EPFO: సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే రూ.7 లక్షల వరకు బీమా, ఏమిటీ స్కీం...5 సందేహాలు - సమాధానాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఉద్యోగులా? అయితే, మీకు తెలియకుండానే మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ.
అదెలా అంటారా..? ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ రూపంలో.
ఈ స్కీమ్ కింద ఎవరైనా ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే.. ఉద్యోగి సర్వీసు కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా గరిష్టంగా రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తోంది ఈపీఎఫ్ఓ.
ఈపీఎఫ్ఓ అందించే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎలా పని చేస్తుంది? ఎవరు అర్హులు? ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు? వంటి వివరాలను తెలుసుకుందాం..


ఫొటో సోర్స్, Getty Images

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అందించే ఇన్సూరెన్స్ పథకమే ఈడీఎల్ఐ. 1976లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ స్కీమ్ కింద సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణించిప్పుడు రిజిస్టర్డ్ నామినీకి లంప్‌సమ్ (ఏకమొత్తంలో)లో కొంత డబ్బును ఈపీఎఫ్ఓ చెల్లిస్తుంది.
ఉద్యోగుల భవిష్య నిధి, ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదు చేసుకున్న అన్ని సంస్థలకు ఈడీఎల్ఐ స్కీమ్ వర్తిస్తుంది.
ఈ సంస్థలు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా జీవిత బీమాను కల్పించేందుకు సహకరించాలి.

ఈడీఎల్ఐ స్కీమ్ కోసం ఉద్యోగులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
కంపెనీలు లేదా యాజమాన్యాలే ఈ మొత్తాన్ని చెల్లిస్తుంటాయి.
ఈడీఎల్ఐ కింద బేసిక్ శాలరీలో 0.5 శాతాన్ని లేదా గరిష్ఠంగా రూ.75 వరకు ప్రతి నెలా సంస్థలే కంట్రిబ్యూట్ చేస్తుంటాయి.
అయితే, దీని కోసం ఉద్యోగుల జీతాల నుంచి ఎలాంటి వసూళ్లను కంపెనీలు చేపట్టవని లైవ్‌మింట్ తన రిపోర్టులో నివేదించింది.
ఈడీఎల్ఐ కింద కంట్రిబ్యూషన్లకు గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలుగానే నిర్ణయించింది ఈపీఎఫ్ఓ.
అంటే రూ.15 వేల కంటే ఎక్కువ బేసిక్ వేతనం అందినా.. రూ.15 వేలపైనే ఈడీఎల్ఐ లెక్కకడుతుంది.
ఒకవేళ రూ.15 వేల కంటే తక్కువుంటే.. తక్కువున్న బేసిక్ శాలరీపై ఈడీఎల్ఐను కాలిక్యులేట్ చేస్తుంది.
ఇన్సూరెన్స్ ఫండ్‌కు అందించే కంట్రిబ్యూషన్లను కంపెనీ, సంస్థ చెల్లించకపోతే లేదా చట్టంలోని ఇతర ప్రొవిజిన్ల కింద చెల్లించాల్సిన చార్జీలను చెల్లించకపోయినా.. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ లేదా ఇతర అధికారి నెలకు సంస్థ చెల్లించాల్సిన బకాయిలపై లేదా దానిలో కొంత భాగంపై డ్యామేజీలను ఒక నెలకు, కొంత భాగానికి 1 శాతం రేటుతో రికవరీ చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

