'నా భాష, మతం వల్ల ఇలా జరిగిందా? లేక నేను పేదవాడిని కావడం వల్లేనా?'

దిల్లీ, గురుగ్రామ్, మురికివాడలు, బంగ్లాదేశ్ అక్రమ వలసలు

ఫొటో సోర్స్, Zoya Mateen/BBC

    • రచయిత, జోయా మటీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లో ఖరీదైన ఎస్‌యూవీలు, ఆకాశహర్మ్యాలు, పరిశుభ్రమైన అపార్ట్‌మెంట్‌లు ఓ పక్కనుంటాయి. దీనికి పూర్తి భిన్నంగా సమీపంలోనే దోమలు, చెత్తకుప్పలు, టార్పాలిన్ గుడిసెలు కనిపిస్తుంటాయి.

గేటెడ్ కాంపౌండ్స్‌ లో దేశంలోనే సంపన్నులైన వారిలో కొందరు నివసిస్తుంటే, పక్కనే ఉన్న మురికివాడల్లో పేద వలస కార్మికులు జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది ఇళ్లల్లో పనిచేసేవాళ్లు, చెత్త సేకరించేవాళ్లు, దినసరి కూలీలు. వీరిలో వందలాది మందిని కిందటి నెలలో స్థానిక అధికారులు తనిఖీలు చేశారు.

బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చినవారిని లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు జరిగాయి. అయితే వీరిలో ఎక్కువమంది తాము పశ్చిమబెంగాల్‌ నుంచి వచ్చిన బెంగాలీ మాట్లాడే ముస్లింలని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దిల్లీ, గురుగ్రామ్, మురికివాడలు, బంగ్లాదేశ్ అక్రమ వలసలు

ఫొటో సోర్స్, Zoya Mateen/BBC

ఫొటో క్యాప్షన్, తాను చూపించిన డాక్యుమెంట్లను అధికారులు అంగీకరించడం లేదని అలీ షేక్ చెప్పారు.

ఇల్లూ, వాకిలీ విడిచిపెట్టి వెళ్లిపోతున్న పేదలు

ఈ తనిఖీలలో అనుమానితులను అదుపులోకి తీసుకుని వారిని ''హోల్డింగ్ సెంటర్ల''లో ఉంచారు. పౌరసత్వం నిరూపించే డాక్యుమెంట్లు సమర్పించాలని వారిని కోరారు. ఈ సమయంలో తమను కొట్టారని, పోలీసులు తమతో తప్పుగా ప్రవర్తించారని అనేకమంది ఆరోపించారు. అయితే పోలీసు అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు.

''నాకు ఓటరుకార్డు, ఆధార్ కార్డులున్నాయి. కానీ అవి నకిలీవని వారు నాతో చెప్పారు. భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియని పరిస్థితుల్లో ఆరు రోజులు పాటు నేనక్కడ ఉన్నా. తర్వాత ఎలాగో విడుదలయ్యా'' అని 15 ఏళ్ల నుంచి గురుగ్రామ్‌లో నివసిస్తున్న అథెర్ అలీ షేక్ అనే దినసరికూలీ చెప్పారు.

కాస్మోపాలిటన్ సంస్కృతికి మారుపేరుగా నిలిచే నగర సామాజిక వ్యవస్థపై ఈ చర్య చెరగని మచ్చలను మిగిల్చింది. వందలాది మంది కార్మికులు రాత్రికి రాత్రే వెళ్లిపోవాలనే తొందరలో కొందరు ఇళ్లు, పనులే కాక, కుటుంబాలను సైతం వదిలిపెట్టేశారు.

''అకస్మాత్తుగా వారు నా వెనుక ఎందుకుపడ్డారో అర్థం కాలేదు'' అని అలీ షేక్ చెప్పారు. ఆయన భార్య హడావుడిగా తమ వస్తువులను ప్యాక్ చేస్తున్నారు. చిరిగిన దుస్తులు, పాత వంటపాత్రలు, పిల్లల పుస్తకాలు వంటివాటిని అట్టపెట్టెల్లో సర్దుతున్నారు.

''నా భాష, మతం వల్ల ఇలా జరిగిందా...లేక నేను పేదవాణ్నవ్వడం వల్లనా, ధనవంతులైన బెంగాలీలను ఎందుకు పట్టుకోలేదు'' అని ఆయన కోపంగా ప్రశ్నించారు.

