అక్కడ ఇల్లు కొంటే.. 150 దేశాలకు వీసాలేకుండా ప్రయాణించే అవకాశం

ఫొటో సోర్స్, Nadia Dyson
- రచయిత, గెమ్మ హ్యాండీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తూర్పు కరేబియన్ దీవులలో ఆస్తిని కొనుగోలు చేసేవారికి అక్కడి ప్రభుత్వాలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. అక్కడ ఒక ఇల్లు కొన్న వారికి ఆ దేశ పాస్‌పోర్ట్ లభిస్తుంది.
ఈ ప్రాంతంలోని ఐదు ద్వీప దేశాలైన ఆంటిగ్వా బార్బుడా, డొమినికా, గ్రెనడా, సెయింట్ కిట్స్ నెవిస్, సెయింట్ లూసియా వివిధ పద్ధతుల ద్వారా పౌరసత్వాన్ని అందిస్తున్నాయి.
మీరు దాదాపు రూ. 1.75 కోట్లు పెట్టుబడి పెడితే ఈ దేశాలలో పౌరసత్వం (సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్‌మెంట్) లభిస్తుంది. అంతేకాదు, అక్కడ ఇల్లు కొన్నవారికి పాస్‌పోర్ట్ కూడా అందిస్తున్నారు. ఈ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా యూకే సహా 150 దేశాలకు ప్రయాణించవచ్చు.


ఫొటో సోర్స్, Getty Images
పన్నులు తక్కువ
సంపన్నులు ఈ దేశాలలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడానికి మరొక కారణం ఉంది. ఈ దీవులలో మూలధన లాభాలు, వారసత్వాలపై పన్నులు విధించవు.
కొన్ని సందర్భాల్లో, ఆదాయంపై కూడా పన్ను ఉండదు. కాబట్టి, ఈ ప్రయోజనాలన్నీ సహజంగానే పెట్టుబడిదారులకు భారీ ఆకర్షణ.
అంతేకాదు, కొత్త పౌరసత్వాన్ని పొందడానికి మీ ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవాల్సిన అవసరమూ లేదు.
ఆంటిగ్వాలో పౌరసత్వం కోసం ఇల్లు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని, ఈ డిమాండ్‌ను తట్టుకోవడంలో ఎస్టేట్ ఏజెంట్లు ఇబ్బంది పడుతున్నారని అక్కడ విలాసవంతమైన ఆస్తిని కలిగి ఉన్న నడియా డైసన్ అనే వ్యక్తి చెప్పారు.
"ఇక్కడ ఆస్తి కొనాలనుకునే వారిలో 70 శాతం మంది పౌరసత్వం పొందాలను కుంటున్నారు. వారిలో ఎక్కువగా అమెరికా నుంచే వచ్చారు" అని డైసన్ బీబీసీతో చెప్పారు.
"మేం వారితో రాజకీయాలపై చర్చించలేదు కానీ, అమెరికాలోని ప్రస్తుత అస్థిర రాజకీయ పరిస్థితి కూడా ఇక్కడ పెట్టుబడికి ప్రధాన కారణం" అని ఆమె అన్నారు.
"గత సంవత్సరం ఈ సమయంలో ఇక్కడ ఆస్తి కొనుగోలుదారులకు విలాసవంతమైన జీవనశైలి మీదే దృష్టి ఉంది. పౌరసత్వంపై తక్కువ ఆసక్తి ఉండేది. కానీ, ఇప్పుడు వారందరూ, 'నాకు ఇంటితో పాటు పౌరసత్వం కావాలి' అంటున్నారు. మేం ఇన్ని ఇళ్లను ఎప్పుడూ అమ్మలేదు" అని డైసన్ అంటున్నారు.
ఆంటిగ్వా పౌరసత్వ విధానం నివాసాన్ని తప్పనిసరి చేయనప్పటికీ, చాలామంది కొనుగోలుదారులు శాశ్వతంగా మారాలనుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
"కొంతమంది ఇప్పటికే వచ్చేశారు" అని డైసన్ స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న దరఖాస్తులు
గత సంవత్సరం కరేబియన్ దీవులలో పెట్టుబడి ద్వారా పౌరసత్వం(సీబీఐ) కోసం దరఖాస్తు చేసుకున్న అమెరికా పౌరుల సంఖ్య అత్యధికంగా ఉందని హెన్లీ అండ్ పార్టనర్స్ తెలిపింది.
హెన్లీ అండ్ పార్టనర్స్ కంపెనీ యూకేకు చెందిన ఒక ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ ఎక్స్‌పర్ట్.
ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల కార్యాలయాలున్న ఈ సంస్థ చెబుతున్నదాని ప్రకారం, అమెరికాతో పాటు, యుక్రెయిన్, తుర్కియే, నైజీరియా, చైనా పౌరులు కరేబియన్ దీవులలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడంలో ముందంజలో ఉన్నారు.
2024 నాలుగో త్రైమాసికం నుంచి, కరేబియన్ దీవులలో పెట్టుబడి ద్వారా పౌరసత్వం(సీబీఐ) కోసం దరఖాస్తుల సంఖ్య మొత్తం 12 శాతం పెరిగిందని కూడా ఏజెన్సీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికన్లే ఎక్కువ
తుపాకీ హింస నుంచి యూదు వ్యతిరేకత వరకు ప్రతిదీ అమెరికన్లలో ఉద్రిక్తత, అనిశ్చితిని సృష్టిస్తోందని హెన్లీ అండ్ పార్టనర్స్‌కు చెందిన డొమినిక్ వోలెక్ అంటున్నారు.
