ఉత్తర కాశీ: ఖీర్ గంగానది ఉగ్రరూపం, ఈ నది చరిత్ర ఏంటి, ఇది ఎంత ప్రమాదకరం?

ధరాలీ
ఫొటో క్యాప్షన్, ఇది ఉత్తరకాశీలోని ధరాలీ పాత చిత్రం
    • రచయిత, దినేష్ ఉప్రేతీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా సరిహద్దులో ఉన్న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా భారీ ప్రాణనష్టం జరిగి ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో...స్థానికులు అరుస్తూ, ప్రమాదం గురించి హెచ్చరిస్తూ, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవాలని ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవడం కనిపించింది.

బలమైన నీటి ప్రవాహం, ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చిన శిథిలాల కారణంగా ఇళ్ళు, బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా ఎలా కూలిపోయాయో వీడియోలో చూడొచ్చు.

సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని, విపత్తు నిర్వహణ దళాలతో పాటు, సైన్యం, పారామిలిటరీ దళాల సాయం కూడా తీసుకుంటున్నామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది.

అయితే ఇప్పుడు చర్చంతా భాగీరథీ నదిలో కలిసే ఖీర్ గంగా నది గురించే.

భారత సైన్యం, పారామిలిటరీ

ఫొటో సోర్స్, Defence PRO

ఫొటో క్యాప్షన్, భారత సైన్యం, పారామిలిటరీ దళాలు సహాయ కార్యకలాపాలలో నిమగ్నమయ్యాయి.

ధరాలీ ఉత్తరకాశీ జిల్లాలోని ఒక పట్టణం. గంగోత్రికి వెళ్ళే మార్గంలో హర్షిల్ లోయలో ఒక భాగమిది. నాలుగు ధామ్‌లలో ఒకటైన గంగోత్రి ధామ్‌కు తీర్థయాత్రకు వెళ్లే ప్రజలకు విశ్రాంతి తీసుకునే శిబిరాల్లో ఈ లోయ ముఖ్యమైంది కూడా.

గంగోత్రి ఇక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భౌగోళికంగా చూస్తే ఇది సముద్ర మట్టానికి దాదాపు 3100 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రకృతి సౌందర్యానికి పేరుగాంచింది.

ఖీర్ గంగా నది ఎత్తైన హిమాలయాల శిఖరాల నుంచి దిగి ధరాలీ పట్టణంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఏడాది పొడవునా ప్రశాంతంగా, నెమ్మదిగా ప్రవహించినప్పటికీ, వర్షాకాలంలో ఉగ్రరూపం దాల్చుతుంది.

మంగళవారం ఖీర్ గంగను చూసిన చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు గతంలో కూడా ఖీర్ గంగాలో భారీ వరదలు సంభవించాయని చెబుతున్నారు.

"ఖీర్ గంగాలో అత్యంత తీవ్రమైన వరద 1835లో సంభవించింది. ఆ సమయంలో ఖీర్ గంగానది ధరాలీ పట్టణం మొత్తాన్ని ముంచెత్తింది. వరద కారణంగా ఇక్కడ భారీ మొత్తంలో శిథిలాలు పేరుకుపోయాయి. ఇప్పుడు అక్కడ ఉన్న నివాసాలన్నీ ఆ శిథిలాల మీద నిర్మించినవే" అని భూగర్భ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్‌.పి. సతి చెబుతున్నారు.

గడచిన కొన్నేళ్లోలో ఖీర్ గంగాలో తీవ్రమైన వరదలు సంభవించాయి. ఈ వరదల్లో చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయి. కానీ ప్రాణ నష్టం లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వరద
ఫొటో క్యాప్షన్, ఉత్తరకాశీలోని ధరాలీలో ఫ్లాష్ ఫ్లడ్స్‌కి ముందు, తరువాతి చిత్రాలు
ఖీర్ గంగా

ఈ ప్రాంతం చాలా సున్నితమైనదని, కొండచరియలు విరిగిపడటం, హిమపాతాలు వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హిమాలయ చరిత్ర, పర్యావరణంపై నిపుణులైన చరిత్రకారులు డాక్టర్ శేఖర్ పాఠక్ అభిప్రాయపడ్డారు.

