కొల్హాపూర్ - ప్రాడా వివాదం ఇండియాకు ఏం నేర్పుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయా మాటీన్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
ఎన్నో గొప్ప కళాత్మక సంప్రదాయాలకు నెలవైన భారత్ వాటిని ఆదాయ వనరులుగా మార్చుకోలేక నష్టపోతోంది. ఫ్యాషన్ దిగ్గజాలు భారత్‌తో ఎలా వ్యవహరిస్తున్నాయనేది ఇటీవల ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ 'ప్రాడా' చుట్టూ ముసిరిన వివాదం స్పష్టం చేసింది.
జూన్‌లో ప్రాడా సంస్థ మోడళ్లు ప్రదర్శించిన చెప్పులు, భారత్‌లో తోలుతో తయారుచేసే కొల్హాపురి చెప్పుల్లా ఉండడంతో ఆ సంస్థ ఇబ్బందుల్లో పడింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శతాబ్దాలుగా ఈ చెప్పులను తయారు చేస్తుండటంతో, ఈ చెప్పులకు కొల్హాపురి అనే పేరు వచ్చింది.
అయితే, ఆ డిజైన్ల మూలాలను సంస్థ పేర్కొనకపోవడంపై స్థానిక కళాకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

వివాదం ముదురుతుండడంతో, చెప్పుల డిజైన్ల మూలాలను అంగీకరిస్తూ ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక కళాకారులతో కలిసి చర్చలు జరిపేందుకు తాము సిద్ధమన్నట్లు సంస్థ తెలిపింది.
గత కొన్ని రోజులుగా ప్రాడా సంస్థకు చెందిన ఒక బృందం కొల్హాపూర్‌లో ఈ చెప్పులను తయారు చేసి విక్రయించే కళాకారులను, దుకాణదారులను కలిసి వీటి గురించి తెలుసుకుంది.
ఈ పరిశ్రమకు చెందిన ప్రముఖ వాణిజ్య గ్రూప్ మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్‌తో జరిగిన సమావేశం విజయవంతంగా ముగిసినట్లు ప్రాడా బీబీసీకి చెప్పింది.
ప్రాడా భవిష్యత్తులో కొల్హాపురి చెప్పుల తయారీదారులతో కలిసి పనిచేయవచ్చని ఈ ప్రకటన సూచిస్తోంది.
అయితే, వీరి కొలాబరేషన్ ఎలా ఉండబోతుందన్న విషయంపై స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, ANI
ఒక ప్రపంచ ఫ్యాషన్ దిగ్గజం స్థానిక చేతి వృత్తుల కళాకారులకు క్రెడిట్ ఇవ్వలేదని ఒప్పుకోవడం చాలా అరుదు. భారతదేశం, దక్షిణాసియా నుంచి ప్రేరణ పొంది తిరిగి ఆవిష్కరించే ఫ్యాషన్ ప్రొడక్ట్‌ల విషయంలో చాలా పెద్ద బ్రాండ్లు మూలానికి క్రెడిట్ ఇవ్వడం లేదని తరచూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో రిఫార్మేషన్, హెచ్&ఎం విడుదల చేసిన డిజైన్లు తీవ్ర చర్చకు దారితీశాయి. దక్షిణాసియా వస్త్రాలను ప్రేరణగా తీసుకుని ఈ అవుట్‌ఫిట్లను తయారు చేసినట్లు ఉందని చాలామంది అన్నారు.
అయితే, ఈ రెండు బ్రాండ్లు ఆ తర్వాత తమ ప్రకటనలను విడుదల చేశాయి. హెచ్&ఎం ఈ ఆరోపణలను ఖండించగా.. రిఫార్మేషన్ మాత్రం ఈ కలెక్షన్ కోసం కొలాబోరేట్ అయిన మోడల్‌కు చెందిన అవుట్‌ఫిట్‌ను ప్రేరణగా తీసుకుని దీన్ని డిజైన్ చేసినట్లు తెలిపింది.
ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పారిస్ కలెక్షన్‌లో గోల్డ్, ఐవరీ హౌండ్‌స్టూత్ కోటును ప్రదర్శించడంతో డియోర్ కూడా విమర్శల పాలైంది.
ఈ కోటు తయారీలో ఉపయోగించిన ముకైష్ వర్క్.. ఉత్తర భారతంలోని శతాబ్దాల నాటి మెటల్ ఎంబ్రాయిడరీ టెక్నిక్ అని చాలామంది అన్నారు.
అయితే, ఈ చేతి కళలకు చెందిన మూలాలను లేదా భారత్ పేరును డియోర్ పారిస్ కలెక్షన్ ప్రస్తావించలేదు.
దీనిపై స్పందన కోసం డియోర్‌ను బీబీసీ సంప్రదించింది.

