ట్రంప్, పుతిన్: ఢీకొంటారా, డీల్ చేసుకుంటారా?

ఫొటో సోర్స్, REUTERS/Jorge Silva
- రచయిత, స్టీవ్ రోసెన్‌బర్గ్
- హోదా, రష్యా ఎడిటర్
డోనల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య సంబంధాలు పట్టాలు తప్పుతున్నాయా? ఓ రష్యా పత్రిక అలాగే భావిస్తోంది. వీరిద్దరి మధ్య సంబంధాలకు ఆ పత్రిక రైళ్లను ప్రతీకగా ఎంచుకుంది.
''రెండూ ఢీకొనడం తప్పదనిపిస్తోంది'' అని మోస్కోవ్‌స్కీ కామ్సోమోలెత్స్ అనే టాబ్లాయిడ్ ఇటీవలి సంచికలో తెలిపింది.
''ట్రంప్ రైలు, పుతిన్ రైలు ఎదురెదురుగా వేగంతో వస్తున్నాయి.అవి పక్కకు తప్పుకోలేవు, ఆపలేం, వెనక్కు వెళ్లవు''.
'పుతిన్ రైలు' యుక్రెయన్ యుద్ధంతో 'ప్రత్యేక సైనిక చర్య' పేరుతో ముందుకు వెళుతోంది. శత్రుత్వాన్ని కట్టిపెట్టడానికి, దీర్ఘకాల కాల్పుల విరమణను ప్రకటించడానికి పుతిన్ ఆసక్తి చూపడం లేదు.
మరోవైపు 'ట్రంప్ రైలు' డెడ్‌లైన్లు, హెచ్చరికలు, అదనపు ఆంక్షల బెదిరింపులతో మాస్కో యుద్ధం ముగించేలా ఒత్తిడి చేస్తోంది.దీంతోపాటు రష్యా వాణిజ్యభాగస్వాములైన ఇండియా, చైనాలాంటి దేశాలపై భారీ సుంకాలు విధిస్తోంది.
వీటన్నింటికితోడు అమెరికాకు చెందిన రెండు అణుజలంతర్గాములను రష్యాకు సమీపంలో మోహరించామని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు.
మనం రైళ్ల నుంచి అణుజలంతర్గాముల వరకు మాట్లాడుకునేలా మారామంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.
మరి నిజంగా దీనర్థం శ్వేతసౌధం యుక్రెయిన్ విషయంలో క్రెమ్లిన్‌ను ''ఢీకొనే మార్గంలో ఉందనా?'' లేదంటే డోనల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ వారం మాస్కోలో పర్యటించడం రష్యా, అమెరికా మధ్య ఘర్షణను ముగించే ఒప్పందం సాధ్యమేననడానికి సంకేతమా?


ఫొటో సోర్స్, REUTERS/Kevin Lamarque
ఇద్దరూ ఒకే మార్గంలో..ఒకే దిశలో..
రెండోసారి ట్రంప్ అధ్యక్షపగ్గాలు చేపట్టిన తరువాత మాస్కో, వాషింగ్టన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే మార్గంలో ఉన్నట్టుగా కనిపించాయి. ఆ సమయంలో వ్లాదిమిర్ పుతిన్, డోనల్డ్ ట్రంప్ ఒకే దారిలో, ఒకే దిశగా సాగుతున్నట్టు కనిపించారు. యుక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండిస్తూ యూరోపియన్ యూనియన్ రూపొందించిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకిస్తూ, ఫిబ్రవరిలో ఐక్యారాజ్యసమితిలో రష్యా పక్షాన నిలబడింది.
అదే నెలలో ఇరు దేశాల అధ్యక్షులు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఒకరి దేశాన్ని మరొకరు సందర్శించడం గురించి మాట్లాడుకున్నారు. ఈ పరిణామం పుతిన్, ట్రంప్ శిఖరాగ్ర సమవేశం ఏ రోజైనా జరగొచ్చని భావించేలా చేసింది.
