ఇండోనేషియా: ఈ పుర్రెబొమ్మ జెండాల ప్రదర్శన దేనికి సంకేతం?

- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జపాన్‌కు చెందిన ప్రసిద్ధ యానిమేషన్ కార్టూన్ సిరీస్ వన్ పీస్‌లో గడ్డితో చేసిన టోపీతో కూడిన పుర్రె బొమ్మ ఉన్న నల్లటి జెండాలను క్రూరమైన పాలనను సవాలు చేసేందుకు, స్వేచ్ఛ కోసం పోరాటానికి సంకేతంగా ప్రదర్శిస్తారు.
అయితే జులైలో ఇలాంటి చిహ్నాలు ఇండోనేషియాలోని ఇళ్ల తలుపుల మీద, కార్ల వెనుక, గోడల మీద కనిపించడం మొదలైంది.
ఆగస్టు 17న దేశ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశ ప్రజలు ఎరుపు, తెలుపు జాతీయ జెండాను ఎగరవేయాలన్న ఇండోనేషియా నాయకుడు ప్రబోవో సుబియాంటో పిలుపుకు ప్రతిస్పందనగా ప్రజలు పుర్రె బొమ్మను ప్రదర్శిస్తున్నారు.
కొంతమంది ఇండోనేషియన్లు జాతీయ జెండాకు బదులుగా ధిక్కారానికి సూచికగా భావిస్తూ జాలీ రోజర్స్ అని పిలిచే ఈ పైరేట్ జెండాలను ఎగరవేయాలని నిర్ణయించుకున్నారు. ప్రబోవో ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ పెరుగుతోందని వాళ్లు విమర్శిస్తున్నారు.
అయితే ఈ ఉద్యమాన్ని అందరూ ఒకేలా చూడటం లేదు. గత వారం డిప్యూటీ హౌస్ స్పీకర్ పైరేట్ జెండాలను ప్రదర్శించడాన్ని విమర్శించారు. "ఇది దేశాన్ని విభజించే ప్రయత్నం" అని ఆయన అన్నారు. ఇది రాజద్రోహం కావచ్చని మరో నాయకుడు అన్నారు.
వన్ పీస్‌ను తొలిసారి 1997లో ప్రపంచంలో ప్రముఖ ఫ్రాంచైజీలలో ఒకటైన ఈచిరో ఒడా తొలిసారి ప్రచురించింది.
ప్రచురించిన తర్వాత 52 కోట్లకు పైగా కాపీలు అమ్ముడు పోయాయి. దీన్ని టీవీ సిరీస్‌గా మార్చి 1100 ఎపిసోడ్లు నిర్మించారు.
జపాన్ యానిమేషన్ కార్యక్రమాలను బాగా ఇష్టపడే ఇండోనేషియాలో వన్‌పీస్‌కు ప్రత్యేక అభిమాన సంఘాలు ఉన్నాయి.
ఈ సిరీస్‌లో మంకీ డి లఫ్పీ నాయకత్వంలోని పైరేట్లు జాలీ రోజర్స్‌ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వేచ్చకు ప్రతీగా ఎగరవేస్తారు. అలాగే కొంతమంది ఇండోనేషియన్లు "మేమీ దేశాన్ని ప్రేమిస్తున్నాం. అంత మాత్రాన ప్రభుత్వ విధానాలతో ఏకీభవిస్తున్నామని కాదనే దానికి సంకేతం" అని చెప్పేందుకు ఈ జెండాలను ఎగరవేస్తున్నామంటున్నారు.
ఇండోనేషియన్లు ఎదుర్కొంటున్న అన్యాయం, అసమానతలకు ఈ యానిమేషన్ ప్రతిబింబమని పపువా ప్రావిన్స్‌లి జయపుర నివాసి అలీ మౌలానా అన్నారు.

"ఈ దేశం అధికారికంగా స్వతంత్రంగా ఉన్నప్పటికీ, మనలో చాలా మంది మన దైనందిన జీవితంలో ఆ స్వేచ్ఛను నిజంగా అనుభవించలేకపోతున్నాం" అని ఆయన బీబీసీతో అన్నారు.
జులైలో అధ్యక్షుడు ప్రబావో ఇచ్చిన ప్రసంగానికి ప్రతిస్పందనగానే పైరేట్ జెండాలను ఎగరవేస్తున్నట్లు అలీ మౌలానాతో పాటు అనేక మంది భావిస్తున్నారు.
"మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎరుపు, తెలుపు జెండాలను ఎగరవేయండి. ఎరుపు స్వాతంత్య్రం కోసం మనం చిందించిన రక్తానికి సూచిక. తెలుపు మన ఆత్మల్లో పవిత్రతకు నిదర్శనం" అని ప్రబావో తన ప్రసంగంలో చెప్పారు.
