20 ఏళ్ల యువకుడి బ్యాంకు ఖాతాలోకి లెక్కపెట్టలేనంత డబ్బు.. అంత మొత్తం ఎలా వచ్చింది, ఏం చేశారు?

ఆయనొక నిరుద్యోగ యువకుడు.. ఆయన బ్యాంకు ఖాతాలోకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు... ఇంకా చెప్పాలంటే లెక్కపెట్టలేనంత డబ్బు జమ అయ్యింది.
ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాకు చెందిన 20 ఏళ్ల దిలీప్ సింగ్ అలియాస్ దీపు 12వ తరగతి ఉత్తీర్ణుడయ్యారు. కొంతకాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నారు.
రెండు నెలల కిందట కోటక్ మహీంద్ర బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారు.
బ్యాంకు సంబంధిత మొబైల్ యాప్‌లో ఆగస్టు 2వ తేదీన లాగిన్ అయ్యేసరికి దిలీప్ ఆశ్చర్యపోయారు.
ఆయన బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు జమ అయ్యిందో చూసి షాక్ అయ్యారు.
బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బు ఎంతంటే....
రూ.10,01,35,60,00,00,00,00,00,01
00,23,56,00,00,00,00,299.
దిలీప్ ఆ మొబైల్ యాప్‌ను పలుమార్లు లాగౌట్ చేసి లాగిన్ చేసి, పాస్ వర్డ్ మార్చి చూసినా ఆ డబ్బు మాత్రం ఆయన ఖాతాలోనే ఉన్నట్లు చూపిస్తోంది.
''చాలా ఎక్కువ. 37 అంకెలతో పొడవుగా ఉన్న ఆ సంఖ్యను లెక్కించేందుకు ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. గూగుల్‌లో అనువాదం చేయడానికి ప్రయత్నించాను. అటు నుంచి కూడా ఎలాంటి సహాయం అందలేదు. అది చాలామందికి చూపించాను. అంత పెద్ద మొత్తాన్ని ఎవ్వరూ లెక్కపెట్టలేకపోయారు'' అని బీబీసీకి చెప్పారు దిలీప్.


‘మనసులో ఒక్కటే అలజడి....’
బ్యాంకు ఖాతాలో లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లు చూసిన దిలీప్...ఇదేదో సాంకేతిక తప్పిదమనే తొలుత అనుకున్నారు. కానీ పదేపదే చెక్ చేసినా అదే అమౌంట్ కనిపిస్తోంది.
''ఖాతాలో ఎలాగూ చాలా డబ్బు ఉంది కాబట్టి మరో ఖాతాకు రూ.10 వేలు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ప్రయత్నించా. కానీ, నా అకౌంట్‌ను బ్యాంకు ఫ్రీజ్ చేసింది'' అని దిలీప్ చెప్పారు.
అంత డబ్బు జమ కావడం చూసి తాను ఆశ్చర్యపోయానని, ఆ క్షణంలో తాను పెద్ద లాటరీ గెలిచాననే అనుకున్నానని దిలీప్ అన్నారు. కానీ లాటరీయే పెద్ద మొత్తం అనుకుంటే, ఇది అంతకన్నా చాలా పెద్దగా ఉందని చెప్పారు.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జమ కాకముందు ఖాతాలో ఎంత ఉందని ప్రశ్నిస్తే, ''నా ఖాతాలో కేవలం రూ.10 నుంచి రూ.12 ఉన్నాయి'' అని ఆయన వెల్లడించారు.

బ్యాంకు ఏమి చెబుతోంది?
కోటక్ మహీంద్రా బ్యాంకులో ఆన్‌లైన్ సేవింగ్స్ అకౌంట్‌ను దిలీప్ ఓపెన్ చేశారు.
తన ఖాతాలో లెక్కపెట్టలేనంత డబ్బు జమ అయ్యిందనే విషయం చెప్పడానికి దిలీప్ స్వయంగా బ్యాంకుకు వెళ్లారు.
''దాని గురించి ఏమీ కంగారు పడొద్దు. చూపిస్తున్న అమౌంట్ నిజమైన డబ్బు కాదు. సాంకేతిక తప్పిదం'' అని బ్యాంకు అధికారులు దిలీప్‌కు చెప్పారు.
''పోలీసు విచారణ చేశాం. ఫోన్‌పే, బ్యాంకు స్టేట్‌మెంట్, ఆ యువకుడి బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేస్తే ఒక్క రూపాయి కూడా లేదు'' అని డన్‌కౌర్ పోలీసు స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ సోహాన్‌పాల్ సింగ్ బీబీసీతో అన్నారు.

ఇరుగుపొరుగు ఏమంటున్నారు?
దిలీప్ బ్యాంకు ఖాతాలో లెక్కపెట్టలేనంత డబ్బు జమ అయ్యిందనే విషయం గ్రేటర్ నోయిడా ప్రాంతంలో చాలామందికి తెలిసింది.
బ్యాంకు బ్యాలెన్స్ స్క్రీన్‌షాట్‌లను దిలీప్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి.
''అలా డబ్బు వచ్చిందంటే ఎవ్వరూ చెడుగా అనుకోలేదు. అంతా సంతోషించారు. దిలీప్ తల్లిదండ్రులు చనిపోయారు. బంధువుల దగ్గర ఉంటున్నాడు. ఆయనకు ఉద్యోగం లేదు. ఆయనకేదైనా మేలు జరగాలని కోరుకుంటున్నాం'' అని దిలీప్ సింగ్ పొరుగింటి మహిళ సుమన్ దేవి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














