నంద్యాల జిల్లా: బిల్వ స్వర్గం గుహలలో 2 లక్షల 60 వేల ఏళ్ల కిందట ఏం జరిగింది? ఏమిటా చరిత్ర?

- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అవి 19వ శతాబ్దం చివరి రోజులు..
ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు మనిషి పుట్టుకపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. యూరప్ దేశం ఫ్రాన్స్‌లోని గుహల్లో ఆ పరిశోధనలు ఎంతో చురుగ్గా సాగుతున్నాయి.
ఆదిమానవుడు భారత్‌లోనే మొదటిసారి పుట్టాడని చాలామంది శాస్త్రవేత్తలు భావించే కాలం అది.
అదే క్రమంలో భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న బేతంచర్లకు 5 కిలోమీటర్ల దూరంలోని ఒక గుహను వెతుక్కుంటూ వచ్చారు బ్రిటిష్ అధికారి రాబర్ట్ బ్రూస్ ఫోట్.
ఇక్కడ తవ్వకాలు జరపమని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆయన్ను పంపింది.
పూర్వ శిలాయుగం లేదా ప్రాచీన శిలాయుగం అంటే పాలియో లిథిక్ కాలపు విశేషాలు వెతికి తీయడంలో బ్రూస్ ఫోట్ సిద్ధహస్తుడు.
దక్షిణ భారతంలో చాలా పాత రాతియుగం ఆనవాళ్లు ఆయన కనిపెట్టారు.


ఆయన 1883లో మద్రాసు నుంచి కర్నూలు వరకు వచ్చారు. కానీ, తాను అనుకున్న గుహ దొరకలేదు. మొదట్లో కర్నూలు దగ్గరున్న బెలూం గుహలనే తాను అనుకున్న గుహలని ఆయన పొరపడ్డారు. కానీ, అవి తాను అనుకున్న గుహలు కావని వెనక్కు వెళ్లిపోయారు.
రెండోసారి వచ్చినప్పుడు ఎర్రజరి గవి అని యాగంటి దగ్గర ఒక ప్రదేశం కనుగొని పరిశోధనలు చేశారు. అప్పుడు కూడా ఆయనకు తాను అనుకున్న గుహలు దొరకలేదు.
చివరగా మూడోసారి వచ్చినప్పుడు సరిగ్గా తాను అనుకున్న గుహలకు చేరుకుని అక్కడ పరిశోధనలు చేశారు. అవే బిల్వ స్వర్గం గుహలు.
బేతంచర్ల దగ్గర్లోని కనుమ కింద కొట్టాల గ్రామం పక్కనే ఉంటాయి ఇవి. తూర్పు కనుమల్లోని ఎర్రజరి కొండల్లో ఇవి ఒక భాగం.
జీఎస్ఐ సంస్థ అప్పట్లోనే ఆ గుహలపై ఆసక్తి కనబరచడానికి ఓ కారణం ఉంది.
అప్పటికి దాదాపు 40 ఏళ్ల క్రితం అంటే 1842 లేదా 1844 ప్రాంతంలో కర్నూలు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేసిన కెప్టెన్ న్యూబోల్డ్ అనే బ్రిటిష్ అధికారి ముందుగా ఈ గుహల గురించి కనుగొన్నారు.
దానిపై లండన్‌లోని రాయల్ సొసైటీకి నివేదిక ఇచ్చారు. గుహలో నేల మీద జంతువుల శిలాజాలు ఉన్నాయని ఆయన రాశారు.
న్యూబోల్డ్ స్వయంగా తవ్వకాలు జరిపి, కొన్ని జంతువుల శిలాజాలు కనుగొని, వాటిని పరిశోధనల కోసం యూరోప్ పంపారు.
అలాగే కోల్‌కతాలోని ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌లో వాటి వివరాలు ప్రచురించారు.
అది జరిగిన 40 ఏళ్ల తరువాత ఆ గుహలను వెతక్కుంటూ బ్రూస్ ఫోట్ కర్నూలు వచ్చారు.

