హమాస్: ప్రభుత్వ ఉద్యోగులకు రహస్యంగా జీతాలు ఎలా చెల్లిస్తోంది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, రష్ది అబుఅలౌఫ్
- హోదా, ఇస్తాంబుల్‌లోని గాజా కరస్పాండెంట్
దాదాపు రెండు సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధం తర్వాత, సైనిక పరంగా చాలా బలహీనపడింది హమాస్. అలాగే దాని నాయకులు కూాడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
అయినప్పటికీ, యుద్ధం జరుగుతున్నన్ని రోజులూ.. హమాస్ 30,000 మంది ప్రభుత్వోద్యోగులకు భారతీయ కరెన్సీలో దాదాపు 70 లక్షల డాలర్లు ( సుమారు రూ. 58.1 కోట్లు) జీతాలుగా చెల్లించడానికి రహస్య నగదు ఆధారిత చెల్లింపు వ్యవస్థను ఉపయోగిస్తూ వచ్చింది.
బీబీసీ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడింది. వారిలో ప్రతి ఒక్కరూ తాము గత వారం రోజుల్లో సుమారు 300 డాలర్లు ( సుమారు రూ.24,900 ) అందుకున్నామని ధృవీకరించారు.
ప్రతి పది వారాలకు యుద్ధానికి ముందు జీతంలో గరిష్టంగా 20% కంటే కొంచెం ఎక్కువగా పొందుతున్న పదుల వేలమంది ఉద్యోగులలో ఆ ముగ్గురు కూడా ఉన్నారు.
ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూండడంతో, పూర్తిజీతంలో కేవలం కొంత భాగం మాత్రమే అందడం పార్టీకి నిబద్ధంగా ఉన్నవారిని మరింత అసంతృప్తికి గురి చేస్తోంది.
ఇజ్రాయెల్ ఆంక్షలే దీనికి కారణమని సహాయ సంస్థలు చెబుతున్నాయి. గాజాలో తీవ్రమైన ఆహార కొరత కారణంగా పోషకాహార లోపం కేసులు పెరుగుతున్నాయి.
కొన్ని వారాల్లోనే కిలో పిండి ధర 80 డాలర్ల ( సుమారు రూ.6,640) వరకు పెరిగింది. ఇదే ఇప్పటివరకు గరిష్ఠ ధర.

గాజాలో బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, జీతం పొందడం కష్టం కావడమే కాదు, , కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారుతోంది. హమాస్ ప్రభుత్వం కొనసాగకుండా చూడాలని, హమాస్ జీతాలు పంపే వ్యక్తులను గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది ఇజ్రాయెల్.
అందుకే హమాస్ రహస్యంగా జీతాలు అందజేస్తోంది.
పోలీసులు, పన్ను శాఖ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులకు తమ ఫోన్‌లో లేదా తమ జీవిత భాగస్వామి ఫోన్‌లో "టీ తాగడానికి స్నేహితుడిని కలవండి" అనే మాటతో నిర్దిష్ట స్థలానికి, నిర్దిష్ట సమయంలో వెళ్లాలని ఒక రహస్య కోడ్ వస్తుంది. ఇది వాస్తవానికి వారు అక్కడ జీతం అందుతుందన్న రహస్య సంకేతం.
వారు సందేశం పంపిన చోటుకి ఒక పురుషుడు, లేదా అప్పుడప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆ ఉద్యోగిని సంప్రదిస్తారు. చాకచక్యంగా జీతం డబ్బు ఉన్న సీల్డ్ కవరును అందజేస్తారు. ఆ తరువాత ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతారు.
భద్రతా కారణాల దృష్ట్యా తన పేరు చెప్పడానికి ఇష్టపడని హమాస్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్యోగి, జీతం తీసుకోవడం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో వివరించారు.
"ప్రతి సారి జీతం తీసుకోవడానికి వెళ్లేటప్పుడు, నా భార్య, పిల్లలకు గుడ్‌బై చెబుతాను. నేను తిరిగి రాకపోవచ్చని నాకు తెలుసు" అని ఆయన చెప్పారు. "కొన్ని సందర్భాల్లో జీతాలు పంపిణీ చేసే ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఒకసారి గాజా సిటీలో రద్దీగా ఉన్న మార్కెట్ లక్ష్యంగా జరిగిన దాడినుంచి నేను తృటిలో తప్పించుకున్నా" అని ఆయన తెలిపారు.
హమాస్ నడిపే ప్రభుత్వంలో పనిచేస్తున్న అలా(పేరు మార్చాం) పాఠశాల ఉపాధ్యాయుడు. ఆరుగురు సభ్యులుగల కుటుంబానికి ఈయన సంపాదనే ఆధారం.
"నాకు 1,000 షెకెల్‌లు (సుమారు రూ.24,900) పాతవి, చిరిగిన నోట్లు ఇచ్చారు. ఏ షాపు వాడు వాటిని తీసుకోలేదు. సుమారుగా 200 షెకెల్స్ ( సుమారు రూ.4,980 ) మాత్రమే మంచినోట్లున్నాయి. మిగిలినవి ఏం చేయాలో అర్థం కాలేదు" అని ఆయన చెప్పారు.
