రేవంత్ రెడ్డి: 'కాళేశ్వరం ప్రాజెక్టులో ఉద్దేశపూర్వకంగా అక్రమాలు, అందుకే సీబీఐ దర్యాప్తు'

ఫొటో సోర్స్, @revanth_anumula
- రచయిత, బళ్ళ సతీశ్, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించిన మేరకు రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెట్టి దీనిపై చర్చించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై జరిగిన చర్చలో భాగంగా సమాధానం ఇచ్చిన ఆయన, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సభలో ప్రకటించారు.
"రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కి పెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజ్‌ల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది" అని రేవంత్ రెడ్డి అన్నారు.
"ఈ ప్రాజెక్టులో అంతరాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో వాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎఫ్‌సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించేందుకు సభ నిర్ణయం తీసుకుంటున్నది తమరి అనుమతితో అధ్యక్షా. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండటం వల్ల సీబీఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడమైనది" అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కమిషన్‌పై చర్చలో భాగంగా సీఎం ప్రకటనకు ముందు బీఆర్ఎస్ తరపున హరీష్‌రావు మాట్లాడారు.
కమిషన్ రిపోర్ట్‌ను రద్దు చేయాలని తానూ, కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశామని, కోర్టు స్టే ఇస్తుందని ఊహించే ప్రభుత్వం హడావుడిగా అసెంబ్లీలో చర్చ పెట్టిందని ఆరోపించారు.
"ప్రభుత్వం ఆదరా బాదరగా ఆదివారం అసెంబ్లీ పెట్టి జస్టిస్ ఘోష్ నివేదికను ప్రవేశ పెట్టడం అంటేనే, వీళ్ల బురద రాజకీయం అర్థమవుతోంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం 8బీ, 8సీ ఇవ్వకుండా, నిబంధనలు అనుసరించలేదని మేము కోర్టుకు వెళ్లాం. అది మాకు రాజ్యాంగబద్దంగా దక్కిన ప్రాథమిక హక్కు" అని హరీష్ రావు అన్నారు.
జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ చెత్త రిపోర్టని హరీష్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై సీబీఐ విచారణ వేయడం మంచిదేనని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఆర్ధిక మంత్రిగా పనిచేశారు.
‘‘వాళ్లకి చేతకాదని తెలుసు, వాళ్ల రిపోర్టు తప్పుల తడక అని తెలుసు, వాళ్ల రిపోర్టు నిలవదు అనేది వాళ్లకు అర్థమైంది. కాబట్టి డిస్ ఓన్ చేసుకోవడానికి ఈ పని చేశారు’’ అని ఈటల రాజేందర్ మీడియాతో అన్నారు.
సీబీఐ ఈ కేసును సంపూర్ణంగా విచారణ జరుపుతుందని, కాళేశ్వరంలో జరిగిన అక్రమాలను బయటపెడుతుందన్న విశ్వాసం తనకుందని రాజేందర్ అన్నారు.



ఫొటో సోర్స్, KCR/Harish Rao Thanneeru/Etela-Rajender/FB

పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఏముంది?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిస్సంకోచంగా విధానపరమైన, ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని జస్టిస్ పినాకి చంద్రఘోష్ (పీసీ ఘోష్) కమిషన్ తేల్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది.
మేడిగడ్డ బరాజ్ కుంగడానికి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని కమిషన్ తేల్చిందని ప్రభుత్వం వెల్లడించింది.
''పరిపాలన, ప్రణాళిక, సాంకేతిక, ఆర్థిక పరమైన అంశాలపై వ్యక్తిగత నిర్ణయాలకుతోడు నాటి రాజకీయ నాయకత్వం ప్రభావం చూపింది. దీనివల్ల పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైంది'' అని జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ప్రస్తావించినట్లు తెలంగాణ సర్కారు పేర్కొంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన, ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై జ్యుడిషియల్ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలోని సారాంశంపై ఆగస్టు 4వ తేదీ తెలంగాణ కేబినెట్ సమావేశమై చర్చించింది.
ఈ నిర్ణయానికి అనుగుణంగానే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో ప్రకటించారు.