"నిజానికి సుమారు 10-15 శాతం మంది ప్రజలు వలస వెళతారు. వారిలో చాలామందికి, ఈ పౌరసత్వం ఇన్సూరెన్స్ లాంటిది. మరొక పౌరసత్వం పొందడం వారికి మంచి ప్రత్యామ్నాయ ప్రణాళిక అవుతుంది" అని డొమినిక్ చెప్పారు.
వ్యాపారవేత్తలు కరేబియన్ పాస్‌పోర్ట్‌లను పొందాలనుకుంటున్నారని డొమినిక్ అన్నారు. ఎందుకంటే అవి ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని, మరింత సౌకర్యవంతంగా చేస్తాయన్నారు.
కరోనా సంక్షోభానికి ముందు, హెన్లీ అండ్ పార్టనర్స్‌కు అమెరికా ఎప్పుడూ దృష్టి లేదని డొమినిక్ వోలెక్ చెప్పారు.
ప్రైవేట్ జెట్లలో స్వేచ్ఛగా ప్రయాణించే సంపన్నులకు కోవిడ్ సమయంలో విధించిన ప్రయాణ ఆంక్షలు ‘‘దిగ్భ్రాంతికరం’’ అని నిరూపించాయి, ఇది కరేబియన్ దేశాలలో 'పెట్టుబడి ద్వారా పౌరసత్వం' కోసం దరఖాస్తులు తొలిసారి పెరుగుదలకు కారణమైంది. ఆ తర్వాత 2020, 2024 అమెరికా ఎన్నికల తర్వాత, ఈ కరేబియన్‌లో పౌరసత్వం పొందడానికి ప్రజల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది.
ఇందులో "డోనల్డ్ ట్రంప్‌ను ఇష్టపడని డెమొక్రటిక్ పార్టీ సభ్యులు లేదా మద్దతుదారులు ఉన్నారు. అదే సమయంలో, డెమొక్రట్లను ఇష్టపడని రిపబ్లికన్‌లూ ఉన్నారు" అని డొమినిక్ చెప్పారు.
"గత రెండేళ్లలో అమెరికాలో మా వ్యాపారం గణనీయంగా విస్తరించింది. అంతకుముందు మా కంపెనీకి అక్కడ కార్యాలయం కూడా లేదు. ఇప్పుడు, అమెరికాలోని ప్రధాన నగరాల్లో మేం ఎనిమిది కార్యాలయాలను తెరిచాం. రాబోయే నెలల్లో మరో రెండు నుంచి మూడు కార్యాలయాలు తెరవబోతున్నాం" అని డొమినిక్ అన్నారు.
కెనడాలోని హాలిఫాక్స్‌లో నివసించే రాబర్ట్ టేలర్ ఈ సంవత్సరం చివరి నాటికి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ఆంటిగ్వాలో ఒక ఆస్తిని కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ పరిమితి రూ.2.6 కోట్లకు పెంచక ముందే అంటే గత వేసవిలో ఆయన రూ. 1.75 కోట్లు పెట్టుబడి పెట్టారు.
ఈ కరేబియన్ దేశాల పౌరుడిగా మారితే ఎంతకాలం నివసించాలనే దానిపై నిబంధనలు లేకపోవడం అనుకూలిస్తుందని, వ్యాపార అవకాశాలకు స్వేచ్ఛను ఇస్తుందని ఆయన అంటున్నారు.
"నేను ఆంటిగ్వాలో పౌరసత్వం పొందాను ఎందుకంటే, ఇక్కడ అందమైన బీచ్‌లు ఉన్నాయి. ప్రజలు చాలా స్నేహపూర్వకంగా కనిపించారు. వాతావరణం కూడా గొప్పగా ఉంది. కాబట్టి నా జీవితాంతం గడపడానికి అనువైనది" అని రాబర్ట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, ఈయూ ఆందోళన
ఈ పౌరసత్వ విధానం చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. 2012లో అప్పటి ఆంటిగ్వా ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి 'పెట్టుబడి ద్వారా పౌరసత్వం' మంజూరు చేయాలని ప్రతిపాదించింది.
కొంతమంది స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ, ఇది తమ గుర్తింపును అమ్ముకున్నట్లుగా ఉందన్నారు.
పౌరసత్వాన్ని అమ్మకపు వస్తువుగా పరిగణించరాదని సెయింట్ విన్సెంట్ ప్రధాన మంత్రి రాల్ఫ్ గోన్సాల్వ్స్ వంటి ఇతర కరేబియన్ నాయకులు కూడా సూచించారు.
అంతేకాదు, బలహీనమైన తనిఖీల వల్ల నేరస్థులు వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి వీలుకల్పించవచ్చనే ఆందోళనలూ తలెత్తాయి. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ బెదిరించింది కూడా. ఈ విధానం ఆర్థిక నేరాలకు అవకాశం కల్పిస్తుందని అమెరికా ఆందోళనను వెలిబుచ్చింది.
దీంతో, ఆయా దీవులు భద్రతను మెరుగుపరుస్తున్నాయి. పౌరసత్వం విషయంలో బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్,ఇంటర్వ్యూలు వంటి కఠినమైన నియమాలను జోడించాయి.
కరేబియన్ దీవుల నాయకులు ఈ విధానాలను సమర్థించుకుంటున్నారు. అవి ఆర్థిక వ్యవస్థను పెంచుతాయని జీడీపీలో 10–30 శాతం తీసుకువస్తాయని, ఆసుపత్రులు, పెన్షన్లు, విపత్తు పునరుద్ధరణకు నిధులు సమకూరుస్తాయని చెబుతున్నారు.
దేశంలోని పెట్టుబడి ద్వారా పౌరసత్వం (సీబీఐ) విధానానికి చాలామంది మద్దతు ఇస్తున్నారని సెయింట్ కిట్స్‌లోని జర్నలిస్ట్ ఆండ్రీ హుయ్ చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎలా సహాయపడుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














