గాజా సిటీని ఆధీనంలోకి తీసుకునే ఇజ్రాయెల్ 'ప్లాన్'కు ఆమోదం, భయాందోళనలో గాజా పౌరులు

ఫొటో సోర్స్, Reuters
గాజా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి సంబంధించిన ప్రణాళిక (ప్లాన్), ''యుద్దాన్ని ముగించేందుకు ఐదు సూత్రాలను'' ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదించినట్లు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మెజారీటీ ఓటుతో ఆమోదం తెలిపినట్లు అందులో పేర్కొంది.
''జెరూసలెంలో శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ సమావేశమైంది. దాదాపు 10 గంటల పాటు చర్చలు సాగాయి. గాజా సిటీ స్వాధీనానికి సంబంధించిన ప్రణాళికను ఆమోదించింది. 'యుద్ధ విరమణకు పంచసూత్రాలు'కు కూడా మెజార్టీ ఓట్లతో ఆమోదించింది'' అని ప్రధాని కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
''యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు వెలుపల ఉన్న పౌరులకు మానవతా సాయం అందిస్తూనే, గాజా సిటీని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవడానికి ఐడీఎఫ్ సిద్ధమవుతుంది'' అని ఆ ప్రకటనలో తెలిపింది.


ఐదు సూత్రాలు..
యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదించిన పంచ సూత్రాలను ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తావించింది.
- హమాస్ నిరాయుధీకరణ
- బందీలను వెనక్కి తీసుకురావడం (సజీవంగా, లేదా మరణిస్తే మృతదేహాలను)
- గాజాస్ట్రిప్‌లో డీమిలిటరైజేషన్ (సైనిక కార్యకలాపాల నిలిపివేత)
- గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భద్రతా బలగాల నియంత్రణ
- హమాస్ కానీ పాలస్తీనా అథారిటీ ప్రమేయం లేకుండా ప్రత్యామ్నాయంగా పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
అయితే, ఈ ప్రకటనలో 'ఆక్రమణ' (ఆక్యుపేషన్) అనే పదం ఎక్కడా ఉపయోగించలేదు. కానీ, ప్రణాళిక అర్థం అదే. ఈ ప్లాన్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది స్పష్టత లేదు.
ఇది గాజాపై ఇజ్రాయెల్ సైన్యం పూర్తి నియంత్రణ సాధించేందుకు మొదటి దశ కావొచ్చు. నెతన్యాహు అదే తన ఉద్దేశమని చెబుతున్నారు.
దాదాపు 8 లక్షల మంది పాలస్తీనీయులు నివసించే గాజా సిటీని స్వాధీనం చేసుకోనున్నట్లు నెతన్యాహు గతంలో ప్రకటించారు. ఆమోదిత ప్లాన్ గాజాపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని చెప్పారు.
ఈ యుద్ధకాలంలో చాలామంది పాలస్తీనీయులు దఫదఫాలుగా గాజా నుంచి వలసపోయారు.
గాజాలో భయాందోళనలు..
గాజాను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న ఇజ్రాయెల్ నిర్ణయంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
గాజాకి చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ బీబీసీతో మాట్లాడుతూ, "ఆక్రమణ, నియంత్రణ మధ్య తేడా ఉంది. కానీ, ఈ రెండింటి వల్ల కలిగే ఫలితం మాత్రం ఒక్కటే. విధ్వంసం, ఆశ్రయం కోల్పోవడం."
"హమాస్ నాయకులు సైన్స్ ఫిక్షన్ ప్రపంచంలో నివసిస్తున్నారు" అని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎహాబ్ అల్-హెలు అన్నారు. "మమ్మల్ని బలి చేయడానికి మీరెవరు?"

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్‌లోనూ నిరసనలు..
గాజా నగరాన్ని నియంత్రణలోకి తీసుకోవాలన్న సెక్యూరిటీ క్యాబినెట్ నిర్ణయం "ఒక డిజాస్టర్''(విపత్తు) అని, ఇది మరిన్ని డిజాస్టర్లకు దారితీస్తుందని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత అంటున్నారు.
గాజాను స్వాధీనం చేసుకోవడం వల్ల మిగిలిన బందీల మరణాలకు, ఎంతోమంది ఇజ్రాయెల్ సైనికుల హత్యలకు దారితీస్తుందని యాయిర్ లాపిడ్ అన్నారు.
గాజా ప్రాంతంలో కొత్తగా సైనిక చర్యకు నెతన్యాహు తలపెట్టిన ఈ ప్రణాళికలపై సైనిక నాయకత్వం, బందీల కుటుంబాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
యుద్ధం ముగించడానికి, బందీలుగా ఉన్న 50 మంది (వారిలో 20 మంది సజీవంగా ఉన్నారని భావిస్తున్నారు) విడుదలకు హమాస్‌తో చర్చించాలని ఇజ్రాయెల్ ప్రజల్లో ఎక్కువ మంది కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
నిలిచిపోయిన కాల్పుల విరమణ చర్చల్లో మరిన్ని డిమాండ్ల కోసం హమాస్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో 'పూర్తి ఆక్రమణ' బెదిరింపు ఒక భాగం కావొచ్చు.
అయితే, హమాస్ ప్రస్తుతానికి చర్చలపై ఆసక్తి చూపించట్లేదని ఇజ్రాయెల్ నాయకులు చెబుతున్నారు.
నెతన్యాహు ఆలోచనలను సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం... గాజాను పూర్తిగా ఆక్రమించుకోవడమంటే ఒక ఉచ్చులో చిక్కుకోవడంతో సమానమని, అది బందీలను ప్రమాదంలో పడేస్తుందని ఆయన ప్రధానమంత్రి నెతన్యాహును హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు
ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబరు 7న హమాస్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ప్రారంభించిన యుద్ధం ముగించాలని కోరుతున్న దేశాల నుంచి ఇప్పుడీ ప్రణాళికలపై ఖండనలు ఎదురుకావొచ్చు.
ఇజ్రాయెల్ నిర్ణయం తప్పిదమని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ అన్నారు. ఇది మరింత రక్తపాతానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ వెంటనే పునరాలోచించాలన్నారు.
''ఆ దారి మంచిది కాదు, గాజాలో నెలకొన్న మానవతా విపత్తును మరింత దిగజారుస్తుంది'' అని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ అన్నారు.
ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను విస్తరించడం వల్ల పాలస్తీనా పౌరులకు, ఇజ్రాయెల్ బందీలకు విపత్కర పరిణామాలు ఎదురవుతాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
''గాజాలో యుద్ధం తక్షణం ఆగిపోవాలి. మరింత తీవ్రతరమైతే భారీ వలసలు, మరిన్ని మరణాలు, అర్థంలేని విధ్వంసం, దారుణ నేరాలకు దారితీస్తుంది'' అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














