మోదీకి వెయ్యి కేజీల మామిడి పండ్లు పంపించిన మహమ్మద్ యూనస్.. దౌత్యంలో ఇండియా, పాకిస్తాన్ కూడా మామిడిని ఎందుకు ‘నమ్ముకుంటాయి’?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శుభ్‌జ్యోతి ఘోస్
- హోదా, బీబీసీ న్యూస్ బంగ్లా, దిల్లీ
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ పంపించిన వెయ్యి కిలోల మామిడి పండ్ల బాక్సులు ఇటీవల దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్నాయి.
బంగ్లాదేశ్, భారత్ మధ్య ఇటీవల కాలంలో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను సానుకూలంగా మార్చే ప్రయత్నమే ఈ మామిడి పండ్లను బహుమతిగా ఇవ్వడమని భారతీయ మీడియా అంటోంది.
అయితే, గతంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఏటా వేసవి కాలంలో ప్రధాని మోదీకి మామిడి పండ్లను పంపేవారు.
''నరేంద్ర మోదీ శాకాహారి కావడం వల్ల ఆయనకు పద్మ హిల్సాను(బంగ్లాదేశ్‌లోని పద్మ నదిలో దొరికే ఒక రకం చేప) పంపడంలో ఎలాంటి అర్థం లేదు. కానీ, మామిడి పండు ఈ మొత్తం ఉపఖండంలో అందరూ ఇష్టపడే బహుమతి'' అని దిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారి అప్పట్లో ఒక రిపోర్టర్‌తో అన్నారు.
షేక్ హసీనా పంపే బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌కు చెందిన హరిభంగా మామిడి పండ్లు, రాజ్‌షాహిలో పండే అమ్రపాలి మామిడి పండ్లు కేవలం రాష్ట్రపతి, ప్రధానికే కాదు పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా అందేవి.

బంగ్లాదేశ్ వైఖరి ఎందుకు మెతకగా మారింది?
''అమెరికా నుంచి టారిఫ్‌ల ఒత్తిడి, పశ్చిమాసియా సంక్షోభం, పొరుగున మియన్మార్ నుంచి ఎదురయ్యే పరిస్థితులు వంటి కారణాలతో బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుండడం వల్ల భారత్‌తో ఎంతోకాలంగా ఉన్న ఈ దౌత్య మార్గాన్ని డాక్టర్ యూనస్ అనుసరించాల్సి వచ్చిందని నేను భావిస్తున్నా'' అని భౌగోళిక రాజకీయ నిపుణులు ప్రియాజిత్ దేబ్‌సర్కార్ అన్నారు.
''దిల్లీతో అంతకుముందు ఉన్న స్థాయిలో సంబంధాలను పునరుద్ధరించుకోవడంపై వారు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇది ఎలాంటి మార్పును తీసుకొస్తుందో చూడాలి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో మామిడి పండ్ల ఎగుమతిలో భారత్, మెక్సికో, పాకిస్తాన్ తొలి మూడు స్థానాల్లో ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ కూడా టాప్ టెన్ జాబితాలో ఉంది.
ప్రపంచంలో కొత్త మార్కెట్లలో తమ వ్యాపారం పెంచుకునేందుకు బంగ్లాదేశ్ చేస్తోన్న ప్రయత్నాలకు భారత్, మెక్సికో, పాకిస్తాన్‌ల నుంచి గట్టి పోటీ ఉంది.
37 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సైనిక పాలకుడు, అధ్యక్షుడు జియా-ఉల్-హఖ్ అనుమానాస్పదంగా మరణించిన ఘటనకు కూడా మామిడి పండ్ల బాక్సులతో సంబంధం ఉంది.
ఈ ప్రపంచంలో మామిడి పండు అనేది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు. మామిడి పండ్ల బాక్సు చుట్టూ మిస్టరీ, రాజకీయం, వైరం, దౌత్యం అలముకుని ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నెహ్రూ కాలం నుంచి మామిడి దౌత్యం కొనసాగుతోంది..