ఓ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలను గురుగ్రామ్ పోలీసులు ఖండించారు. '' ఏ మతాన్ని గానీ, వర్గాన్నిగానీ టార్గెట్ చేసుకుని డ్రైవ్ చేపట్టలేదు''అని ప్రజా సంబంధాల అధికారి సందీప్ కుమార్ బీబీసీతో చెప్పారు. అదుపులోకి తీసుకున్న 250 మందిలో 10మందిని మాత్రమే అక్రమవలసదారులుగా గుర్తించామని, వారిని బహిష్కరిస్తామని ఆయన చెప్పారు.

''మిగిలినవారందరినీ విడిచిపెట్టాం. సెంటర్లలో ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. అంతా పారదర్శకంగా, న్యాయంగా జరిగింది'' అని ఆయనన్నారు.

దిల్లీ, గురుగ్రామ్, మురికివాడలు, బంగ్లాదేశ్ అక్రమ వలసలు

ఫొటో సోర్స్, Zoya Mateen/BBC

ఫొటో క్యాప్షన్,

చెత్త పేరుకుపోయిన వీధులు

మరోవైపు నగరానికి ఆవల కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కార్మికులెవరూ లేకపోవడంతో చెత్తబుట్టలు, డంప్ యార్డ్‌లు నిండిపోయాయి. వీధుల నిండా చెత్త పేరుకుపోయింది. ఇది స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది.

''మా ఇంట్లో పనిచేసే మహిళ, డ్రైవర్‌గా పనిచేసే ఆమె భర్త ఇద్దరూ వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు పనిమనిషి లేరు''అని ఆ కాంప్లెక్స్‌ల్లో నివసించే తబస్సుమ్ బనో చెప్పారు.

ముస్లిం మెజార్టీ దేశమైన బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొనేవారిపై తనిఖీలు భారత్‌లో కొత్త కాదు. రెండు దేశాల మధ్య 4,906 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. సరిహద్దుకు రెండువైపులా జనసంచారం విస్తృతంగా ఉంటుంది.

నరేంద్రమోదీ ప్రభుత్వ హయాంలో ఈ చర్యలు మరింత తీవ్రమైనట్టు కనిపిస్తోంది.

ఇటీవలి కాలంలో అక్రమ వలసదారులనే అనుమానంతో భారత ఆర్మీలో పనిచేసిన ఓ మాజీ ముస్లిం అధికారి సహా వందలాదిమందిని అరెస్టు చేశారు.

దిల్లీ, గురుగ్రామ్, మురికివాడలు, బంగ్లాదేశ్ అక్రమ వలసలు

ఫొటో సోర్స్, Zoya Mateen/BBC

ఫొటో క్యాప్షన్, తన భర్త ఏమయ్యారో మూడు రోజుల పాటు తెలియలేదని రౌనా బీబీ చెప్పారు.

‘పేదరికంపై పోరాడగలను గానీ...’

ఈశాన్యరాష్ట్రం అసోంలో ఈ సమస్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలకు కారణమవుతోంది. అక్రమ బంగ్లాదేశీలుగా అనుమానిస్తూ అక్కడ అధికారులు వందలాదిమంది బెంగాలీ ముస్లింలను వెనక్కి పంపిస్తుంటారు.

దిల్లీలోకూడా ఇలాంటివి జరుగుతున్నాయి. గడచిన ఆరు నెలల్లో 700మందిని పట్టుకుని, సరిహద్దు రాష్ట్రాలకు పంపించివేశారు.

అక్కడి సమాజంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

చెత్తతో పేరుకుపోయిన కాలనీలతో గురుగ్రామ్‌లో ఓ రకమైన ఆందోళన నెలకొంది.

‘‘అనేక ఏళ్లు మేం వారి చెత్తను శుభ్రం చేశాం. ఇప్పుడు వారు మమ్మల్ని అలానే చూస్తున్నారు ''అని రౌనా బీబీ చెప్పారు.

ఇళ్లల్లో పనిచేసే రౌనా భర్త పశ్చిమబెంగాల్ నుంచి తిరిగి వచ్చిన రోజే నిర్బంధం మొదలైంది. దాని గురించి తెలుసుకున్న ఆయన తీవ్ర భయాందోళన చెంది తిరిగి వెళ్లిపోయారు. భార్యతో కూడా ఏమీ చెప్పలేదు.

