అనిల్ అంబానీ : ఈడీ ముందు ఎందుకు హాజరవుతున్నారు, అసలు ఆయనేం చేశారు?

అనిల్ అంబానీ, యెస్ బ్యాంక్, సెబీ, ఆర్థిక అక్రమాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు అప్పుల్లో చిక్కుకున్నాయి.
    • రచయిత, దినేష్ ఉప్రేతి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అనిల్ అంబానీ. ఒకనాడు లక్షకోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి యజమాని. ప్రస్తుతం ఆయన కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా 35 కి పైగా ప్రదేశాలలో దాడులు చేసింది. పెద్దమొత్తంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విచారణ జరుపుతోంది.

అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ మంగళవారం సమన్లు జారీ చేసింది.

అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని వాటిని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేయనుంది.

నిధులలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలన్నింటినీ అనిల్ అంబానీ గ్రూప్ ఖండించింది. తాము దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రెండు వారాల కిందట అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు, అందులో పని చేస్తున్న అధికారుల నివాసాలపై ఈడీ దాడులు చేసిన తర్వాత, ఈ వ్యవహారంలో అనిల్ అంబానీని ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది.

జులై 24న ఈడీ అధికారులు ముంబయిలోని 35 ప్రాంతాలు, 50 కంపెనీలు, 25 మంది నివాసాలపై మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన రూ.17వేల కోట్లరూపాయలకు పైగా లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కంపెనీలు బ్యాంకుల నుండి పొందిన రుణాలను నకిలీ కంపెనీల ద్వారా బదిలీ చేశాయనే ఆరోపణలు ఉన్నాయి.

అనిల్ అంబానీ, యెస్ బ్యాంక్, సెబీ, ఆర్థిక అక్రమాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాణా కపూర్, తన బంధువైన ఒకరితో కలిసి 2004లో యెస్ బ్యాంక్‌ను ప్రారంభించారు.

యెస్ బ్యాంక్‌తో కుమ్మక్కయ్యారా?

వీటన్నింటితోపాటుగా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు యెస్ బ్యాంక్ నుంచి 2017 నుంచి 2019 మధ్య 3వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నాయి.

ఇందుకు ప్రతిఫలంగా అనిల్ అంబానీ గ్రూప్ బ్యాంక్ ప్రమోటర్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

రుణం ఆమోదం పొందడానికి ముందే బ్యాంక్ ప్రమోటర్లకు నేరుగా డబ్బులు ముట్ట చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. అనిల్ అంబానీ గ్రూప్‌ కంపెనీలకు యెస్ బ్యాంక్ రుణం ఆమోదించడం వెనుక భారీగా అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.

సీబీఐ నమోదు చేసిన రెండు ఎఫ్ఆర్‌ల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. కొన్ని నియంత్రణ సంస్థలు కూడా అనిల్ అంబానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు నివేదికలను సమర్పించాయి.

ఇందులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి.

అనిల్ అంబానీ, యెస్ బ్యాంక్, సెబీ, ఆర్థిక అక్రమాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఫొటో సోర్స్, ADAG

ఫొటో క్యాప్షన్, ఈడీ దాడుల గురించి అనిల్ అంబానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.

అనిల్ అంబానీ గ్రూప్ ఏం చెప్పింది?

నిధులను వేరే కంపెనీలకు మళ్లించడం వెనుక 'మాస్టర్‌మైండ్' అనిల్ అంబానీయేనని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 2024లో జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. అర్హత లేని వ్యక్తులు, సంస్థలకు రుణాలు ఇవ్వరాదని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను హెచ్చరించినట్టు తెలిపింది.

ఈ ఆదేశాల ప్రకారం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇచ్చిన అనేక రుణాలలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో విధానపరమైన, డాక్యుమెంటేషన్ పరమైన నిబంధనలను ఉల్లంఘించారు.

అంతకు ముందు, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ఈడీ దాడుల గురించి ఒక ప్రకటన విడుదల చేసింది.

"ఈడీ దాడుల అన్ని ప్రాంతాల్లోనూ ముగిశాయి. కంపెనీతో పాటు అధికారులంతా దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించారు. భవిష్యత్‌లోనూ ఇదే సహకారం కొనసాగుతుంది. సంస్థ పారిశ్రామిక కార్యకలాపాలు, ఆర్థిక పని తీరు, షేర్ హోల్డర్లు, ఉద్యోగుల మీద ఈడీ దాడుల ప్రభావం ఏమీ లేదు" అని అందులో తెలిపింది.

ఇంకా అందులో "రిలయన్స్ పవర్ ఇండిపెండెంట్ లిస్టెడ్ కంపెనీ. సంస్థ బోర్డులో అనిల్ అంబానీ లేరు. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో దానికి ఎలాంటి సంబంధం లేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2016 నుంచి దివాలా ప్రక్రియలో ఉంది" అని తెలిపింది.

అనిల్ అంబానీ, యెస్ బ్యాంక్, సెబీ, ఆర్థిక అక్రమాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనిల్ అంబానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీలు దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి.

ఎలా వెలుగులోకి వచ్చింది?