1883-1885 మధ్య రాబర్ట్ బ్రూస్ ఫోట్, ఆయన కుమారుడు హెన్రీ ఫోట్ కలసి బిల్వ స్వర్గం గుహల్లో పరిశోధన చేశారు. అక్కడ లోతైన గుంతలు తవ్వారు.
పెద్ద ఎత్తున జంతు శిలాజాలు సేకరించారు. పాత రాతియుగపు ఆయుధాలుగా భావించే వస్తువులు సేకరించారు. భూమి పొరల ఆధారంగా జంతువుల కాలాలు నిర్ణయించారు. వాటన్నింటినీ లండన్ పంపారు.
అక్కడ రిచర్డ్ లిడెకర్ అనే శాస్త్రవేత్త అవి ఏ జంతువులవి అనేది వివరంగా పరిశోధన చేశారు.
దాదాపు 180 ఏళ్లుగా ఇక్కడకు దఫదఫాలుగా దేశవిదేశాల శాస్త్రవేత్తలు వచ్చి పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ప్రతిసారీ ఇక్కడ కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారు.
అక్షరాలా 2 లక్షల 60 వేల ఏళ్ల క్రితం ఆ గుహలో తిరిగిన, జీవించిన జంతువుల ఆనవాళ్లు.. ప్రస్తుతం ఆఫ్రికాలో తప్ప ఇంకెక్కడా కనబడని జంతువుల అవశేషాలు.. నాలుగున్నర వేల ఏళ్ళ క్రితం మనిషి నడచిన ఆనవాళ్లు.. ఇలా అనేకం అక్కడ దొరికాయి.
ప్రొఫెసర్ తిమ్మారెడ్డి చేసిన పరిశోధన ప్రకారం, అక్కడ ఆదిమానవులు వాడిన ఆయుధాలు దొరికాయి.
ఇదొక్కటే కాదు... పాత కర్నూలు జిల్లా పరిసరాల్లో అనేకమంది ఆదిమానవులు తిరిగిన అనేక ప్రదేశాలు ఉన్నాయని ఎందరో దేశ విదేశీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ప్రదేశం నుంచి 1356 రాతి పనిముట్లను తిమ్మారెడ్డి సేకరించారు. వాటిలో ఎముకతో చేసినవి కూడా ఉన్నాయి.

మనిషి పుట్టుకపై విస్తృత పరిశోధనలు
''శిలాజాలుగా మారిన మానవుల, జంతువుల ఎముకలను కనుక్కోవడానికి లైమ్ స్టోన్ గుహలు కీలకమైన ఆధారాలు. ఈ క్రమంలోనే ఈ బిల్వ స్వర్గం గుహల గురించి పురాతత్వ, భూగర్భ, శిలాజ శాస్త్ర నిపుణులకు తెలుసు.
తాజాగా జెనెటిక్ పరంగా కూడా పరిశోధనలు జరుగుతూ మనిషి పుట్టుకపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఈ బిల్వ స్వర్గం గుహలకు ప్రాధాన్యం ఉంది. కొంత విరామం ఇచ్చి కొత్తగా తవ్విన ప్రతిసారీ పురాతత్వ స్థలాలు అనేక కొత్త కొత్త ఫలితాలను ఇస్తుంటాయి. సాధారణంగా గుహల్లోకి ఇతరులు వెళ్లి ధ్వంసం చేయరు కాబట్టి అక్కడి సాక్ష్యాలు చెక్కు చెదరకుండా ఉంటాయి'' అని బిల్వ స్వర్గంలో పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ రవి కొరిశెట్టార్ బీబీసీతో అన్నారు.

