టారిఫ్ టెన్షన్: ట్రంప్ ఇలాగే వ్యవహరిస్తే, ఇండియా చైనా దగ్గరవుతాయా? ఈ పరిస్థితిని ట్రంప్ కోరుకుంటారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ కోసం
- నుంచి, లండన్
భారత్, అమెరికా మధ్య పరిస్థితులు గత రెండేళ్లలోనే పూర్తిగా మారిపోయాయి. ఇది చాలా ఆశ్చర్యకరం.
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రెండేళ్ల కిందటే అమెరికా ఘనంగా స్వాగతించింది. అమెరికా పార్లమెంటులో ఆయన ప్రసంగంపై సభ్యులు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తంచేశారు.
ప్రపంచ దేశాల మధ్య అంతరాలు అంతకంతకూ పెరుగుతున్న వేళ అమెరికాకు భారత్ నమ్మకమైన భాగస్వామి అని చెప్పడానికి ఆ క్షణం ఒక ఉదాహరణగా నిలిచింది.
నరేంద్ర మోదీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా అంతగా స్వాగతించడం వెనుక రెండు వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నాయి.
మొదటిది, యుక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి తీసుకోవాలని అమెరికా ఆశించింది. రెండోది, చైనా ప్రభావాన్ని ఎదుర్కోగల దేశాల కూటమిలో భారత్‌ను చేర్చింది.
రెండేళ్ల కిందటి వరకూ, అమెరికా దృష్టిలో భారతదేశం ఒక పార్ట్‌నర్ మాత్రమే కాదు, ఆసియాలో బలమైన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.
ఈ వాణిజ్య యుద్ధంవల్ల తాత్కాలికంగా భారతదేశానికి నష్టమేనని, కానీ దీని కారణంగా అమెరికా ఒక సన్నిహిత భాగస్వామిని కోల్పోవచ్చని, చైనా విషయంలో తనకు సాయంగా ఉండగల మిత్ర దేశాన్ని దూరం చేసుకోవచ్చని కొంతమంది దౌత్యవేత్తలు వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ సుంకాల నిర్ణయం భారతదేశానికి పెద్ద దెబ్బ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ ప్రభావాన్ని తట్టుకోవడానికి భారత ఎగుమతిదారులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు.
ట్రంప్ నిర్ణయం షాకింగ్‌లాంటిదని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) పేర్కొంది. ఈ సుంకాల నిర్ణయంతో అమెరికాకు భారత్ చేసే మొత్తం ఎగుమతుల్లో సగానికి పైగా ప్రభావితమవుతాయని ఆ సంస్థ భావిస్తోంది.
దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్' (జీటీఆర్ఐ) అనే థింక్ ట్యాంక్ సంస్థ అంచనా ప్రకారం అమెరికాకు భారత్ ఎగుమతుల్లో 40 నుంచి 50 శాతం వరకూ తగ్గవచ్చు.
భారతదేశం సంయమనం పాటించాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ సూచించారు. ‘‘భారత్ మౌనంగా ఉండాలి. ప్రతీకారం లేదా అపనమ్మకం ఉన్న పరిస్థితుల్లో అర్థవంతమైన చర్చలు జరగవని అర్థం చేసుకోవాలి’’ అన్నారు.
ట్రంప్ కోపానికి కారణం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం మాత్రమే కాదు, యుక్రెయిన్‌లో కాల్పుల విరమణ సాధించడంలో ఆయన విఫలమవ్వడం కూడా ఒకటని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని 24 గంటల్లో ఆపుతానని అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రకటించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఏడు నెలలు గడుస్తున్నా అది జరగలేదు.
అందుకే, భారత్ ఈజీ టార్గెట్ అయ్యిందా?


ఫొటో సోర్స్, Getty
ట్రంప్ విధానంలో వ్యూహాత్మక గందరగోళాన్ని కొంతమంది నిపుణులు లోతుగా పరిశీలిస్తున్నారు.
