ఫేక్ వెడ్డింగ్స్: పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తప్ప అందరూ ఉండే ఈ న్యూ ట్రెండ్ పార్టీలు ఏంటి?

ఫొటో సోర్స్, Third Place
- రచయిత, నికితా యాదవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో సంపన్న వర్గాలు నిర్వహించే భారీ పెళ్లి వేడుకలను తలచుకున్నప్పుడు మనకు ఏమేం గుర్తుకు వస్తాయి?
మెరుపులు వెదజల్లే విద్యుద్దీపపు కాంతులు, ధగధగ మెరిసే దుస్తులు, బాలీవుడ్ హిట్ పాటలు, నోరూరించే వంటలు, అంతా పండగ వాతావరణం.
ప్రతిదీ చాలా విలాసవంతంగా, భావోద్వేగభరితంగా, జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుంది.
అయితే వధువు, వరుడు లేకుండా అలాంటిది జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి.
అగ్నిహోమం చుట్టూ వధూవరులు ఏడడుగులు కలిసి నడవడం, బంధువులు, కన్నీటి వీడ్కోలు ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలం పార్టీ మాత్రమే.
ఇదేంటి? ఇలా ఎలా సాధ్యం?
ప్రస్తుతం భారతీయ నగరాలు ఇలాంటి ఉత్తుత్తి పెళ్లిళ్ల ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ నిజంగా పెళ్లి జరగదు. కానీ పెళ్లి పేరుతో నిర్వహించే పార్టీల్లో ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.
క్లబ్బులు, కంపెనీలు, హోటళ్లు నిర్వహించే ఇలాంటి ఈవెంట్లకు వెళ్లాలంటే టిక్కెట్లు కొనుక్కోవాలి.
పెళ్లికి సంబంధించిన సంప్రదాయాలు, పూజలు, ఇతర తంతులేమీ లేకుండా పెళ్లిళ్లలో లభించే ఆనందాన్ని, పార్టీ అనుభవాన్ని అందించేందుకు వీలుగా ఈ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు.
సింపుల్‌గా చెప్పాలంటే ఇది వెడ్డింగ్ అనే థీమ్‌తో చేసుకునే పార్టీ మాత్రమే.

దిల్లీ, ముంబయి, బెంగళూరు లాంటి మహా నగరాల్లో కొన్ని వారాలుగా ఈ ఫేక్ పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి.
స్నేహితులతో రాత్రిపూట సరదాగా గడపాలని భావించే యువతీ యువకులు ఈ పార్టీలకు వస్తున్నారు.
అటెండర్ల ఒత్తిళ్లు లేకుండా సంప్రదాయ భారతీయ వివాహాల్లో నాటకీయతను, వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
గత వారం దిల్లీలో మేం ఒక ఫేక్ సంగీత్ ( వివాహానికి కొన్ని రోజుల ముందు జరుపుకునే వేడుక)కు హాజరయ్యాం.
ఒక ఖరీదైన క్లబ్‌లో జరిగిన ఈ వేడుకలో ఉత్సాహం పట్టలేనట్టుగా ఉంది.
సీక్వెన్డ్ చీరలు, లెహంగాలలో వచ్చిన యువతులు, పొడవాటి సంప్రదాయ జాకెట్లు, కుర్తాలలో వచ్చిన మగవాళ్లు అక్కడ కనిపించారు.
సంప్రదాయ వాయిద్యాలు మోగుతూ ఉంటే అక్కడకు వచ్చిన వారంతా డాన్స్ చేస్తూనే ఉన్నారు.
టెకీలా నింపిన గోల్‌గప్పాలను వారికి సర్వ్ చేశారు.
ఇలాంటి వేడుకకు తొలిసారి హాజరైన శివాంగి శరీన్ "అద్భుతం" అన్నారు.

