కల్వకుంట్ల కవిత: బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా విమర్శలు.. పార్టీకి ఆమె పూర్తిగా దూరమైనట్లేనా?

Kalvakuntla Kavitha

ఫొటో సోర్స్, facebook/Kalvakuntla Kavitha

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''అనుచితమైన వ్యాఖ్యలను ఒక ఇంటి ఆడబిడ్డగా నాపై చేస్తే యావత్ తెలంగాణ బాధ పడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్టుగా రియాక్ట్ అయ్యారు. మరి, ఏమైందో ఏమో తెలియదు గాని బీఆర్ఎస్ పార్టీలోని అన్నదమ్ములకు.. వాళ్లు మాత్రం ఎవరూ రియాక్ట్ కాలేదు''

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా చేసిన ఈ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రత్యేకించి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు సన్నిహితుడిగా పార్టీలో పేరున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్యంగా కవిత విమర్శలు చేశారు.

''నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు 'ఆమెవరు.. ఈమెవరు' అని నా గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నదెవరనేది ప్రజలు ఆలోచించుకోవాలి'' అని విమర్శించారు కవిత.

దీనిపై జగదీష్ రెడ్డి కూడా స్పందించారు.

''నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికున్న జ్ఞానానికి నా జోహార్లు. ఎవరైతే కేసీఆర్ శత్రువులా... అడుగడుగునా కేసీఆర్‌పై విషం కక్కుతున్న వారు.. నా గురించి వ్యాఖ్యలు చేస్తున్నారో.. అవే వ్యాఖ్యలు వల్లె వేసినందుకు నా సానుభూతి తెలియజేస్తున్నా'' అంటూ ఎద్దేవా చేశారు.

ఈ వ్యవహారం కేవలం ఇద్దరు నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలుగా కాకుండా బీఆర్ఎస్‌ నాయకులను కవిత లక్ష్యంగా చేసుకున్నారని భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

''బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తనంతట తానుగా బయటకు వెళ్లకుండా పార్టీయే తనను దూరం పెట్టి బహిష్కరించడం లేదా సస్పెండ్ చేసే విధంగా చేయడం కవిత లక్ష్యం కావొచ్చు'' అని ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కల్వకుంట్ల కవిత, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్, లిల్లీఫుట్, జగదీశ్వర్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook.com/KavithaKalvakuntla

ఫొటో క్యాప్షన్, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని బీఆర్ఎస్ నాయకులపై కవిత గతంలో విమర్శలు చేశారు.

'జై బీఆర్ఎస్' నినాదం ఊసెత్తని కవిత

గత కొంతకాలంగా.. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానంటూనే వేరొకరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదని కవిత చెబుతున్నారు.

పరోక్షంగా తన అన్న కె. తారక రామారావు (కేటీఆర్) నాయకత్వాన్ని అంగీకరించేది లేదని చెప్పకనే చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచిన సమయంలో దాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు కవిత.

కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెబుతూనే... బీఆర్ఎస్ కండువాలు గానీ, జెండాలు గానీ తన వెంట లేకుండా చూసుకుంటున్నారు.

42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆగస్టు 4 నుంచి 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు కవిత.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ''జై తెలంగాణ.. జై బీసీ.. జై జాగృతి'' అన్నారే తప్ప ఎక్కడా పార్టీ పేరు ప్రస్తావించలేదు. దీక్షలోనూ ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించలేదు.

బీఆర్ఎస్ నాయకులు ఆమె ధర్నాకు వెళ్లకపోవడానికి కారణం ఆమె తమను పిలవకపోవడమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

''కవిత చేసే ధర్నాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాచారం గానీ, ఆహ్వానం గానీ లేదు. అలాంటప్పుడు ఎలా వెళ్తారు?'' అని బీఆర్ఎస్ ముఖ్య నాయకుడొకరు బీబీసీతో చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యవహారంలో ఎక్కువ విశ్లేషణ చేసేందుకు ఆయన ఇష్టపడలేదు.

అయితే, ప్రాంతీయ పార్టీలలో వారసత్వం కోసం జరిగే పోరాటంగానే కవిత ఎపిసోడ్ చూడాలంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్.

''కవిత విషయంలోనే కాదు, గతంలో తెలుగుదేశం సహా వివిధ పార్టీల్లోనూ రాజకీయ వారసత్వంపై విభేదాలు తలెత్తాయి. ఎప్పటికైనా కేటీఆర్‌ను వారసుడిగా తీసుకురావాలనేది కేసీఆర్ ఆలోచన. అందువల్ల తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని కవిత భావిస్తున్నారు'' అని దేవులపల్లి అమర్ విశ్లేషించారు.