ఈ సుంకాల దాడి దూరదృష్టితో చేసిందికాదని బీజింగ్‌కు చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హువాంగ్ హువా అభిప్రాయపడ్డారు.
‘‘భారత్ నష్టాలను చూస్తుంది. కానీ అమెరికాకు మరింత నష్టం. భారత్ పట్ల ట్రంప్ విదేశాంగ విధానం తప్పుడు దిశలో వెళ్తోందని అనుకుంటున్నా’’ అని హువాంగ్ అన్నారు.
ఇది భారత్‌ను చైనాకు దగ్గర చేస్తుందని హువాంగ్ భావిస్తున్నారు. అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి చైనా, భారత్ కలిసి నిలబడే పరిస్థితిని ఆయన ఊహిస్తున్నారు.
సరిగ్గా ఇదే తరుణంలో, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాన మంత్రి మోదీ చైనాకు వెళ్లనుండటం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితుల్లో, షీ జిన్‌పింగ్, మోదీ ఒకే వేదికపైకి రావడం ద్వారా ఒత్తిడికి తాము తలొగ్గేది లేదనే సందేశాన్ని భారత్ ఇచ్చినట్లవుతుంది.
భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ ఏమిటి?
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్‌కు రెడ్ కార్పెట్ వేయలేదని అర్ధమవుతూనే ఉంది. బ్రెజిల్ తర్వాత, ఇప్పుడు భారతదేశం కూడా 50 శాతం టారిఫ్‌తో ఎదురుదెబ్బ తిననుంది.
దీనికి రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపకపోవడమే కారణమని అమెరికా చెబుతోంది.
రష్యాను ఒంటరి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు, భారత్ ఆ దేశం నుంచి చమురు కొనడం వల్ల బలహీనపడుతున్నాయని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్రకటనపై భారత్ ఆచితూచి స్పందించింది. ట్రంప్ నిర్ణయం 'అనుచితమైంది, అహేతుకమైంది' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను భారత్ తీసుకుంటుందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty
రష్యా వైఖరితో ట్రంప్ ఇబ్బంది పడుతున్నారా?
ట్రంప్ రెండో దఫా పదవీకాలంలో అమెరికా దౌత్య విధాన స్వభావం భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈసారి ట్రంప్ తన దౌత్యాన్ని వాణిజ్యం వైపు మళ్లిస్తున్నారు.
''గతంలో ట్రంప్ చాలా దేశాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత వాటిని మార్చుకున్నారు. చాలాసార్లు ఆయన ప్రకటనలు చర్చల్లో ఒత్తిడిని సృష్టించడానికి ఉద్దేశించినవే'' అని భారత్ మాజీ దౌత్యవేత్త శరద్ సభర్వాల్ అన్నారు.
ఈ టారిఫ్ విధానం అమెరికాకు చేటు చేస్తుందనే విషయం నిరూపితమవుతుందని ప్రొఫెసర్ హువాంగ్ గట్టిగా చెబుతున్నారు.
ట్రంప్ నుంచి ఎదురయ్యే ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే చైనా, భారత్ మధ్య బలమైన సంబంధాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
బహుశా, ఈ విషయంలో ప్రధానమంత్రి మోదీ చైనా పర్యటన చాలా కీలకం కావచ్చు.
ఇది కేవలం బెదిరింపు కోసమేనా?
ప్రస్తుత అమెరికా విదేశాంగ విధానం వాణిజ్యం ద్వారా మిత్ర దేశాలపై ఒత్తిడి తేవడానికి ఒక వ్యూహం మాత్రమే అయితే, అందువల్ల భారత్ పట్ల ట్రంప్ ఆగ్రహంలో వాస్తవం లేదని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాల్పుల విరమణకు రష్యా అంగీకరిస్తే, సంబంధాలు మళ్లీ మెరుగవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
అసలు ఈ సుంకాల యుద్ధం వాస్తవ విధానమా, లేదంటే ట్రంప్ దీన్ని బేరసారాల చిప్‌గా ఉపయోగిస్తున్నారా? అనేదే ఇప్పుడు ప్రశ్న.