ఫొటో సోర్స్, TelanganaCMO

- మొత్తం 665 పేజీలతో కూడి నివేదికను జులై 31న జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సమర్పించారు.
- కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటైన కమిషన్ దాదాపు 16 నెలల పాటు అధ్యయనం చేసింది.
- ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ల కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి, అందులో సారాంశాన్ని ప్రభుత్వానికి నివేదించింది.



కమిటీ తయారు చేసిన నివేదిక సారాంశంలో ఏముందంటే.. (కమిషన్ నివేదికపై ఐఎఎస్‌ల కమిటీ అధ్యయనంలో ఉన్నదున్నట్టు)
ప్రాజెక్టుకు సంబంధించిన అనేక తప్పులను కమిషన్ గుర్తించింది. తీవ్రవిమర్శలు చేసింది. అనేక లోటుపాట్లను ఎత్తి చూపింది. తీవ్రమైన ఆర్థిక అవకతవకలను, ప్రణాళిక లేకపోవడాన్ని, నిర్మాణంలో లోపాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అసలు లేకపోవడాన్ని గుర్తించింది.
కీలకమైన రాజకీయ నాయకులు, అధికారులు బాధ్యులని ఎత్తి చూపింది.ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి వ్యవస్థలను, ప్రొసీజర్లను పక్కన పెట్టి ప్రత్యక్షంగా ఎలా జోక్యం చేసుకుని, ప్రభుత్వ ఖజానాకు, బ్యారేజీల ప్రస్తుత స్థితికీ కారకులయ్యారో నివేదికలో రాసి ఉంది.



- ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి స్వయంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర బరాజ్‌లు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
- ఇందులో ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వ నిర్ణయాలు జరగలేదు. నిపుణుల నివేదికను పూర్తిగా పక్కన పెట్టేశారు.
- 2015 జనవరి 21న ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మేడిగడ్డ దగ్గర బరాజ్‌ను కావాలంటే వేమనపల్లి దగ్గర నిర్మించాలని చెప్పింది. కానీ సీఎం దీన్ని పక్కన పెట్టారు.
- తుమ్మిడిహట్టి దగ్గర నీరు లేదు అనేది మేడిగడ్డ దగ్గర బరాజ్ కట్టడానికి చెప్పిన వంక మాత్రమే. అందుకు చెప్పిన కారణంలో నిజాయితీ లేదు. మూడు బరాజ్‌ల నిర్మాణానికి ఇచ్చిన 2016 మార్చి నాటి జీవోలకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ అప్రూవల్ లేకుండా చేశారు.
- వాప్కోస్ డీపీఆర్ ఇవ్వకముందే, 2016 ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో కాళేశ్వరం ఖర్చు 71,436 కోట్లు అన్నారు.
- సీడబ్ల్యూసీ టర్న్‌కీ పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వమంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం లమ్సమ్ పద్ధతిలో ఇచ్చింది. సరైన అవసరం లేకుండా ధరల పెంపు జరిగింది.
- 2016 జూలై-ఆగస్టుల్లోనే కాంట్రాక్టులు పూర్తయిపోగా, అక్టోబరులో అన్నారం, సుందిళ్ళ బరాజ్‌ల స్థలం మార్చాలని హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపై వాప్కోస్‌ని కూడా సంప్రదించలేదు. కారణాలు ఏం చూపించినా, ప్రాజెక్టు ఖర్చు పెంపుఅనేది కొన్ని సంస్థలకు లబ్ధి చేకూరుస్తూ, ప్రజాసొమ్మును నీళ్లలా వృధా చేశారు.
- ప్రాజెక్టులకు కీలకమైన ఓఅండ్ఎం అంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అసలు లేదు.
- కాలానుగుణంగా చేయాల్సిన తనిఖీలు,వానాకాలం సన్నద్ధత నివేదికలు ఇవేవీ ఈ మూడు బరాజ్‌లకు లేనేలేవు.
- ఇవి నీటి నిల్వ కోసం ఉద్దేశించిన డ్యాములు కావు. నీటి నిర్వహణకు ఉద్దేశించిన బరాజ్‌లు. అయినప్పటికీ వీటిలో ఎప్పుడూ నీటి నిల్వ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించడం వల్ల బరాజ్‌లపై పెద్ద స్థాయిలో ఒత్తిడి పడింది.
- మార్గదర్శకాలు, సాధారణ నియమావళికి విరుద్ధంగా ఈ బరాజ్‌లను నీటి నిల్వ కోసం డిజైన్ చేశారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు కీలకమైన "బ్యాక్ వాటర్ స్టడీలు, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వులు, జీ-డీ కర్వులు, జియోఫిజికల్ పరీక్షలు అసలు నిర్వహించలేదు.
- నాణ్యతాప్రమాణాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ఉంది. కనీస ప్రమాణాలు పాటించలేదు. బరాజ్ నిర్మాణ నాణ్యత పాటించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపారు. సీసెంట్ పైల్స్ వెర్టికల్ చెక్స్ కొలతలు కూడా లేకుండానే ఎస్ అంటూ రికార్డు చేసుకుంటూ వెళ్లిపోయారు.
- సంస్థలు, కాంట్రాక్టర్లకు అనైతిక లబ్ధి చేకూర్చారు. మేడిగడ్డలో లోపాలుండి, పనులు పూర్తి కాకపోయినప్పటికీ, సబ్ స్టాన్షియల్ కన్‌స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్ 2019 సెప్టెంబర్లో, సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ 21 మార్చిలో ఇచ్చేశారు. ఇది తప్పు, చట్టవ్యతిరేకం, అందులో ఒక సంస్థకు లాభం చేకూర్చాలనే దురుద్దేశాలు ఉన్నాయి.


