కొకురాలో ఉన్న సైనిక దళాలు ఆ విమానాలను గుర్తించి వాటిపై కాల్పులు జరిపాయి.
దాంతో బాక్స్‌కార్ అనే విమానం నడుపుతున్న మేజర్ చార్ల్స్ స్వీనీ.. విమానం గాల్లో చక్కర్లు కొట్టి ఇంధనం ఎక్కువగా ఖర్చయిపోవడంతో నాగాసాకి వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ విధంగా కొకురా రెండవసారి కూడా ప్రమాదం నుంచి బయటపడింది.

ఫొటో సోర్స్, Bettmann Archive/Getty Images
అమెరికా వ్యూహం
అమెరికన్ విమానాలు 1945 మార్చి నుంచి, జపాన్‌పై వరుసగా దాడులు చేస్తూనే ఉన్నాయి.
ఈ దాడులలో ఫైర్ బాంబులు వేశారు. అవి నగరాలను బూడిదగా మార్చేస్తున్నాయి.
మార్చి 9 రాత్రి టోక్యోపై జరిగిన ఒక్క దాడిలోనే 83 వేల మందికి పైగా మరణించారు. 10 లక్షల మంది మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
కానీ, ఆగస్టులో B-29 యుద్ధ విమానాలు కొకురా మీదుగా వెళ్లినప్పుడు ఆ నగరానికి అంతగా నష్టం జరగలేదు.
అణుబాంబు వేయడానికి మొదట్లో ఎంపిక చేసిన నగరాల్లో నాగాసాకి లేదు. కానీ, తరువాత అప్పటి యూఎస్ సెక్రటరీ ఆఫ్ వార్ హ్యారీ స్టిమ్సన్ నాగాసాకిని ఆ జాబితాలో చేర్చారు.
జపాన్ పాత రాజధాని అయిన క్యోటోను నాశనం చేస్తే, యుద్ధానంతరం జపాన్, అమెరికా మధ్య మళ్లీ స్నేహ సంబంధాలు ఏర్పడటం చాలా కష్టమవుతుందని అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ను ఒప్పించారు స్టిమ్సన్.
అయితే, క్యోటోను కాపాడటం వెనుక స్టిమ్సన్‌కు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఉన్నాయని అమెరికన్ చరిత్రకారులు పేర్కొన్నారు. ఇంతకుముందు చాలాసార్లు ఆయన జపాన్‌లో పర్యటించారు. తన హనీమూన్ కోసం క్యోటో వెళ్లారని వాళ్లంటున్నారు.

ఫొటో సోర్స్, Kitakyushu City handout
ఊరట, విచారం
ఆగస్టు 15, 1945న జపాన్ బేషరతుగా లొంగిపోతున్నట్లు జపాన్ చక్రవర్తి హిరోహితో ప్రకటించారు.
ఇప్పుడు కితాక్యూషూగా పిలుస్తున్న కొకురా నగరం విధ్వంసాన్ని తప్పించుకుంది, కానీ భయాన్ని మాత్రం కాదు.
నాగాసాకీపై వేసిన బాంబు అసలు తమ నగరంపై వేయాల్సిందని కొకురా ప్రజలకు తెలిసినప్పుడు, వారికి ఒకవైపు ఊరటతో పాటు దిగులూ, మరొకవైపు నాగాసాకి ప్రజలపై సానుభూతి కలిగాయి.
కితాక్యూషూ నగరంలో ఒకప్పుడు ఆయుధ నిల్వాగారంగా ఉపయోగించిన ప్రదేశంలో ఉన్న పార్కులో, నాగాసాకి అణుబాంబు స్మారక స్థూపం ఉంది.
ఈ స్మారక చిహ్నం నగరం విధ్వంసం నుంచి త్రుటిలో తప్పించుకున్న అదృష్టంతో పాటు నాగాసాకి విషాదాన్ని గుర్తుచేస్తుంది. మరణించిన వారి జ్ఞాపకార్థం 1973 నుంచి ఆగస్టు 9న ఇక్కడ ప్రతి ఏడాది కార్యక్రమం నిర్వహించి, మృతులను స్మరించుకుంటారు.
కితాక్యూషూ సిటీ మ్యూజియం ఆఫ్ పీస్ 2022 లో ప్రారంభమైంది.
రెండు నగరాలు దశాబ్దాల కాలంలో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకున్నాయి. వాటి చరిత్ర, భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని బహిరంగంగానే అంగీకరిస్తున్నాయి.
అయితే, కితాక్యూషూ కూడా కఠినమైన సవాళ్లు ఎదుర్కొంది. జపాన్ పునర్నిర్మాణ సమయంలో, ఈ కర్మాగార నగరం విపరీతమైన కాలుష్యానికి గురైంది. ఎక్కడచూసినా చెత్తతో నిండిపోయింది. దాంతో దోకాయ్ బేలో తాగునీరు కరువైంది.
కానీ, ప్రస్తుతం ఈ నగరం ఆసియాలోని పచ్చని నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
ఈ నగరం గతాన్ని ఎప్పటికీ మరచిపోలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














