చనిపోయి 28 ఏళ్లయిన చెక్కు చెదరకుండా దొరికిన మృతదేహం

పాకిస్తాన్, గ్లేసియర్ ప్రమాదం

ఫొటో సోర్స్, Omar Khan

ఫొటో క్యాప్షన్, మృతదేహం వద్ద లభించిన గుర్తింపుకార్డు
    • రచయిత, జోయల్ గ్యుంటో
    • హోదా, బీబీసీ ప్రతినిధి
    • నుంచి, సింగపూర్
    • రచయిత, మహమ్మద్ జుబాయిర్ ఖాన్
    • నుంచి, పాకిస్తాన్

మంచుతుఫాను నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి హిమానీనదం (గ్లేసియర్) పగులులోకి జారిపోయారు. 28 ఏళ్ల తర్వాత ఆయన మృతదేహం బయటపడింది.

పాకిస్తాన్ మారుమూల ప్రాంతమైన కోహిస్తాన్ రీజియన్‌లోని లేడీ వ్యాలీ మంచు పర్వతాలలో కరిగిన హిమానీనదం నుంచి బయటపడిన ఆ మృతదేహం ఓ గొర్రెల కాపరి కంటపడింది. అది కుళ్లిపోలేదు. మృతదేహంపై దుస్తులు కూడా అలాగే ఉన్నాయి.

ఆ మృతదేహంతో పాటు లభించిన గుర్తింపుకార్డు ఆధారంగా పోలీసులు ఆయన వివరాలు తెలుసుకోగలిగారు. అతని పేరు నసీరుద్దీన్.

1997 జూన్‌ నెలలో సంభవించిన మంచుతుఫాను సమయంలో ఒక హిమానీనదం పగులులోకి జారిపడిపోయిన ఆయన తర్వాత కనిపించకుండాపోయారు.

ఆ ప్రాంతంలో ఇటీవలి సంవత్సరాల్లో హిమపాతం తగ్గిపోయింది. సూర్యకాంతి నేరుగా పడుతుండటంతో హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి.

మారుతున్న వాతావరణ పరిస్థితులు హిమానీనదాలు వేగంగా కరిగిపోవడానికి ఏవిధంగా ప్రభావితం చేస్తున్నదీ, అక్కడ బయటపడ్డ నసీరుద్ధీన్ మృతదేహం అద్దంపడుతోందని నిపుణులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ సంఘటన జరిగిన ప్రదేశం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోనిది (ప్రతీకాత్మక చిత్రం)

కుటుంబ కలహాలతో ఇంటినుంచి వెళ్లిపోయి...

నసీరుద్దీన్ మృతదేహాన్ని గుర్తించిన గొర్రెలకాపరి ఒమర్ ఖాన్ బీబీసీతో మాట్లాడారు.

''నేను చూసింది నమ్మశక్యం కాకుండా ఉంది. ఆ మృతదేహం చెడిపోలేదు. దుస్తులు కూడా చిరిగిపోలేదు'' అని చెప్పారు.

‌మృతుడు నసీరుద్దీన్ అని పోలీసులు గుర్తించిన తర్వాత ఆయన గురించి స్థానికులు మరిన్ని వివరాలు అందించారని ఒమర్ ఖాన్ వెల్లడించారు.

నసీరుద్దీన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంలో గొడవల కారణంగా తన సోదరుడు కతిరుద్దీన్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారని పోలీసులు చెప్పారు.

''ఆ రోజు ఉదయం మేమిద్దరమూ గుర్రంపై లోయకు చేరుకున్నాం. మధ్యాహ్నం నా సోదరుడు ఒక గుహలోకి వెళ్లాడు. తర్వాత తిరిగిరాలేదు. అతని కోసం గుహలోపల వెతికాను. కనిపించలేదు. తర్వాత స్థానికుల సహాయంతో ఆ ప్రాంతంలో వెతికాను. వారూ అతని ఆచూకీ కనుక్కోలేకపోయారు'' అని కతిరుద్దీన్ బీబీసీకి చెప్పారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Suleman

ఫొటో క్యాప్షన్, ఈ ప్రాంతం కఠినమైన రోడ్లు, కొండల మధ్య ఉంటుంది.

మమ్మీలా మారిపోయింది....

''మానవ మృతదేహం హిమానీనదంలో పడిపోతే, తీవ్రమైన చల్లదనంతో వేగంగా గడ్డకట్టిపోతుంది. కుళ్లిపోకుండా ఆపుతుంది’’ అని ఇస్లామాబాద్‌లోని కోమ్సాట్స్ యూనివర్సిటీ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ మహమ్మద్ బిలాల్ చెప్పారు.

హిమానీనదంలో తేమ, ఆక్సిజన్ లేకపోవడంతో ఆ మృతదేహం మమ్మీగా మారిపోతుందని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)