ఉత్తర కాశీలో ఫ్లాష్ ఫ్లడ్స్: ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారు?

ఉత్తరాఖండ్, ఉత్తర కాశీ, ఫ్లాష్ ఫ్లడ్స్, ధరాలీ గ్రామం, విధ్వంసం

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ఆసిఫ్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
Redline
  • ఉత్తరకాశీలో ఆకస్మిక వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో నలుగురు మరణించారు. 50 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
  • తన కళ్ళ ముందే అనేక హోటళ్ళు కొట్టుకుపోయాయని, ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదని స్థానికురాలు ఆస్తా పవార్ చెప్పారు.
  • ఫ్లాష్ ఫ్లడ్స్, కొండచరియలు విరిగిపడటం ఆర్మీ క్యాంప్‌‌లోని కొంతభాగం, సహాయక బృందాలపైనా ప్రభావం పడిందని సమీపంలోని ఆర్మీ తెలిపింది.
  • ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. సహాయ బృందాలను మోహరించారు.
Redline

మంగళవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా అకస్మాత్తుగా వరద విరుచుకు పడింది. హర్షిల్ ప్రాంతంలోని ఖీర్ గంగా గడేరాలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగి ధరాలీ గ్రామాన్ని ముంచేసింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం నలుగురు మరణించారని కొంత ఆస్తి నష్టం కూడా సంభవించిందని ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య మీడియాకు తెలిపారు.

"ఈ సంఘటనలో 40 నుండి 50 ఇళ్లు కొట్టుకుపోయాయి. 50 మందికి పైగా గల్లంతయ్యారని తెలిసింది" అని ఎన్‌డీఆర్ఎఫ్ డీఐజీ మోహ్‌సెన్ షహేది పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.

ధరాలీలో విధ్వంసం తీవ్రత భారీగా ఉందని, భారీ స్థాయిలో అస్తి నష్టం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ సంఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రత్యక్ష సాక్షి

ఈ భయంకరమైన సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ధరాలీ గ్రామవాసి ఆస్తా పవార్ తన అనుభవాన్ని బీబీసీ ప్రతినిధి వికాస్ త్రివేదీతో పంచుకున్నారు.

"ప్రస్తుతం నేను ధరాలిలో ఉన్నాను. నా ఇల్లు రోడ్డు నుంచి కొంచెం దూరంలో ఉంది. కింద ఎంత నష్టం జరిగిందో ఇక్కడ నుంచి కనిపిస్తోంది" అని ఆమె చెప్పారు.

"నా కళ్ల ముందే చాలా హోటళ్లు కొట్టుకుపోయాయి. అన్నీ ఒకేసారి కొట్టుకుపోయాయని కాదు. మొదటిసారి వచ్చిన అల చాలా బలంగా భయంకరంగా ఉంది. మీరు ఆ వీడియోలను చూసి ఉంటారు. తర్వాత కూడా ప్రతి 10–15 లేదా 20 నిమిషాలకు భారీ ఎత్తున వరదతోపాటు శిథిలాలు వస్తూనే ఉన్నాయి. అవి కూడా హోటళ్లను ధ్వంసం చేసి తమతో తీసుకెళ్లాయి" అని ఆస్తా పవార్ వివరించారు.

ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి ప్రభుత్వం లేదా అధికార యంత్రాంగం నుంచి ఏదైనా సమాచారం అందిందా అన్న ప్రశ్నకు తనకు దాని గురించి ఏమీ తెలియదని ఆస్తా చెప్పారు.

"మాకు ఎలాంటి హెచ్చరిక అందలేదు. ప్రస్తుతం సెలవులేమీ లేవు. ఈ రోజు పిల్లలకు సెలవు లేదు. ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని ఎవరికీ ఎలాంటి అవగాహన లేదు. ఈ సంఘటన మధ్యాహ్నం పూట జరిగింది. మేం ఇంటి పైకి వెళ్లాం. అంతా స్పష్టంగా కనిపించింది. ఏమీ మిగల్లేదు" అని ఆస్తా చెప్పారు.

గ్రామస్తుల్లో కొందరు స్థానిక పూజకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె తెలిపారు.

"ఆగస్టు 4 రాత్రి, 5న ఉదయం పూజ జరిగింది. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదం ఆగస్టు 4 రాత్రి జరగలేదు, ఎందుకంటే గ్రామం మొత్తం పూజకు హాజరైంది" అని ఆస్తా అన్నారు.

