మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా సహా విదేశాలకు పారిపోయిన ఐదుగురు బడా వ్యాపారవేత్తలు

విజయ్ మాల్యా, బిజినెస్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విజయ్ మాల్యాను భారత్ తిరిగి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు న్యాయపోరాటం చేస్తున్నాయి.

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విజ్ఞప్తి మేరకు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టు చేశారు. ఆలిండియా రేడియో ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన బంధువు నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ జాబితాలో మరికొందరు వ్యాపారవేత్తల పేర్లు కూడా ఉన్నాయి. వారు వివిధ కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని తిరిగి భారత్ రప్పించడం కోసం దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

మెహుల్ చోక్సీ సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు వ్యాపారవేత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మెహుల్ చోక్సీ, పీఎన్‌బీ, స్కామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో మెహుల్ చోక్సీ నిందితుడు

మెహుల్ చోక్సీ

2018 ప్రారంభంలో, పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ సహా అనేక మందిపై బ్యాంకు ఫిర్యాదు చేసింది.

నిందితులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై, కుట్రపన్ని బ్యాంకుకు నష్టం కలిగించారని బ్యాంకు ఆరోపించింది.

బ్యాంకు అంతర్గత విచారణ పూర్తయిన తర్వాత, 2018 ఫిబ్రవరిలో ఈ మోసం గురించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం అందించింది.

మెహుల్ చోక్సీ ఒకప్పుడు భారత వజ్రాల వ్యాపారానికి పోస్టర్ బాయ్.

నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీఎన్‌బీ స్కామ్‌లో మెహుల్ చోక్సీతో పాటు నీరవ్ మోదీ కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

నీరవ్ మోదీ

పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేల కోట్ల రూపాయల స్కామ్‌లో నీరవ్ మోదీ కూడా నిందితుడిగా ఉన్నారు. 2018 జనవరిలో నీరవ్ భారత్ నుంచి పరారయ్యారు.

లండన్‌లోని హోబర్న్‌లో ఉన్న మెట్రో బ్యాంక్ బ్రాంచ్‌లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు వెళ్లినప్పుడు, 2019 మార్చి 19న నీరవ్ మోదీ అరెస్టయ్యారు. నీరవ్ మోదీ అప్పగింత కేసు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో 2020 మే నుంచి నడుస్తోంది.

నీరవ్ మోదీ కుటుంబం తరాలుగా వజ్రాల వ్యాపారంలో ఉంది. భారత్‌లో రిటైల్ జ్యువెల్లరీ కంపెనీ అయిన గీతాంజలి గ్రూప్ అధిపతి మెహుల్ చోక్సీతో నీరవ్ మోదీ దాదాపు 10 ఏళ్లు కలిసి పనిచేశారు.

ఆ తర్వాత, భారత్‌లో ఫైర్‌స్టార్ డైమండ్ అనే కంపెనీని స్థాపించారు.

విజయ్ మాల్యా

ఫొటో సోర్స్, Getty Images

విజయ్ మాల్యా

కింగ్‌ఫిషర్ కంపెనీ యజమాని విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు ఉన్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని, వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయినట్లు మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడింది.

విజయ్ మాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన లండన్‌లోనే నివసిస్తున్నారు. మాల్యాను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు బ్రిటన్ కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాయి.

నిజానికి, భారత్ - బ్రిటన్ 1992లో అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరిని మాత్రమే అలా రప్పించారు.

లలిత్ మోదీ, ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లలిత్ మోదీని రప్పించేందుకు భారత్ పలు ప్రయత్నాలు చేసింది.

లలిత్ మోదీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చీఫ్ లలిత్ మోదీ 2010 నుంచి బ్రిటన్‌లో నివాసముంటున్నారు.

ఐపీఎల్ చీఫ్‌గా ఉన్న సమయంలో, ఐపీఎల్ వేలంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని లలిత్ మోదీపై ఆరోపణలు ఉన్నాయి.

అయితే, ఈ ఆరోపణలను ఆయన ఖండిస్తూ వస్తున్నారు. మరోవైపు, ఆయన్ను తిరిగి రప్పించడానికి భారత్ ఎన్నో విఫల యత్నాలు చేసింది.

2008లో, ఐపీఎల్ ఏర్పాటులో లలిత్ మోదీ కీలకపాత్ర పోషించారు. అది ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీగా మారింది.

2010లో, రెండు జట్ల ఫ్రాంచైజీల వేలంలో అవకతవకలకు పాల్పడ్డారనేది లలిత్ మోదీపై ఉన్న ప్రధాన ఆరోపణ. అనుమతులు లేకుండా ప్రసార, ఇంటర్నెట్ హక్కులను విక్రయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

లలిత్ మోదీ క్రికెట్ వ్యవహారాల్లో పాల్గొనకుండా 2013లో, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) శాశ్వత నిషేధం విధించింది.

నితిన్ సందేసరా, స్టెర్లింగ్ బయోటెక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నైజీరియా, అల్బేనియా దేశాల పౌరసత్వం పొందింది సందేసరా కుటుంబం.

నితిన్ సందేసరా

బ్యాంకులను రూ.5,700 కోట్లకు మోసం చేయడం, మనీలాండరింగ్ వంటి కేసుల్లో ప్రధాని నిందితుడిగా ఉన్నారు గుజరాత్‌కు చెందిన బడా వ్యాపారవేత్త నితిన్ సందేసరా. స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీ యజమాని అయిన నితిన్ జె.సందేసరాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. ఈయనతో పాటు హితేశ్ నరేంద్రభాయ్ పటేల్, దీప్తి సందేసరా, చేతన్ సందేసరా కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

2017లో, కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రారంభించడానికి కొద్దిరోజుల ముందు ఈ కుటుంబం భారత్‌ నుంచి పారిపోయింది. దుబయ్ మీదుగా నైజీరియాకు వెళ్లిపోయింది. సందేసరా కుటుంబం నైజీరియా, అల్బేనియా దేశాల పౌరసత్వం పొందింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)