ఎత్తైన కొండల మధ్య ఉన్నట్లుగా గుహ ముఖద్వారం
చూడగానే రెండు ఎత్తైన కొండల మధ్య ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ గుహ ముఖద్వారం. లోపలికి వెళ్లి తలెత్తి చూస్తే సుమారు 200 అడుగుల ఎత్తైన కొండను ఏదో ప్రవాహం చీల్చేసినట్టుగా దారి కనిపిస్తుంది.
గుహ అంటే ఇది పూర్తిగా మూసుకుపోయి ఉండేది కాదు. ఆకాశం కనిపించే విధంగా ఉంటుంది.
ఇందులో రెండు పెద్ద గుహలు, అనేక చిన్న గుహలు, సొరంగాలు ఉన్నాయి.
చార్నెల్ హౌస్, పర్గేటరీ, కేథడ్రల్, నార్త్ చాపెల్, సౌత్ చాపెల్, చాప్టర్ హౌస్ అనే పేర్లతో గుహలు, ట్రాన్సెప్ట్, గోతిక్ ఆర్క్ వయండ్, ఇన్నర్ కోర్ట్స్, ఔటర్ కోర్ట్స్ అనే పేర్లతో సెక్షన్లు ఉన్నాయి.
ఇంకా పరిశోధనలు చేయని అనేక చిన్న మార్గాలూ ఉన్నాయి. వీటిలో చార్నల్ హౌన్, కేథడ్రల్ హౌస్ చాలా పెద్దవి. వీటిలో దాదాపు 30 మీటర్ల పొడవైన ఓ గుహ ఉంది.
ప్రస్తుతం తూర్పు ఆఫ్రికాలోని ఇతోపియన్ కొండ ప్రాంతాల్లో కనిపించి, భారత్‌లో అంతరించిపోయిన ఓల్డ్ వల్డ్ మంకీ (Theropithcus galeda) ఆనవాళ్లు ఇక్కడ దొరికాయి.
4500 ఏళ్ల క్రితమే ఇక్కడ మనిషి తిరిగినట్టు ఆధారాలున్నాయి. ఒక గోడపై చిన్నగా బ్రాహ్మీ లిపి అక్షరాలు ఉన్నాయి.
''దక్షిణ భారతదేశపు పురాచరిత్రకు సంబంధించి ఇది కీలక ఆధారం. గతంలో మేం చాలా కీలక పరిశోధనలు చేశాం. నిధుల కొరత వల్ల మా పరిశోధన కొనసాగలేదు. బెలూం గుహల్లో ఇటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి అక్కడ మార్పులు చేసినా పర్లేదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ జంతువుల ఆనవాళ్లు స్పష్టంగా దొరికాయి. మనుషుల అవశేషాలు దొరకలేదు. అలాగని ఇకపై దొరకవు అని చెప్పలేం '' అని రవి కొరిశెట్టార్ అన్నారు.
పురాతత్త్వ (archaeological), శిలాజ శాస్త్ర (palaeontological), ప్రాచీన జంతు-వృక్ష శాస్త్ర (palaeoenvironmental) పరిశోధనలు ఇక్కడ ఇంకా జరగాలి.
ఉత్తర ప్రాచీన రాతియుగం గురించి ఇంకా వివరాలు రావాల్సి ఉంది. జంతువుల శిలాజాలను పురాచరిత్ర పరిణామ క్రమంలో కనుగొన్నారు. అలాగే యంగెస్ట్ టోబా టర్ఫ్ ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఇక్కడున్నట్టుగా ప్రపంచంలో మరెక్కడా ఇలా గుహల్లో అగ్నిపర్వత పేలుడు ఆనవాళ్లు కనిపించలేదు'' అంటూ ఆ గుహ ప్రత్యేకత వివరించారు రవి కొరిశెట్టార్.