"ఇలా జరుగుతుందని హెచ్చరించి ఉంటే మేం పూజకు వెళ్ళేవాళ్ళం కాదు. మరెక్కడైనా హెచ్చరిక జారీ చేసి ఉంటే దాని గురించి మాకు తెలియదు. ఇక్కడ అంతా సాధారణంగా ఎప్పటిలాగే ఉంది. స్కూళ్లు తెరిచి ఉన్నాయి. సెలవేమీ ప్రకటించలేదు. ఇంత పెద్ద విషాదం జరుగుతుందని ఎవరికీ తెలియదు" అని ఆమె చెప్పారు.

ఉత్తరాఖండ్, ఉత్తర కాశీ, ఫ్లాష్ ఫ్లడ్స్, ధరాలీ గ్రామం, విధ్వంసం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సహాయ చర్యల్లో ఆర్మీ సిబ్బంది
ధరాలీ

ఆస్తా ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో నివసిస్తున్నారు.

"అక్కడ చాలా పెద్ద హోటళ్ళు, మూడు-నాలుగు అంతస్తుల హోటళ్ళు ఉండేవి. ఇప్పుడు వాటి పైకప్పులు కూడా కనిపించడం లేదు. నష్టం చాలా తీవ్రంగా ఉంది. మార్కెట్ అంతా ధ్వంసమైంది. ధరాలీలో పెద్ద మార్కెట్ ఉండేది. చాలా పెద్ద ఆలయం ఉండేది. ఇప్పుడు అక్కడ ఏమీ కనిపించడం లేదు. అన్నీ ధ్వంసమయ్యాయి. కల్ప కేదార్ ఆలయం కూడా కనిపించడం లేదు" అని ఆమె చెప్పారు.

ధరాలీ గంగోత్రికి వెళ్ళే దారిలో వస్తుంది. ఈ ప్రదేశం హర్షిల్ లోయ సమీపంలో ఉంది. కల్ప కేదార్ ఇక్కడ స్థానిక ఆలయం. ఇక్కడకు భక్తులు దర్శనం కోసం వస్తారు.

చార్ ధామ్ యాత్ర మార్గం ధరాలి గుండా వెళుతుంది. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు తరచుగా ధరాలిలోని హోటళ్లలో బస చేస్తారు.

హర్షిల్ వ్యాలీలోని బాగోరి గ్రామంలో నివసించే కరణ్ బీబీసీతో మాట్లాడారు. లోయ చుట్టూ ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాత్రిపూట వర్షం పడితే ప్రాణాలకు, ఆస్తికి భద్రత కల్పించడానికి ప్రజలను సమీపంలోని ఎత్తైన ప్రాంతాలకు పంపుతున్నట్లు వివరించారు.

ఉత్తరాఖండ్, ఉత్తర కాశీ, ఫ్లాష్ ఫ్లడ్స్, ధరాలీ గ్రామం, విధ్వంసం

ఫొటో సోర్స్, ANI

కొనసాగుతున్న సహాయక చర్యలు

ధరాలీనుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక ఆర్మీ క్యాంప్ కూడా ఉంది. ప్రమాదం గురించి ఆర్మీ అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విభాగం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

హర్షిల్ పోస్ట్ వద్ద ఉన్న భారత సైనిక దళం ముందుగా స్పందించి, కేవలం 10 నిముషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుందని బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ మన్‌దీప్ ధిల్లాన్ తెలిపారు.

సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు దాదాపు 20 మందిని సురక్షితంగా తరలించామని, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు.

ఫ్లాష్ ఫ్లడ్స్, కొండ చరియలు విరిగిపడటం వల్ల ఆర్మీ క్యాంపులోని కొంత భాగం, రెస్క్యూ బృందం కూడా ప్రభావితం అయినట్లు ధిల్లాన్ చెప్పారు.

ఫ్లాష్ ఫ్లడ్స్

మోదీ, అమిత్‌షా, రాహుల్ సంతాపం

ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ విచారం వ్యక్తం చేశారు.

"ఉత్తరకాశిలోని ధరాలీలో జరిగిన ఈ విషాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో మాట్లాడి పరిస్థితి గురించి సమాచారం తీసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయ బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయి" అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఈ సంఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. ప్రభావిత ప్రాంతానికి మూడు ఐటీబీపీ బృందాలు, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపామని చెప్పారు.

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అవసరమైన వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.

"ఉత్తరాఖండ్‌లోని ధరాలీలో సంభవించిన భారీ విధ్వంసం కారణంగా అనేక మంది మరణించడం, అనేక మంది అదృశ్యమవడం చాలా బాధాకరం. ఆందోళన కలిగించే విషయం" అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)