Ground Report: 'నీరవ్ మోదీ మమ్మల్ని మోసగించి మా భూములు లాక్కున్నాడు'

ఫొటో సోర్స్, Amey Pathak
- రచయిత, అమేయ్ పాఠక్
- హోదా, బీబీసీ కోసం
"ప్రభుత్వ బస్సు సైతం రాని మా గ్రామానికి నీరవ్ మోదీ రాగలిగాడు. రావడమే కాదు మమ్మల్ని నిండా ముంచాడు. మా భూములను అతడికి కారుచౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. మేం నీరవ్ మోదీ మనుషుల మాటలు విని మోసపోయాం. ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో మునిగిపోయాం."
ఇలా తన బాధను వ్యక్తం చేస్తున్న వ్యక్తి పేరు పోపట్‌రావ్ మానే. మహారాష్ట్ర, అహ్మద్‌నగర్ జిల్లాలోని ఖండాలా గ్రామానికి చెందిన రైతు ఆయన.
నిజానికి ఈ ఫిర్యాదు ఆయనొక్కరిదే కాదు. ఖండాలా గ్రామంతో పాటు గోయ్‌కరవడా, కాప్‌రేవడి గ్రామాలకు చెందిన అనేక మంది రైతులు ఇదే మాట చెబుతున్నారు. బీబీసీ ఈ గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం పరారీలో ఉన్నారన్న విషయం తెలిసిందే.
ఆయన యాజమాన్యంలోని ఒక కంపెనీ అహ్మద్‌నగర్ జిల్లాలోని ఈ మూడు గ్రామాల్లో 85 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో 37 ఎకరాల భూమిని నీరవ్ మోదీ పేరిట కొనుగోలు చేయగా, 48 ఎకరాలను ఫైర్‌స్టోన్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో కొనుగోలు చేశారు. నీరవ్ మోదీ ఈ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారు.
ప్రస్తుతం ఈ భూములను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. ఈ భూములను చాలా తక్కువ ధరకు తమ నుంచి కొన్నారని పోపట్‌రావ్ తదితర రైతులు ఆరోపిస్తున్నారు. కాబట్టి తమ భూములను తమకే ఇప్పించాలని వారు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Amey Pathak
'భూములు లాక్కుంటారని చెప్పారు'
"ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. మేం జొన్నలు, అపరాలు పండిస్తాం. ఇది కరవు ప్రాంతం కాబట్టి మాకు మరో ఉపాధి మార్గం ఏదీ లేదు. పొట్ట నింపుకోవడం కోసమే మేం వ్యవసాయం చేస్తుంటాం. ఏమైనా మిగిలితే వాటిని మార్కెట్లో అమ్ముకుంటాం. నాకున్న 12 ఎకరాల్లో ఏడెకరాల భూమిని అమ్మేశాను. ఇప్పుడు మిగిలిన ఐదెకరాల భూమిలో తగినంత పంట రావడం లేదు" అంటూ పోపట్‌రావ్ తన పరిస్థితిని వివరించారు.
70 ఏళ్ల వయసున్న పోపట్‌రావ్ కుటుంబంలో వృద్ధురాలైన తల్లి, భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లు ఉన్నారు.
పోపట్‌రావ్ కుమారుడు సంతోష్ బీబీసీతో మాట్లాడుతూ.. "2007 వరకు మేం ఏ ఇబ్బందీ లేకుండా వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవాళ్లం. అప్పుడే పుణె నుంచి కొంత మంది మా గ్రామానికి వచ్చారు. ఇక్కడ ప్రభుత్వం పక్షుల అభయారణ్యం ఏర్పాటు చేస్తుందనీ, దాని కోసం ఈ భూములను తీసేసుకుంటారని వారన్నారు. దాంతో మేం ఆదరాబాదరా వారు చెప్పిన ధరలకు మా భూములను అమ్మేశాం. మా ఏడెకరాల భూమిని రూ. 10 వేలకు ఎకరం చొప్పున అమ్మాం. ఇప్పుడు 11 ఏళ్లు గడచిపోయాయి. కానీ అభయారణ్యం ఏర్పాటేదీ జరగలేదు. ఆ తర్వాత వాళ్లు ఈ భూములను నీరవ్ మోదీ పేరిట, అతడి కంపెనీ పేరిట మార్చేశారు" అని చెప్పారు.
"పీఎన్‌బీ కుంభకోణంలో నీరవ్ మోదీ పేరు విన్న తర్వాత మేం కూడా మోసానికి గురైనట్టు మాకర్థమైంది. ఇప్పుడు మా భూముల్ని మాకు తిరిగి ఇచ్చెయ్యాలని మేం కోరుతున్నాం."