1947లో భారతదేశ విభజన తర్వాత రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడిన భారత్, పాకిస్తాన్ రెండింటికీ 'జాతీయ ఫలం' మామిడి పండే.
ఈ రెండు దేశాలు కూడా దౌత్యంలో మామిడి పండ్లను ఉపయోగించిన సందర్భాలున్నాయి.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎప్పుడైనా విదేశాలకు వెళ్తే మామిడి పండ్ల బాక్సును బహుమతిగా తన వెంట తీసుకెళ్లేవారు.
ఎప్పుడైనా ఎవరైనా విదేశీ అధ్యక్షులు లేదా ప్రధానమంత్రి భారత్‌ను సందర్శిస్తే.. నెహ్రూ వారికి మామిడి పండ్లను ఇచ్చేవారు.
1955లో నెహ్రూ చైనా వైళ్లినప్పుడు ఆ దేశ ప్రధానమంత్రి చౌ ఎన్ లైకి బాగా పండిన ఎనిమిది దశేరీ, లంగ్డా మామిడి పండ్లను బహుమతిగా ఇచ్చారు.
అదే ఏడాది సోవియట్ నేత నికితా కృష్చెవ్ భారత్‌కు వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు నెహ్రూ బహుమతిగా ఇచ్చిన ఉత్తర ప్రదేశ్‌లోని మలీహబాదీకి చెందిన దశేరి మామిడి పండ్లను మాస్కోకు తీసుకెళ్లారు.
1986లో రాజీవ్ గాంధీ ఫిలిప్పీన్స్‌ను సందర్శించినప్పుడు కూడా ఆ దేశ అధ్యక్షుడికి మామిడి పండ్లను బహుకరించారు.
ఫిలిప్పీన్స్ జాతీయ ఫలం కూడా మామిడే. కానీ, భారతీయ మామిడి పండ్లతో పోలిస్తే ఫిలిప్పీన్స్ మామిడి పండ్ల రుచి, వాసన, గుణాలలో భిన్నంగా ఉంటాయి.

మామిడి పండ్లను బహుమతిగా ఇవ్వడం విషయంలో పాకిస్తాన్ ఏమీ వెనుకంజలో లేదు. చైనాకు ఇచ్చిన పాకిస్తానీ మామిడి పండ్లు ఆ దేశంలో సాంస్కృతిక విప్లవానికి ఒక ముఖ్యమైన చిహ్నంగా మారాయి.
1968 ఆగస్టులో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మియాన్ అర్షద్ హుస్సైన్ బీజింగ్‌ను సందర్శించి చైనా రాజకీయ నాయకుడు మావోకు మామిడి పండ్ల బాక్సును బహుమతిగా ఇచ్చారు.
చైనాలో అప్పటికి మామిడి పండు గురించి తెలియదు. మావో ఆ పండు తిని ఆశ్చర్యపోవడమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఫ్యాక్టరీలు, యూనివర్సిటీలకు ఆ పండ్లను అందించారని చెప్తారు.

ఫొటో సోర్స్, Getty Images
బద్ధశత్రువులైన భారత్, పాకిస్తాన్‌లు కూడా ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు దౌత్యాన్ని అనుసరించాయి.
1981లో పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఉల్ హఖ్ అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి పాకిస్తాన్‌లో 'అన్వర్ రతౌలా'గా పిలిచే మామిడి పండ్లను పంపారు.
భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో కూడా రతౌలా గ్రామం ఉంది. మర్యాదపూర్వకంగా పంపించిన ఈ బముమతి ఈ మామిడి పండు భారత్‌లో పుట్టిందా? లేదా పాకిస్తాన్‌కు చెందినదా? అనే చర్చకు దారి తీసింది.
2008లో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ భారత్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు మామిడి పండ్లను బహుకరించారు.
ఆ తర్వాత ఏడేళ్లకు అంటే 2015లో అప్పటి పాకిస్తానీ నేత నవాజ్ షరీఫ్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీకి మామిడి పండ్ల బాక్సులను పంపారు కానీ, రెండు దేశాల మధ్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఇవి సాయపడలేదు.
