'రష్యా సైనికులను చంపండి.. పాయింట్లు గెలుచుకోండి', ఏమిటీ స్కీమ్?

 రష్యా, యుక్రెయిన్, డ్రోన్లు, ఈ-పాయింట్లు

ఫొటో సోర్స్, BBC/Xavier Vanpevenaege

ఫొటో క్యాప్షన్, సంపాదించిన పాయింట్లతో మిలటరీ యూనిట్లు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వస్తువులు కొనుగోలు చేయొచ్చు.
    • రచయిత, పాల్ ఆడమ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రతిరోజూ వేలసంఖ్యలో చిత్రాలొస్తున్నాయి.

పొడవైన సరిహద్దు వెంబడి యుక్రెయిన్ సైనికుల వేటలో నేలకూలుతున్న శత్రు సైనికులు, యుద్ధ సామగ్రి అంతా చిత్రీకరించి, నమోదు చేసి, లెక్కిస్తున్నారు.

ఇదంతా చేయడానికి కారణం యుక్రెయిన్ సైన్యం తమకంటే చాలా శక్తిమంతమైన శత్రువుతో చేస్తున్న పోరాటంలో ప్రతి ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం.

గత ఏడాది మొదటిసారి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘‘ఆర్మీ ఆఫ్ డ్రోన్స్: బోనస్’’ (దీనిని ‘‘ఈ-పాయింట్స్’’ అని కూడా పిలుస్తారు) అనే పథకం కింద యుక్రెయిన్ సైనికులు.. రష్యా సైనికుడిని చంపినా లేదా ఆ దేశానికి చెందిన యుద్ధ పరికరాన్ని ధ్వంసం చేసినా ఆ యూనిట్‌కు పాయింట్లు లభిస్తాయి.

ఇది కొంతవరకు "కాల్ ఆఫ్ డ్యూటీ" అనే వీడియో గేమ్‌లోని కిల్‌స్ట్రీక్‌లా.. లేదా 1970ల టీవీ గేమ్ షోలా అనిపిస్తుంది. పాయింట్లు అంటే బహుమతులు.

''లక్ష్యం ఎంత పెద్దగా, ఎంత వ్యూహాత్మకంగా ఉంటే... ఆ యూనిట్‌కు అన్ని పాయింట్లు లభిస్తాయి'' అని బ్రేవ్ 1 టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఉదాహరణకు, శత్రువుకు చెందిన మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్‌ను ధ్వంసం చేస్తే 50 పాయింట్లు, ఓ ట్యాంక్‌ను ధ్వంసం చేస్తే 40 పాయింట్లు, ట్యాంక్‌కు నష్టం కలిగిస్తే 20 పాయింట్లు లభిస్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 రష్యా, యుక్రెయిన్, డ్రోన్లు, ఈ-పాయింట్లు

ఫొటో సోర్స్, BBC/Xavier Vanpevenaege

ఫొటో క్యాప్షన్, మిఖయిలో ఫెదొరోవ్

‘పాయింట్ల వల్ల సైనికులకు ఉత్సాహం వస్తోంది’

అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియోను కీవ్‌ జాగ్రత్తగా విశ్లేషిస్తోంది. మారుతున్న సైనిక ప్రాధాన్యాల ప్రకారం పాయింట్లు కేటాయిస్తోంది.

‘‘యుద్ధం లెక్కలపై ఇది నాణ్యమైన సమాచారం. ఇది పరిమిత వనరులను మరింత ప్రభావవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో అర్ధం చేసుకోవడం’’ అని ఈ-పాయింట్స్ పథకం రూపొందించిన మిఖయిలో ఫెదొరోవ్ చెప్పారు. ఆయన యుక్రెయిన్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ మంత్రి.

మూడున్నరేళ్లుగా సాగుతున్న కఠినమైన యుద్ధం తర్వాత, ఈ పాయింట్ల వ్యవస్థకు మరో ముఖ్యమైన ఉపయోగం కనిపించిందని... అది సైనికుల్లో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని పెంచడమని ఆయన తెలిపారు.

‘‘పాయింట్ల విలువలు మారితే, సైనికుల ఉత్సాహం ఎలా మారుతుందో స్పష్టంగా తెలుస్తుంది’’ అని మంత్రి చెప్పారు.

