సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే ఒక్కో అభ్యర్థి ఎంత సంపాదన కోల్పోతున్నారంటే...

సివిల్స్ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గ్రీకు రాజ్యం ఏఫీరాకు పునాదులువేసిన 'సిసిఫస్' నేటికీ చరిత్రపుటల్లో మనకు కనిపిస్తుంటాడు. తన తెలివితో ఆయన గ్రీకు దేవతలు, అమరులను సైతం బురిడీ కొట్టించాడని గ్రీకు పురాణాలు చెబుతుంటాయి.

ఆధునిక ఫ్రెంచ్ తత్వవేత్త ఆల్బర్ట్ కామూ పుస్తకం 'ద మిత్ ఆఫ్ సిసిఫస్' చివరి చాప్టర్‌లోనూ ఆ కథ మనం చూడొచ్చు.

ఇంగ్లిష్ సాహిత్యంలోనూ ''సిసిఫస్ టాస్క్'' అనే ఫ్రేజ్ అప్పుడప్పుడూ మనకు తారస పడుతుంటుంది.

ఈ గ్రీకు చక్రవర్తి కథ మనకెందుకు అనుకుంటున్నారా? అయితే, అసలు ఆయన ఎందుకు చరిత్రలో నిలిచిపోయాడో మనం మొదట తెలుసుకోవాలి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సిసిఫస్ పేయింటింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిసిఫస్ పేయింటింగ్

అంతులేని కథలా...

సిసిఫస్ పదే పదే దేవతలను బురిడీ కొట్టిస్తుంటాడు. వారి రహస్యాలను కూడా బయటకు ఊదేస్తుంటాడు.

దీంతో ఆయనకు గ్రీకు దేవతలు ఒక శిక్ష విధిస్తారు. అదేంటంటే, ఒక పెద్ద గుండ్రాయిని వాలుగా ఉన్న కొండపైకి నెట్టుకుంటూ తీసుకెళ్లాలి.

అయితే, కొండ అంచుల వరకు చేరుకోగానే ఆ గుండ్రాయి దొర్లుకుంటూ కిందకు వచ్చేస్తుంది. దీంతో సిసిఫస్ మళ్లీ మొదటి నుంచి గుండ్రాయిని పైకి నెట్టుకుంటూ వస్తాడు. ఇలా పదే పదే చేస్తూనే ఉంటాడు.

ఇదొక అంతులేని కథ. పైగా అర్థం లేని పని. దీని గురించి ఆల్బర్ట్ కామూ తన పుస్తకంలో స్పందిస్తూ.. జీవితానికి అర్థం వెతుకుతూ మనం చేసే ప్రయత్నానికి, దానికి ప్రతిస్పందనగా విశ్వం వహించే మౌనానికి మధ్య అసంబద్ధత ఏర్పడుతుందని అన్నారు.

అంటే ఇక్కడ మనం చేసే ప్రయత్నానికి కనీసం ప్రతిఫలం దక్కుతుందని ఆశ మనకు కనిపించాలి. సక్సెస్ రేటు 0.17 శాతమే ఉన్నప్పుడు ఆ పనిని మనం ఎందుకు పదేపదే చేయాలో ఆలోచించుకోవాలి.

ఇదే అభిప్రాయాన్ని ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ సభ్యుడు సంజీవ్ సన్యాల్ వెలిబుచ్చారు. సీఏ కుషాల్ లోధా పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు.

యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మేధావులుగా పరిగణించే ఐఐటీ విద్యార్థులు ఏళ్లకు ఏళ్లకు సమయాన్ని యూపీఎస్సీపై వృథా చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.

అభ్యర్థులను భయం వెంటాడుతోందా?

ఇప్పుడు నిజ జీవిత కథల గురించి తెలుసుకుందాం. ఐఐటీ దిల్లీలో చదివిన 24 ఏళ్ల విద్యార్థి ఒకరు, నెల రోజులుగా తాను ఆత్మహత్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు లింక్డిన్‌లో రాశారు.

ఆ పోస్టు వివరాల ప్రకారం, కాలేజీలో నాలుగో ఏడాది చదువుతున్నప్పుడే ఆయన యూపీఎస్సీ సన్నాహాలు మొదలుపెట్టారు. రెండుసార్లు మెయిన్స్‌లో ఒకసారి ప్రిలిమ్స్‌లో ఫెయిల్ అయ్యారు. గత నాలుగేళ్లుగా రోజుకు 10-12 గంటలు చదువుతూనే ఉన్నారు. ఈ సమయంలో ఆయన సంపాదన సున్నా.

