అమెరికా అధ్యక్షుడికి వచ్చిన కాళ్ల వాపు ప్రమాదకరమా? ఏమిటీ వ్యాధి?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, జాక్వెలిన్ హోవార్డ్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ‘క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ’ అనే వ్యాధి ఉన్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.
ఆయన చేతికి అయిన డ్యామేజ్ గురించి చాలా కాలంగా ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో.. ట్రంప్ చేయించుకున్న వైద్య పరీక్షల్లో ఈ దీర్ఘకాలిక సమస్య ఉన్నట్లు తెలిసింది.
79 ఏళ్ల ట్రంప్‌కు కాళ్లల్లో వాపు వచ్చినట్లు గమనించడంతో వెంటనే వైద్య పరీక్షలు చేయించగా ఈ అనారోగ్య సమస్య ఉన్నట్లు నిర్ధరణ అయిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.
ఇటీవలి ట్రంప్ ఫోటోల్లో ఆయన చేతికి వెనుకాల మేకప్ ప్యాచ్‌లు కనిపించాయి.
అయితే, దీనికి సిరల వ్యాధికి సంబంధం లేదని వైట్‌హౌస్ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడికి నిర్ధరణ అయిన ‘క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ’ వ్యాధి గురించి మనం కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ అంటే ఏమిటి?
ట్రంప్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. సాధారణంగా 70 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపిస్తుందని రిపోర్టర్లకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వైట్‌హౌస్ వైద్యుడు, కెప్టెన్ సీన్ బార్బబెల్లా పేర్కొన్నారు.
గుండె వైపు రక్తాన్ని వెళ్లకుండా కాళ్లలోని సిరలు అడ్డుకున్నప్పుడు క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ ఏర్పడుతుంది. దీనివల్ల కిందనున్న అవయవాల్లోనే రక్తం పేరుకుపోతుంది.
గ్రావిటీకి వ్యతిరేక దిశలో కాళ్ల నుంచి గుండెకు సాధారణంగా రక్తం పైకి వెళ్తుంటుంది. అయితే, వయసు పైబడిన వారిలో ఈ ప్రక్రియ కాస్త క్లిష్టంగా జరుగుతుంటుంది.
వయసు పెరుగుతున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది.
సిరలు, వాటి కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ వస్తుందని.. దీనివల్ల రక్తం కాళ్లల్లోకి చేరుతుందని ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీలో వాస్క్యులర్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మెరిల్ లోగాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ వల్ల కాళ్లల్లోనే రక్తం పేరుకుపోతే వాపు వస్తుంది. ఇటీవల ట్రంప్ ఫోటోల్లో ఆయన మడమల్లో వాపు కనిపించడానికి ఇదే కారణం.
జులై 13న న్యూజెర్సీలో జరిగిన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా తీసిన ఫోటోల్లో ట్రంప్ పాదాలు ఉబ్బినట్లు కనిపించాయి.
ఆ తర్వాత కొన్నిరోజులకు, వైట్‌హౌస్‌లో బహ్రెయిన్ ప్రధానమంత్రి సల్మాన్ బిన్ హమాద్ బిన్ ఇసా అల్-ఖలిఫాతో సమావేశమైనప్పుడు తీసిన ఫోటోల్లో ఆయన చేతులపై బ్లూమార్కులు కనిపించాయి. ఫిబ్రవరి ప్రారంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో సమావేశమైనప్పుడు ట్రంప్ చేతిపై మార్కు ఉంది. దీంతో, అధ్యక్షుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆన్‌లైన్‌లో ఊహాగానాలు మొదలయ్యాయి.
క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ వల్ల నొప్పి, దురద లేదా సీరియస్ కేసుల్లో చర్మంలో మార్పులు, అల్సర్లు, రక్తస్రావం, కాళ్లలో రక్తం గడ్డకట్టే డీప్ వీన్ థ్రాంబోసిస్ రావొచ్చు.
''తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దీనికి సంబంధం ఉండొచ్చు. కానీ, ఇది అంత సీరియస్ వ్యాధి కాదు'' అని వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీలోని వాస్క్యులర్ సర్జరీ విభాగానికి చెందిన చైర్ డాక్టర్ మాథ్యూ ఎడ్వర్డ్స్ చెప్పారు.
''ఆయన వయసు వ్యక్తుల్లో బహుశా 10 నుంచి 35 శాతం మందికి ఈ వ్యాధి ఉంటుంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ వైద్యుడు ఏం చెప్పారు?
ఆయన కాళ్లలో వాపును గుర్తించిన తర్వాత, వైట్‌హౌస్ వైద్య విభాగం తగు జాగ్రత్తలతో ఆయనకు వైద్య పరీక్షలు చేసినట్లు ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా ఒక ప్రకటనలో చెప్పారు.
ట్రంప్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశామని, ఈ పరీక్షల్లో క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ వచ్చినట్లు తెలిసిందని డాక్టర్ బార్బబెల్లా తెలిపారు. ఇది అంత ప్రమాదకరమైన సమస్య కాదు. సాధారణంగా వయసు పైబడిన వారిలో కనిపించే సమస్యనే అని తెలిపారు.
డీప్ వీన్ థ్రాంబోసిస్, ధమనుల సమస్య వంటివేమీ లేవని చెప్పారు. ట్రంప్ మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
వైద్య పరీక్షల్లో గుండె పనితీరు, నిర్మాణం అంతా సాధారణంగా ఉందన్నారు. గుండె, కిడ్నీలకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని, ఇతర ఏ వ్యాధుల సంకేతాలు కనిపించలేదని ట్రంప్‌కు చేసిన ఇతర వైద్య పరీక్షల్లో తేలినట్లు వెల్లడించారు.
ఇటీవల ఫోటోల్లో ట్రంప్ చేతి వెనుకాల కనిపించిన మార్కులను బార్బబెల్లా కూడా గుర్తించారు.
''తరచూ కరచాలనం చేస్తుండటం, ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల చేతుల్లో ఉండే మృదువైన కణజాలానికి కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వాటివల్ల ఏర్పడినవే ఈ మచ్చలు'' అని తెలిపారు.
ఆస్పిరిన్ అనే మెడిసిన్‌ను హార్ట్ అటాక్ రాకుండా, రక్తం గడ్డకట్టకుండా, స్ట్రోక్ రాకుండా తీసుకుంటూ ఉంటారు.
వైట్‌హౌస్ వైద్యుడు చెప్పిన ఈ విషయాన్ని డాక్టర్ ఎడ్వర్డ్స్ కూడా అంగీకరించారు. ట్రంప్ వయసు, ఆస్పిరిన్ వాడకం వంటివి ఈ మచ్చలకు కారణం కావొచ్చన్నారు.

ఫొటో సోర్స్, Reuters
తన ఆరోగ్యం గురించి ట్రంప్ ఏం చెప్పారు?
రెండోసారి అధ్యక్షునిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఏప్రిల్ నెలలో వార్షిక వైద్య పరీక్షలు చేయించుకున్నారు ట్రంప్.
''అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం చాలా బాగుంది. గుండె, పల్మనరీ, న్యూరోలాజికల్ కార్యకలాపాలన్నీ మామూలుగానే ఉన్నాయి’’ డాక్టర్ బార్బబెల్లా ఒక ప్రకటనలో తెలిపారు.
కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకునేందుకు మందులు తీసుకోవాలని, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఆస్పిరిన్, చర్మం కోసం మొమెటాసోన్ క్రీమ్‌ను తీసుకోవాలని ఆ హెల్త్ అసెస్‌మెంట్ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు నిత్యం తన మెరుగైన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ... తనని తాను అత్యంత ఆరోగ్యవంతమైన అధ్యక్షుడిగా అభివర్ణించుకుంటూ ఉంటారు.
తొలిసారి వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత మాట్లాడిన ట్రంప్.. '' మొత్తంగా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను’’ అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