ఆయన కార్యాలయంలో భారీ తెరపై యుద్ధక్షేత్రంలో ఎగురుతున్న డ్రోన్ల లైవ్ వీడియోలు కనిపిస్తుంటాయి.

ఇప్పటివరకు రష్యా సైనికులు మరణించడంలో, గాయపడడంలో డ్రోన్ల పాత్ర దాదాపు 70% ఉందని కమాండర్లు చెబుతున్నారు.

 రష్యా, యుక్రెయిన్, డ్రోన్లు, ఈ-పాయింట్లు

ఫొటో సోర్స్, BBC/Xavier Vanpevenaege

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ సైన్యం తీసిన వీడియోలను విశ్లేషించి పాయింట్లు కేటాయిస్తారు.

యుక్రెయిన్ సైనికులేమంటున్నారు?

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తొలిరోజుల్లో సామాజిక మాధ్యమాల్లో డ్రోన్ దాడుల వీడియోలు అనేక సౌండ్ ట్రాక్‌లు, భారీ మ్యూజిక్‌తో కనిపించేవి.

వీటిలో ట్యాంకులు పేలిపోవడం, ఒక సైనికుడు ఒక్కడే డ్రోన్‌తో పోరాడడం వంటివి ఉండేవి.

ఇది కాస్త భయానకంగా, ప్రత్యర్థుల మరణాన్ని చూసి సంతోషిస్తున్నట్టుగా ఉండేవి.

యుద్ధరంగంలో ఉన్న యుక్రెయిన్ సైన్యం యూనిట్లు ఇప్పుడు తమకు రివార్డులు తెచ్చిపెట్టేవాటిగా వీడియోలను చూస్తున్నాయి.

బీబీసీ దీనిపై యుక్రెయిన్‌కు చెందిన పన్నెండుకు పైగా యూనిట్లతో మాట్లాడింది.

ఈ పథకంపై వారి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి.

దీనిపై సానుకూలంగా ఉన్నానని 108వ టెరిటోరియల్ డిఫెన్స్ బ్రిగేడ్‌కు చెందిన వోలోదిమిర్ అనే సైనికుడు చెప్పారు. తన ఇంటిపేరు బయటపెట్టొద్దని ఆయన కోరారు.

యుద్ధరంగంలో ముఖ్యంగా డ్రోన్లను భారీగా కోల్పోతున్న సమయంలో, ఈ పథకం చాలా ఉపయోగపడుతోందని చెప్పారు.

‘‘ఇది మనం కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి, శత్రువుకు ఎంత వీలయితే అంత నష్టం కలిగించడానికి ఒక మార్గం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

 రష్యా, యుక్రెయిన్, డ్రోన్లు, ఈ-పాయింట్లు

ఫొటో సోర్స్, BBC/Xavier Vanpevenaege

ఫొటో క్యాప్షన్,

‘‘ఇది నైతికత లేనిది’’

‘‘మొదట పథకం ఎలా పనిచేస్తుందో అర్థం కాలేదు, కానీ తర్వాత ఇది మంచి వ్యవస్థగా అనిపించింది’’ అని 22వ మెకనైజ్డ్ బ్రిగేడ్‌‌కు చెందిన సైనికుడు చెప్పారు. ఆయన్ను జాక్ అని పిలుస్తారు.

‘‘మా బృందం బాగా అలసిపోయింది. వాళ్లకు ఇక ఉత్సాహం లేదు. కానీ ఈ పాయింట్ల వ్యవస్థ కొంతమేర ఉపశమనం కలిగిస్తోంది’’ అని ఆయనన్నారు.

ఈ పథకంతో బహుమతులు అందుతున్నాయని చెప్పారు.

కానీ మరికొందరు ఈ వ్యవస్థతో అసంతృప్తిగా ఉన్నారు.

‘‘సైనికుల్లో మోటివేషన్ సమస్యను ఈ పాయింట్లు పరిష్కరించలేవు’’ అని స్నేక్‌గా పిలిచే ఓ సైనికుడు అన్నారు.

సైన్యం నుంచి ఎవరైనా పారిపోకుండా ఈ పాయింట్లు ఆపలేవని ఆయన అభిప్రాయపడ్డారు.