అధ్యక్షుడి ప్రసంగం తర్వాత తనకు "వేల సంఖ్యలో ఆర్డర్లు" వచ్చాయని సెంట్రల్ జావాలో విక్ వికి పేరుతో బట్టల దుకాణం నిర్వహిస్తున్న డెండీ క్రిస్టాంటో చెప్పారు.
"జులై ముగిసే నాటికి ఇండోనేషియాలోని అన్ని ప్రాంతాల నుంచీ ప్రతీ రోజూ వందలాది ఆర్డర్లు వచ్చాయి" అని ఆయన జకార్తా పోస్ట్ వార్తా సంస్థకు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే ఉన్నతాధికారులు కొందరు అంత సంతోషంగా లేరు.
ప్రబావో కుడి భుజంగా భావించే డిప్యూటీ హౌస్ స్పీకర్ సుఫ్‌మి డాస్కో అహ్మద్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని "దేశాన్ని ముక్కలు చేసేందుకు సమన్వయంతో సాగుతున్న ప్రయత్నం" అని అభివర్ణించారు.
"అలాంటి చర్యలను మనమంతా కలిసి కట్టుగా ప్రతిఘటించాలి" అని ఆయన అన్నారు.
ఈ జెండాలను ప్రదర్శించడం నేరం అవుతుందని సెంటర్-రైట్ గోల్కర్ పార్టీకి చెందిన నాయకుడు ఫిర్మాన్ సొబాగ్యో చెప్పారు.
అయితే తాజాగా దేశమంత్రి ప్రసేత్యో హడి ఈ జెండాలను సృజనాత్మకత వ్యక్తీకరణగా ఉపయోగిస్తే అధ్యక్షుడికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
"ఎరుపు, తెలుపు జెండాల ప్రాముఖ్యాన్ని సవాలు చేయడానికి లేదా తగ్గించడానికి దీనిని ఉపయోగించకూడదు. పోలిక లేదా సంఘర్షణను ఆహ్వానించేలా రెంటినీ పక్కపక్కనే ఉంచకూడదు" అని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఊహాజనిత జెండాల ప్రదర్శనను నియంత్రించేందుకు ఇండోనేషియాలో చట్టాలేమీ లేవు. అయితే జాతీయ జెండాలతో కలిపి వాటిని ఎగరవేస్తే , జాతీయ జెండాను ఎప్పుడూ మిగతా వాటన్నింటికంటే ఎత్తులో ఎగరవేయాలని చట్టం చెబుతోంది.
"పైరేట్ జండాలతో సహా ఇతర జెండాలు, జాతీయ స్ఫూర్తికి అనుగుణంగా లేని చిహ్నల ఉపయోగించడంపై పర్యవేక్షణ ఉంది" అని జకార్తా పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
"జాతీయ భద్రతకు ముప్పు"
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియా కొంతకాలంగా సవాళ్ళను ఎదుర్కొంటోంది.
ప్రజాదరణ ఉన్న మాజీ నాయకుడు జోకో విడోడో ప్రజాస్వామ్యవాదిగా అధికారంలోకి వచ్చారు. అయితే రెండోసారి ఆయన పదవీకాలం ముగిసే నాటికి మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులకు మరణశిక్షను పునరుద్ధరించడం, వివాదాస్పద మాజీ జనరల్ ప్రబోవోను రక్షణమంత్రిగా నియమించడం వంటి నిర్ణయాలు, ఆయనకు ప్రజల్లో ఉన్న ప్రతిష్ఠను చెరిపేశాయి.
ప్రబోవో 2024 అక్టోబర్‌లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ కోతలు, ప్రభుత్వంలో సైన్యం కీలక పాత్ర పోషించేందుకు అనుమతించే చట్టంలో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది ప్రజలు ఆందోళనకు దిగారు.
"ఎరుపు-తెలుపు జెండాలు ఇప్పుడు మనం ఎగరేయలేనంత పవిత్రమైనవి" అని ఓ ఆందోళనకారుడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
కొంతమంది చట్టసభ సభ్యులు జాలీ రోజర్స్ ప్రదర్శనను విమర్శిస్తుంటే, మరికొందరు దీనిని ప్రజా వ్యక్తీకరణ రూపంగా అంగీకరిస్తున్నట్లు చెప్పారు.
"ప్రజల ఆలోచనలను వ్యక్తీకరించడానికి అదొక మార్గం" అని డిప్యూటీ హోంమంత్రి బీమా ఆర్య సుగియార్టో అన్నారు.
"హింసాత్మకంగా మారే వీధి నిరసనల కంటే ఈ రకమైన ప్రతీకాత్మక చర్య మంచిది" అని ప్రతిపక్ష పార్టీ నేత డెడ్డీ యెవ్రి సిటోరస్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