"మామూలు పెళ్ళిళ్లలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించాలనే దాని గురించి బంధువులు నిర్ణయిస్తారు. ఇది మాత్రం సరదాగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఇది మేము మా స్నేహితులతో కలిసి చేసుకుంటాం. ఏం డ్రెస్సులు వేసుకోవాలో మేమే నిర్ణయించుకుంటాం" అని ఆమె అన్నారు.
ఇలాంటి వేడుకలకు టికెట్ల ధర వేదిక, సదుపాయాలను బట్టి రూ.1500 దగ్గర నుంచి రూ. 15000 వరకు, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది.
శివాంగి ఆమె స్నేహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జంటకు రూ.10వేలు చెల్లించారు.
"నెలకొకసారి ఇలా ఖర్చు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఈ కార్యక్రమంలో లభించిన ఆనందం కోసం అంత ఖర్చు పెట్టొచ్చు" అని శివాంగి చెప్పారు.
ఆతిధ్య రంగంలో కొత్తదనం కీలకమని చెప్పడానికి తాజా ట్రెండ్ నిదర్శనమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రెస్టారెంట్ యజమాని శరద్ మదన్ అన్నారు.
"మా కస్టమర్ల కోసం కొత్తగా ఏదైనా చేస్తూనే ఉండాలి" అని ఆయన అన్నారు.
ఇలాంటి ఈవెంట్ల ప్లానింగ్, నిర్వహణకు రూ. 10 లక్షలు ఖర్చవుతుందని, టిక్కెట్ల అమ్మకాల ద్వారా తాము పెట్టిన ఖర్చుకు రెట్టింపు ఆదాయం రాబట్టాలని తమ బృందం భావించిందని మదన్ చెప్పారు. అయితే ఇది లాభాల కోసం మాత్రమే కాదని ఆయన అన్నారు.
"ఇది కష్టమర్లను ఆకర్షించడం గురించి. ఇందులో అంత లాభాలు లేకపోయినా, మా కస్టమర్లు ఏదైనా కొత్తగా కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాటిని నిర్వహిస్తాం" అని ఆయన చెప్పారు.
బెంగళూరులోని 8 క్లబ్‌లో జులైలో ఇలాంటి పార్టీ ఒకటి నిర్వహించారు. దీనికి 2వేల మంది హాజరయ్యారు. ఫేక్ వివాహాలు అనే కాన్సెప్ట్‌కు విదేశాల్లో నివసిస్తున్న యువ భారతీయులే స్ఫూర్తి అని 8 క్లబ్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన కౌషల్ చనాని చెప్పారు.
"ప్రవాస భారతీయులు ఈవినింగ్స్‌ను ఆస్వాదించేందుకు సంప్రదాయ దుస్తులు ధరించి ఒకచోటకు చేరి బాలీవుడ్ పాటలకు డాన్స్ చేస్తుంటారు. మేము దీన్ని అనుసరిస్తున్నాం" అని ఆయన చెప్పారు.
బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు 'ఊహించని రీతిలో' స్పందన వచ్చిందని ఆయన చెప్పారు.
దిల్లీలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇది తమను ప్రోత్సహించిందని, ఈ కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్లు అన్నీ అమ్ముడు పోయాయని అన్నారు.
కోల్‌కతా, జైపుర్, లఖ్‌నవూలోనూ ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించాలని ఈవెంట్ ఆర్గనైజర్లు తమను సంప్రదిస్తున్నారని చెప్పారు.
"ఆసక్తి ఉన్న వారికి ప్రస్తుతం మేము మా పాలసీ గురించి వివరిస్తున్నాం. అలాంటి అనుభవాన్ని సృష్టించడం, మార్కెటింగ్ చేయడం, దాన్ని లాభసాటిగా మలచడానికి ఇదొక గైడ్ లాంటిది" అని ఆయన చెప్పారు.
అయితే ఫేక్ వెడ్డింగ్స్ అన్నీ ఒకే కాన్సెప్ట్‌ను అమలు చేయడం లేదు.