''వాళ్లు ఆయన్ని పట్టుకున్నారా...ఆయన బతికే ఉన్నారా అని ఆలోచిస్తూ మూడు రోజుల పాటు నేను భయపడుతూ గడిపా. చివరకు ఎలాగో ఆయనతో మాట్లాడగలిగాం. మాకు ఎలాంటి సమస్యలూ కలిగించకూడదన్న ఆలోచనతో ఫోన్ చేయలేదని ఆయనన్నారు'' అని రౌనా చెప్పారు.

రౌనాను బాధపెట్టింది భర్త ప్రవర్తనగానీ, ఆయనకు పనిలేకపోవడంగానీ కాదు. తాము ఈ ప్రాంతానికి చెందినవారమని గర్వంగా చెప్పుకోలేకపోవడం ఆమెను తీవ్రంగా బాధిస్తోంది.

''నా కష్టంతో పేదరికంపై పోరాడినట్టుగా నేను దీనిపై పోరాడలేను. వాళ్లు నన్ను పట్టుకుంటే ఎలా బయటపడాలో నాకు తెలియదు. ఈ మురికివాడ, మేం చేసే పని, ఇళ్లు శుభ్రం చేయడం...ఇదే మా మొత్తం జీవితం'' అని ఆమె అన్నారు.

దిల్లీ, గురుగ్రామ్, మురికివాడలు, బంగ్లాదేశ్ అక్రమ వలసలు

ఫొటో సోర్స్, Zoya Mateen/BBC

ఫొటో క్యాప్షన్, వందలాదిమంది కార్మికులు రాత్రికి రాత్రి బెంగాల్ వెళ్లిపోయారు.

అక్రమ వలసల నిరోధానికి కొత్త మార్గదర్శకాలు

అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించివేసేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందించిన హోం మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే తాజా తనిఖీలు జరిగాయని సందీప్ కుమార్ చెప్పారు.

ఈ ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్రాలు హోల్డింగ్ సెంటర్లు సహా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలి. బంగ్లాదేశ్, మియన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించి, వారిని తిరిగివెనక్కి పంపాలి.

ప్రతి ఒక్కరికీ వారి పౌరసత్వం రుజువుచేసుకునేందుకు 30రోజులు గడువిస్తారు. వారు సమర్పించిన డాక్యుమెంట్లను వెరిఫికేషన్ కోసం వారి సొంత జిల్లాలకు పంపిస్తారు.

ఈ ఆధారాలు సమర్పించడంలో విఫలమైతే అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య, వీలయినంతమేర సమూహాలుగా తీసుకెళ్లి వారిని దేశం నుంచి పంపించివేసేందుకు సరిహద్దు బలగాలకు అప్పగిస్తారు.

అనుమానితులగా ఎవరిని చూస్తారనేదానికి ఈ ఆదేశంలో ఎలాంటి ప్రాతిపదిక లేదని విమర్శకులు అంటున్నారు.

''వాస్తవంగా చెప్పాలంటే బెంగాలీ మాట్లాడడం, ముస్లిం పేరు ఉండడం, గుడిసెలో జీవించడం మినహా ఎలాంటి ప్రాతిపదిక లేదు'' అని కార్మికుల హక్కుల కోసం పోరాడే ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నేషనల్ కౌన్సిల్‌కు చెందిన ఆకాశ్ భట్టాచార్య చెప్పారు.

ఇంకా దారుణమైన విషయమేంటంటే అనుమానితుల్లో పౌరసత్వం సరిగానే ఉందని నిర్థరణ అయినప్పటికీ వారికి దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలేదు. దీనివల్ల మళ్లీ అవే ఆరోపణలతో పట్టుకోవడం వారిని మరింత నిస్సహాయులుగా చేస్తోంది అని ఆయన తెలిపారు.

దిల్లీ, గురుగ్రామ్, మురికివాడలు, బంగ్లాదేశ్ అక్రమ వలసలు

ఫొటో సోర్స్, Zoya Mateen/BBC

ఫొటో క్యాప్షన్, కొందరు తమ తలదిండ్ల కింద డాక్యుమెంట్లు పెట్టుకుని నిద్రపోతున్నారు.

