ట్రంప్ -మోదీ బంధాన్ని ఆరునెలల్లోనే తలకిందులు చేసిన అంశాలేమిటి?

ఇండియా, మోదీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి చమరు కొనుగోలు చేయడం ద్వారా, రష్యా యుక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి భారత్ నిధులు సమకూర్చుతోందంటూ ట్రంప్ విమర్శించారు
    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక వాషింగ్టన్ లో పర్యటించిన తొలి ప్రపంచ నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు.

ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికల్లా రెట్టింపు చేసి, 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నందుకు ఆయన మోదీని ''గొప్ప మిత్రుని''గా అభివర్ణించారు.

కానీ సాంతం ఆరునెలల కూడా గడవక ముందే వీరి బంధం పాతాళానికి జారిపోయినట్టు కనిపిస్తోంది.

భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై ట్రంప్ మొత్తంగా 50శాతం సుంకాలు విధించారు. చైనా, రష్యా, దక్షిణాఫ్రికా వ్యవస్థాపకసభ్యులుగా ఉన్న బ్రిక్స్‌ కూటమిలో భారత్ సభ్యత్వం కలిగినందుకు అదనంగా పదిశాతం సుంకాలు విధిస్తామంటూ గతంలో చేసిన బెదిరింపు కూడా ఇప్పటికీ కొనసాగుతోంది.

తొలుత ట్రంప్ భారత్‌పై 25శాతం సుంకాలు విధించారు. కానీ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి జరిమానాగా బుధవారం అదనంగా 25శాతం సుంకాలను ప్రకటించారు. ఈ చర్యను భారత ప్రభుత్వం ''అన్యాయం, అసమంజసం'' అని పేర్కొంది.

కిందటివారం ట్రంప్ భారత్‌ను ''మృత ఆర్థిక వ్యవస్థ'' గా అభివర్ణించారు.

గత రెండు దశాబ్దాలుగా ఇరుదేశాల ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, రెండు ప్రధాన పార్టీల మద్దతు, ప్రపంచస్థాయి అంశాలపై సారూప్యత కలిగిన అభిప్రాయాలు భారత్, అమెరికా సంబంధాల పరిపుష్ఠికి దోహదపడ్డాయి.

ఇరు దేశాల మధ్య ఓ చక్కని వాణిజ్య ఒప్పందం కుదురవచ్చంటూ ఇటీవలి కొన్ని వారాలలో వాషింగ్టన్, దిల్లీ నుంచి సానుకూల సంకేతాలు కనిపించాయి . కానీ ఇప్పుడా ఒప్పందం కుదరడం క్లిష్టంగా కనిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్

తప్పు ఎక్కడ జరిగింది?

వరుసగా తప్పటడుగులు, జనాకర్షక ప్రకటనలు, భౌగోళిక, దేశీయ రాజకీయ ఒత్తిళ్ల పరంపర చర్చల వైఫల్యానికి దారితీసింది.

అయితే ఓ చక్కని వాణిజ్య ఒప్పందం కుదరడానికి దౌత్యమార్గం సాయపడుతుందనే ఆశతో భారత్ ఇప్పటిదాకా ట్రంప్ దూకుడుపై సంయమనం పాటిస్తోంది. కానీ శ్వేతసౌథం నుంచి ఎటువంటి హామీలు కనిపించడం లేదు.

దిల్లీ అంగీకరించని ఎన్నో అంశాలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. అందులో ముఖ్యమైనది, భారతదేశాన్ని దాని వైరిదేశం పాకిస్తాన్‌ను ఒకేగాటన కట్టి చూడటం.

రెండు దక్షిణాసియా ప్రత్యర్థుల మధ్యన తీవ్ర ఘర్షణ జరిగిన కొన్నివారాల వ్యవధిలోనే పాకిస్తాన్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇచ్చారు.

ఆ తర్వాత ఆ దేశానికి 19శాతం ప్రాధాన్య సుంకాల రేటుతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు పాకిస్తాన్‌లో చమురు నిల్వలను అన్వేషించేందుకు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అంతేకాదు ఏదో ఒక రోజు పాకిస్తాన్ భారత్‌కు చమురును విక్రయించే అవకాశం ఉందన్నారు.

ట్రంప్

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ పదేపదే చెప్పడం దిల్లీకి చికాకు కలిగిస్తోంది.