ఫొటో సోర్స్, BRS PARTY

నివేదికలో ఎవరెవరిని బాధ్యులను చేశారంటే..
అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు:
- "ఈ మూడు బరాజ్‌లకు సంబంధించి ప్రణాళిక, నిర్మాణం, పూర్తి చేయడం, ఆపరేషన్, నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈయనే బాధ్యులు. బరాజ్‌లో సమస్యలు, అవకతవకలకు ఆయన జోక్యం, ఆయన మార్గనిర్దేశనమే కారణం.
అప్పటి నీటి పారుదల మంత్రి టి హరీశ్ రావు:
- "కావాలనే నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోలేదు"
అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్:
- కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆర్థిక, ద్రవ్య స్థితిని పట్టించుకోలేదు. ఆర్థిక స్థితిని కాపాడటానికి అంకితభావం, నిజాయితీ చూపలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాల విషయంపై తనకేమీ తెలియదంటున్నారు.
ఎస్‌కే జోషి, అప్పటి కేఐపీసీఎల్ అధ్యక్షులు, సాగునీటి ముఖ్య కార్యదర్శి:
- కేఐపీసీఎల్ వైఫల్యానికి బాధ్యులు, నిపుణుల కమిటీ నివేదిక తొక్కిపెట్టడానికి కారకులు, పరిపాలనా అనుమతుల విషయంలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘించారు.
స్మితా సబర్వాల్:
- అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. కేబినెట్ అప్రూవల్స్‌కి సంబంధించి బిజినెస్ రూల్స్ పట్టించుకోలేదు.
సి మురళీధర్, ఈఎన్సీ సాగునీరు, రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ చైర్మన్, హై పవర్ కమిటీ సభ్యుడు:
- కేంద్ర జల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. నిపుణుల కమిటీ నివేదికను తొక్కి పెట్టారు. కుట్రపూరితంగా, అంచనాలను పెంచే ప్రతిపాదనలు ఇచ్చారు, ఓ అండ్ ఎంలో విఫలం అయ్యారు.
బి హరిరామ్, చీఫ్ ఇంజినీర్ పీసీఎస్ఎస్, కేఐపీసీఎల్ ఎండీ:
- నిపుణుల నివేదిక తొక్కి పెట్టారు, కేంద్ర జల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారు. సంస్థకు ఎండీ అయ్యుండీ, బరాజ్‌ల గురించి ఏమీ తెలియదన్నారు.
ఇంకా ఎన్ వెంకటేశ్వర్లు – సీఈ కాళేశ్వరం, కె సుధాకర రెడ్డి – సీఈ రామగుండం, సర్దార్ ఓంకార్ సింగ్ ఈఈ సహా ఇతరులను ఈ నివేదిక బాధ్యులుగా చూపింది . బి నాగేంద్ర రావు, ఓ అండ్ ఎం ఈఎన్సీ, టి ప్రమీల, సీఈ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, ఛీఫ్ ఇంజినీర్లు హరి రామ్, ఎ నరేందర్ రెడ్డి, ఇతర ఇంజినీర్లు కెఎస్ఎస్ చంద్ర శేఖర్, బసవరాజు, టి శ్రీనివాస్ పేర్లను కూడా నివేదిక ప్రస్తావించింది.


