ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని తయారు చేయాలనుకుంటోన్న కంపెనీ, ఎందుకంటే...

రాడియా

ఫొటో సోర్స్, Radia

    • రచయిత, మార్క్ పైసింగ్

విండ్‌రన్నర్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తయారు చేయబోతున్న విమానం పేరు. భారీ విండ్ టర్బైన్‌లను దీని ద్వారా సులభంగా తీసుకెళ్లవచ్చు. అయితే, దీని చేపట్టిన కంపెనీ మాత్రం చాలా చిన్నది, ఇప్పటి వరకు ఒక్క విమానాన్ని కూడా తయారు చేయలేదు.

విండ్‌రన్నర్‌ను తయారు చేయడానికి ముందే, దాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా చెబుతోంది ఆ కంపెనీ.

అయితే, ఈ పెద్ద విమానాన్ని తయారు చేసేది ఎయిర్‌బస్, బోయింగ్ లేదా లాక్‌హీడ్ వంటి ఏరోస్పేస్ సంస్థలు కాదు.

సీరియల్ ఆంట్రప్రెన్యూర్, ఏరోస్పేస్ ఇంజనీర్ కూడా అయిన మార్క్ లండ్‌స్ట్రోమ్ 2016లో ‘రాడియా’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. భూమి మీద ఏర్పాటు చేసే విండ్ టర్బైన్లను తయారు చేసే ఇండస్ట్రీని మరింత విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఆయన రాడియాను నెలకొల్పారు.

నీటి మీద ఏర్పాటు చేసే విండ్ టర్బైన్ బ్లేడ్ల (రెక్కలు) పొడవులో 100 మీటర్లు (345 అడుగులు), ఆపై వరకు ఉంటాయి. భూమిపై ఉన్న వాటితో పోలిస్తే ఇవి చాలా పెద్దవి.

భూమిపై ఉండేవి సుమారు 70 మీటర్లను (230 అడుగులు) మాత్రమే. ఫ్యాక్టరీ నుంచి ఒక పీఠభూమి లేదా మైదానంలోని మారుమూల ప్రాంతానికి వీటిని రవాణా చేయడం కష్టం కావడమే వీటి పొడవు తక్కువ ఉండటానికి కారణం.

అందుకే, ఆన్‌షోర్ విండ్ పవర్ ఆర్థికంగా అంత ప్రయోజనకరంగా ఉండటం లేదు.

ఒకవేళ ఈ సమస్యను పరిష్కరిస్తే, పొడవైన రెక్కలతో, తక్కువ ఖర్చులో ఆన్‌షోర్ విండ్ ఫామ్‌లలో మరింత ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని లండ్‌స్ట్రోమ్ భావించారు.

ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 10 లక్షలకు పైగా ఈ 'సూపర్' టర్బైన్లను డెవలప్ చేయొచ్చని అన్నారు. ఈ వ్యాపారవేత్త తన విజన్‌కు 'గిగావిండ్' అని పేరు పెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుతం కొలొరాడోలోని బౌల్డర్‌ ప్రాంతానికి చెందిన ఈ కంపెనీ 150 మిలియన్ డాలర్ల(రూ.1,308 కోట్లు) కు పైగా నిధిని సేకరించింది.

విండ్‌రన్నర్‌ను లాంచ్ చేసేందుకు ఉన్నతస్థాయి అడ్వైజర్లను నియమించుకుంది.

భారీ విండ్ టర్బైన్ బ్లేడ్లను తేలికగా రవాణా చేసేందుకు చరిత్రలోనే అతిపెద్ద, బరువైన విమానాన్ని తయారు చేస్తున్నట్లు రాడియా తెలిపింది.

ఆన్‌షోర్ విండ్ పవర్‌ విషయంలో ఇదొక విప్లవంగా మారుతుందని ఆ కంపెనీ చెబుతోంది.

'' ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని మేం తయారు చేస్తున్నాం. దాన్ని ఎందుకు తయారు చేస్తున్నామంటే బరువైన వాటిని తీసుకెళ్లే సామర్థ్యమున్న విమానాల కొరత చాలా ఉంది'' అని లండ్‌స్ట్రోమ్ చెప్పారు.

రాడియా విండ్‌రన్నర్ తప్ప ఈ అవసరాన్ని తీర్చేందుకు పెద్ద కార్గో విమానాలు ఏవీ తయారీలో లేవని అన్నారు.

సరైన రవాణా సాధనాలు లేకపోవడంతోనే భారీ ఆన్‌షోర్ విండ్ టర్బైన్లను ఉత్పత్తి చేయలేకపోయామని తెలిపారు.

అయితే, అంతకుముందు ఆరు ఇంజిన్లతో నడిచే ఆంటనోవ్-యాన్-225 మ్రియా (యుక్రెయిన్‌లో దీన్ని డ్రీమ్ అని పిలుస్తారు) అనే కార్గో విమానం ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా ఉండేది.

