రష్యా నుంచి చమురు కొనడం మానేస్తే భారత్‌లో పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతాయా?

పెట్రోల్, డీజిల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభయ్ కుమార్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని భారత్ ఆపేస్తుందన్న సమాచారం తనకు అందిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

‘‘అయితే ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్పలేను. ఏం జరుగుతుందో చూద్దాం" అని శుక్రవారం రిపోర్టర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆగస్టు 1 నుంచి భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.

భారత్, రష్యా నుంచి సైనిక పరికరాలు, చమురు కొనుగోలు చేస్తే సుంకాలతో పాటు జరిమానాలు కూడా విధిస్తామని అన్నారు.

యుక్రెయిన్‌లో యుద్ధం చేయడానికి పరోక్షంగా రష్యాకు భారత్ సాయం చేస్తోందని ఆయన ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.

"మేము అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, మా ఇంధన అవసరాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని మీకు తెలుసు. మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటి ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితుల ఆధారంగా మా నిర్ణయాలు ఉంటాయి" అని ఆయన అన్నారు.

రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపేస్తే లేదా తగ్గిస్తే అది భారత ఆర్థిక వ్యవస్థ, దేశంలోని చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? రష్యాతో దౌత్య సంబంధాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనే దానిపై చర్చ జరుగుతోంది.

ఈ అంశంపై నిపుణులతో మాట్లాడింది బీబీసీ.

భారత్, రష్యా, ముడి చమురు దిగుమతులు, డోనల్డ్ ట్రంప్, దిగుమతులపై సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

రష్యా నుంచే ఎందుకు ?

భారత్, చైనా రష్యా నుంచి భారీగా ముడి చమురు కొంటున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు మరింత పెరిగాయి.

2024-25 ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి భారత్ 35శాతం ముడి చమురు దిగుమతి చేసుకుందని భారత వాణిజ్య మంత్రిత్వశాఖ చెబుతోంది.

2018 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 1.8 శాతం.

ఇలాంటి పరిస్థితుల మధ్య భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల్ని ఆపేస్తే ఏం జరుగుతుందనేది కీలక ప్రశ్నగా మారింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కావల్సినంత ముడి చమురు అందుబాటులో ఉందని, దాని సరఫరాకు సంబంధించి ఎలాంటి సమస్య లేదని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీ వాస్తవ చెప్పారు.

"ప్రపంచ చమురు వినియోగంలో భారతదేశం వాటా కేవలం 2శాతమే. చమురు అధిక ఉత్పత్తి ఎప్పుడూ ఒక సమస్యే. అందుకే చమురు ఉత్పత్తులను క్రమబద్దీకరించడానికి ఒపెక్ ఏర్పడింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒపెక్ దేశాలు అవసరాన్ని బట్టి చమురు ఉత్పత్తి పెంచగలవు. కాబట్టి ఇప్పుడు చమురు సరఫరా సమస్య కాదు" అని ఆయన చెప్పారు.

అయితే, నికోర్ అసోసియేట్స్‌కు చెందిన ఆర్థికవేత్త మిథాలీ నికోర్ ఈ మార్గం అంత సులభం కాకపోవచ్చునని అంటున్నారు.

"ఇది భారతదేశానికి సంక్లిష్టమైన వ్యవహారం. రష్యా నుంచి మనం ఇప్పుడు రాయితీ ధరలకు చమురు కొంటున్నాం. చాలా దేశాలు రష్యా నుండి చమురు కొనడం కష్టం, భారత్‌కు రష్యా రాయితీ ఇస్తోంది. యూరప్ దేశాలు కూడా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకంటున్నాయి. రష్యా మీద ఆంక్షలు విధించిన అమెరికా, మాస్కో నుంచి కొన్ని ఉత్పత్తులను కొంటున్నట్లు చైనా ఇటీవల భద్రతామండలిలో తెలిపింది. కాబట్టి, అమెరికా స్వయంగా రష్యాతో వ్యాపారం చేస్తున్నప్పుడు, ఇతర దేశాలను రష్యాతో వ్యాపారం చేయవద్దని ఎందుకు చెబుతోంది? చైనా కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తింది" అని మిథాలీ చెప్పారు .