ఫొటో సోర్స్, facebook.com/KaleshwaramProject

భారీగా పెరిగిన ప్రాజెక్టు నిర్మాణ వ్యయం
నివేదికలో పేర్కొన్న ప్రకారం..
- ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతిగా రూ. 38,500 కోట్ల అంచనా ఉండగా, కాళేశ్వరం ఖర్చు 2016 నాటికి రూ.71,436 కోట్లకు పెరిగింది.
- తరువాత 2022 మార్చి నాటికి లక్షా 10 వేల 248 కోట్ల రూపాయలకు (1,10,248.48) పెరిగింది.
- ఈ మొత్తం ప్రాజెక్టు మితిమీరిన, బెరకులేని తీవ్రమైన ప్రొసీజరల్, ఆర్థికపరమైన అవకతవకలతో నిండిపోయింది.
- వాప్కోస్ సంస్థకు ఇచ్చిన 6 కోట్ల 77 లక్షలు అధికారుల నుంచి వసూలు చేయాలి.
మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఖర్చు పెట్టిన భారీ మొత్తాన్ని కుట్ర పూరితంగా స్వాహా చేయడంలో అధికార యంత్రాంగం, కాంట్రాక్టరు కలసి మెలసి పనిచేశారని నివేదిక వ్యాఖ్యానించింది.
‘‘మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజా ధన దుర్వినియోగం చేసే సాధనంగా మిగిలింది. అంతేకాదు, పరిపాలన, ప్రణాళిక, సాంకేతిక ముందుచూపు, ఆర్థిక క్రమశిక్షణ, వంటి వైఫల్యం, వాటిలో అసవరంలేని వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ జోక్యం కనిపించింది.’’ అని నివేదిక పేర్కొంది.


ఫొటో సోర్స్, facebook.com/KaleshwaramProject

తేదీల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలు..
2016, ఆగస్టు 26
- మేడిగడ్డ బరాజ్ కట్టాలని ఒప్పందం కుదిరింది.
2019, జూన్ 21
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది
2023, అక్టోబరు 21
- మేడిగడ్డ బరాజ్ లోని బ్లాక్ నం.7లోని పిల్లర్ నం.20 కుంగింది.
2023, అక్టోబరు 23
- నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), ఈఎన్సీ (ఆపరేషన్ అండ్ మెయింటెన్స్) మేడిగడ్డ బరాజ్ కుంగిన పిల్లర్లను పరీక్షించింది. మరమ్మతుల కోసం ప్రాజెక్టు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థతో అప్రైజల్ మీటింగ్ నిర్వహించింది.
2023, నవంబరు 1
- మేడిగడ్డ బరాజ్‌లోని పియర్లు కుంగడానికి కారణాలపై ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక సమర్పించింది.
2023, నవంబరు 30
- తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి
2024, ఫిబ్రవరి 13
- కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మూడు బరాజ్‌లకు సంబంధించి డిజైన్లు, నిర్మాణం తీరుపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ ఛైర్మన్‌ను కోరింది.
2024, మార్చి 2
- మూడు బరాజ్‌ల నిర్మాణం, డిజైన్లపై అధ్యయనం చేసేందుకు ఎన్డీఎస్ఏ కమిటీని నియమించింది.
2024, మార్చి 7, 8
- మూడు బరాజ్‌లను (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల) ను కమిటీ సందర్శించింది.
2024, మార్చి 14
- కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన, ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై జ్యుడిషియల్ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌నను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
2025, జూన్ 11
- పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ప్రత్యక్షంగా హాజరై వివరాలు సమర్పించిన మాజీ సీఎం కేసీఆర్.
2025, జులై 31
- పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
2025 ఆగస్టు 31
- కమిషన్ నివేదిలోని అంశాలను బట్టి, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండటం వల్ల సీబీఐ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