"ఈ ప్రాంతం హిమాలయాల చౌఖంభా పశ్చిమ శ్రేణికి చెందినది. 1700 సంవత్సరంలో పర్మార్ రాజవంశం గడ్వాల్‌ను పరిపాలిస్తున్నప్పుడు, ఝాలాలో ఒక పెద్ద కొండచరియ విరిగిపడటంతో 14 కిలోమీటర్ల పొడవైన సరస్సు ఏర్పడింది. దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి, ఎందుకంటే భాగీరథి నది ప్రవాహం ఈ ప్రాంతంలో ఆగిపోయినట్లు కనిపిస్తుంది" అని శేఖర్ బీబీసీతో చెప్పారు.

1978లో, ధరాలీ నుంచి ఉత్తరకాశీ వైపు 35 కి.మీ దూరంలో ఉన్న దబ్రాని దగ్గర ఒక ఆనకట్ట తెగి, భాగీరథి వరదల్లో మునిగిపోయి అనేక గ్రామాలు కొట్టుకుపోయాయని డాక్టర్ పాఠక్ చెప్పారు.

దీని తరువాత, ధరాలీ, పరిసర ప్రాంతాలలో అనేకసార్లు క్లౌడ్ బరస్ట్, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు సంభవించినప్పటకీ, పెద్దగా ప్రాణనష్టం జరగలేదు.

ఖీర్ గంగా పేరుకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనేక కథనాల విషయానికొస్తే, శేఖర్ పాఠక్ వాటిని కేవలం వదంతులుగా కొట్టిపారేస్తారు.

"ఈ నది మొదట హిమానీనదం(గ్లేసియర్) గుండా ప్రవహిస్తుంది, తరువాత దట్టమైన అడవుల గుండా ప్రవహిస్తుంది. కాబట్టి దాని నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అంటే, అనేక ఇతర నదుల మాదిరిగా, ఇందులో సున్నపు నీరు కలవదు. అందుకే దీనిని ఖీర్ (పాయసం లేదా తీపి రుచిగలది) నదిగా పిలుస్తారు" అని ఆయన అన్నారు.

 విధ్వంసం
ఫొటో క్యాప్షన్, ధరాలీ స్థానికులు ఇది భారీ విధ్వంసం అని, దీని వలన ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని చెబుతున్నారు.
ఉత్తరాఖండ్

హిమాలయ ప్రాంతంలో అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలలో క్లౌడ్‌బరస్ట్ ఒకటి. చాలా తక్కువ సమయంలో, కొద్ది ప్రాంతంలో కురిసే భారీ వర్షపాతం కారణంగా ఇది సంభవిస్తుంది.

20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో గంటలో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్‌గా పరిగణిస్తారని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) పేర్కొంది.

వాతావరణ మార్పుల కారణంగా ఈ సంఘటనలు జరిగే అవకాశం నిరంతరం పెరుగుతోందని నిపుణులు అంటున్నారు.

"గతంలో, ఈ ఎత్తైన ప్రాంతాలలో మంచు కురిసేది. హిమానీనదాలు ఏర్పడేవి. చాలా తక్కువ వర్షపాతం ఉండేది. కానీ ఇప్పుడు.. తక్కువ మంచు, ఎక్కవ వర్షం కురుస్తోంది. దీనికి కారణం వాతావరణ మార్పు. దీని ప్రభావం ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల రూపంలో కనిపిస్తుంది" అని శేఖర్ పాఠక్ చెప్పారు.

"క్లౌడ్ బరస్ట్‌ ఘటనలు సాధారణంగా 2000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలలో జరుగుతాయి. వీటిలో హిమాలయాలలోని జనసాంద్రత కలిగిన లోయలు కూడా ఉన్నాయి" అని 2023లో రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం గుర్తించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)