రష్యా నుంచి చమురు ఎక్కువగా కొంటున్న దేశం చైనా, కానీ ట్రంప్ టార్గెట్ భారత్, ఎందుకు?

ఫొటో సోర్స్, Mikhail Svetlov/Getty
- రచయిత, సుమంత్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి చేరుకున్నాయి. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.
రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూ.. యుక్రెయిన్‌లో యుద్ధాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని, అదే సుంకాల విధింపుకు కారణంగా ట్రంప్ చెబుతున్నారు.
దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. ''ఈ చర్య అనవసరమైంది, అహేతుకమైంది, అకారణమైంది" అని పేర్కొంది.
అమెరికాతో పాటు చాలా యూరోపియన్ దేశాలు రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని భారత్ అంటోంది.
అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. భారత్ మాత్రమే కాకుండా, రష్యాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనా.
వైట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన బీబీసీ ప్రతినిధి ఆంథోనీ జర్చర్.. ''చైనాతో పాటు చాలా దేశాలు రష్యా నుంచి చమురు కొంటున్నాయి. మరి భారత్‌నే ఎందుకు టార్గెట్ చేశారు?'' అని ట్రంప్‌ను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు స్పందించిన ట్రంప్, '' 8 గంటలే గడిచాయి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మీరు ఇంకా చాలా చూడాల్సి ఉంది. మరిన్ని అదనపు ఆంక్షలను కూడా చూడొచ్చు'' అని అన్నారు.

చైనాపై అదనపు సుంకాలు విధించే ప్రణాళికలేమైనా ఉన్నాయా? అని ట్రంప్‌ను అడిగారు.
'' అదీ జరగొచ్చు. తర్వాత తీసుకోబోయే చర్యలపై అది ఆధారపడి ఉంటుంది'' అని తెలిపారు.
వాణిజ్య ఒప్పందం కోసం విధించిన గడువు ఆగస్టు 1తో ముగియడంతో ఇటీవల 90కి పైగా దేశాలపై సరికొత్తగా సుంకాలు విధించారు డోనల్డ్ ట్రంప్.
ట్రంప్ అత్యధిక సుంకాలు విధించిన దేశాల్లో బ్రిక్స్ దేశాలు కూడా ఉన్నాయి.
సుంకాల కొత్త జాబితా ప్రకారం.. బ్రెజిల్‌పై 50 శాతం సుంకాలను విధించారు ట్రంప్.
దీంతోపాటు, దక్షిణాఫ్రికా, చైనాలపై 30 శాతం చొప్పున సుంకాలు వేశారు.
భారత్‌తో పోలిస్తే రష్యాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా.
అయినప్పటికీ, భారత్‌తో పోలిస్తే చైనాపై తక్కువ సుంకాలు ఎందుకు వేశారనే దానిపై నిపుణులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా కంటే భారత్‌పైనే అధిక సుంకాలు ఎందుకు?
సుంకాల విషయంలో చైనా చాలా తెలివిగా వ్యవహరించిందని బ్లూమ్‌బర్గ్ సీనియర్ గ్లోబల్ ఎఫైర్స్ అనలిస్ట్ కరిష్మా వాస్వాని బీబీసీతో చెప్పారు.
'' ట్రంప్ సుంకాల విషయంలో చైనా దౌత్యం చాలా పరిపక్వతతో ఉంది. కొన్ని తక్కువ అభివృద్ధి చెందిన వాణిజ్య భాగస్వామి దేశాలకు చైనా సుంకాలను జీరో చేసింది. జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చే ఉత్పత్తులకు డిమాండ్‌ను క్రమబద్ధీకరించడం వంటి చర్యలు చైనాను అనుభవంతో కూడిన దేశంగా నిలిపాయి'' అని తెలిపారు.
''అమెరికా, చైనా రెండింటికీ తమ వ్యాపార అవసరాలను ఎలా తీర్చుకోవాలో తెలుసు. పలు దఫాల చర్చల తర్వాత సుంకాలు తగ్గుతూ రావడం చైనా ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలియజేసింది'' అని కరిష్మా వాస్వాని చెప్పారు.
''టారిఫ్‌ల విషయంలో చైనా నాకేం బాధలేదన్నట్లు వ్యవహరించింది'' అని అమెరికాకు చెందిన దక్షిణాసియా విశ్లేషకులు మైకేల్ కుగల్‌మెన్ చెప్పారు.
'' కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ క్రెడిట్ తీసుకోవడం గురించి చైనా స్పందించలేదు. ట్రంప్‌తో మాట్లాడేందుకు చైనా నేతలెవరూ ఫోన్ చేయలేదు. కానీ, భారత్ విషయంలో అది జరిగింది. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని ట్రంప్ క్రెడిట్ తీసుకోవడాన్ని భారత్ ఖండించింది. ఈ విషయంపై పదేపదే పలు ప్రకటనలు జారీ చేసింది'' అని కుగల్‌మెన్ అన్నారు.
అందుకే, సుంకాల విషయంలో భారత్‌పై ట్రంప్ ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తున్నారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇది ట్రంప్ 'డబుల్ స్టాండర్డ్'గా కుగల్‌మెన్ అభివర్ణించారు.
ట్రంప్ వైఖరిపై భారత మాజీ విదేశీ కార్యదర్శి కన్వల్ సిబల్ కూడా పలు ప్రశ్నలు లేవనెత్తారు.
'' టారిఫ్ కింగ్ అంటూ ట్రంప్ నిరంతరం భారత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. టారిఫ్‌లను విధిస్తానని హెచ్చరించారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని చెబుతున్నారు. కానీ, ఏది తప్పు, ఏది ఒప్పో కనీసం ఆయనకు మోదీ చెప్పడం లేదు'' అని అన్నారు కన్వల్ సిబల్.
'' అమెరికాను చైనా అధికార ప్రతినిధి ప్రతిరోజూ విమర్శించారు. అవమానించారు. బహిరంగంగా సవాల్ విసిరారు. అయినప్పటికీ, చైనాపై టారిఫ్‌ల విధింపును ట్రంప్ తాత్సారం చేస్తున్నారు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యాతో ఎవరెంత వాణిజ్యం చేస్తున్నారు?
''యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యాను అమెరికా, యూరోపియన్ దేశాలు విమర్శించినప్పటికీ, ఆ దేశంతో మాత్రం వ్యాపారం చేశాయి'' అని ఫిన్‌లాండ్‌కు చెందిన థింక్ ట్యాంక్ సంస్థ 'సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ)' తెలిపింది.
రష్యా చమురును కొంటున్నందుకు భారత్‌ను ట్రంప్ టార్గెట్‌గా చేసుకున్నారు. కానీ, రష్యా నుంచి యూరోపియన్ దేశాలకే ఎక్కువగా ఇంధనం ఎగుమతి అవుతోందని సీఆర్‌ఈఏ రిపోర్ట్ నివేదించింది.
2025 ఏప్రిల్‌లో రష్యా నుంచి యూరోపియన్ దేశాలకు 3.32 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఎగుమతి అయిందని సీఆర్‌ఈఏ తెలిపింది. 2025 జూన్‌లో 3.01 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయినట్లు పేర్కొంది.
సీఆర్‌ఈఏ రిపోర్టు ప్రకారం.. భారత్, చైనాలు రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారులు. కానీ, యూరోపియన్ యూనియన్ అతిపెద్ద గ్యాస్ కొనుగోలుదారుగా ఉంది.
బొగ్గు.. 2022 డిసెంబర్ 5 నుంచి 2025 జూన్ మధ్య కాలంలో రష్యా మొత్తం బొగ్గు ఎగుమతుల్లో 44 శాతం చైనా కొనుగోలు చేసింది. భారత్ కేవలం 19 శాతమే కొన్నది. తుర్కియే 11 శాతం, దక్షిణ కొరియా 9 శాతం, తైవాన్ 4 శాతం కొనుగోలు చేశాయి.
క్రూడాయిల్.. రష్యా మొత్తం క్రూడాయిల్ ఎగుమతుల్లో 47 శాతం చైనా కొనుగోలు చేసింది. క్రూడాయిల్ కొనుగోళ్లలో భారత్ రెండో స్థానంలో ఉంది. మొత్తం ఆయిల్‌లో 38 శాతం భారత్ కొన్నది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్, తుర్కియే 6 శాతం చొప్పున చమురును కొన్నాయి.
లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ)... యూరోపియన్ యూనియన్ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. మొత్తం రష్యా ఎల్ఎన్‌జీ ఎగుమతుల్లో 51 శాతం యూరోపియన్ యూనియన్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత 13 శాతం చైనా, 12 శాతం బ్రెజిల్ కొన్నాయి.
పైప్‌లైన్ గ్యాస్.. పైప్‌లైన్ల ద్వారా అత్యధిక గ్యాస్‌ను కూడా రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ కొన్నది. మొత్తం పైప్‌లైన్ గ్యాస్ ఎగుమతుల్లో 37 శాతం యూరోపియన్ యూనియన్ కొనుగోలు చేసినవే. ఆ తర్వాత 30 శాతం చైనా, 27 శాతం తుర్కియే కొనుగోలు చేసింది.