కశ్మీర్ వివాదాన్ని భారత్ అంతర్గత అంశంగా చూస్తూ, మూడో పక్షం జోక్యాన్ని నిరాకరిస్తూ వస్తోంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆయనతో సహా చాలా మంది ప్రపంచ నేతలు దిల్లీ వైఖరిపై సున్నితంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

కాల్పుల విరమణ ఒప్పందంలో ఏ దేశమూ మధ్యవర్తిత్వం వహించలేదని మోదీ భారత పార్లమెంటులో చెప్పిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు తన వాదనను మరింతగా పెంచారు. ట్రంప్ పేరును కానీ, అమెరికా పేరును కానీ మోదీ ప్రస్తావించనప్పటికీ శ్వేతసౌధానికి తలవంచొద్దని ఆయనపై భారత్‌లో రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది.

''భారత్-పాకిస్తాన్ ఘర్షణ జరిగిన వెంటనే ఇస్లామాబాద్‌తో అమెరికా భారీ, ఉన్నత స్థాయి సంబంధాల నేపథ్యంలో ఇది జరగడం దిల్లీకి, విస్తృత భారత ప్రజానీకానికి మరింత బాధాకరం. అమెరికాను భాగస్వామిగా విశ్వసించలేమంటూ భారత్‌లో కొందరు చేసే వాదనను ఇది మరింత పదునెక్కించింది'' అని వాషింగ్టన్ కు చెందిన దక్షిణాసియా విశ్లేషకుడు మైఖేల్ కుగెల్ మాన్ అన్నారు.

ట్రంప్ హెచ్చరికలు

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి చమరుగు కొనుగోళ్లు కొనసాగిస్తే అధిక సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ భారత్‌ను హెచ్చరించారు

ఇది ట్రంప్ ఎత్తుగడ?

అయితే ఈ అసహనం ఇప్పటిపరిణామలవల్ల కాదు. ''ఇది కొంతమేర ప్రచ్ఛన్న యుద్ధం నాటి అవశేషాల ప్రభావం కావచ్చనిపిస్తోంది. కానీ ఈ సారి సమకాలీన పరిస్థితులు దాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి'' అని ఆయన పేర్కొన్నారు.

జాతీయవాద అంశాలను నినాదంగా మార్చుకున్న మోదీ ప్రభుత్వం ఇలాంటి విషయాలలో తలవంచకుండా, ధైర్యంగా స్పందించాలని దాని మద్దతుదారులు ఆశిస్తున్నారు.

ఇదో క్లిష్టపరిస్థితి. దిల్లీ ఓవైపు ఒప్పందాన్ని సాధించాలనుకుంటోంది. మరోవైపు, ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయినట్టుగా కనిపించకూడదనుకుంటోంది.

దిల్లీ క్రమంగా సంయమనాన్ని సడలిస్తోంది. రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయడంపై వాషింగ్టన్ ఆగ్రహానికి ప్రతిస్పందనగా, దిల్లీ తన "జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను" రక్షించడానికి "అవసరమైన అన్ని చర్యలు" తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసింది.

అయితే భారత్ ఆతిథ్యాన్ని ప్రేమించి, అంతకుముందే గొప్ప దేశంగా అభివర్ణించిన ట్రంప్ నమ్మకమైన మిత్రదేశంపై ఎందుకు విరుచుకుపడ్డారనేది ప్రశ్న.

అమెరికాకు ఉపయోగపడుతుందని భావిస్తున్న ఒప్పందాన్ని చేసుకోవడానికి ట్రంప్ ఈ ఎత్తుగడ వేశారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

''ట్రంప్ ఓ స్థిరాస్థి వ్యాపారి. ఆయన తీరు దౌత్యపూరితంగా ఉండకపోవచ్చుకానీ, ఫలితాలు మాత్రం దౌత్యపరమైనవే కావాలని ఆయన కోరుకుంటారు. ఆయన వ్యవహారశైలి సంప్రదింపుల వ్యూహంలో భాగమని అనుకుంటున్నా" అని మాజీ భారత రాయబారి, ప్రస్తుతం ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జితేంద్ర నాథ్ మిశ్రా చెప్పారు.