''నేను ఐఐటీ నుంచి గ్రాడ్యుయేట్‌ని. మూడున్నరేళ్లుగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. గత 4 ప్రయత్నాల్లో నేను కనీసం ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ పాస్ కాలేదు. మా ఇంట్లో పరిస్థితి కూడా సరిగాలేదు. అంతకుముందు ఒక స్టార్టప్‌లో ఉద్యోగం చేసేవాడిని. కార్పొరేట్‌లో జీవితం అర్థరహితమని కొంతకాలానికే అర్థమై యూపీఎస్సీ బాట పట్టాను. కానీ, ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నా. ఐఏఎస్ కావాలని నేను తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పుడు నాలో చాలా నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి'' అంటూ మరో అభ్యర్థి లింక్డిన్‌లో రాసుకొచ్చారు.

కేవలం వీళ్లిద్దరు మాత్రమే కాదు ఇలాంటి వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు.

సివిల్స్ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

యూపీఎస్సీ డ్రీమ్స్..

''దేశంలోని యువ ప్రతిభావంతులు స్టార్టప్‌లు నెలకొల్పడం, కొత్త ఉత్పత్తులు తయారు చేయడం, చిన్న వయస్సులోనే ఎంతో ప్రభావం చూపగల పనులెన్నో చేయొచ్చు. కానీ, అలా జరగడం లేదు. కోచింగ్ సెంటర్లు, యూపీఎస్సీ డ్రీమ్స్‌ను అమ్ముతుండగా.. బాలీవుడ్ సినిమాలు, టీవీ సిరీస్‌లు ఈ కలకు మరింత గ్లామర్‌ను జోడిస్తున్నాయి'' అని మిస్ ఫిట్స్ ఫౌండేషన్ చైర్మన్, ఇన్వెస్టర్ నమన్ శ్రీవాస్తవ లింక్డిన్‌లో రాశారు.

అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు, యూపీఎస్సీ వలలో చిక్కుకుపోయి తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన 20ల వయస్సును మొత్తం ప్రిపరేషన్‌లోనే వృథా చేస్తున్నారని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ సభ్యుడు సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యానించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ దిల్లీ ఇటీవలే నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ 2025 రిపోర్టును విడుదల చేసింది.

ఈ రిపోర్టు ప్రకారం, 2025లో ఐఐటీ దిల్లీ నాలుగేళ్ల బీటెక్ మీడియన్ ప్యాకేజీ రూ.19 లక్షలు కాగా, 711 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ పొందారు. ఎంటెక్ మీడియన్ ప్యాకేజీ రూ.15.09 లక్షలుగా రిపోర్టులో పేర్కొన్నారు. మీడియన్ ప్యాకేజీ అంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో విద్యార్థులు పొందిన జీతాల్లో మధ్య స్థానంలో ఉన్న జీతం.

2024లో రూ.20 లక్షల మీడియన్ ప్యాకేజీతో 676 మంది బీటెక్ విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ పొందారు. అంటే ఈ ఉద్యోగాలు పొందిన వారిలో సగం మంది ప్యాకేజీ రూ. 20 లక్షల కంటే తక్కువ, మరో సగం మంది ప్యాకేజీ రూ. 20 లక్షల పైబడి ఉంటుంది. ఐఐటీ దిల్లీ ప్లేస్‌మెంట్లలో అత్యధిక ప్యాకేజీ రూ.2 కోట్లు అని, సగటు ప్యాకేజీ 25.82 లక్షలుగా కాలేజ్ దునియా అనే వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది.

దీని కోసం ఒక ఉదాహరణ తీసుకుందాం. బీటెక్ చేసిన ఒక విద్యార్థి రూ. 25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగంలో చేరాడనుకుంటే, కనీసం 10 శాతం ఇంక్రిమెంట్ 8 ఏళ్లపాటు అందుతూపోతే, అప్పటికి అతని ప్యాకేజీ రూ. 50 లక్షలకుపైగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ఎనిమిదేళ్లలో ఆ వ్యక్తి ఆర్జన దాదాపు రూ 3.5 కోట్లు ఉండొచ్చు. ఎనిమిదేళ్ల పాటు సివిల్స్‌కే అంకితమైన ఒక అభ్యర్థి ఇంత సంపాదనను కోల్పోయినట్లే.

ఒకటి కాదు రెండు కాదు, 8 కంటే ఎక్కువసార్లు..