ఫొటో సోర్స్, Trippy Tequila
బెంగళూరుకు చెందిన థర్డ్ ప్లేస్ అనే ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ స్టార్టప్ ఒకటి ఇటీవల ఒక సంగీత్‌ను నిర్వహించింది. ఆల్కహాల్ లేకుండా వేడుక చేసుకునేలా దీన్ని రూపొందించారు.
"కార్యక్రమానికి హాజరైన వారిని మేము వరుడి గ్రూపు, వధువు గ్రూపులుగా విభజించాము. వారితో మేము కొన్ని పదాలను అభినయం ద్వారా గుర్తించడం, పార్టీలో ఎవరి రక్త సంబంధీకులు ఎవరో గుర్తించడం లాంటి స్టీరియోటైప్ ఆటలు ఆడించాం" అని సీఈఓ అనురాగ్ పాండే చెప్పారు.
ఈ కార్యక్రమంలో అతిధులకు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. మద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టారు.
"మద్యం వల్ల కొన్నిసార్లు ఆనందం మాయం అవుతుంది. పబ్బుల్లో మాదిరిగా కాకుండా కొంచెం భిన్నంగా చేయాలనుకున్నాం. భారతీయ వివాహ స్ఫూర్తిని ప్రదర్శించాలన్నది మా ప్రయత్నం" అని పాండే చెప్పారు.
వేడుక చేసుకోవాలనే నేటి తరం ఆకాంక్షల తీరును ఇలాంటి కార్యక్రమాలకు పెరుగుతున్న ఆదరణ ప్రతిబింబిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు.
"ప్రజలకు ఒక రీజన్ కావాలి. ఆ రీజన్ చెప్పి వేడుక చేసుకోవాలి. అందులో పెళ్లి కంటే మెరుగైన సందర్భం ఏముంటుంది. ఇందులో అన్ని రకాల సరదా అంశాలు ఉంటాయి" అని రచయిత సంతోష్ దేశాయ్ అన్నారు.
"ఇది ఆనందానికి పరాకాష్ట. ప్రత్యేకించి ఇందులో నిజమైన వివాహంలో ఉండే ఒత్తిడి లాంటివేమీ లేనప్పుడు చాలా బాగుంటుంది" అని ఆయన అన్నారు.
ఇలాంటి వేడుకలు గతంలో పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు కొనుగోలు చేసిన దుస్తుల్ని మరోసారి ధరించవచ్చని దేశాయ్ గుర్తు చేశారు.
అయితే ఇలాంటి కార్యక్రమాల అవసరం ఉందా?
ప్రస్తుతం ఫేక్ వివాహాలు ఒక ఫ్యాషన్ అని, ఇందులో చాలా బిజినెస్ ఉందని దిల్లీకి చెందిన టచ్‌వుడ్ ఈవెంట్స్ వ్యవస్థాపకుడు విజయ్ అరోడా నమ్ముతున్నారు.
ఇలాంటి వేడుకల్లో పాల్గొనాలని నేటి యువత కోరుకుంటోందని ఆయన చెప్పారు.
"ఇదొక కొత్త మార్కెట్ కేటగిరీగా మారితే ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. దీని వల్ల మొత్తం పరిశ్రమలో వ్యాపార అవకాశాలు క్రమేపీ పెరుగుతాయి" అని విజయ్ అరోడా చెప్పారు.
భారతీయ వివాహ పరిశ్రమ130 బిలియన్ డాలర్లు( సుమారు రూ. 11 లక్షల కోట్లు) ఉండవచ్చని పెట్టుబడుల సలహా సంస్థ రైట్ రీసర్చ్ అంచనా వేసింది.
ఈ రంగం విస్తరిస్తున్నప్పటికీ, కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వివాహాలు ఎక్కువగా నవంబర్ నుంచి మార్చ్ మధ్య జరుగుతుంటాయి. జూన్ నుంచి ఆగస్ట్ మధ్య వర్షాకాలాన్ని పెళ్లిళ్లకు ఆఫ్ సీజన్‌గా పరిగణిస్తున్నారు.
ఈ సమయంలో వివాహ వేదికలు ఖాళీగా ఉండటం, కార్యక్రమ నిర్వాహకులకు పెద్దగా పని లేకపోవడం, ప్రజలు ఆనందాన్ని నిరంతరంగా కోరుకోవడం లాంటివి ఫేక్ వెడ్డింగ్స్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.
ఫేక్ వెడ్డింగ్స్ పెరుగుతున్న తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అరోడా చెప్పారు
"అయితే మనం ఎలాంటి వేడుకలు జరుపుకోవాలని అనుకుంటున్నాం అనేది అర్థం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. మనం మన కుటుంబ సభ్యులు, స్నేహితుల వివాహ వేడుకలకు హాజరు కాలేకపోయినప్పటికీ, ఫేక్ వెడ్డింగ్స్‌కు హాజరుకావడం వల్ల ఆ అనుభూతిని ఆస్వాదించవచ్చు" అని అరోడా అభిప్రాయపడ్డారు.
అయితే, ఇందులో ప్రతీ ఒక్కరూ అద్భుతమైన అనుభూతి పొందుతారనే గ్యారంటీ ఏమీ లేదు.

ఫొటో సోర్స్, Third Place
తాను హాజరైన ఫేక్ వెడ్డింగ్ తనకు పెద్దగా ఆనందం కలిగించలేదని బెంగళూరుకు చెందిన మార్కెటింగ్ నిపుణురాలు 23 ఏళ్ల సృష్టి శర్మ చెప్పారు.
"కొన్నేళ్లుగా నేను ఇంటికి దూరంగా ఉంటున్నా. పెళ్లిళ్లకు హాజరుకాకపోవడాన్ని నిజంగా మిస్సవుతున్నా" అని ఆమె చెప్పారు.
"ఇందులో పెద్ద సానుకూలత ఏంటంటే, నీ పెళ్లెప్పుడు అని విసిగించే బంధువులు లేకపోవడం" అని ఆమె అన్నారు.
పార్టీ డ్రెస్ కొనుక్కునేందుకు సృష్టి శర్మ ఆమె స్నేహితురాళ్లు చాలా సమయం వెచ్చించారు. అయితే వారు హాజరైన పార్టీ, వారి అంచనాలకు తగ్గట్లుగా లేదు.
"వాళ్లు ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్‌తో ప్రారంభించి రెండు గంటల తర్వాత బాలీవుడ్ పాటల వైపు మళ్లారు" అని ఆమె చెప్పారు.
"మాకు పెళ్లి భోజనం పెడతారని ఆశించాం. అయితే అందుకు బదులుగా పిజ్జా, ఫ్రైస్ వచ్చాయి. స్వీట్లు కూడా లేవు, ఆల్కహాల్ ఉంది. అలంకరణ కూడా చాలా సాదాసీదాగా ఉంది" అన్నారు సృష్టి.
కొంతమంది ఇలాంటి ఈవెంట్లను విమర్శిస్తున్నారు. ఇవి భారతీయ వివాహ సంప్రదాయాలు, విలువలను తక్కువ చేసి చూపుతున్నాయని అంటున్నారు.
అయితే దిల్లీలో జరిగిన ఫేక్ సంగీత్‌కు హాజరైన విధి కపూర్ అభిప్రాయం మరోలా ఉంది.
"పార్టీకి వచ్చే వారిని వధువు, వరుడిలా దుస్తులు ధరించమని అడిగితే అభ్యంతరం ఉండేది. అయితే ఇది కేవలం పార్టీ మాత్రమే. దీన్ని మనం అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు" అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