ఫొటో సోర్స్, Amey Pathak
'దేశాన్ని దోచుకున్నాడు, మమ్మల్నీ ముంచాడు'
ఖండాలా గ్రామానికి చెందిన మరో రైతు బబన్ టక్లే కూడా మాతో మాట్లాడారు. "నీరవ్ మోదీ దేశాన్ని దోచుకున్నాడు. మా నుంచి కూడా అతడు మోసంతోనే చౌకగా భూముల్ని లాగేసున్నాడు. భూమి మాకు తల్లి లాంటిది. అది తప్పుడు మనుషుల చేతిలో పడటం బాధాకరం" అని ఆయన చెప్పారు.
బబన్ కుటుంబంలో ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు.
"నాకున్న నాలుగున్నర ఎకరాల భూమిని కేవలం భయం వల్లనే అమ్మేశాను. ప్రభుత్వం పక్షుల అభయారణ్యం కోసం భూమిని సేకరిస్తుందని అనడంతో నేను హడలిపోయాను. ఆ భూమంతా అమ్మేసి నా ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాను. ఇప్పుడు నా దగ్గర సెంటు భూమి కూడా లేదు. కూలీ పనులు చేస్తూ పొట్ట పోసుకుంటున్నాను" అని బబన్ వాపోయారు.

ఫొటో సోర్స్, Amey Pathak
పోపట్‌రావ్, బబన్‌ల లాంటి అనుభవాలే ఇంకా చాలా మంది రైతులు మాతో పంచుకున్నారు.
ఖండాలా గ్రామ సర్పంచ్ నవ్‌నాథ్ పంధారే బీబీసీతో మాట్లాడారు. "ఈ భూమిలో గ్రామ పంచాయతీ అనుమతితో వారు ఒక సోలార్ ప్లాంట్ కూడా నిర్మించారు. కానీ 2011 నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి ఒక్క పైసా పన్ను కట్టలేదు" అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఈ ప్లాంటు కూడా ఈడీ స్వాధీనంలో ఉంది.

ఫొటో సోర్స్, BBC Sport
'మా భూములు మాకివ్వండి' అంటున్న రైతులు
తమ భూములు ఇలా మోసంతో, తక్కువ ధరలకు పరుల చేతుల్లోకి వెళ్లినందుకు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వారు ఆ భూముల్ని మళ్లీ స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. తమ పోరాటాన్ని ఆపబోమని వారన్నారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వ స్పందన ఏంటో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
ఈ ప్రాంత తహసీల్దార్ మాతో మాట్లాడుతూ.. "రైతులు తమ భూములు తమకు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఈ వివాదాస్పద భూమి ప్రస్తుతం ఈడీ స్వాధీనంలో ఉంది" అని తెలిపారు.
ఈ విషయంపై నీరవ్ మోదీ కంపెనీని కూడా సంప్రదించాలని బీబీసీ ప్రయత్నించింది. ఫైర్‌స్టోన్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక మెయిల్ ఐడీకి మేం కొన్ని ప్రశ్నలు రాసి పంపించాం. అయితే ఈ మెయిల్ ఐడీ ప్రస్తుతం యాక్టివ్‌గా లేదు.
ఆ తర్వాత నీరవ్ మోదీ తరఫు న్యాయవాది విజయ్ ఆగ్రవాల్‌ను ఈ కేసు గురించి అడగగా, తనకు దీని గురించి ఏమీ తెలియదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