2022లో యుక్రెయిన్‌ను రష్యా ఆక్రమించుకోవడం ప్రారంభించిన తొలి దశలలో ఇది పాడైంది. ఇది యుక్రెయిన్‌కు, ప్రపంచ ఏవియేషన్ కమ్యూనిటీకి భారీ దెబ్బ.

అతిపెద్ద, భారీ కార్గోలను అంటే రైల్వే ఇంజిన్లను, విండ్ టర్బైన్ బ్లేడ్లను, డిజాస్టర్ రిలీఫ్‌లను రాత్రికి రాత్రే రవాణా చేసే సామర్థ్యం దీనికి ఉండేది. కానీ, ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు.

అయితే, రాడియా కొత్త ప్రాజెక్టు విషయానికొస్తే ఒకే ఒక్క సమస్య ఉంది. అంతకుముందు ఈ సంస్థ ఒక్క విమానాన్ని కూడా తయారు చేయలేదు.

2024లో ఫ్రాన్‌బారో ఇంటర్నేషనల్ ఎయిర్‌షోలో దీన్ని ఆవిష్కరించడానికి ముందే ఈ విమానం స్పెషిఫికేషన్లను డిజైన్ చేసే నిపుణుల బృందాన్ని లండ్‌స్ట్రోమ్ నియమించుకున్నారు.

విండ్ టర్బైన్ల రవాణాకు విమానం

ఫొటో సోర్స్, Radia

ఎయిర్‌షిప్ అనేది టీమ్ వద్ద ఉన్న ఏకైక పరిష్కారం. కానీ, వారు భారీ ఫిక్స్‌డ్-వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేయాలని నిర్ణయించారు.

ఈ భారీ ఫిక్స్‌డ్-వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఉన్న వైవిధ్యమైన ఫీచర్ ఏంటంటే.. ఎలాంటి వంకర్లు లేని పొడవైన రెక్కలు ఉంటాయి. పొడవు తక్కువున్న సెమీ ప్రిపేర్డ్ రన్‌వేపైనే ఇది టేకాఫ్, ల్యాండ్ కావాలి.

80 మీటర్ల (260 అడుగుల) పొడవున్న మూడు విండ్ టర్బైన్ బ్లేడ్లను లేదా 95 మీటర్ల (310 అడుగుల) పొడవున్న రెండు టర్బైన్లను, లేదా 105 మీటర్ల (345 అడుగుల) పొడవున్న ఒక బ్లేడ్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది.

1800 మీటర్ల చదును చేయని రన్‌వేపై ఇది దిగగలదు. కానీ, 72,500 కేజీలను (74 టన్నులు) మాత్రమే మోయగలదు. 2000 కి.మీలే ఎగురుతుంది. ఒకవేళ విండ్‌రన్నర్ సిద్ధమైనా, అది కేవలం నార్త్ అమెరికా, యూరప్ లేదా సౌత్ అమెరికాల మధ్యలోనే నడుస్తుంది.

విమానం

ఫొటో సోర్స్, Getty Images

దీని తయారీలో చాలా సవాళ్లు ఉన్నాయని లండ్‌స్ట్రోమ్ చెప్పారు. విండ్‌రన్నర్‌ను రూపొందించేందుకు ‘‘కొత్తగా ఏమీ చేయొద్దు, మన అవసరాలకు ఉపయోగపడే విమానం తయారు చేస్తే చాలు’’ అన్నది తమ ప్రాథమిక సూత్రమని ఆయన అన్నారు.

తమ విజన్‌ను వాస్తవరూపంలోకి తీసుకొచ్చేందుకు, లండ్‌స్ట్రోమ్, ఆయన బృందం అనుభవజ్ఞులైన డిస్ట్రిబ్యూటర్లను నియమించుకుంది.

అంటే ఫ్యూజ్‌లేజ్‌ కోసం (ప్రయాణికులను, కార్గోను మోసే ఎయిర్‌క్రాఫ్ట్ ప్రధాన బాడీ కోసం) ఇటలీలోని లియోనార్డోను, రెక్కలు, ఇంజిన్ పైలాన్ల కోసం స్పెయిన్‌కు చెందిన ఏర్నోవాను, సేఫ్టీ ఫీచర్లను పరిశీలించేందుకు అమెరికాకు చెందిన ఏఫ్యూజన్‌ను నియమించుకుంది.

అయితే, పేరున్న ఇంజిన్ సరఫరాదారు లేకపోవడం, ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, ఇది అంత పెద్ద సమస్య కాదని రాడియా అధికార ప్రతినిధి బీబీసికి చెప్పారు. '' మేం ఇప్పటికే ఉన్న సర్టిఫైడ్ ఇంజిన్‌ను ఎంపిక చేశాం. ఎయిర్‌ఫ్రేమ్‌పై ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ కోసం పనిచేస్తున్నాం. త్వరలోనే ఇంజిన్ పార్టనర్‌ను కూడా ప్రకటిస్తాం'' అని తెలిపారు.