భారత్, రష్యా, ముడి చమురు దిగుమతులు, డోనల్డ్ ట్రంప్, దిగుమతులపై సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్ భవిష్యత్ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకునే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని ఈవై ఇండియా బిజినెస్ పాలసీ హెడ్ అగ్నేశ్వర్ సేన్ బీబీసీతో చెప్పారు.

ఇంధన భద్రతను కాపాడుకోవడానికి భారతదేశం అనేక మార్గాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

"ప్రస్తుతం భారత దేశంలో ఉత్పత్తి అవుతున్న చమురు, దేశంలోని డిమాండ్‌లో 15 శాతం అవసరాలు మాత్రమే తీరుస్తోంది. దీనిని త్వరలో పెంచడం అంత సులభం కాదు. అందుకే భారతదేశం తన ఇంధన భద్రత, వ్యయం, భౌగోళిక-రాజకీయ సమతుల్యతను కాపాడుకోవడానికి దాని చమురు వనరులను జాగ్రత్తగా ఎంచుకోవాలి" అని అగ్నేశ్వర్ సేన్ చెప్పారు.

భారత్, రష్యా, ముడి చమురు దిగుమతులు, డోనల్డ్ ట్రంప్, దిగుమతులపై సుంకాలు

భారత్ ముందున్న అవకాశాలేంటి?

భారతదేశంలో అనేక చమురు వనరులు ఉన్నాయి. అయితే వాటి వెలికితీతకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి.

"చమురుకు సంబంధించి యూఏఈ ఎప్పుడూ అతి పెద్ద ఆప్షన్. అక్కడ చమురు ఖరీదైనా, అందుబాటులో ఉంటుంది. అమెరికా నుంచి కూడా ముడి చమురు కొనుక్కోవచ్చు. అమెరికా కొత్తగా రిఫైనరీలను ప్రారంభిస్తోంది" అని మిథాలీ నికోర్ చెప్పారు

అయితే భారత్ ముందున్న మరి కొన్ని ప్రత్యామ్నాయాలు అంత తేలికైనవి కావని ఆమె అభిప్రాయపడ్డారు

"ఆఫ్రికాలో చమురు ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయి. అయితే చైనా 20 ఏళ్లుగా అక్కడ భారీ పెట్టుబడులు పెట్టింది. కాబట్టి అక్కడి వనరులపై దానికి గణనీయమైన నియంత్రణ ఉంది. అందువల్ల అక్కడి నుండి చమురు కొనడం అంత తేలిక కాకపోవచ్చు" అని మిథాలీ చెప్పారు.

దీన్ని బట్టి చూస్తే చమురు కొనడానికి అవకాశాలు ఉన్నప్పటికీ, అవి చౌకగా లేదా సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు.

ఫిబ్రవరి 2025లో బీబీసీ హార్డ్ టాక్ షోలో మాట్లాడిన కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ఈ సవాళ్లను ప్రస్తావించారు.

"భారత్ ఇప్పుడు 39 దేశాల నుండి చమురు దిగుమతి చేసుకుంటోంది" అని ఆయన అన్నారు.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా ఆగ్రహంగా ఉందా అని అడిగినప్పుడు "నేను ఇక్కడ స్పష్టంగా చెబుతాను. ఇది ఎవరి ఇష్టానికి వ్యతిరేకం కాదు" అని ఆయన అన్నారు.

"రష్యా నుండి మనకు కావలసినంత చమురు కొనుగోలు చేయవచ్చని, సరసమైన ధరకు కొనుగోలు చేయవచ్చని అమెరికా మాకు చెప్పింది. ఇది మాకు ఆమోదయోగ్యమే" అని ఆయన అన్నారు.

భారత్, రష్యా, ముడి చమురు దిగుమతులు, డోనల్డ్ ట్రంప్, దిగుమతులపై సుంకాలు

ఫొటో సోర్స్, BBC NEWS INDIA/YOUTUBE

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

రష్యా నుండి చమురు కొనుగోళ్లను ఆపివేస్తే లేదా గణనీయంగా తగ్గిస్తే భారత్‌లో చమురు ధరలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుంది?

