మెహుల్ చోక్సీ లుకేమియా కారణంగా బెల్జియం నుంచి భారత్ రాకుండా తప్పించుకోగలరా?

ఫొటో సోర్స్, Getty Images
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేశారు.
సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విజ్ఞప్తి మేరకు ఆయనను బెల్జియంలో అరెస్ట్ చేసినట్లు ఆలిండియా రేడియో పేర్కొంది.
వ్యాపారవేత్త మెహుల్ చోక్సీని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.
ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,500 కోట్లకుపైగా మోసం చేసినట్లు మెహుల్ చోక్సీ, ఆయన బంధువు నీరవ్ మోదీపై ఆరోపణలు ఉన్నాయి.
బెల్జియం నుంచి మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించడానికి భారత ఏజెన్సీలు, ఈడీ, సీబీఐ ఈ చర్య తీసుకున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
విషయం ఏంటి?
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన వేల కోట్ల రూపాయల కుంభకోణం 2018 ప్రారంభంలో వెలుగులోకి వచ్చింది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన భార్య ఆమీ, సోదరుడు నిషాల్‌లతో పాటు అంకుల్ చోక్సీ కూడా ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
నీరవ్ మోదీ ఇప్పుడు లండన్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు చాలాసార్లు తిరస్కరించింది.
తనను భారత్‌కు అప్పగించవద్దంటూ నీరవ్ మోదీ కోర్టులలో పిటిషన్లు వేశారు.
ఈ నిందితులంతా బ్యాంక్ అధికారులతో కలిసి కుట్ర చేసి బ్యాంకుకు నష్టం కలిగించారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆరోపించింది.
2018 జనవరిలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, వారి అనుచరులపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలిసారి ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదులో ఆయన రూ. 280 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపించారు.
ఫిబ్రవరి 14న, అంతర్గత దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కుంభకోణం గురించి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌కు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమాచారం ఇచ్చింది.
భారత్‌లో జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి.
చోక్సీ, నీరవ్ మోదీ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. చోక్సీ కోసం సీబీఐ, ఈడీ వెదుకుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అప్పగింత ఎందుకు కష్టం?
దోషుల అప్పగింతపై భారత్, బెల్జియంల మధ్య ఒక ఒప్పందం ఉంది.
బెల్జియంలో మెహుల్ చోక్సీ ఉన్నట్లుగా అసోసియేటెడ్ టైమ్స్ అనే వెబ్‌సైట్ ఒక కథనంలో పేర్కొంది.
''మెహుల్ చోక్సీ ఆయన భార్య ప్రీతి చోక్సీతో కలిసి ఇప్పుడు బెల్జియంలోని ఆంట్వర్ప్‌లో నివసిస్తున్నారు. ఆయన బెల్జియం దేశపు ఎఫ్ రెసిడెన్సీ కార్డును పొందారు'' అని ఆ కథనంలో ప్రస్తావించారు. 2025 మార్చిలో ఈ కథనం ప్రచురితమైంది.
చోక్సీని అప్పగించాలని భారత్ బెల్జియంను కోరినట్లు ఈ కథనంలో అసోసియేటెడ్ టైమ్స్ పేర్కొంది.
అయితే, భారత అధికారులు దీన్ని ధ్రువీకరించలేదు.
బెల్జియంలో మెహుల్ చోక్సీ బెయిల్ దరఖాస్తు చేసుకోవచ్చని, తన అప్పగింతకు సంబంధించి భారత్ చేసిన విజ్ఞప్తిని ఆయన వ్యతిరేకించవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.
చోక్సీ న్యాయబృందం ఆయన అనారోగ్యాన్ని ఒక బలమైన కారణంగా చూపించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
గతంలో మెహుల్ చోక్సీ, ముంబయి కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో తాను భారత్‌కు రాలేనని పేర్కొన్నారు.
తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా భారత్‌లో విచారణకు సిద్ధంగా లేనని చోక్సీ చెప్పినట్లు ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
తనకు లుకేమియా ఉందని, ప్రయాణాలు అసలు చేయొద్దని బెల్జియం వైద్యుడొకరు సిఫార్సు చేశారంటూ ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలు ఉన్న భారత్‌లో మెహుల్ చోక్సీకి సరైన చికిత్స లభిస్తుందని ఒక అధికారి చెప్పినట్లు ఎకనమిక్ టైమ్స్ తన కథనంలో రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
బెల్జియం ఏం చెప్పింది?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో నివసిస్తున్నట్లు వచ్చిన కథనాలపై బెల్జియం ఒక ప్రకటన చేసింది.
ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బెల్జియం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ ఫారిన్ అఫైర్స్ సోషల్ మీడియా అధికార ప్రతినిధి డేవిడ్ జోర్డాన్స్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
''ఎఫ్‌పీఎస్ ఫారిన్ అఫైర్స్ శాఖకు దీని గురించి తెలుసు అని నేను చెప్పగలను. ఇది చాలా ప్రాధాన్య అంశం'' అని బెల్జియంలో చోక్సీ ఉనికి గురించి అడిగినప్పుడు జోర్డాన్స్ అన్నారు.
''అయితే మేం వ్యక్తిగత కేసుల గురించి వ్యాఖ్యానించం. ఈ అంశం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ జస్టిస్ పరిధిలోకి వస్తుంది. ఈ అంశంలో జరిగే పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉంటాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మెహుల్ చోక్సీ ఎవరు?
భారత్‌లో తొలి గోల్డ్ ఏటీఎం ముంబయిలో ఏర్పాటైనట్లుగా 2011 నవంబర్ 29న ఒక వార్త బయటకు వచ్చింది.
ఈ ఏటీఎం నుంచి ప్రజలు బంగారం, వెండి నాణేలను, అన్ని రకాల నగలను కొనుక్కోవచ్చు. కానీ, ఈ యంత్రం ప్రజలను ఆకర్షించలేదు.
వినియోగదారులు ఎవరూ ఆ ఏటీఎంను ఉపయోగించలేదని సమీపంలోని దుకాణాదారులు చెప్పారు.
భారత వజ్రాల వ్యాపారానికి ఒకప్పుడు పోస్టర్ బాయ్‌గా ఉన్న మెహుల్ చోక్సీ కథ కూడా ఈ ఏటీఎం లాంటిదే అనిపిస్తుంది.
ప్రారంభంలో ఆయన కెరీర్ వజ్రంలానే వెలుగులీనింది. ఆయన పద్ధతులు బంగారం లాగే సరళంగా ఉండేవి. కానీ, ఫలితం మాత్రం జ్యుయెల్లరీ దుకాణంలో మోసపోయినట్లుగా ఉండేది.
గోల్డ్ ఏటీఎంతో చోక్సీని ఎందుకు పోల్చామంటే, ఆ ఏటీఎంను మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి అనే కంపెనీ ఏర్పాటు చేసింది.
ఆయన సోదరి పేరు మీద ఉన్న గీతాంజలి కంపెనీ 2006లో ఐపీఓకు వెళ్లి రూ. 330 కోట్లు సేకరించింది. 2013 నాటికి, మెహుల్ సంస్థలో అవకతవకలు జరిగాయనే అనుమానంతో సెబీ ఆ సంస్థను స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకుండా 6 నెలల పాటు నిషేధం విధించింది.
2008లో కత్రినా కైఫ్ వారి వజ్రాలను ఎండార్స్ చేసినప్పుడు అమ్మకాలు ఒక ఏడాదిలో 60 శాతం పెరిగాయి. గీతాంజలి కంపెనీ తన కస్టమర్లకు నకిలీ వజ్రాలు అమ్ముతోందని ఆ కంపెనీ మాజీ ఎండీ సంతోష్ శ్రీవాస్తవ ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














