ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమలు, వివాహాలు, విడాకులలో ఎలాంటి మార్పులు రానున్నాయి?

ఫొటో సోర్స్, ANI
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేసిన తొలిరాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో సోమవారం (27.01.2025) నుంచి యూసీసీ అమల్లోకి వచ్చింది.
ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు వ్యతిరేకించాయి.
యూసీసీ అమలుకు అధికారుల శిక్షణ సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
తాము అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామంటూ 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది.

బీజేపీ 2022 ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ఏర్పాటైనప్పటి నుంచి ఏ పార్టీ కూడా అక్కడ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. తమ విజయానికి యూసీసీ కూడా ఒక కారణమని ధామి అన్నారు.
ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలుకు ఒక రోజు ముందు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, ఇది బీజేపీ పైలట్ ప్రాజెక్ట్ అన్నారు.
''ఉత్తరాఖండ్‌లో దీన్ని అమలు చేసి ప్రజాస్పందన తెలుసుకోవాలని బీజేపీ చూస్తోంది. తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలనుకుంటోంది. ఈ అంశంపై ఏకాభిప్రాయం లేకపోవడంతో బీజేపీ, ఉత్తరాఖండ్ నుంచి దీన్ని ప్రయత్నిస్తోంది'' అని సింఘ్వీ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఏం మారుతుంది?
ఉత్తరాఖండ్‌లోని గిరిజన తెగలు, ప్రత్యేక రక్షణ ఉన్న వ్యక్తులు, సముదాయాలకు మినహాయించి మిగతా ప్రజలందరికీ యూసీసీ వర్తిస్తుంది.
ఉత్తరాఖండ్ యూసీసీ చట్టంలో వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం, వీటికి సంబంధించిన అంశాలు మిళితమై ఉంటాయి. ఇది స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సును నిర్థరిస్తుంది.
అన్ని మతాల వారికి విడాకులు, ఇతర విధానాలకు ఒక పునాదిని నిర్మిస్తుంది. ఈ చట్టం బహుభార్యత్వాన్ని నిషేధిస్తుంది.
ఈ చట్టం ప్రకారం, జీవిత భాగస్వామి లేని ఇద్దరి మధ్య మాత్రమే వివాహం జరుగుతుంది. కనీస వివాహ వయస్సు పురుషుడికి 21 ఏళ్లు, స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
వివాహ నిబంధనలు
చట్టపరమైన విధానాలు లేదా మతపర ఆచారాల ప్రకారం వివాహం జరగొచ్చు.
వివాహం జరిగిన 60 రోజుల్లోపు ఆ పెళ్లిని రిజిస్టర్ చేయాలని యూసీసీ చట్టం తెలుపుతోంది.
యూసీసీ కింద అన్ని విధాలైన వివాహాలు, సహ జీవన బంధాలను రిజిస్టర్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆన్‌లైన్ ద్వారా వివాహాన్ని రిజిస్టర్ చేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, 2010 మార్చి 26కు ముందు రాష్ట్రంలో లేదా రాష్ట్రం వెలుపల జరిగిన ఏ వివాహమైనా, ఆ పెళ్లి చేసుకున్న ఇద్దరు కలిసి జీవిస్తున్నట్లయితే, చట్టపరంగా అర్హులైతే ఈ యూసీసీ చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోపు ఆ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఏదైనా ఒక ఆపరేషన్ లేదా పోరాటంలో భాగంగా ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సైనికుల కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు.

ఫొటో సోర్స్, Thinkstock
విడాకుల నిబంధనలు
ఈ చట్టం ప్రకారం, భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదం ఉంటే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అక్కడ చట్టపరంగా వారి సమస్యను పరిష్కరిస్తారు.
పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకున్నా కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.
ఈ చట్టం విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి కారణాలు ఉండాలో పేర్కొంది. ఒక వ్యక్తి, విడాకుల కోసం ఈ కింది కారణాల వల్ల దరఖాస్తు చేసుకోవచ్చు.
- భార్యాభర్తల్లో ఎవరైనా ఇష్టపూర్వకంగా వేరొకరితో శారీరక సంబంధాలు కలిగి ఉన్నప్పుడు.
- భార్యాభర్తల్లో ఎవరైనా క్రూరంగా ప్రవర్తించినప్పుడు.
- పెళ్లయ్యాక కనీసం రెండేళ్లపాటు ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్న పక్షంలో,
- భార్యాభర్తల్లో ఒకరు మతం మారి ఉంటే, లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు,
- భార్యాభర్తల్లో ఎవరైనా సుఖవ్యాధులతో బాధపడుతుంటే, లేదా ఏడేళ్లుగా దూరంగా ఉంటే,
- వివాహమైన ఏడాదిలోపు విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడం నిషేధం. అయితే, అసాధారణమైన కేసుల్లో మినహాయింపు ఉంటుంది.
- ఒక వ్యక్తి ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఇక విడాకులు తీసుకోలేరు.

ఫొటో సోర్స్, ANI
సహజీవన బంధాల గురించి...
యూసీసీ అమలు ఏర్పాట్లతో పాటు సహజీవన బంధాలకు సంబంధించిన చట్టాన్ని చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతుండటం ఇదే తొలిసారి.
ఉత్తరాఖండ్ యూసీసీలో సహజీవన బంధాలలో ఉన్నవారి కోసం లేదా అందుకు సిద్ధమవుతున్నవారి కోసం నిబంధనలను రూపొందించారు. ఈ బంధంలో ఉన్న వారు జిల్లా రిజిస్ట్రార్ ముందు ఈ విషయాన్నిప్రకటించాల్సి ఉంటుంది.
దీనితో పాటు, రాష్ట్రం వెలుపల నివసించే ఉత్తరాఖండ్ నివాసులు కూడా తమ జిల్లా రిజిస్ట్రార్ వద్ద తమ సహజీవన బంధం గురించి తెలపాల్సి ఉంటుంది.
ఈ బంధం ద్వారా జన్మించిన పిల్లలకు కూడా చట్టబద్ధత కల్పించారు.
మైనర్ల మధ్య లేదా ఇప్పటికే వివాహమైన వారి మధ్య సహజీవనం చెల్లదు. అలాగే బలవంతంగా లేదా మోసపూరితంగా ఈ బంధంలో ఉన్నట్లయితే అది కూడా చెల్లదు.
21 ఏళ్ల లోపు ఉండి, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న యువతీయువకుల తల్లిదండ్రులకు ఈ బంధం గురించి ముందుగానే తెలియజేయడం అవసరం.
ఎవరైనా యువతీయువకులు నెల రోజులకు పైగా సహజీవనంలో ఉండి, దాని గురించి వెల్లడించకపోతే వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 జరిమానా పడే అవకాశం ఉంది.
ఈ బంధాన్ని ముగించాలనుకున్నా దాని గురించి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