రష్యా నుంచి రాయితీ ధరకు కొంటున్న చమురు భారత ఆర్థిక వ్యవస్థకు కచ్చితంగా ప్రోత్సాహాన్ని అందించింది. అయితే ఆ ప్రయోజనం సామాన్యులకు చేరడం లేదని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

"రష్యా నుండి చమురు కొంచెం తక్కువ ధరకు లభిస్తుంది. కానీ దీని వల్ల వినియోగదారులకు ఎలాంటి లాభం అందడం లేదు. ఈ లాభాన్ని ప్రభుత్వం లేదా చమురు సంస్థలే సొంతం చేసుకుంటున్నాయి. పెట్రోల్-డీజిల్ ధరలలో ఊహించని తగ్గింపు జరగలేదు" అని ఆయన అంటున్నారు.

రష్యా నుండి చమురు కొనుగోలు చేయకపోతే దాని ప్రభావం ఎలాగైనా కనిపిస్తుందని మిథాలీ నికోర్ అభిప్రాయపడ్డారు.

"వందశాతం ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితి ఎవరికీ ప్రయోజనం కలిగించదు. ఇది పూర్తిగా నష్టాలను కలిగించే పరిస్థితి. నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలో మనం ఆలోచించాలి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాలి లేదా అమెరికా సుంకాల ప్రమాదాన్ని ఎదుర్కోవాలి లేదా సేవా రంగంపై కొత్త పన్నులు లేదా సుంకాలు ఉండవచ్చు. అన్ని వైపులా నష్టపోతాం. ఈ పరిస్థితిని సరిగ్గా మేనేజ్ చేయడానికి , మనం మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి, దేశీయ వినియోగాన్ని పెంచాలి" అని ఆమె చెప్పారు.

ఈ నిర్ణయం సాధారణ వినియోగదారులను ప్రభావితం చేస్తుందని అగ్నేశ్వర్ సేన్ కూడా అభిప్రాయపడ్డారు.

"భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలును పూర్తిగా ఆపివేస్తే, పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలు లీటరుకు రూ. 5 నుండి రూ. 6 వరకు పెరగవచ్చు" అని సేన్ చెప్పారు.

భారత్, రష్యా, ముడి చమురు దిగుమతులు, డోనల్డ్ ట్రంప్, దిగుమతులపై సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశం దేశీయంగా ముడి చమురు వెలికితీతను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పుడేం చేయాలి?

చమురు సరఫరాకు సంబంధించి రాబోయే కాలంలో భారత్‌ వ్యూహం ఎలా ఉండవచ్చనే దానిపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.

"ధర ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడి నుండే చమురు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రస్తుత ప్రకటన సరైనదేనని నేను భావిస్తున్నాను. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి వీలైనంత త్వరగా పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు మన వ్యూహంగా ఉండాలి" అని మిథాలీ నికోర్ అన్నారు.

దేశీయ ఉత్పత్తి ప్రాముఖ్యతను అజయ్ శ్రీవాస్తవ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

భారతదేశం మరోసారి తన ఇంధన అవసరాల కోసం అన్వేషణ, పెట్టుబడిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

"మనం దీర్ఘకాలికంగా ఇంధన స్వయం సమృద్ధిని సాధించాలనుకుంటే, దేశీయ చమురు అన్వేషణపై దృష్టి పెట్టడం అవసరం. ఇది జరిగే వరకు మనం బహిరంగ మార్కెట్ నుండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది" అని శ్రీవాస్తవ చెప్పారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు అనేది ఆర్థిక నిర్ణయం, రాజకీయ వైఖరి కాదని ఆయన స్పష్టం చేశారు.

"యుక్రెయిన్ యుద్ధానికి ముందు, భారతదేశం రష్యా నుండి చాలా తక్కువ చమురును కొనుగోలు చేసింది. ధర చౌకగా ఉండటం వల్లే రష్యా నుండి కొనుగోళ్లను పెంచింది. ఇది వ్యాపార నిర్ణయం, రాజకీయ నిర్ణయం కాదని అర్థం చేసుకోవాలి" అని శ్రీవాస్తవ అన్నారు.

"భారత్, రష్యా మధ్య చాలాకాలంగా బలమైన బంధం ఉంది. అయితే దీనికి చమురు కొనుగోలుతో ఎటువంటి సంబంధం లేదు. రష్యా నుంచి చౌకగా చమురు లభించినంత కాలం భారతదేశం కొనుగోలు చేస్తుంది. అది చౌకగా లభించకపోతే ఇతర దేశాల నుండి చమురును కొనుగోలు చేస్తుంది" అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)