రిలయన్స్ క్యాపిటల్‌ ఆర్థిక లావాదేవీల ఆడిటింగ్ బాధ్యతల నుంచి 2019 జూన్‌లో ప్రైస్ వాటర్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) తనంతటతానుగా వైదొలగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

సంస్థలో జరిగిన అనేక లావాదేవీలపై ప్రైస్ వాటర్ కూపర్స్ ప్రశ్నలు లేవనెత్తింది. కొన్ని లావాదేవీల్ని పట్టించుకోలేదని, పరిష్కరించలేదని తెలిపింది. ఇది సంస్థ ఆర్థిక పరిస్థితి మీద భారీ ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది.

రిలయన్స్ క్యాపిటల్ ఆడిటింగ్ బాధ్యతల నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రైస్ వాటర్ కూపర్స్ కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఒక లేఖను అప్‌లోడ్ చేసింది. రిలయన్స్ క్యాపిటల్ ఆర్థిక పరిస్థితులపై ఈ లేఖ అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

అయితే అప్పట్లో అనిల్ అంబానీ గ్రూప్ ప్రైస్ వాటర్ కూపర్స్ లేఖలో పేర్కొన్న అంశాలను కొట్టి పారేస్తూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది.

సంస్థ లెక్కల్ని చూసేందుకు పాఠక్ ‌హెచ్‌డీ అండ్ అసోసియేట్స్‌ను నూతన ఆడిటర్‌గా నియమిస్తున్నట్లు రిలయన్స్ క్యాపిటల్ షేర్ హోల్డర్లకు తెలిపింది.

ఈ సమయంలోనే భారత్‌లో ఆర్థిక మార్కెట్లు కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్‌ఎల్) లాంటి సంస్థలు దివాలా తీశాయి.

ఇలాంటి పరిస్థితుల నడుమ(2017 నుంచి2019 వరకు) బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల మీద విశ్వాసం సడలిపోయిందని ఎకనామిక్ టైమ్స్ బ్యాంకింగ్ ఎడిటర్ సంగీత మెహతా ఒక పాడ్‌కాస్ట్‌ కార్యక్రమంలో చెప్పారు. సరిగ్గా ఈ సమయంలోనే యెస్ బ్యాంక్ రిలయన్స్ క్యాపిటల్‌కు రుణం మంజూరు చేసింది.

రిలయన్స్ క్యాపిటల్ యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ కుటుంబ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్‌కు రుణం మంజూరు చేస్తున్న విషయాన్ని రాణా కపూర్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డుకు తెలియజేయలేదు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలోనూ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చాలా అప్పులు ఉన్నాయి. దీంతో అనిల్ అంబానీ కంపెనీలో ఆర్థిక లావాదేవీలపై సందేహలు లేవనెత్తిన బ్యాంక్ ఆఫ్ బరోడా దర్యాప్తు చేయించింది.

గ్రాంట్ థోర్నటన్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా ఫోరెన్సిక్ ఆడిటర్‌గా నియమించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల్లో జరిగిన అవకతవకలను కూడా తన నివేదికలో ప్రస్తావించింది.

దీని తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పుడీ వ్యవహారం అనిల్ అంబానీని ఈడీ విచారణకు హాజరయ్యే వరకు తీసుకొచ్చింది.

అనిల్ అంబానీ, యెస్ బ్యాంక్, సెబీ, ఆర్థిక అక్రమాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనిల్ అంబానీ అనేక కేసుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు.

పీఎంఎల్ఏ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది?

ఒక సంస్థలో ఆర్ధిక అక్రమాలు జరిగాయని బ్యాంకు గుర్తిస్తే, ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తుంది.

ఈ ఆడిట్‌లో నిధుల మళ్లింపు లేదా మోసపూరిత లావాదేవీల గురించి తెలుస్తుంది.

బ్యాంకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, ఆ రుణాన్ని 'మోసం'గా ప్రకటిస్తుంది.

నేర కార్యకలాపాలు స్పష్టంగా వెల్లడైతే ఈడీ లేదా సీబీఐ దర్యాప్తు మొదలవుతుంది.

పీఎంఎల్ఏలోని సెక్షన్ 3 ప్రకారం, ఒక వ్యక్తి నేరం ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన కార్యకలాపాలలో తెలిసి పాల్గొంటే, అతను 'మనీలాండరింగ్' నేరానికి పాల్పడినట్లు భావిస్తారు.

అనిల్ అంబానీ కేసుకు పీఎంఎల్ఏ వర్తిస్తుందా?

అనిల్ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న సంస్థలు తీసుకున్న రూ.3వేల కోట్ల విలువైన రుణాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

రుణం ఎగ్గొట్టేందుకు ఈ డబ్బును షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అదే జరిగితే మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లు వర్తిస్తాయి.

గతంలో జరిగిన అనేక హై-ప్రొఫైల్ స్కామ్‌లు ఇలాంటి విధానాన్ని అనుసరించాయి:

అవి ఏంటంటే..

దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) - వాధావన్ (రూ.34,000 కోట్లు): ఫేక్ హౌసింగ్ లోన్లు, నిధుల మళ్లింపు.

ఏబీజీ షిప్‌యార్డ్ (రూ.22,842 కోట్లు): ఆస్తి విలువలను పెంచుకుంది. నిధులను విదేశాలకు బదిలీ చేసింది.

రోటోమాక్ పెన్నులు (రూ.3,695 కోట్లు): ఎగుమతి క్రెడిట్ల దుర్వినియోగం

ఐఎల్&ఎఫ్ఎస్: గ్రూపులోని ఇతర కంపెనీలకు రుణాలు ఇచ్చి లెక్కల్ని తారుమారు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)