ఈ కోణంలో చూస్తే సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని బీబీసీతో వైజాగ్‌ కేంద్రంగా నడిచే ఎల్‌టీఎక్స్ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు, ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ బోధించే సురేశ్ అన్నారు. జీడీపీ వృద్ధికి దోహదపడాల్సిన వయస్సులో అభ్యర్థులంతా ఏళ్లకేళ్లు ఎగ్జామ్స్ రాసే ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పారు.

యూపీఎస్సీ వార్షిక రిపోర్టులను పరిశీలిస్తే, ప్రతీయేటా సివిల్స్‌ సాధించే వారిలో 8 సార్లు, అంతకంటే ఎక్కువసార్లు పరీక్ష రాసినవారు కూడా ఉంటారు. 73వ వార్షిక నివేదికను 2022-23లో విడుదల చేసింది యూపీఎస్సీ. దీని ప్రకారం చూస్తే 2021లో 748 మంది సివిల్స్‌లో విజయం సాధించారు. అందులో తొలి 4 ప్రయత్నాల్లో ఉద్యోగాలు సాధించినవారు 66.5 శాతం కాగా, చివరి 5 ప్రయత్నాల్లో విజయం సాధించినవారు 33.5 శాతం మంది ఉన్నారు.

''సివిల్స్ ఎగ్జామ్ కోసమే యువత ఏడెనిమిదేళ్లు కేటాయిస్తున్నారు. ఈ సర్వీసులో భాగమయ్యేందుకు కొంతమంది మంచి ఉద్యోగాలు, భారీ జీతాలను కూడా వదులుకుంటున్నారు'' అని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌.వై. ఖురేషీ గతంలో వ్యాఖ్యానించారు.

కొన్నేళ్లుగా ప్రతీ ఏటా 10 లక్షలు మందికిపైగా విద్యార్థులు సివిల్స్ పరీక్షకు దరఖాస్తు చేస్తున్నారు. అయితే, వీరిలో ప్రిలిమ్స్ దాటుకొని మెయిన్స్‌కు అర్హత సాధించేవారు 1 శాతం మాత్రమే.

ఓవరాల్‌గా ఈ పరీక్ష వ్యవధి 31 గంటలు. అంటే ప్రిలిమ్స్ పరీక్షలు 4 గంటలు, మెయిన్స్ పరీక్షలు మొత్తం 27 గంటలు జరుగుతాయి.

గంపెడంత సిలబస్, తీవ్రమైన పోటీ, సెలెక్షన్ ప్రాసెస్ కఠినంగా ఉండే ఈ పరీక్షలో విజయం సాధించాలంటే కఠోర శ్రమ, సంకల్పం, మేధస్సు అవసరం.

2024లో 5.83 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాగా 14,627 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. 2,845 మంది ఇంటర్వ్యూల్లో పాల్గొనగా 1,009 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రిలిమ్స్ నుంచి ఫైనల్ రిజల్ట్ వరకు చూసుకుంటే సక్సెస్ రేట్ 0.17 శాతం.

'సమాజంలో హీరో గుర్తింపు'

ఐఏఎస్ అధికారులను సొసైటీలో సెలెబ్రిటీల్లా చూస్తారని, ఈ ఉద్యోగంతో వచ్చే అధికారం, సమాజాన్ని మార్చగలమనే తపనతో విద్యార్థులు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటూ సివిల్స్‌ ప్రయత్నాల్లోనే కొనసాగుతారని బీబీసీతో ఎల్‌టీఎక్స్ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు సురేశ్ చెప్పారు.

''విద్యార్థులు 20ల వయస్సును సివిల్స్‌లోనే కోల్పోతున్నారనడంలో సందేహం లేదు. అటెంప్ట్స్ ఎగ్జాస్ట్ అయ్యాక వీళ్లంతా మళ్లీ రాష్ట్రస్థాయి ఉద్యోగాల వైపు మళ్లుతారు. కానీ, యూపీఎస్సీలో సక్సెస్ రేట్ తక్కువనే విషయాన్ని మొదట్లోనే గ్రహించిన కొంతమంది మాత్రం దీనితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తుంటారు. కొందరు యూపీఎస్సీ మాత్రమే ధ్యేయంగా చదువుతూ సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి చాలా ఒత్తిడి ఎదుర్కొంటారు. రకరకాల ఒత్తిళ్ల కారణంగా మానసికంగా కుంగిపోతుంటారు'' అని ఆయన అన్నారు.

సివిల్స్ పరీక్షలో విజయవంతం కావడానికి సగటున అయిదేళ్ల సమయం పట్టొచ్చని ఆయన చెప్పారు.