- సర్వీసులో ఉండగా ఒకవేళ ఉద్యోగి మరణిస్తే.. ఈపీఎఫ్ స్కీమ్ కింద ఆ ఉద్యోగి నామినేట్ చేసిన కుటుంబ సభ్యులు ఈడీఎల్ఐ ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఒకవేళ నామినేషన్ చేసి ఉండకపోతే, చట్టబద్ధమైన వారసులకు లేదా కుటుంబ సభ్యులకు ఈ మొత్తం అందుతుంది.
- నామినీ లేదా కుటుంబ సభ్యులు లేదా చట్టబద్ధమైన వారసులు మైనర్ అయితే ఈ మొత్తాన్ని గార్డియన్ క్లెయిమ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గత 12 నెలల సగటు నెలవారీ జీతానికి 35 రెట్లు ఎక్కువగా ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందిస్తుంది.
అయితే, ఒక ఉద్యోగికి గరిష్ఠ సగటు నెలవారీ జీతం రూ.15 వేలుగానే ఈపీఎఫ్ఓ నిర్దేశించింది.
అంటే మరణించిన ఉద్యోగి 12 నెలలుగా లేదా అంతకంటే ఎక్కువ కాలంగా సర్వీసులో కొనసాగుతూ ఉంటే...12 నెలల సగటు నెలవారీ జీతం రూ.15,000 x 35 అంటే.. రూ.5,25,000ను, దానికి అదనంగా రూ.1,75,000 బోనస్‌ను కలిపి గరిష్టంగా రూ. 7 లక్షలు చెల్లిస్తుంది.
12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ నెలలు నిరంతరం ఉద్యోగంలో కొనసాగిని వ్యక్తికి కనీసం రూ.2,50,000ను, గరిష్ఠంగా రూ.7 లక్షలను చెల్లించనున్నట్లు ఈపీఎఫ్ఓ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
అయితే, సర్వీసులో చేరి ఏడాది పూర్తికాకముందే చనిపోతే అందించే ఇన్సూరెన్స్ ప్రయోజనాలను ఇటీవలే ఈపీఎఫ్ఓ సవరించింది.
ఒకవేళ ఏడాది కాలం సర్వీసు పూర్తి చేయకుండా ఉద్యోగి మరణిస్తే.. కుటుంబ సభ్యులకు, చట్టపరమైన వారసులకు కనీసం రూ.50 వేల ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని కల్పించాలని ఇటీవల జరిగిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 237వ సమావేశంలో నిర్ణయించింది.
అంతకుముందు సబ్‌స్క్రైబర్ సగటు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను ఆధారంగా చేసుకుని ఈ ప్రయోజనాన్ని అందించేవారు.
అయితే, ఇప్పుడు లబ్దిదారుల కుటుంబాలకు కనీస గ్యారెంటీడ్ పేమెంట్ రూ.50 వేలుగా ఉండాలని సీబీటీ నిర్ణయించింది.
దీంతో పాటు, మరో రెండు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది.
ఒకటి...ఈపీఎఫ్ఓ అకౌంట్‌కు చివరి కంట్రిబ్యూషన్ అందిన ఆరు నెలల లోపు గనుక ఉద్యోగి మరణిస్తే, వారి పేర్లను రికార్డుల నుంచి తొలగించని పక్షంలో కుటుంబ సభ్యులకు ఈడీఎల్ఐ ప్రయోజనాలు అందించాలి.
అంతకుముందు.. నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ తర్వాత సర్వీసులో ఉన్నప్పటికీ ఉద్యోగి మరణిస్తే, ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లను తిరస్కరించేవారు.
మరో కీలక సవరణ ఎంప్లాయిమెంట్ గ్యాప్‌లు ఉన్నప్పటికీ ఈడీఎల్ఐ ప్రయోజనాలు అందించడం.
అంతకుముందు ఉద్యోగి జాబ్ మారేటప్పుడు ఒకటి లేదా రెండు రోజులు (వీకెండ్స్ లేదా హాలిడేస్ రావడం) గ్యాప్ వస్తే, ఈడీఎల్ఐ ప్రయోజనాలను తిరస్కరించేవారు.
ఏడాది పాటు నిరాఘాటంగా సర్వీసులో లేరనే కారణంతో కుటుంబ సభ్యులకు ఈ ప్రయోజనాలు అందేవి కావు.
కానీ, కొత్త నిబంధన కింద రెండు సంస్థల మధ్య ఎంప్లాయిమెంట్ గ్యాప్ రెండు నెలల వరకు ఉన్నా, సర్వీసు కొనసాగిస్తున్నట్లే పరిగణిస్తున్నారు.
ఈడీఎల్ఐ కింద గరిష్ఠ ప్రయోజనాలను అందించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ మార్పుల వల్ల సర్వీసులో ఉండగా మరణిస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనం లభించనుంది.