దిల్లీ వాషింగ్టన్‌కు అనేక రాయితీలు ఇచ్చింది. వీటిలో పారిశ్రామిక వస్తువులపై సుంకాలు లేకపోవడంపై, దశలవారీగా కార్లు, మద్యంపై సుంకాలు తగ్గించడం వంటివి ఉన్నాయి. భారత్‌లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ కార్యకలాపాలకు కూడా ఒప్పదం కుదుర్చుకుంది.

కానీ దిల్లీతో వాణిజ్యంలో ఉన్న 45 బిలియన్ డాలర్ల లోటును పూడ్చుకునేందుకు భారత్‌లోని వ్యవసాయ,పాడిపరిశ్రమ రంగంలోకి అడుగుపెట్టేందుకు అవకాశమివ్వాలని వాషింగ్టన్ కోరుకుంటోంది.

ట్రంప్, మోదీ

రష్యాతో బంధంపై ఒత్తిడి

అయితే మోదీ లేదా మరే భారత ప్రధానికైనా ఈ రంగాలు చాలా కీలకమైనవి. భారతదేశంలో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలు 45శాతం మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. అందుకే అధికారంలో ఎవరు ఉన్నా అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు.

వాషింగ్టన్ డిమాండ్లను ఆమోదించడం భారత్‌కు ఆమోదయోగ్యం కాదని కుగెల్‌ మాన్ నమ్ముతున్నారు.

"భారత్ ముందుగా దేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చాలి. తాము ఒత్తిడికి లొంగబోమని స్పష్టం చేయాలి. దేశంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇది చాలా కీలకమైనది" అని ఆయన చెప్పారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీద ట్రంప్‌లో అసహనం పెరుగుతోంది. అందుకే ఆయన మాస్కో నుంచి భారత్ చమురు దిగుమతులు నిలిపివేయాలని పట్టుబడుతున్నారని కుగెల్‌మాన్ భావిస్తున్నారు.

"మాస్కోతో వ్యాపారం చేస్తున్నందుకు సుంకాలు పెంచడం ద్వారా రష్యాను దాని అతి ముఖ్యమైన చమురు కొనుగోలు దారుల నుంచి దూరం చేసేందుకు, ట్రంప్ తన ఒత్తిడి వ్యూహాలకు పదును పెట్టడం మనం చూస్తున్నాం" అని ఆయన చెప్పారు.

అయితే రష్యా నుంచి ఉన్నపళంగా చమురు కొనుగోళ్లను ఆపివేయగలిగే పరిస్థితిలో భారత్ లేదు.

ప్రపంచంలో చమురు అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఇప్పటికే మూడో స్థానంలో ఉంది. భారత్‌లో మధ్య తరగతి వేగంగా పెరుగుతోంది. దీని వల్ల చమురు వినియోగం పెరిగి 2030 నాటికి చైనాను అధిగమించి భారత్ అగ్రస్థానానికి చేరే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేస్తోంది.

భారత్ చమురు దిగుముతల్లో 30 శాతం రష్యా నుంచే వస్తోంది. 2021-22లో ఇది ఒక శాతం కంటే తక్కువగా ఉంది.

యుక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా మద్దతిస్తోందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. అయితే దిల్లీ దీన్ని తిరస్కరిస్తోంది. రష్యా నుంచి రాయితీ ధరలకు ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా దేశంలో కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను కాపాడుతున్నామని చెబుతోంది.

"ఎలాంటి వాతావరణంలోనైనా" రష్యా ఆధారపడదగిన భాగస్వామి అని భారత్ భావిస్తోంది.

భారత్ ఎప్పుడు సంక్షోభంలో పడినా మాస్కో అండగా నిలుస్తూ వస్తోంది. భారత ప్రజల నుంచి రష్యాకు విస్తృతంగా మద్దతు లభిస్తోంది.

అంతే కాదు, భారత్‌కు రష్యా అతి పెద్ద ఆయుధాల సరఫరాదారు. 2016-2020 మధ్య రెండు దేశాల మధ్య 55 శాతం ఉన్న ఆయుధ వాణిజ్యం 2020-2025 మధ్య 36 శాతానికిప పడిపోయినప్పటికీ రష్యా నుంచే భారత్ ఎక్కువగా ఆయుధాలు కొంటోందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్‌ట్యూట్ చెబుతోంది.