ఫొటో సోర్స్, ANDREW CABALLERO-REYNOLDS/AFP via Getty
ట్రంప్ కోపానికి 'ట్రేడ్ డీల్' కారణమా?
మోదీకి అంతకుముందు ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్, ప్రస్తుతం ఆయనకు ఎందుకు వ్యతిరేకంగా మారారు?
మోదీ, ట్రంప్ మధ్య స్నేహం చాలా బాగుందన్నట్లు మీడియా పేర్కొంటూ వచ్చింది. కానీ, రెండు దేశాల మధ్య సంబంధాల సంక్లిష్టతను మీడియా చూపించలేదు. చివరకు, వ్యక్తిగత సంబంధాలు రాజకీయాల్లో పనిచేయవని స్పష్టమైంది.
ట్రంప్ రాజకీయాల్లో భావోద్వేగాల ప్రస్తావనే ఉండదు. చమురు, వాణిజ్యం విషయంలో ట్రంప్‌తో భారత్ ఏకీభవించలేదని నిపుణులు చెప్పారు. అందుకే, ఇదంతా జరుగుతుందన్నారు.
అమెరికా, భారత్ మధ్యలో పలు దఫాల చర్చలు జరిగిన తర్వాత కూడా, వాణిజ్య ఒప్పందం జరగలేదు.
వ్యవసాయం, పాల ఉత్పత్తుల రంగంలో అమెరికాకు రాయితీలు ఇచ్చేందుకు భారత్ ఒప్పుకోకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














