భారత్‌పై 50శాతం టారిఫ్ విధించిన ట్రంప్, సరైన చర్య కాదన్న మోదీ ప్రభుత్వం

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Win McNamee/Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకాన్ని విధించారు. ఈ కొత్త టారిఫ్ ఇప్పటికే ఉన్న 25 శాతం టారిఫ్‌తో కలిపి మొత్తం 50 శాతం అవుతుంది

ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, ఈ అదనపు టారిఫ్‌లు 21 రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 27 నుంచి అమలులోకి వస్తాయి.

"భారత ప్రభుత్వం ప్రస్తుతం రష్యా చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకుంటోంది" అని బుధవారం వైట్ హౌస్ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దీని ఆధారంగా, భారతదేశం నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకం విధించాలని అమెరికా నిర్ణయించింది.

"ఇటీవలి కాలంలో, భారత్.. రష్యా నుంచి చేసే చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా దిగుమతులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి, భారతదేశంలోని 1.4 బిలియన్ జనాభాకు ఇంధన భద్రతను నిర్ధరించే లక్ష్యంతో ఉన్నాయి. ఈ అంశాలపై మా వైఖరిని మేం ఇప్పటికే స్పష్టం చేశాం" అని భారత్ పేర్కొంది.

"అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం. అనేక ఇతర దేశాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం అదే పని చేస్తున్నాయి. ఈ చర్య అన్యాయం, అసమంజసమైంది. అహేతుకం అని మేం మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది" అని భారత ప్రభుత్వం పేర్కొంది.

అమెరికా ఈ నిర్ణయం తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్.

‘‘నరేంద్ర మోదీ స్నేహితుడు ట్రంప్ భారతదేశంపై 50% సుంకాలు విధించారు. ట్రంప్ నిరంతరం భారతదేశంపై చర్యలు తీసుకుంటున్నారు, కానీ నరేంద్ర మోదీ ఆయన పేరెత్తరు. నరేంద్ర మోదీ, ధైర్యం చూపించండి. ట్రంప్‌కు సమాధానం చెప్పండి" అని కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది .

"ట్రంప్ విధించిన 50% టారిఫ్ అనేది ఆర్థిక బ్లాక్‌మెయిల్. ఇది భారతదేశాన్ని అన్యాయమైన వాణిజ్య ఒప్పందానికి అంగీకరించేలా ఒత్తిడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నం. ప్రధాని మోదీ తన బలహీనతతో భారత ప్రజల ప్రయోజనాలపై ప్రభావం పడేలా చేయకూడదు" అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో రాశారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా చర్యపై నిపుణులు ఏమంటున్నారు?

దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అధిపతి అజయ్ శ్రీవాస్తవ దీనిపై స్పందించారు.

"ఈ నిర్ణయంతో, భారతదేశం ఇప్పుడు అమెరికా అత్యంత సుంకాలు విధించిన వాణిజ్య భాగస్వాముల జాబితాలో చేరింది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటివాటి కంటే చాలా ఎక్కువ. ఇది భారతదేశం అమెరికాకు వార్షికంగా చేసే 86.5 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో సింహభాగాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది" అని అన్నారు.

2024లో రష్యా నుంచి చైనా 62.6 బిలియన్ డాలర్ల విలువైన చమురును కొనుగోలు చేసిందని, ఇది భారతదేశం కొనుగోలు చేసిన 52.7 బిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ అని, అయినప్పటికీ దానిపై ఎటువంటి జరిమానా విధించలేదని ఆయన అన్నారు.

"అమెరికా రక్షణ, సాంకేతిక రంగాలకు కీలకమైన గాలియం, జెర్మేనియం, రేర్ ఎర్త్స్, గ్రాఫైట్ వంటి ముఖ్యమైన ముడి పదార్థాల సరఫరాను చైనా నియంత్రిస్తుంది కాబట్టి వాషింగ్టన్ చైనాను చూసీచూడనట్లుగా వదిలేస్తోంది" అని అజయ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

"రష్యాతో తన మిత్రదేశాల వాణిజ్యాన్ని కూడా అమెరికా విస్మరించింది. గత సంవత్సరం, యూరోపియన్ యూనియన్ రష్యా నుండి 39.1 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. వాటిలో 25.2 బిలియన్ డాలర్ల విలువైన చమురు కూడా ఉంది. అమెరికా స్వయంగా రష్యా నుండి 3.3 బిలియన్ డాలర్ల విలువైన వ్యూహాత్మక వనరులను కొనుగోలు చేసింది" అని ఆయన అన్నారు.

ఈ సుంకం వల్ల అమెరికన్ మార్కెట్లో భారతీయ వస్తువులు చాలా ఖరీదైనవిగా మారవచ్చని, అమెరికాకు భారత ఎగుమతులు 40 నుండి 50 శాతం తగ్గవచ్చని అజయ్ శ్రీవాస్తవ అంచనా వేశారు.

అమెరికా, రష్యా, భారత్

ఫొటో సోర్స్, Sputnik/Gavriil Grigorov/Pool via REUTERS

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్

పుతిన్‌తో అమెరికా ప్రత్యేక రాయబారి సమావేశం తర్వాత ప్రకటన

ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

యుక్రెయిన్ కాల్పుల విరమణకు రష్యా అంగీకరించడానికి శుక్రవారం గడువు ముగియడానికి ముందే పుతిన్‌ను కలిశారు స్టీవ్ విట్‌కాఫ్.

అంతకుముందు, రష్యా నుంచి అమెరికా యురేనియం, ఎరువులు, రసాయనాలు వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందని తనకు తెలియదని ట్రంప్ అన్నారు.

దీనికి సంబంధించి ట్రంప్‌ను మంగళవారం నాడు విలేఖరులు ఒక ప్రశ్న అడిగారు.

"అమెరికా రష్యా నుండి యురేనియం, రసాయనాలు, ఎరువులు కొనుగోలు చేస్తుందని భారతదేశం చెబుతుంది. కానీ వారి (భారతదేశం) చమురు దిగుమతులను మాత్రం అమెరికా వ్యతిరేకిస్తుంది. దీనికి మీ సమాధానం ఏమిటి?" అని ట్రంప్‌ను విలేఖరులు అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా ట్రంప్, "దీని గురించి నాకేమీ తెలియదు. నేను దాని గురించి తెలుసుకోవాలి. దీని గురించి మీకు తరువాత సమాచారం అందిస్తాము" అని అన్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై త్వరలోనే సుంకాలు విధించే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ ఇటీవలే చెప్పారు.

భారతదేశం రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసి, ఇతర దేశాలకు అమ్మడం ద్వారా లాభాలు ఆర్జిస్తోందని ట్రంప్ ఇటీవలే భారత్ పై ఆరోపణలు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)