మరోపక్క ట్రంప్ అధికారయంత్రాంగం మాస్కోపై కాకుండా కీయేవ్‌పై ఒత్తిడి తెచ్చింది, కెనడా, డెన్మార్క్ వంటి సంప్రదాయ మిత్రదేశాలతోనూ అమెరికా ఘర్షణలకు దిగింది. ఇక ప్రసంగాలు, టీవీ ఇంటర్వ్యూలలో నేటో, యూరప్ నాయకులను అమెరికా అధికారులు తీవ్రంగా విమర్శించేవారు.
ఇదంతా క్రెమ్లిన్‌కు వీనులవిందు.
''ప్రస్తుతం అమెరికాకు రష్యాతో ఉన్న సారూప్యం వాషింగ్టన్ బ్రస్సెల్స్ లేదా కీయేవ్‌తో కలిగి ఉన్న సంబంధాల కన్నా ఎక్కువ'' అని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్‌కు చెందిన రాజకీయ శాస్త్రవేత్త కాన్‌స్టాంటిన్ బ్లోకిన్ మార్చిలో ఇజ్వెస్టియా పత్రికకు చెప్పారు.
మరుసటి నెలలో అదే వార్తాపత్రికలో..
''ట్రంపిస్టులు విప్లవకారులు. వారు వ్యవస్థలను ధ్వంసం చేయాలనే ఉద్దేశం గలవారు. వారికి ఈ విషయంలో మాత్రమే మద్దతు ఇవ్వగలం. పశ్చిమదేశాల ఐక్యత ఇక గతం. రాజకీయ,ప్రాంతీయపరంగా అది మిత్రదేశాల సమూహం కాదు. ట్రాన్స్-అట్లాంటిక్ అనే ఐక్యతను ట్రంపిజం ధైర్యంగా, వేగంగా ధ్వంసం చేసింది''
మరోపక్క డోనల్డ్ ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యాకు తరచూ వచ్చిపోయే సందర్శకుడు అయిపోయారు. రెండు నెలల వ్యవధిలో ఆయన నాలుగుసార్లు వచ్చారు. వ్లాదిమిర్ పుతిన్‌తో గంటలకొద్దీ మాట్లాడారు. ఓ సమావేశం తరువాత అయితే క్రెమ్లిన్ నేత విట్కాఫ్‌కు డోనల్ట్ ట్రంప్ చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చి దానిని శ్వేతసౌధానికి తీసుకువెళ్లమన్నారు.
కానీ ట్రంప్ మాస్కో నుంచి కేవలం చిత్రపటం కాకుండా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు. యుక్రెయిన్‌లో సమగ్ర బేషరతు కాల్పుల విరమణపై ప్రెసిడెంట్ పుతిన్ సంతకం చేయాలని ఆయన కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్‌లో పెరిగిన అసహనం
యుద్దభూమిలో ఆధిపత్యం తనదే అనే విశ్వాసంతో ఉన్న పుతిన్, మాస్కో దౌత్యపరమైన పరిష్కారానికి కట్టుబడి ఉందనే మాటకు విరుద్ధంగా యుద్ధాన్ని ఆపడానికి విముఖంగా ఉన్నారు.
దీనివల్ల డోనల్డ్ ట్రంప్ క్రెమ్లిన్‌పై నానాటికీ విసుగెత్తిపోతున్నారు.
యుక్రెయిన్ నగరాలపై రష్యా ఇటీవల నిరంతరాయంగా చేసిన దాడులను ''అవమానకరం'' ''అప్రతిష్ఠ'' అని ఖండించారు. యుక్రెయిన్‌పై ప్రెసిడెంట్ పుతిన్ ''అర్థరహితంగా'' మాట్లాడుతున్నారని ఆరోపించారు.