''ఇప్పటికే ఉన్న సిస్టమ్‌లను, కాంపోనెంట్లను, టెక్నాలజీలను సాధ్యమైనంత స్థాయిలో తిరిగి వాడుకోవాలనే ఆలోచనతో దీన్ని తక్కువ ఖర్చులో తయారు చేయాలని ఆశిస్తున్నాం'' అని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. విమాన బరువు, పరిణామాన్ని బట్టి యూనిట్ ఖర్చు ఉంటుందన్నారు.

అత్యంత బరువైన లేదా అతిపెద్ద విమానాన్ని తయారు చేయాలని గతంలో కూడా ఏరోస్పేస్ ఇండస్ట్రీలో లక్ష్యాలు ఉండేవి.

విండ్‌రన్నర్ సాధ్యాసాధ్యాలపై అప్రమత్తంగా ఉండాలని కొంతమంది పరిశీలకులు అంటున్నారు.

‘‘వారికి మరింత మూలధన పెట్టుబడి వచ్చేంత వరకు కూడా ఇదెలా పనిచేస్తుందో తెలియదు'' అని ఏవియేషన్ రచయిత, వ్యాఖ్యాత క్రిస్ పోకాక్ వ్యాఖ్యానించారు.

''విండ్‌రన్నర్‌కు ట్రాన్స్‌అట్లాంటిక్ రేంజ్ (అట్లాంటిక్ మహాసముద్ర వ్యాప్తంగా ప్రయాణించే పరిధి) లేదు. దీంతో, ఆ కోణం నుంచి చూస్తే అంత ఆకర్షణీయంగా లేదు'' అని అన్నారు.

విమానం

ఫొటో సోర్స్, Radia

ఎయిర్‌షిప్‌ అనే భావనను రాడియా కొట్టిపారేసిందని పోకాక్ భావిస్తున్నారు. హైబ్రిడ్ ఎయిర్‌షిప్‌ల డిజైనర్లు కూడా ఇదే మార్కెట్‌పై కన్నేసిట్లు తెలిపారు.

విండ్ పవర్‌ను ఒక చెత్త అంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అభివర్ణించారు. వీటి విస్తరణ ప్రణాళికలకు వ్యతిరేకంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు.

కానీ, ఆన్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రయోజనాలను, విద్యుత్ భద్రత అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే, అమెరికాలో ఇది ఒక బిజినెస్ కేసుగా ఉపయోగపడుతుండొచ్చు.

విండ్‌రన్నర్ మిలటరీ కార్గోను ఎలా రవాణా చేస్తుందో అధ్యయనం చేసేందుకు రాడియా కంపెనీతో 2025 మే నెలలో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

విండ్ టర్బైన్ మార్కెట్‌ లక్ష్యాలకు ఇది కాస్త దూరంగా అనిపించింది. అయితే, రాడియా ప్రధాన లక్ష్యం ఆన్‌షోర్ విండ్ ఎనర్జీ మార్కెట్‌కు సేవలందించడమేనని రాడియా అధికార ప్రతినిధి బీబీసీకి చెప్పారు.

అయితే, విండ్‌రన్నర్ ప్రత్యేక సామర్థ్యాలలో డిఫెన్స్‌తో పాటు అదనంగా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

పెద్ద విమానం

ఫొటో సోర్స్, Radia

కిందటిసారి చేసిన ఫండింగ్ ప్రయత్నాలు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయని రాడియా బీబీసీకి తెలిపింది. ప్రస్తుతం తాము ప్రభుత్వాలతో, పెట్టుబడిదారులతో కలిసి తదుపరి దశ పెట్టుబడుల సేకరణ కోసం పనిచేస్తున్నామని చెప్పింది.

ఇప్పటి వరకు రాడియా కేవలం చిన్న సైజులో ఉన్న విండ్‌రన్నర్ మోడల్‌ను మాత్రమే విండ్ టన్నెల్‌లో పరీక్షించింది. ఇతర ఏవియేషన్ తయారీదారులు, స్టార్టప్‌లలాగానే, రాడియా కూడా వేగంగా పనులు చేసుకుంటూ పోతోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు చూస్తోంది.

విండ్‌రన్నర్ ఎగిరేందుకు సురక్షితమని సర్టిఫికేషన్ రావాలంటే ఖరీదైన, సుదీర్ఘ ప్రక్రియతో ముడిపడి ఉంది. దీనికోసం సర్టిఫైడ్ కాంపోనెంట్లను మాత్రమే వాడాల్సి ఉంది. ఈ దశాబ్దం చివరికి తమ తొలి ఫ్లయిట్‌ను తీసుకురావాలని రాడియా ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత వెంటనే ప్రొడక్షన్ చేపట్టాలన్నది ఆ కంపెనీ ఆలోచన.

సర్టిఫికేషన్ అనేది ఏ విమాన తయారీ సంస్థకైనా క్లిష్టమైన ప్రక్రియే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)