తలదిండ్ల కింద డాక్యుమెంట్లు

బలమైన ప్రాథమిక ఆధారాలుండడం వల్లే గురుగ్రామ్‌లో నిర్బంధం సాగిందని సందీప్ కుమార్ చెప్పారు.

''వారి ఫోన్లు చెక్ చేశాం. బంగ్లాదేశ్ నుంచి అనుమానిత కాంటాక్టులు గుర్తించాం. తమ పూర్వీకుల గురించి అడిగిన ప్రశ్నలకు సైతం విచారణ సమయంలో కొందరు సమాధానం చెప్పలేకపోయారు'' అని ఆయనన్నారు.

ఈ విధానాన్ని మతపరమైనదిగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదని మానవ హక్కుల కార్యకర్త సుహాస్ చక్మా చెప్పారు.

''బంగ్లాదేశ్ జనాభాలో 95శాతం ముస్లింలు కాబట్టి...వారిని ఎక్కువగా అరెస్టు చేసినట్టు కనిపిస్తోంది'' అని ఆయన అన్నారు.

దశాబ్దాలుగా శరణార్థుల సమస్య ఎదుర్కొంటున్న దేశంగా, ఈ కఠినమైన సమస్యల పరిష్కారానికి భారత్‌కు విస్తృతమైన శరణార్థి చట్టం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం బెంగాలీ ముస్లింలు తీవ్ర భయాందోళన మధ్య జీవిస్తున్నారు.

వారిలో చాలా మంది అనుకోకుండా దాడులు జరిగితే, వెంటనే చూపించడానికి వీలుగా నిద్రించేటప్పుడు దిండ్ల కింద తమ డాక్యుమెంట్లు పెట్టుకుంటున్నారు.

దిల్లీ, గురుగ్రామ్, మురికివాడలు, బంగ్లాదేశ్ అక్రమ వలసలు

ఫొటో సోర్స్, Zoya Mateen/BBC

ఫొటో క్యాప్షన్, ప్రతీక్షణం భయాందోళన మధ్య గడుపుతున్నామని స్థానికులు చెప్పారు.

‘కనీసం అక్కడ ఫ్యాన్ అయినా ఉంటుంది’

''మేం ఇప్పటికే మా జీవితాల్లోని కఠిన పరిస్థితులతో పోరాడుతున్నాం. ఇప్పుడు దీనిపై కూడా పోరాడాలి'' అని జైహింద్ క్యాంప్‌కు చెందిన రబి-ఉల్-హస్సన్ తెలిపారు. దిల్లీలోని అత్యంత విలాసవంతమైన కాలనీల్లో ఒకటైన ప్రాంతంలో ఉన్న పెద్ద మురికివాడ ఇది.

మూడువారాల క్రితం అధికారులు ఈ ప్రాంతానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. దాదాపు 400 మంది చీకట్లో మగ్గిపోయారు.

తామిక్కడ తరతరాలుగా నివసిస్తున్నామని పేదలు చెబుతోంటే...ఆ భూమి ప్రైవేట్ ల్యాండ్ అని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు

''నగరం అర్బన్ ప్లానింగ్ ఆర్గనైజేషన్ ఈ ప్రాంతాన్ని మురికివాడగా చట్టబద్ధంగా గుర్తించింది. అయినాగానీ అధికారులు ఇలా చేశారు'' అని కోర్టు తీర్పును సవాల్ చేసిన ఓ లాయర్ చెప్పారు.

అప్పటినుంచి అక్కడి స్థానికులు ఓ విధమైన కోపం, ఆందోళన, భయంతో గడుపుతున్నారు. వారు అలిసిపోయినట్టుగా కనిపిస్తున్నారు.

''వేడి భరించలేనిదిగా ఉంది. ఆహారం పాడవుతోంది. పిల్లలు ఏడుపు ఆపడం లేదు. రాత్రి సమయంలో ఇళ్ల బయట నిద్రపోయేందుకు ప్రయత్నించాం. కానీ దోమలు విపరీతంగా కుడుతున్నాయి'' అని బైజాన్ బీబీ చెప్పారు.

''నేను చాలా అలిసిపోయాను. దీనికి బదులు హోల్డింగ్ సెంటర్లలో నివసించడం కాస్త బాగుంటుందేమో అని కూడా నాకు కొన్నిసార్లు అనిపించింది. అక్కడ కనీసం ఫ్యాన్ అయినా ఉంటుంది''అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)