జైశంకర్ చైనా పర్యటన.. పాకిస్తాన్, అమెరికాకు సందేశమా?

ఫొటో సోర్స్, Getty Images
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఈ నెలలో (జూలై) చైనాను సందర్శించారు. ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సహా ఉన్నతాధికారులను కలిశారు.
కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల తర్వాత, ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిన పెట్టేందుకు రెండుదేశాలూ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో జైశంకర్ పర్యటన జరిగింది.
2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత తొలి చైనా పర్యటన ఇది.
భారత్-పాకిస్తాన్ ఘర్షణలో పాకిస్తాన్‌కు చైనా మద్దతు ఇవ్వడం గురించి చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో.. జైశంకర్ చైనా పర్యటన కేవలం దౌత్యపరంగానే కాకుండా, ఇంకా అనేక కీలక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.
భారత్-పాకిస్తాన్ ఘర్షణ సమయంలో పాకిస్తాన్‌కు చైనా బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాకుండా, ఆయుధాలను కూడా అందించిందని నివేదికలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో, జైశంకర్ చైనాకు వెళ్లడం ఎంతవరకు సరైనది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చైనాకు దగ్గరవ్వడం ద్వారా అమెరికాతో తన సంబంధాలను బ్యాలెన్స్ చేయాలని భారత్ కోరుకుంటోందా? దక్షిణాసియాతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కంటే చైనా ప్రభావం ఎక్కువా?
బీబీసీ హిందీ కార్యక్రమం 'ది లెన్స్'లో, కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మ ఈ అంశాలన్నింటినీ చర్చించారు.
కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మతో పాటు దౌత్య వ్యవహారాల నిపుణురాలు శృతి పాండలే, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల ప్రొఫెసర్ పుష్ప్ అధికారి, దిల్లీ విశ్వవిద్యాలయంలో, ఈస్ట్ ఏసియా స్టడీస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ రంజన్ ఈ చర్చలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, X/DR S JAISHANKAR
దౌత్య సంబంధాల్లో కొత్త దశ ప్రారంభమా?
గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలిశారు. 2020లో ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత మోదీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన తొలి ద్వైపాక్షిక సమావేశం అది.
దీని తరువాత, చైనాతో వరుస చర్చలు ప్రారంభమయ్యాయి. గత జూన్‌లో, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బీజింగ్ వెళ్లారు. వారిద్దరూ అక్కడ జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశంలో పాల్గొన్నారు.
ఇటీవల, జైశంకర్ పర్యటన. దీంతో ఇది సంబంధాల పునరుద్ధరణగా కొంతమంది అభివర్ణిస్తున్నారు.
జైశంకర్ పర్యటనను ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నంగా చూడాలని శృతి పండాలే అభిప్రాయపడ్డారు.
"అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొని ఉంది. ప్రస్తుతం, సంబంధాల్లో ట్రాన్స్‌నేషనలిజం ముఖ్యపాత్ర పోషిస్తుందని భారత్ అర్థం చేసుకుంది. గతంలో, ఏదైనా సమస్య వస్తే పరిష్కరించేందుకు కొన్ని దేశాలు కలిసి వచ్చేవి. గతంలో చైనాతో సంబంధాలు ఒక సమస్య. ఆ తర్వాత, రష్యాతో వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు. కాబట్టి, జైశంకర్ పర్యటనను కూడా ఈ కోణంలోనే చూడాలి" అని శృతి పండాలే అన్నారు.
భారత్, చైనా మధ్య మూడు వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దు రేఖ ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలో నదులు, సరస్సులు, మంచుప్రాంతాలు ఉండటం వల్ల సరిహద్దు రేఖ స్పష్టంగా లేదు. ఈ అస్పష్టత వల్ల ఇరుదేశాల సైనికుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి.
ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్, చైనా రెండింటిపైనా సుంకాలు విధించారు. భారత్ చర్చల మార్గాన్ని ఎంచుకోగా, చైనా బహిరంగంగా నిరసన వ్యక్తం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రాధాన్యం ఏంటి?
అంతర్జాతీయ రాజకీయాల ప్రొఫెసర్ పుష్ప్ అధికారి ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, '' చైనా, భారత్ మధ్య ప్రధానమైనది సరిహద్దు సమస్య. కానీ, ఇప్పుడు దాన్ని పక్కనపెట్టారు. దీనికి కారణం డోనల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడి విధానాలు రెండు దేశాలు దగ్గరయ్యేలా ప్రేరేపించాయి" అని అన్నారు.