భారత మాజీ దౌత్యవేత్త శరద్ సభర్వాల్ ఏమంటారంటే, ''భారతదేశంపై ట్రంప్ 50 శాతం సుంకాన్ని వాస్తవంగా అమలుచేస్తారో లేదో వేచిచూడాల్సిందే. 25 శాతం అదనపు సుంకం 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. నాటికి కొద్దిరోజుల ముందే ఇరు దేశాల మధ్య తదుపరి వాణిజ్య చర్చలు జరగనున్నాయి'' అని అన్నారు.
అంటే, చర్చలకు ఇంకా అవకాశం ఉంది. భారత్‌కు ఆప్షన్లు ఉన్నాయి, ఆ విషయం ఆ దేశానికి తెలుసు.
మోదీ ప్రభుత్వం ఇప్పటివరకూ తన ప్రతిస్పందనలో చాలా జాగ్రత్త వహిస్తోంది.
భారత్ ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా ఉన్నాయని శరద్ సభర్వాల్ భావిస్తున్నారు.
''తన జాతీయ ప్రయోజనాలను, ఇంధన భద్రతను కాపాడుకుంటామని భారత్ ప్రకటించింది. ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన ఆప్షన్లు ఏమున్నాయో నాకు తెలియదు. కానీ చర్చలకు అవకాశాలను మనం సజీవంగా ఉంచాలి'' అన్నారు.
పాకిస్తాన్ వైపు అమెరికా మొగ్గు చూపిస్తోందా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ను మరింత ఇబ్బందిపెట్టే విషయమేమిటంటే, పాకిస్తాన్‌తో అమెరికాకు పెరుగుతున్న సాన్నిహిత్యం.
పాకిస్తాన్‌లో భారత్ హైకమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న సభర్వాల్... పాకిస్తాన్‌తో అమెరికా దౌత్యవిధానంలో ఒక నమూనా ఉందంటున్నారు.
''పాకిస్తాన్‌తో లావాదేవీల ఆధారిత సంబంధం మళ్లీ ఉద్భవిస్తున్నట్లు కనిపిస్తోంది'' అని చెప్పారు.
ఈ లావాదేవీల విషయంలో, ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో బిజినెస్ ప్రయోజనాలను, పాకిస్తాన్‌లో చమురు అన్వేషణ గురించి అకస్మాత్తుగా ప్రస్తావించడాన్ని సభర్వాల్ గుర్తు చేశారు.
కానీ ప్రస్తుతం పాకిస్తాన్‌లో పెద్దగా చమురు నిల్వలు లేవు. అక్కడ శాంతిభద్రతల పరిస్థితి కూడా స్థిరంగా లేదు.
''వాస్తవానికి ఈ సహకారం అమెరికా అంచనాలను అందుకోలేకపోవచ్చు. పాకిస్తాన్‌కు ప్రాధాన్యమివ్వడం కూడా భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఒక భాగమే అనిపిస్తోంది'' అని సభర్వాల్ చెప్పారు.
అయితే, దీని అర్థం భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడవని కాదు.
డిఫెన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్ రంగాల్లో సంస్థాగత సంబంధాలు బలంగా ఉన్నాయి. కానీ, అవి ప్రస్తుతం పరీక్ష ఎదుర్కొంటున్నాయి.
ఇదే విధానాన్ని కొనసాగిస్తే, ప్రపంచ అధికార సమతుల్యతలో కీలక పాత్ర పోషించగల భాగస్వామి (భారత్)ను అమెరికా నుంచి ట్రంప్ దూరం చేసుకుంటారు.
భారత్-చైనాలు కలిసిపోయేంత బలంగా ట్రంప్ చర్యలు ఉండకపోవచ్చు. కానీ స్వతంత్రంగా, సమతుల్య వైఖరిని అవలంభించేలా ఉండవచ్చు.
ఆ విధానం అమెరికా ప్రభావాన్ని తగ్గిస్తుంది.
అంటే బాల్ ఇప్పుడు ట్రంప్ కోర్టులోనే ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