కొన్ని యూనిట్లు ఒకే లక్ష్యాన్ని ఎవరు కొట్టారనే విషయంలో గొడవ పడుతున్నాయని, ఇప్పటికే దెబ్బతిన్న శత్రువుపైనే మళ్లీ దాడులు చేయడం ద్వారా పాయింట్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాయని దిమిత్రో అనే సైనికుడు విమర్శించారు.

తనకు ఈ వ్యవస్థ మొత్తం నైతికంగా తప్పుడు విధానంలా అనిపించిందని ఆయన అన్నారు.

మరణాన్ని కూడా లాభం కోణంలో చూసే మనస్తత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

కాగా, ఇప్పుడు 90-95శాతం యుద్ధ యూనిట్లు ఇందులో పాల్గొంటున్నాయని ఫెదొరోవ్ చెప్పారు.

కీవ్‌లో ఉన్న ఒక రహస్య కార్యాలయంలో, విశ్లేషకులు ప్రతి వీడియోను పరిశీలిస్తున్నారు. వారిని మేం కలుసుకున్నాం.

దాడులను పూర్తిగా విశ్లేషించి వీడియోల ఆధారంగా వారు పాయింట్లు కేటాయిస్తున్నారు.

తాము ఉన్న ప్రదేశం, పేర్లు వెల్లడించవద్దని వారు కోరారు.

‘‘మా దగ్గర రెండు రకాలుగా పాయింట్లు ఉంటాయి. లక్ష్యంపై దాడి చేయడం, ధ్వంసం చేయడం’’ అని వొలోదియా అనే వ్యక్తి చెప్పారు.

‘‘ఒక రష్యన్ సైనికుడిని చంపినందుకు ఒక పాయింట్ వస్తే, ఆయన్ను బందీగా పట్టుకుంటే పది రెట్లు అంటే పది పాయింట్లు వస్తాయి. ఎందుకంటే బందీల ద్వారా తరువాత ఖైదీల మార్పిడి ఒప్పందాలు చేసుకోవచ్చు’’ అని ఆయన చెప్పారు.

వొలోదియా బృందం రోజూ దాడులకు సంబంధించి వేలాది వీడియోలను విశ్లేషిస్తుంది.

 రష్యా, యుక్రెయిన్, డ్రోన్లు, ఈ-పాయింట్లు

ఫొటో సోర్స్, Getty Images

‘‘యుక్రెయిన్ పోరాడి తీరాల్సిన యుద్ధం’’

‘‘దాక్కోవడంలో, తప్పించుకోవడంలో రష్యన్లు నైపుణ్యం కలిగినవారు’’ అని ఆయనన్నారు.

రష్యా వ్యూహాలు మారితే.. అందుకు తగ్గట్లుగా ఈ-పాయింట్ల వ్యవస్థలోనూ యుక్రెయిన్ మార్పులు చేస్తోంది.

చిన్నచిన్న బృందాలుగా నడిచే లేదా బైక్‌లపై వచ్చే దళాలను రష్యా ఎక్కువగా ఉపయోగించడం వల్ల, సైనికుడి విలువ ఇప్పుడు పెరిగింది.

‘‘ఇంతకుముందు శత్రు సైనికుడిని చంపితే 2 పాయింట్లు వచ్చేవి, ఇప్పుడు 6 పాయింట్లకు పెరిగింది’’ అని బ్రేవ్ 1 తెలిపింది.

శత్రువు డ్రోన్ ఆపరేటర్ విలువ డ్రోన్ కంటే ఎక్కువ.

ఇంకా, ఈ పథకంలో ఇప్పటివరకు యూనిట్లు తమ పాయింట్లను నగదుగా మార్చుకుని అవసరమైన సామగ్రిని కొనుక్కోవడానికి ఉపయోగించేవి.

ఇకపై ఈ పాయింట్లను నేరుగా బ్రేవ్ 1 మార్కెట్ అనే కొత్త వేదికలో ఉపయోగించొచ్చు.

దీనిని ‘‘యుద్ధం కోసం అమెజాన్’’ అని డిజైనర్లు చెబుతున్నారు.

సైనికులు 1,600కిపైగా వస్తువులను బ్రౌజ్ చేసి, పాయింట్లతో వాటిని తయారీదారుల దగ్గర నుంచే కొనుగోలు చేయొచ్చు. రివ్యూలు కూడా ఇవ్వొచ్చు. ఖర్చును చివరికి రక్షణ మంత్రిత్వ శాఖ భరిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)