"రెండు దేశాల మధ్య నమ్మకమైన ఈ సంబంధం ఎంతకాలం ఉంటుందో చూడాలి. అమెరికా భారత్‌ను ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కోరవచ్చు. అలాగే, రష్యా, చైనాతో సహా బ్రిక్స్ దేశాల నుంచి దూరంగా ఉండాలని అడగొచ్చు. భారత్ ట్రంప్ మాటలకు ఒప్పుకుంటే, చైనాతో సంబంధాలు ఎక్కువ కాలం కొనసాగుతాయని అనుకోను. జైశంకర్ ప్రయత్నం మంచిదే. కానీ అప్పుడే ఒక నిర్ణయానికి రాలేం" అని పుష్ప్ అధికారి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, అమెరికా, రష్యాలకు భారత్ ఇచ్చే సందేశం ఏంటి?
జైశంకర్ పర్యటన భారత అంతర్గత రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్‌కు మద్దతిచ్చే చైనాకు వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది.
దిల్లీ యూనివర్సిటీ, ఈస్ట్ ఏసియా స్టడీస్ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ రంజన్ మాట్లాడుతూ, "విదేశాంగ మంత్రి చైనాకు వెళ్లి ఉండకపోతే, భారత ప్రయోజనాలు ఎక్కడో ఓచోట దెబ్బతినే అవకాశం ఉంది. ఎస్‌సీఓ వేదికపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన స్వరాన్ని వినిపించింది. భారత్ ఈ సమావేశానికి హాజరు కాకపోతే, పాకిస్తాన్ దానిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం భారత్‌లో జరగనుంది. ఇప్పుడు మనం నిరాకరిస్తే, చైనా నాయకత్వం భారత్ రావడానికి నిరాకరించే అవకాశం కూడా లేకపోలేదు" అని అన్నారు.
భారత్, పాకిస్తాన్ ఘర్షణ తీవ్రస్థాయికి చేరిన సమయంలో, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో కాల్పుల విరమణ ప్రకటించారు. కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రను భారత్ అంగీకరించలేదు. పాకిస్తాన్ మాత్రం ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అయినప్పటికీ, కాల్పుల విరమణ అవసరాన్ని ట్రంప్ పదేపదే పునరుద్ఘాటించారు.
"భారత్-పాకిస్తాన్ సమస్య, ద్వైపాక్షిక సమస్య అని అమెరికాకు భారత్ పదేపదే చెప్పింది. అలాగే, చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించాలని భారత్ కోరుకుంటోంది. ద్వైపాక్షిక సంబంధాలను ఏ థర్డ్ పార్టీ(మూడవ పక్షం) ప్రభావితం చేయలేదని ఎస్‌సీఓలో విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే, పాకిస్తాన్. ట్రంప్ విధానాల కారణంగా భారత్ తన విధానాలను మార్చుకోవాల్సి వచ్చింది. భారత్ ప్రయోజనాల రీత్యా చైనా, అమెరికాలతో బ్యాలెన్స్ అవసరం" అని శృతి పాండలే అన్నారు.
భారత్ మల్టీపోలార్ వరల్డ్ (బహుళ ధ్రువ ప్రపంచం) గురించి మాట్లాడుతోంది. అటువంటి పరిస్థితిలో, జైశంకర్ చైనా పర్యటనను ఇతర దేశాలు ఎలా చూస్తున్నాయి?
"రష్యా-చైనా-భారత్ అనే త్రైపాక్షిక కూటమిని క్రియాశీలకం చేయాలనుకుంటున్నట్లు రష్యా నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, భారత్ అమెరికాకు మరింత దగ్గరవుతున్న నేపథ్యంలో, భారత్ దీనికి స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం, భారత్ తన భాగస్వామిని ఎంచుకునే సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఇలాంటి ప్రకటన అమెరికా నుంచి కూడా రావొచ్చు. ఈ విషయంలో, భారత్ వైఖరి ఏంటో తెలుసుకోవాలంటే కొద్దికాలం వేచిచూడాల్సిందే" అని ప్రొఫెసర్ పుష్ప్ అధికారి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














