ట్రంప్‌‌కు భారత్ సమాధానం ఇదే - టారిఫ్ బెదిరింపులు, రష్యా చమురు కొనుగోళ్లపై స్పందించిన ఇండియా

Modi, Trump

ఫొటో సోర్స్, Getty Images

రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని డొనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

'రష్యా వార్ మెషీన్ వల్ల యుక్రెయిన్‌లో ఎంత మంది చనిపోతున్నా, వారు (భారత్) పట్టించుకోవడం లేదు' అని అమెరికా అధ్యక్షుడు సోమవారం తన ఆన్‌లైన్ వేదిక ట్రూత్ సోషల్‌లో రాశారు.

ప్రస్తుతం రష్యా నుంచి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. 2022 లో యుక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించినప్పుడు అనేక యూరప్ దేశాలు వాణిజ్యాన్ని తగ్గించిన తరువాత ఇది మాస్కోకు ఒక ముఖ్యమైన ఎగుమతి మార్కెట్‌గా మారింది.

అయితే దీనిపై భారత్ స్పందించింది. తమను ‘అకారణంగా’, ‘అసమంజసంగా’ యూరోపియన్ యూనియన్, అమెరికా లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్

కొత్త సుంకాలు ఏమిటో ట్రంప్ పేర్కొనలేదు, కానీ భారతదేశంపై భారీగా 25% సుంకాన్ని ప్రకటించిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ పోస్టు చేశారు.

గత వారం, ట్రంప్ భారతదేశాన్ని "మిత్రదేశం" గా అభివర్ణించారు, కానీ యుఎస్ ఉత్పత్తులపై దాని సుంకాలు "చాలా ఎక్కువ" అన్నారు. రష్యాతో వాణిజ్యంపై "జరిమానా" ఉంటుందని హెచ్చరించారు.

తాజాగా ట్రూత్ సోషల్ పోస్టు ద్వారా ట్రంప్ మరోసారి విమర్శనాత్మకంగా స్పందించారు.

భారత్ భారీ మొత్తంలో రష్యన్ ఆయిల్ ను కొనుగోలు చేయడమే కాకుండా, కొనుగోలు చేసిన చమురులో ఎక్కువ భాగాన్ని బహిరంగ మార్కెట్లో భారీ లాభాలకు విక్రయిస్తోందని ఆయన రాశారు.

రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని భారత చమురు శుద్ధి కర్మాగారాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించలేదని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

దీనిపై ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది.

అమెరికాకు భారత్ సమాధానం

యుక్రెయిన్‌తో ఘర్షణలు ప్రారంభమైన తరువాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ భారత్‌ను విమర్శిస్తున్నాయి.

నిజానికి యుద్ధం మొదలైన తరువాత సంప్రదాయ సరఫరాలన్నీ యూరప్‌కు మళ్లించడం వల్ల, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది.

ఆ సమయంలో అమెరికానే స్వయంగా ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి భారత్ దిగుమతులను బాగా ప్రోత్సహించింది.

అమెరికాకు భారత్ సమాధానం

భారతీయ వినియోగదారులకు సరసమైన ధరలలో ఇంధనం లభించేలా చేయడమే దిగుమతుల ఉద్దేశం.

ప్రపంచ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా అవి తప్పనిసరి.

అయితే భారత్‌ను విమర్శించే దేశాలే రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయని వెల్లడైంది. పైగా భారత్‌లా వారికది ముఖ్యమైన జాతీయ అవసరం కూడా కాదు.

అమెరికాకు భారత్ సమాధానం

వస్తువుల రంగంలో యూరోపియన్ యూనియన్ 2024లో రష్యాతో 67.5 బిలియన్ యూరోల (సుమారు 6.84 లక్షల కోట్ల రూపాయల) విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం చేసింది.

దీనికి అదనంగా సేవలరంగంలో 2023లో 17.2 బిలియన్ యూరోల (సుమారు 1.74 లక్షల కోట్ల రూపాయల) వ్యాపారం జరిగినట్టు అంచనా.

ఇది ఆ ఏడాది కానీ, తరువాత కానీ భారత్ రష్యాతో జరిపిన మొత్తం వాణిజ్యం కంటే ఎక్కువ.

నిజానికి 2024 లో యూరోపియన్ ఎల్ఎన్‌జీ దిగుమతులు రికార్డు స్థాయిలో 16.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి, ఇది 2022లో 15.21 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి దిగుమతుల కంటే ఎక్కువ.

randhir jaiswal
అమెరికాకు భారత్ సమాధానం

యూరప్, రష్యా వాణిజ్యంలో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, మైనింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు యంత్రాలు.. రవాణా పరికరాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి.

అమెరికాకు భారత్ సమాధానం

అమెరికా విషయానికొస్తే.. ఆ దేశం తన అణు పరిశ్రమ కోసం యురేనియం హెక్సాఫ్లోరైడ్, తన ఈవీ పరిశ్రమ కోసం పల్లాడియం, ఎరువులు, రసాయనాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

randhir jaiswal
అమెరికాకు భారత్ సమాధానం

ఈ నేపథ్యంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అకారణం, అసంమజసం. అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే, భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది.

మోదీ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

‘‘అమెరికా తీరు తప్పుదోవ పట్టించేలా ఉంది’’

రష్యాతో భారత్ చమురు వాణిజ్యంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అనేక కారణాల వల్ల తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారత మాజీ వాణిజ్య అధికారి, దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) అధినేత అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

పాశ్చాత్య ఆంక్షలు సరఫరాలకు అంతరాయం కలిగించిన తరువాత ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించడంలో సహాయపడటానికి భారతదేశం చమురు కొనుగోళ్లను పెంచిందని శ్రీవాస్తవ చెప్పారు.

ధర, సరఫరా భద్రత, ఎగుమతి నిబంధనలు వంటి అంశాల ఆధారంగా ముడి చమురును ఎక్కడ కొనుగోలు చేయాలో భారత చమురు శుద్ధి కర్మాగారాలు నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు. ఇవి స్వతంత్రంగా పనిచేస్తాయి. రష్యా లేదా ఇతర దేశాల నుండి కొనుగోలు చేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)