సంస్కృతి, సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందే ప్రతి బ్రాండ్ తప్పుడు ఉద్దేశంతో ఇలా చేయదని కొందరు నిపుణులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైనర్లు అన్ని వేళల్లో కూడా వివిధ రకాల సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందుతూ.. వాటిని ప్రపంచస్థాయికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
తీవ్ర పోటీగల ఈ ఫ్యాషన్ ప్రపంచంలో, బ్రాండ్లకు కూడా వారి ఎంపికలకు అనుగుణంగా సాంస్కృతిక కోణంలో ఆలోచించేందుకు తగినంత సమయం ఉండటం లేదు.
కానీ, దేనినైనా ప్రేరణగా తీసుకున్నప్పుడు, ముఖ్యంగా అత్యంత శక్తిమంతమైన గ్లోబల్ బ్రాండ్లు వాటి ఆలోచనలను పునరుద్ధరించి, ఎక్కువ ధరలకు అమ్మేటప్పుడు వాటికి తగినంత గుర్తింపు, గౌరవం ఇవ్వాలని విమర్శకులు అంటున్నారు.
''క్రెడిట్ ఇవ్వడం డిజైన్ బాధ్యతలో భాగం. డిజైన్ స్కూల్‌లో మీకు అది నేర్పిస్తారు. దీని గురించి బ్రాండ్లు కూడా వాటికవే అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది.'' అని వాయిస్ ఆఫ్ ఫ్యాషన్ ఎడిటర్-ఇన్-చీఫ్ షెఫాలీ వాసుదేవ్ చెప్పారు. అలా చేయకపోతే, బ్రాండ్లు ప్రేమిస్తోన్న ప్రపంచంలో భాగమైన సాంస్కృతిని వారు నిర్లక్ష్యం చేసినట్లేనని అన్నారు.

మారుతున్న లగ్జరీ మార్కెట్ అంచనాలు..
భారత లగ్జరీ మార్కెట్ సైజు అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. కానీ, ప్రస్తుతం దీన్నొక అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా చూస్తున్నారు.
భారత్‌లో 2032 నాటికి లగ్జరీ రిటైల్ మార్కెట్ సుమారు రెండింతలు అయి 1,400 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు చెందిన నిపుణులు చెప్పారు. మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు విస్తరిస్తుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ బ్రాండ్లు భారత్‌పై కన్నేశాయి. భారత్‌ను వారొక కీలకమైన మార్కెట్‌గా చూస్తున్నారు.ఇతర ప్రాంతాల్లోఉన్న బలహీనమైన డిమాండ్‌ను భారత్ ద్వారా అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నారు.
హైఎండ్ లగ్జరీ ఫ్యాషన్‌కు భారత్‌ను అంత పెద్ద మార్కెట్‌గా చాలా బ్రాండ్లు చూడటం లేదని కన్సల్టెన్సీ సంస్థ టెక్నోపాక్ చైర్మన్ అర్వింద్ సింఘాల్ చెప్పారు.
ఇటీవల కాలంలో, చాలా ఫ్లాగ్‌షిప్ లగ్జరీ స్టోర్లు హైఎండ్ మాల్స్‌లో తెరుచుకున్నాయి. కానీ, ఆ స్టోర్లకు పెద్దగా జనాలు వెళ్లడం లేదు.
'' ప్రాడా లాంటి సంస్థలు ఇప్పటికీ చాలామంది భారతీయులకు అందనంత దూరమే. అత్యంత ధనికుల్లో కొంత డిమాండ్ ఉంది. కానీ, తొలిసారి ఈ స్టోర్లను సందర్శించే కస్టమర్లు చాలా తక్కువ'' అని సింఘాల్ చెప్పారు.
దిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సంప్రదాయంగా భారత్ ఒక మార్కెట్‌గా ఉండటం కంటే తయారీ హబ్‌గా ఉండేది. పారిస్, మిలాన్‌లోని అత్యంత ఖరీదైన బ్రాండ్లు భారతీయ చేతి వృత్తుల కళాకారులను నియమించుకుని తమ గార్మెంట్ల తయారీకి, ఎంబ్రాయిడరీకి ఉపయోగించేవి.
'' అయితే, దీనర్థం చరిత్రను, దాని వెనుకున్న సందర్భాన్ని అర్థం చేసుకోకుండా సంస్కృతిని నిర్మొహమాటంగా వాడుకుని లక్షల డాలర్లకు బ్రాండ్ చేయాలని కాదు'' అని అన్నారు.