50 రోజులలో యుద్ధం ఆపేయకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామని, టారిఫ్‌లు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. తరువాత ఆ గడువును తగ్గించారు. ఈ వారంతానికి గడువు ముగియనుంది. వాషింగ్టన్ ఒత్తిడికి పుతిన్ తలొగ్గినట్టు ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలు కనిపించలేదు.
నిజంగా వ్లాదిమిర్ పుతిన్ ఎంత ఒత్తిడికి గురవుతున్నారు?
"ట్రంప్ చాలా గడువులు మార్చారు. కాబట్టి, పుతిన్ ఆయనను తీవ్రంగా తీసుకుంటారని అనుకోవడం లేదు" అని న్యూయార్క్‌లోని ది న్యూ స్కూల్ లో అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ నినా క్రుశ్చేవా అభిప్రాయపడ్డారు.
యుక్రెయిన్ 'మేం అలసిపోయాం, మీ షరతులను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం' అని చెప్పకపోతే పుతిన్ తనకు వీలైనంత కాలం పోరాడతారు.
"పుతిన్ క్రెమ్లిన్ లో కూర్చొని రష్యా జార్లు, ఆ తర్వాత జోసెఫ్ స్టాలిన్ వంటి ప్రధాన కార్యదర్శుల కలలను నెరవేరుస్తున్నారని, రష్యాను అగౌరవంగా చూడరాదని పాశ్చాత్య దేశాలకు చూపిస్తున్నారని అనుకుంటున్నాను."

ఒప్పందం ఇప్పటికీ సాధ్యమే
పుతిన్, ట్రంప్ రైళ్లు ఢీకొనడం అనివార్యం.
కానీ కచ్చితమని కాదు.
డోనల్డ్ ట్రంప్ తనకు తాను ఓ గొప్ప ఒప్పందకర్తగా చూసుకుంటూ ఉంటారు. అలా చూస్తే ఆయన వ్లాదిమిర్ పుతిన్‌తో ఒప్పంద ప్రయత్నం వదులుకోలేదు.
క్రెమ్లిన్ అధినేతతో చర్చల కోసం స్టీవ్ విట్కాఫ్ ఈ వారం రష్యాకు తిరిగి రానున్నారు. ఆయన తనతో పాటు ఎలాంటి ఆఫర్ తీసుకొస్తారో తెలియదు. కానీ మాస్కోలోని కొందరు వ్యాఖ్యాతలు దీనివల్ల నష్టాల కన్నా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆంక్షల నుంచి తప్పించుకోవడంలో రష్యా చాలా మెరుగ్గా ఉందని అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం వ్యాఖ్యానించిన విషయాన్ని మరిచిపోకూడదు.
మాస్కోలోని ఎంజీఐఎంవో యూనివర్సిటీలో పొలిటికల్ థియరీ అసోసియేట్ ప్రొఫెసర్ ఇవాన్ లోష్కరేవ్ సోమవారం మాట్లాడుతూ.. చర్చలను సులభతరం చేయడానికి, విట్కాఫ్ ‘‘యుక్రెయిన్ పై ఒప్పందం తర్వాత రష్యాకు లభించే ప్రయోజనకరమైన సహకార ప్రతిపాదనలను అందించవచ్చు" అని ఇజ్వెస్టియాకు చెప్పారు.
మూడున్నరేళ్ల యుద్ధం తర్వాత క్రెమ్లిన్‌ను శాంతి ప్రతిపాదనకు ఒప్పించేందుకు ఇది సరిపోతుందా? గ్యారంటీ లేదు.
అయితే యుక్రెయిన్ భూభాగం, యుక్రెయిన్ తటస్థత, యుక్రెయిన్ సైన్యం భవిష్యత్తు పరిమాణం వంటి డిమాండ్ల నుంచి పుతిన్ ఇప్పటివరకు వెనక్కి తగ్గలేదు.
డోనల్డ్ ట్రంప్ ఒప్పందాన్ని కోరుకుంటున్నారు. వ్లాదిమిర్ పుతిన్ విజయాన్ని కోరుకుంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