బిల్వ స్వర్గం గుహలను పర్యటకంగా అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం
ఇంత వైవిధ్యం ఉన్న ఈ గుహలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ గుహ పరిశోధనలకు పనికిరాకుండా పోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. వారు ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) కి దీనిని బాధ్యులను చేస్తుండగా, ఏపీటీడీసీ అధికారులు ఆ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు.
2024 జనవరిలో బిల్వ స్వర్గం గుహలను పర్యటకపరంగా అభివృద్ధి చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యటక అభివృద్ధి సంస్థ.. ఆ గుహలో కింద నడిచే దారి మొత్తాన్ని కాంక్రీటుతో నింపేసింది.
సహజసిద్ధమైన గుహ నేల భాగం మొత్తం కాంక్రీటు పోశారు.
ఆ గుహ గోడలకు, నేలపై కాంక్రీటుకూ మధ్య ఖాళీ లేకుండా సిమెంట్ చేసేశారు.
దీంతో భవిష్యత్తు పరిశోధనలకు ఈ గుహలో తవ్వకాలకు వీలులేకుండా పోయిందని నిపుణులు అంటున్నారు.
రోడ్లు వేయడం వరకూ బాగానే ఉంది కానీ కాంక్రీటు పోయడాన్ని పురాతత్త్వ శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం పర్యటకులు ఇక్కడకు వస్తున్నారు. గుహ లోపలకి వెళ్లడానికి ఏపీటీడీసీ టికెట్ వసూలు చేస్తోంది.
అక్కడకు కొంత భాగం రోడ్డు వేసి, కొన్ని సౌకర్యాలు కల్పించారు. రోడ్డు వేయడం, సౌకర్యాల కల్పనపై ఏ వివాదం లేదు కానీ, కాంక్రీటు పోయడంపై మాత్రం వివాదం ఉంది.

కాంక్రీటు వల్ల నష్టమా?
''2008 ప్రాంతంలో ఇక్కడ లైమ్ స్టోన్ తవ్వకాలు జరిగాయి. అవి ప్రమాదం అని గుర్తించిన మేం స్థానిక బేతంచర్ల నాయకులతో చర్చిస్తే, వారు ఆ మైనింగ్ ఆపించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఆ స్థలాన్ని ధ్వంసం చేసింది. ప్రభుత్వం అక్కడి నేలను మార్చేసింది. నేలపై కాంక్రీటు పోశారు. గుహ లక్షణాన్ని ధ్వంసం చేసేశారు. అది సరికాదు.
దీనిపై నేను హైదరాబాద్, విజయవాడల్లోని నా మిత్రులను సంప్రదించి, వారికి కొన్ని ప్రతిపాదనలు ఇచ్చాను. దాన్ని టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఉంచుతూనే, పరిశోధనలకు కూడా వీలు కల్పించాలి. దాన్ని సరైన పద్ధతిలో అభివృద్ధి చేస్తే ఇంకా గొప్ప టూరిస్టు కేంద్రంగా చేయవచ్చు.
దాన్నొక నేచురల్ హిస్టరీ మ్యూజియంగా మార్చాలనే నా ప్రతిపాదనను కొందరు మిత్రుల ద్వారా ప్రభుత్వానికి పంపే ప్రయత్నం చేస్తున్నాను. నేలపై కాంక్రీటు తొలగించాలి. పాత పద్ధతిలో మట్టితో కూడిన నేల రావాలి. కాంక్రీటు మొత్తం తొలగించి ట్రెంచీలను మళ్లీ తెరవాలి. మనుషులు నడవడానికి లోహపు రెయిలింగ్ పెట్టాలి. అప్పుడు శాస్త్రవేత్తలకు, పర్యటకులకూ ఇబ్బంది ఉండదు.
టెక్నాలజీ సాయంతో అనేక హంగులు పెట్టవచ్చు. జంతువులు, అలనాటి మనుషుల త్రీడీ చిత్రాలు పెట్టవచ్చు. అప్పుడు అది మరింత ఆసక్తికరంగా ఉండి ఎక్కువ మంది పర్యటకులు వస్తారు'' అన్నారు రవి.
దీనిపై ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ స్పందించింది. ఈ ఆరోపణలను తిరస్కరించింది. శాస్త్రవేత్తల విమర్శలు సరైనవి కావు అంటున్నారు ఏపీ టూరిజం అధికారులు. ఈ ఆరోపణలపై ఏపీటీడీసీ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడారు.
''మేం నిపుణుల అభిప్రాయాలు తీసుకునే చేశాం. కింద నేలపై కేవలం 4 అంగుళాల కాంక్రీటు పరిచాం. అంతేకానీ, మిగిలిన గుహల్లో కాంక్రీటు నింపలేదు. మనుషులు నడిచే దారిలో వర్షం వస్తే అక్కడి మట్టి అంతా కొట్టుకుపోతుంది. కాబట్టి సాయిల్ ఎరోజన్ ఆపడం కోసమే అక్కడ కాంక్రీటు వేయాల్సి వచ్చింది. పరిశోధనలు జరిగే గుహలను మేము అసలు ముట్టుకోలేదు. ఇక కొందరు ప్రతిపాదిస్తున్నట్టు ఇనుప రెయిలింగ్ వలన మన్నిక ఉండదు. అక్కడ దేన్నీ ధ్వంసం చేయలేదు. ఎవరైనా కొత్త దాని అభివృద్ధికి కొత్త ప్రతిపాదనలతో వస్తే మేం స్వాగతిస్తాం'' అని బీబీసీతో చెప్పారు పర్యటక శాఖ అధికారి ఒకరు.