''చైనా లాగా అత్యంత వేగంగా ఎదుగుతోన్న లగ్జరీ మార్కెట్ మనం కాకపోవచ్చు. కానీ, ప్రస్తుత యువతరం, అధునాతన తరాల వారికి భిన్నమైన రుచులు, ఆసక్తులు ఉన్నాయి. ఇవే లగ్జరీ మార్కెట్ రూపురేఖలను మార్చుతున్నాయి.'' అని టాటా క్లిక్ లగ్జరీ ఎడిటర్-ఇన్-చీఫ్ నోనితా కర్లా చెప్పారు.
ప్రాడా విషయంలో చూసుకుంటే, తన తప్పును దిద్దుకునేందుకు ఎంత దూరం వెళ్లిందో చూస్తే.. నిజంగానే ఆ బ్రాండ్ లోపాన్ని సరిచేసుకున్నట్లు అనిపించిందన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రాడా వివాదం ఏం చెబుతోంది?
సమస్య చాలా విస్తృతమైందని, ఒకే రకమైన లక్షణాలు, అభిప్రాయాలు, వైఖరి ఉన్న వ్యక్తులకు చెందిన సంస్థలు నడిపే పశ్చిమ దేశాల బ్రాండ్లు ప్రపంచంలోని ఇతర దేశాలను కూడా విదేశీ కోణంలోనే చూస్తున్నాయని కర్లా అన్నారు.
ఫ్యాషన్ పరిశ్రమలో వైవిధ్యత లోపించడం అనేది అతిపెద్ద లోపం అని ఆమె చెప్పారు. దాన్ని మార్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను బ్రాండ్లు నియమించుకోవాలని సూచించారు.
''కానీ, భారతీయ వారసత్వంపై వారికున్న ప్రేమ, గౌరవం నిజమైంది'' అని చెప్పారు.
అయితే, ఈ సంస్కృతి, సంప్రదాయాలను వారెలా ఉపయోగిస్తున్నారన్నదే క్లిష్టమైన ప్రశ్న.
అయితే, దీనికి అంత తేలికైన సమాధానం లేనప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి సవాలును ఎదుర్కోని పలు బ్రాండ్లు, డిజైనర్ల నుంచి మెరుగైన జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసేందుకు ప్రాడా చుట్టూ నెలకొన్న వివాదం మంచి ప్రారంభ సూచిక అని కొందరు భావిస్తున్నారు.
ఇది భారత్‌కు ఒక మంచి అవకాశం. తన సొంత వారసత్వానికి మద్దతు ఇస్తూ, వాటిని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలను ఇది ప్రతిబింబిస్తోంది.
ఒక ప్రొడక్ట్‌ను పూర్తి చేసేందుకు చేతి వృత్తుల కళాకారులు వారాలు లేదా నెలలు శ్రమిస్తారు. కానీ, వారు తరచూ సరైన సదుపాయాలు లేని పరిస్థితుల్లో ఈ పనులు చేస్తుంటారు. ఇంటర్నేషనల్ ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ చట్టాల కింద వారికి పనికి సరైన రక్షణ దొరకడం లేదు.
'' మన సొంత కళాకారులకు తగినంత గౌరవాన్ని, క్రెడిట్‌ను ఇవ్వం. వారిని గుర్తించి, ప్రోత్సహించడంలో విఫలమవుతాం. దీనివల్ల, తేలికగా ఇతరులు దానినుంచి ప్రయోజనం పొందుతున్నారు.'' అని వాసుదేవ్ అన్నారు.
''అయితే, మనకు ఉన్న సమస్య ఏంటంటే.. భారత్‌లో చాలా ఎక్కువ కళలు ఉన్నాయి. వందల రకాల క్రాఫ్ట్ టెక్నిక్స్, సంప్రదాయాలు ఉన్నాయి. ప్రత్యేక రకమైన విధానాలు, డిజైన్లు ఉన్న ప్రతి కళావృత్తి కూడా ఎన్నో శతాబ్దాల కాలం నాటిది.'' అని చేతివృత్తులను, కళాకారులను ప్రోత్సహించే దస్తకర్ చైర్‌పర్సన్ లైలా త్యాబ్జి చెప్పారు.
''పూర్తిగా డిజైన్ చేసిన చెప్పులను కొనేందుకు మనం బేరమాడుతూ ఉంటాం. కానీ, అంతకంటే పదింతలు ఎక్కువ ధరకు నైకా ట్రైనర్ల నుంచి కొనేందుకు మాత్రం మనకు ఎలాంటి సమస్య ఉండదు. '' అని అన్నారు.
''అయితే, మన కళాకారులకు గౌరవాన్ని ఇచ్చి, వారిని అభినందించినప్పుడు మాత్రమే నిజమైన మార్పు వస్తుంది. వారి కష్టాన్ని దోపిడీ కాకుండా ఎదుర్కొనే సాధనాలు మన దగ్గర ఉన్నాయి.'' అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