సివిల్స్ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

మానసిక సమస్యలు

సివిల్స్‌లోని విస్తృత సిలబస్‌ను పూర్తి చేయడానికి రోజుకు 10-12 గంటలు చదువుతూ నిద్రను, సోషల్ లైఫ్‌ను త్యాగం చేస్తూ, ఒత్తిడి, యాంగ్జైటీకి లోనవుతున్నారని ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది.

యూపీఎస్సీకి సన్నద్ధమవుతున్న, ఇప్పటికే సివిల్స్ పరీక్ష రాసిన అభ్యర్థులపై చేసిన సర్వే ఫలితాలను ఈ అధ్యయనంలో పొందుపరిచారు. వీరంతా 19 నుంచి 33 ఏళ్ల మధ్య ఉన్నవారే. సర్వేలో పాల్గొన్న వారిలో 53.3 శాతం మంది తమ మానసిక ఆరోగ్యం 'పూర్'గా ఉందని, 47 శాతం మంది రోజుకు 4-6 గంటలే నిద్ర పోతున్నట్లు, డిప్రెషన్, యాంగ్జైటీ, నిరాశ వంటి కారణాలతో రోజూవారీ పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు 41.7 శాతం తెలిపినట్లు అధ్యయనం పేర్కొంది.

రెండుసార్లు ప్రిలిమ్స్‌లో మంచి ర్యాంకు రాలేదనే డిప్రెషన్‌తో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు జులై 22న ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

గత మూడేళ్లుగా సివిల్స్‌ ప్రిపేర్ అవుతున్న తమ కుమారుడు మంచి ర్యాంకు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడని కుటుంబీకులు చెప్పినట్లు సరూర్‌నగర్ ఎస్‌.ఐ. శిరీష వెల్లడించారని తెలంగాణ టుడే పత్రిక ఓ వార్తను ప్రచురించింది.

దిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో జమ్మూకు చెందిన 25 ఏళ్ల యువకుడు కూడా ఇలాగే జులై 21న ఆత్మహత్యకు పాల్పడ్డారు. అకడమిక్ ఒత్తిడి, మానసిక సమస్యలతో ఈ పనికి పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

సివిల్స్ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

సివిల్స్ పరీక్షలో మార్పులు రావాలా?

ఇంత రిస్క్ తీసుకొని సివిల్స్‌లో విజయం సాధించిన 0.1 శాతం అభ్యర్థులు కూడా తమ ఉద్యోగాల్లో సంతోషంగా లేరని సంజయ్ సన్యాల్ అన్నారు.

''వీరిలో చాలామంది ఉత్సాహం లేని రొటీన్ పనులే చేస్తుంటారు. రివార్డులు కూడా పెద్దగా ఉండవు. కాబట్టి దేశంలోని యువత తమ టాలెంట్‌ను సద్వినియోగం చేసుకునేలా వ్యాపారం, క్రీడలు, కళలు వంటి రంగాల వైపు ఆసక్తి చూపాలి. విజయాల శాతం తక్కువగా ఉండే ఒక ఉద్యోగానికి పోటీ పడే బదులు ఎక్కువ జీతం అందించే దానివైపు ఎందుకు మళ్లకూడదు?'' అని సన్యాల్ ప్రశ్నించారు.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో మార్పులు తీసుకురావాల్సిన సమయం వచ్చిందని లింక్డిన్‌లో చేసిన పోస్టులో నమన్ కొన్ని సూచనలు చేశారు.

''ఒక అభ్యర్థికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, పరీక్షల్లోనే 24 నెలలు గడిచిపోతున్నాయి. ఈ వ్యవధిని తగ్గించాలి. రెండోది, ఈ ఏడాది ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ క్లియర్ చేస్తే వచ్చే ఏడాది సివిల్స్ సైకిల్‌లో వీటిని పరిగణలోకి తీసుకోవాలి. మూడోది, వివిధ సర్వీసుల కోసం వేర్వేరు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అనుసరించాలి. ప్రిలిమ్స్‌లో ప్రశ్నల సంఖ్య పెంచాలి'' అని ఆయన సూచించారు.

జీవితంలో విజయవంతం కావడానికి సివిల్స్ ఒక్కటే మార్గం కాదని, జీవిత పరమావధి ఇదే కాదని 2009 బ్యాచ్ ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి శశి వాపంగ్ లాను అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నాగాలాండ్ సీజీఎస్టీ కమిషనరేట్‌లో అడిషనల్ కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నారు.

గమనిక:

  • ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
  • సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)