"రెండున్నర నెలలుగా ఆకలితో అలమటిస్తున్నాం. ఇప్పుడేమో చిరిగిన నోట్లు ఇచ్చారు. నా పిల్లలకు తినడానికి కొంత పిండి తెచ్చుకోవాలనే ఆశతో నేను తరచుగా సహాయ పంపిణీ కేంద్రాలకు వెళ్తున్నా. కొన్నిసార్లు కొద్దిగా పిండి దొరుకుతుంది. కానీ చాలాసార్లు ఏమీ దొరకదు" అని ఆయన చెప్పారు.
మార్చిలో ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రిపై జరిగిన దాడిలో హమాస్ ఆర్ధిక వ్యవహారాలు చూసే ఇంచార్జ్ ఇస్మాయిల్ బర్హౌమ్‌ను చంపేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆయన హమాస్ సైనిక విభాగానికి నిధులు మళ్లించాడని ఆరోపించింది.
హమాస్ జీతాలు ఎలా చెల్లిస్తోంది అన్నది స్పష్టంగా తెలియదు. ఎందుకంటే పరిపాలనా కార్యాలయాలు, ఆర్థిక వ్యవస్థల కార్యాలయాలను చాలా వరకు ఇజ్రాయెల్ నాశనం చేసింది.
"దక్షిణ ఇజ్రాయెల్‌లో 2023 అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ముందే, హమాస్ దాదాపు 700 మిలియన్ల డాలర్ల(5,810 కోట్లు) నగదు, వందల మిలియన్ల షెకెల్‌లను భూగర్భ సొరంగాల్లో నిల్వ చేసింది. తర్వాత భారీ స్థాయిలో ఇజ్రాయెల్ సైనిక చర్య మొదలైంది" అని హమాస్ ఆర్థిక కార్యకలాపాల గురించి బాగా తెలిసిన, ఉన్నత పదవుల్లో పనిచేసిన ఒక సీనియర్ ఉద్యోగి బీబీసీతో చెప్పారు.
ఈ నగదు నిల్వలను హమాస్ నాయకుడు యహ్యా సిన్వార్, ఆయన సోదరుడు మొహమ్మద్ నేరుగా పర్యవేక్షించారని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఇజ్రాయెల్ దళాలు వారిద్దరినీ హతమర్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
హమాస్ గాజాలోని ప్రజలపై విధించే ఎక్కువ దిగుమతి సుంకాలు, పన్నులతోనే నిధులు సమకూర్చుకుంది. దాంతోపాటు ఖతార్ నుంచి మిలియన్ల డాలర్ల మద్దతు కూడా పొందింది.
హమాస్‌కు చెందిన సైనిక విభాగమైన కస్సామ్ బ్రిగేడ్‌లు స్వతంత్ర ఆర్థిక వ్యవస్థతో పనిచేస్తుంటాయి. వీటికి ఇరాన్ నిధులు సమకూరుస్తుంది.
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిస్ట్ సంస్థలలో ఒకటైన, ఈజిప్టుకు చెందిన నిషేధిత ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి, తమ బడ్జెట్‌లో దాదాపు 10% హమాస్‌కు మళ్లించారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధ సమయంలో ఆదాయాన్ని సంపాదించడానికి, హమాస్ వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేస్తూనే ఉంది. పెద్ద మొత్తంలో సిగరెట్లను వాటి అసలు ధర కంటే 100 రెట్లు ఎక్కువ ధరలకు విక్రయించింది. యుద్ధానికి ముందు 20 సిగరెట్ల పెట్టె ధర 5 డాలర్లు (సుమారు రూ. 415). అది ఇప్పుడు 170 డాలర్లు (సుమారు రూ. 14,110) కంటే పెరిగింది.
నగదు చెల్లింపులతో పాటు, హమాస్ తన సభ్యులకు, వారి కుటుంబాలకు స్థానిక అత్యవసర కమిటీల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. అయితే ఇజ్రాయెల్ తరచుగా దాడులు చేయడంతో ఈ కమిటీల నాయకత్వం తరచూ మారుతోంది.
దాంతో గాజాలో చాలా మంది కోపంగా ఉన్నారు. హమాస్ తన మద్దతుదారులకు మాత్రమే సహాయం చేస్తోందని, మిగలిన వారందరినీ నిర్లక్ష్యం చేసిందని వారు చెబుతున్నారు.
ఈ ఏడాది మొదట్లో కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి పంపిన సాయాన్ని హమాస్ దోచుకుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనిని హమాస్ ఖండించింది. అయితే, ఆ సమయంలో హమాస్ ఎక్కవ మొత్తంలో తీసుకున్నట్లు కొంతమంది స్థానికులు బీబీసీతో చెప్పారు.
ఐదు సంవత్సరాల కిందట నిస్రీన్ ఖలీద్ భర్త క్యాన్సర్‌తో చనిపోయారు. అప్పటినుంచి నస్రీన్ ఒక్కరే ముగ్గురు పిల్లలను పెంచుతున్నారు.
"ఆకలికి తట్టుకోలేక నా పిల్లలు ఏడుస్తున్నారు. కేవలం నొప్పితో మాత్రమే కాదు, హమాస్‌కు మద్దతు తెలిపే పొరుగువారు ఆహార పొట్లాలు, పిండి బస్తాలను తీసుకోవడం చూసి కూడా ఏడుస్తున్నారు" అన్నారు.
"మా బాధలకు కారణం వాళ్లే కదా? అక్టోబర్ 7న దాడిచేసే ముందు కావలసిన ఆహారం, నీరు, మందులను ఎందుకు ఏర్పాటు చేయలేదు?" అని ఆమె ప్రశ్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