అలాగే దిల్లీ లిక్కర్ కేసులో పార్టీ తరఫున ఎవరూ సరిగా స్పందించలేదని ఆమె భావిస్తున్నట్లున్నారని ఆయన చెప్పారు.

కల్వకుంట్ల కవిత, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్, లిల్లీఫుట్, జగదీశ్వర్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook.com/KavithaKalvakuntla

ఫొటో క్యాప్షన్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

''సొంత మార్గం' దిశగా కవిత పయనం?

బీఆర్ఎస్, కవిత మధ్య దూరం బాగా పెరిగిందని, అది ఆమె ''సొంత మార్గం'' దిశగా నడిపిస్తోందని అన్నారు కె.శ్రీనివాస్.

''ప్రస్తుతం కవిత కొంతకాలం పాటు వార్తల్లో ఉండడాన్ని చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్లే తనను దూరం పెడుతున్నారని భావన శ్రేణుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులు, కవిత వ్యాఖ్యలు, ధర్నాల్లో ఆమె వెనుక జెండాలు, నాయకులను పరిశీలిస్తే... బీఆర్ఎస్ గొడుగు కింద కాకుండా తనకంటూ ప్రత్యేక క్యాడర్ ఏర్పాటు దిశగా ఆమె ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా స్పష్టమవుతోంది.

తెలంగాణ జాగృతి జెండాలు, నినాదాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

''నేను ముందుగా తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి ఎనిమిదేళ్లు పనిచేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాల కంటే ముందు నుంచే జాగృతి ఉంది'' అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కవిత.

ఒకవైపు పార్టీతో విభేదాలు లేవంటున్నా, కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతమైన తర్వాత ఆమె బీఆర్ఎస్ కండువా కప్పుకొన్న దాఖలాలు కనిపించలేదు.

''ఆమె వెనక్కి వెళ్లినా సరే సముచిత గౌరవం దక్కుతుందని అనుకోవడానికి లేదు'' అని కె.శ్రీనివాస్ అన్నారు.

గత నెల 26న హైదరాబాద్‌లోని కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యకర్తల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కవిత. అదే రోజు మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం శిక్షణ తరగతులు నిర్వహించారు. వరంగల్‌లోను ఇదే తరహాలో కార్యక్రమాలు జరిగాయి.

ఇలా బీఆర్ఎస్‌కు పోటీగా తెలంగాణ జాగృతి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా చేసినవి కాదని, ముందుగానే అనుకున్న కార్యక్రమాలేనని కవిత చెప్పారు.

కవిత బయటకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగతుందా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని కె.శ్రీనివాస్ చెబుతున్నారు.

''ఆమెకు మద్దతుగా ప్రజాప్రతినిధులెవరూ లేరు. జాగృతి నేతలు కాకుండా కొద్ది మంది నిజామాబాద్‌కు చెందిన నేతలు రావొచ్చు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఇదే విషయంపై దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వెళ్తే పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

''నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడినప్పుడు తమకు ఎలాంటి నష్టం ఉండదని వారు చెబుతున్నారు. ఆమె వైఖరి చూస్తుంటే, భవిష్యత్తులో తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తోంది'' అని విశ్లేషించారు.

కల్వకుంట్ల కవిత, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్, లిల్లీఫుట్, జగదీశ్వర్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook.com/KavithaKalvakuntla

ఫొటో క్యాప్షన్, తాను చేపట్టే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ కండువాలు గానీ, జెండాలు గానీ లేకుండా చూసుకుంటున్నారు.

లేఖ తర్వాత చిచ్చు తీవ్ర స్థాయికి..

ఈ ఏడాది మేలో కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ బహిర్గతమైన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోనూ, కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయన్న విషయం వెలుగు చూసింది.

''కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి'' అని ఆ లేఖలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

పరోక్షంగా తన అన్న కేటీఆర్ సహా ఎంపీ సంతోష్ కుమార్‌ను ఆమె లక్ష్యంగా చేసుకున్నారని చర్చ జరిగింది.

దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు.

''పార్టీలో ఏ హోదాలో ఉన్నా, అంతర్గతంగా మాట్లాడవలసిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బావుంటుంది'' అన్నారు కేటీఆర్

వీటన్నింటినీ చూస్తే... ఈ లేఖ తర్వాత నుంచి కవితకు, బీఆర్ఎస్‌కు మధ్య ఏర్పడిన అంతరం తీవ్రమైందనేది స్పష్టంగా తెలుస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)