అసలు పేరు ఏది?
ఈ గుహ పేరుకు భిన్నమైన రూపాలున్నాయి. తెలుగులో బిల్ల సర్గం, బిల్ల సొరంగం, బిల్వ సొరంగం, బిల్వ స్వర్గం అని రాస్తున్నారు. అందులో బిల్వ స్వర్గం అనే పదాన్ని ఏపీ పర్యటక శాఖ బోర్డులుగా పెట్టింది.
ఎక్కువ మంది శాస్త్రవేత్తలు తమ ఇంగ్లిష్ రికార్డుల్లో Billa sargum, Billa surgum, Billa Sargam, Billa Surgam గా కూడా రాశారు.
ఈ గుహ గురించి పాత కాలంలో రాబర్ట్ బ్రూస్ ఫోట్, ఆయన కుమారుడు హెన్రీ బ్రూస్ ఫోట్, కెప్టెన్ టీజే న్యూబోల్డ్ మొదలుకొని.. తాజాగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మైకేల్ హస్లాం, గ్రిఫిత్ విశ్వవిద్యాలయానికి చెందిన మైకేల్ డి పెట్రాగ్లియా, ది యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌కు చెందిన ట్యామ్ స్మిత్, పుణె యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎంఎల్ఎకే మూర్తి వంటి వారు ఎన్నో పరిశోధనలు చేశారు. వారు ప్రచురించిన వివిధ పరిశోధక పత్రాల నుంచి సేకరించిన సమాచారం ఈ కథనంలో ఉంది.
ఆ గుహలో దొరికిన జంతువుల అవశేషాల జాబితా ఇదీ...

ఫొటో సోర్స్, Asian Perspective
(ఆధారం: ఏషియన్ పర్‌స్పెక్టివ్ అనే జర్నల్‌లో 1977లో ప్రొఫెసర్ కె తిమ్మారెడ్డి రాసిన 'బిల్లసర్గం: యాన్ అప్పర్ పాలియోలిథిక్ కేవ్ సైట్ ఇన్ సౌత్ ఇండియా' (Billasurgam: An Upper Palaeolithic Cave Site in South India) అనే వ్యాసంలోను, కర్ణాటక యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, పురాతత్త్వ శాస్త్రవేత్త రవి కొరిశెట్టార్ ఇచ్చిన సమాచారం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