భారత్‌లో 1200 రకాల మామిడి పండ్లను పండిస్తుండగా.. పాకిస్తాన్‌లో 400 రకాలు పండుతున్నాయి. భారత్‌లో మామిడి పండ్ల ఉత్పత్తి చాలా ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
భారత మామిడి పండ్లపై అమెరికా నిషేధం ఎలా ఎత్తివేసిందంటే..
ప్రపంచంలో మామిడి పండ్లకు అమెరికా, చైనాలు సంప్రదాయ మార్కెట్లు. యూరప్‌లోనూ దక్షిణాసియా మామిడి పండ్లకు మార్కెట్ ఉంది.
అయితే, చైనాకు మామిడి పండ్లను ఎగుమతి చేసే భారత ప్రయత్నాలు అంత సఫలం కాలేదు.
2004లో భారత మామిడి పండ్లకు చైనా మార్కెట్ తలుపులు తెరిచింది. కానీ, భారత ఎగుమతిదారులు అక్కడ అంత ప్రభావం చూపించలేకపోయారు.
సుమారు రెండు దశాబ్దాల పాటు భారత మామిడి పండ్ల ఎగుమతులపై అమెరికా నిషేధం విధించింది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ భారత్‌ను సందర్శించిన తర్వాతనే 2006లో నిషేధాన్ని ఎత్తివేశారు. ఆ తర్వాత 'మాంగో ఇనీషియేటివ్'ను లాంచ్ చేశారు.
భారత మామిడి పండ్లను తినేందుకు బుష్ అమితంగా ఇష్టపడ్డారు. నిషేధం ఎత్తివేయడంలో ఆయన వ్యక్తిగత ఆసక్తి కూడా ఉంది.
ఆ తర్వాత 2007 ఏప్రిల్ 17న న్యూయార్క్ జేఎఫ్‌కే ఎయిర్‌పోర్టుకు 150 కార్టన్లతో భారత మామిడి పండ్లు అమెరికాకు చేరుకున్నాయి.
వాషింగ్టన్‌లో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ తరచూ అమెరికా సెనేటర్లకు, నేతలకు, మంత్రులకు మామిడి పండ్లను బహుమతిగా ఇస్తుంటుంది. తన ఎంబసీలో మామిడి పండ్లతో పార్టీలను కూడా నిర్వహిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
మామిడి పండ్ల జీవిత కాలం
''మామిడి పండు జీవిత కాలం ఎంత ఎక్కువగా ఉంటే, ఎగుమతికి అది అంత అనువైనది. ఎందుకంటే, పండ్ల తోట నుంచి న్యూయార్క్ లేదా లండన్‌లోని ఏదైనా దుకాణానికి చేరుకోవాలంటే కనీసం ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది. అది చేరుకునే సమయానికి పాడైపోకూడదు.'' అని దిల్లీకి చెందిన మామిడి పండ్ల నిపుణుడు ప్రదీప్ కుమార్ దాస్‌గుప్తా బీబీసీతో అన్నారు.
భారత్‌లోని కొంకణ్ ప్రాంతం, మహారాష్ట్ర నుంచి వచ్చే అల్ఫాన్సో మామిడి పండ్లలో తప్ప మిగిలిన చాలా రకాల మామిడి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
పాకిస్తాన్‌లో పొడి వాతావరణం కారణంతో, అక్కడ మామిడి పండ్లలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. దీంతో వాటి జీవితకాలం కూడా ఎక్కువ.
''ఈ కారణంగానే భారత్ నుంచి అల్ఫోన్సో మినహా ఇతర మామిడి పండ్లు చాలా తక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పాకిస్తానీ సింధూరి, చౌసా, అన్వర్ రతౌలా మామిడి పండ్లకు పశ్చిమ మార్కెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఉంది'' అని ప్రదీప్ కుమార్ దాస్‌గుప్తా తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