భారత్ దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి పెంచడం, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ నుంచి కూడా ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల భారత ఆయుధ కొనుగోళ్లలో రష్యా వాటా తగ్గింది.

అయితే భారత్ రక్షణ వ్యూహంలో రష్యా పాత్రను ఎంత మాత్రం తక్కువ చేసి చూడలేం. దీనిని పశ్చిమ దేశాలు అర్థం చేసుకున్నాయి. భారత్- రష్యా బంధాన్ని ఎన్నడూ అవి సవాలు చేయలేదు. అయితే ట్రంప్ మాత్రం దీన్ని బద్దలు కొట్టాలని భావిస్తున్నారు.

పుతిన్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

రాత్రికి రాత్రే ఏమీ అయిపోదు

రష్యాతో బలమైన బంధం ఉన్నప్పటికీ పశ్చిమ దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో భారత్ విజయవంతంగా నెట్టుకు రాగలిగింది.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా అధిపత్యానికి వ్యతిరేకంగా భారత్‌ రక్షణ కవచమని అమెరికా చాలా కాలంగా భావిస్తోంది. అందుకే అనేక అంశాల్లో భారత్‌కు మద్దతిస్తోంది.

అమెరికా, పశ్చిమ దేశాలతో సంబంధాల విషయంలో రష్యా ఎన్నడూ భారత్‌తో కఠినంగా వ్యవహరించలేదు.

అయితే ప్రస్తుతం ట్రంప్ ఈ పరిస్థితుల్ని సవాలు చేస్తున్నారు. దీనిపై దిల్లీ స్పందన భారత్- అమెరికా సంబంధాల భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.

ఈ పరిస్థితులను భారత్ అంచనా వేసినప్పటికీ, పూర్తిగా వెనక్కి తగ్గడం లేదు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వం కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని అమెరికా తమకు చెప్పిందని భారత్ తన ప్రకటనలో పేర్కొంది.

యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఇంధనం, ఎరువులు, ఖనిజాలు, రసాయన ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నాయని, తమను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని భారత్ అంటోంది.

పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నప్పటికీ, అంతా ముగిసి పోలేదని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. భారత్ అమెరికా మధ్య కొన్ని రంగాలకు సంబంధించి బలమైన బంధం ఉంది. వాటిని రాత్రికి రాత్రే తెంచుకోవడం సాధ్యమైన పని కాదు.

భారత్

ఫొటో సోర్స్, NASA

అమెరికా, భారత్ మధ్య ఎక్కడెక్కడ సహకారం ఉంది?

అంతరిక్ష సాంకేతికత, ఐటీ, విద్య, రక్షణ రంగాల్లో భారత్ అమెరికా మధ్య సన్నిహత సహకారం ఉంది.

భారత్‌కు చెందిన అనేక ఐటీ సంస్థలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టాయి. అలాగే సిలికాన్ వ్యాలీకి చెందిన సంస్థలు భారత్‌లో తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి.

"రెండు దేశాల బంధానికి సంబంధించిన పునాదులు బలహీనంగా లేవని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ భారత్‌ దిగుమతులపై 25శాతం సుంకాలు, జరిమానాలను ప్రకటించిన రోజున రెండు దేశాలు కలిపి అభివృద్ధి చేసిన శాటిలైట్‌ను భారత రాకెట్‌ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది" అని మిశ్రా చెప్పారు.

ట్రంప్ పదునైన వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.

"విదేశాంగ విధానంలో ట్రంప్ పూర్తిగా క్షమాపణకు తావు లేని లావాదేవీల ధోరణితో కమర్షియల్‌గా వ్యవహరిస్తారు. అమెరికాకు సన్నిహిత భాగస్వామి భారత్‌ను దూరం చేసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ, తన కఠినమైన వ్యూహాలను ప్రయోగించే విషయంలో ఆయనకు ఎలాంటి సంకోచం ఉండదు" అని కుగెల్‌మాన్ చెప్పారు.

అయితే గత రెండు దశాబ్ధాలుగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను బట్టి చూస్తే ఈ భాగస్వామ్యంపై చాలా నమ్మకం ఉందని ఆయన అన్నారు.

"కాబట్టి, కోల్పోయిన దాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇందుకు చాలా సమయం పట్టవచ్చు" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)