ఫొటో సోర్స్, Getty Images

మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులు ఈడీఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవాలంటే కింద పేర్కొన్న డాక్యుమెంట్లను సమర్పించాలి.
- పూర్తిగా నింపిన ఫామ్ 5 (ఐఎఫ్)
- ఈపీఎఫ్ఓ సభ్యుడి లేదా సభ్యురాలి మరణ ధ్రువీకరణ పత్రం (చనిపోయే నాటికి ఉద్యోగి ఈపీఎఫ్ స్కీమ్‌కు యాక్టివ్ కంట్రిబ్యూటర్ అయి ఉండాలి)
- చట్టపరమైన వారసులు ఈ క్లెయిమ్ ఫైల్ చేస్తున్నప్పుడు వారసత్వ సర్టిఫికేట్ సమర్పించాలి.
- మైనర్ తరఫున నేచరల్ గార్డియన్ కాని వ్యక్తి క్లెయిమ్ ఫైల్ చేస్తున్నప్పుడు గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ చూపించాలి.
- బ్యాంకు అకౌంట్‌కు చెందిన క్యాన్సిల్డ్ చెక్ కాపీ
- ఈపీఎఫ్ స్కీమ్ 1952 కింద మినహాయించిన సంస్థలైతే సర్టిఫికేట్ పార్టు కింద ఆ సంస్థకు చెందిన గత 12 నెలల పీఎఫ్ వివరాలు ఇవ్వాలి. మెంబర్ నామినేషన్ ఫామ్ కాపీని కూడా పంపించాలి.
- మీ క్లెయిమ్ ఫామ్‌పై సంస్థ సంతకం పెట్టి, ధ్రువీకరించాలి.
కంపెనీ లేదా సంస్థను మూసివేసినప్పుడు లేదా క్లెయిమ్ ఫామ్‌పై సంతకం చేసేందుకు ఆథరైజ్డ్ అధికారి లేనప్పుడు...
- మేజిస్ట్రేట్
- గెజిటెడ్ ఆఫీసర్
- పోస్టు లేదా సబ్ పోస్టు మాస్టర్
- స్థానిక ఎంపీ లేదా ఎమ్మెల్యే
- బ్యాంకు మేనేజర్ (చనిపోయిన వ్యక్తి అకౌంట్ ఉన్న బ్రాంచ్‌కు చెందిన మేనేజర్)
- లోకల్ మున్సిపల్ బోర్డు మెంబర్, చైర్మన్ లేదా సెక్రటరీ
- ఈపీఎఫ్ లేదా సీబీటీ రీజనల్ కమిటీ సభ్యుడు
- ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ అధినేత..
ఇలా ఎవరిదైనా ఒక అధికారి సంతకం, సీల్‌తో కూడిన ఫామ్‌ను జతచేయాలి.
ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976 కింద క్లెయిమ్ పొందే ఫామ్‌ను ఫామ్ 20 (ప్రావిడెంట్ ఫండ్ బాకీలను క్లెయిమ్ చేసుకోవడం), ఫామ్ 10 డీ/10సీ (పెన్షన్, విత్‌డ్రాయల్ బెనిఫిట్ ఫామ్)తో పాటు సమర్పించాలి.
ఈ మూడు స్కీమ్‌ల కింద ప్రయోజనాలను ఒకేసారి ప్రాసెస్ చేస్తుంది ఈపీఎఫ్ఓ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














