నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటూ తీర్పు చెప్పిన బ్రిటన్ కోర్టు

నీరవ్ మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీరవ్ మోదీ

పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తెలిపింది.

నీరవ్‌ మోదీని ముంబయి ఆర్థర్ రోడ్ జైలులోని 12వ బ్యారక్‌‌లో ఉంచొచ్చని కోర్టు సూచించింది. 2020 ఆగస్టులో భారత్ పంపించిన ఆ జైలు వీడియో చూస్తే, అక్కడ అన్ని సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నట్టు అనిపిస్తోందని న్యాయమూర్తి జస్టిస్ శామ్యూల్ గూజీ అన్నారు.

భారత్‌లో నీరవ్ మోదీకి ఎలాంటి అన్యాయం జరగదని న్యాయమూర్తి అన్నారు. తన మానసిక పరిస్థితి సరిగా లేదని నీరవ్ మోదీ చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. అయితే, ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు నీరవ్‌కు కోర్టు అవకాశం కల్పించింది.

ఈ కోర్టు ఆదేశాలపై బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆమె సంతకం చేస్తే నీరవ్‌ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమవుతుంది.

వీడియో క్యాప్షన్, పంజాబ్ నేషనల్ బ్యాంకు: కుంభకోణం అసలెలా జరిగింది!

పీఎన్‌బీ కుంభకోణం ఎలా జరిగింది?

ముంబయిలోని బ్రీచ్‌క్యాండీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో రూ.11,360 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆ బ్యాంకు 2018 ఆరంభంలో వెల్లడించింది.

ఈ కుంభకోణం 2011 నుంచి 2018 వరకు కొనసాగిందని, ఏడేళ్లలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని బ్యాంకు ఉన్నతాధికారులు చెప్పారు.

సీబీఐ చెబుతున్న వివరాల ప్రకారం.. నీరవ్ మోదీ ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకును సంప్రదించారు.

ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం కావాలని అడిగారు. విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంకు ఆయనకు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (LOU) ఇచ్చింది. అంటే విదేశాల్లో ముడి వజ్రాలు సరఫరా చేసే వారికి డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు అంగీకరించింది.

కానీ, బ్యాంకు అధికారులు నకిలీ LOUలు జారీ చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు అనుమానం రాలేదు. దాంతో నిధులు విడుదల చేశాయి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఇంటర్ బ్యాంకింగ్ మెసేజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు.

దీన్ని గుర్తించకుండా విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులు పీఎన్‌బీకి రుణం ఇచ్చేశాయి. ఆ తర్వాత ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. దాంతో నీరవ్ మోదీ ముడి వజ్రాలు పొందారు.

పాత రుణాలకు కూడా కొందరు పీఎన్‌బీ అధికారులు కొత్తగా LOUలు ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా నీరవ్ మోదీ రుణాలు చెల్లించలేదు. కొత్తగా వచ్చిన అధికారులు భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇదంతా 2011 నుంచి 2018 మధ్య కాలంలో జరిగింది.

నీరవ్ మోదీ

ఫొటో సోర్స్, Getty Images

నీరవ్ మోదీ ఎవరు?

నీరవ్ మోదీ ఒక వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అయనపై అభియోగాలు ఉన్నాయి.

2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన భారత్‌ నుంచి లండన్‌‌కు వెళ్లిపోయారు.

నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్‌ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేస్తూ వచ్చింది.

లండన్‌లో తన ఆచూకీ బయటకు తెలియకుండా కొంతకాలం జాగ్రత్తపడ్డ నీరవ్ మోదీ 2019 ఆరంభంలో 'ది టెలిగ్రాఫ్' పత్రిక జర్నలిస్టుల కంటపడ్డారు. లండన్ వీధుల్లో ఆయన్ను ఆ జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేశారు.

లండన్‌లో సుమారు రూ.73 కోట్ల ఖరీదైన త్రీ బెడ్‌రూం అపార్టుమెంట్‌లో ఉంటున్నారని, మళ్లీ కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నారని ది టెలిగ్రాఫ్‌ కథనం వెల్లడించింది.

ఆ తర్వాత ఆయన్ను బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నీరవ్ మోదీ మోసం చేశారని, అందుకు సంబంధించిన ఆధారాలను లండన్ కోర్టుకు సమర్పించినట్లు ఈడీ, సీబీఐ తెలిపాయి.

నీరవ్ మోదీ సాక్షులను భయపెట్టారని, లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని కోర్టులో భారత్‌ వాదనలు వినిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)