గాజా: ‘‘దేవుడా.. నా పిల్లల ఆకలి తీర్చేందుకు ఒక్క పిండి సంచీ దొరికినా చాలు..నేను మరణాన్ని ఆహ్వానిస్తా’’

గాజాలో ఆకలి కేకలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్వామినాథన్ నటరాజన్, గాజా లైఫ్‌లైన్ ప్రొగ్రామ్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

''నాలుగు రోజులుగా ఏం తినకపోవడంతో నా పిల్లలిద్దరూ ఆకలితో ఏడుస్తున్నారు'' అని గాజాకు చెందిన ఒక వ్యక్తి చెప్పారు.

''కనీసం ఒక పిండి బ్యాగయినా దొరుకుతుందేమోననే ఆశతో ఆహార పంపిణీ కేంద్రం దగ్గరకు వెళ్లాను. కానీ, అక్కడికు వెళ్లేసరికి, ఏం చేయాలో తోచలేదు'' అని ఆయన బీబీసీ న్యూస్ అరబిక్‌కు చెప్పారు.

''గాయాలు పాలైన వారిని రక్షించాలా? చనిపోయిన వారిని తీసుకు రావాలా? లేదా పిండి కోసం ఎదురు చూడాలా? దేవుడా, నా పిల్లలు తినేందుకు ఒక పిండి బ్యాగ్ దొరికినా చాలు, నేను మరణాన్ని ఆహ్వానిస్తానని ప్రార్థనచేశాను'' అని తెలిపారు.

గాజాలో 9 లక్షల మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. వారిలో 70 వేల మంది పోషకాహార లోపంతో ఉన్నారని ఒక డాక్టర్ బీబీసీకి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పోషకాహార లోపం, ఆకలి కేకలు, మానవతా సహాయ కేంద్రాల వద్ద మరణాలు గాజాలో ఆందోళనకరంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ మద్దతుతో నడిచే వివాదాస్పద గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (డీహెచ్‌ఎఫ్) పంపిణీపైనే అక్కడి ప్రజలు పూర్తిగా ఆధారపడాల్సి వచ్చింది.

''గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మే 27న గాజాలో ఆహారం పంపిణీ చేయడం ప్రారంభించినప్పటి నుంచి అక్కడకు ఆహారం కోసం వెళ్లిన 1000 మందికి పైగా పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం చంపేసింది'' అని ఐరాస మానవ హక్కుల కార్యాలయానికి చెందిన అధికార ప్రతినిధి తమీన్ అల్-ఖీతన్ చెప్పారు.

'' జులై 21 వరకు ఆహారం తెచ్చుకోవడానికి వెళ్లిన 1,054 పైగా ప్రజలు గాజాలో చనిపోయారు. వారిలో 766 మంది జీహెచ్ఎఫ్ కేంద్రాలకు సమీపంలో చనిపోగా, 288 మంది ఐరాస, ఇతర మానవతా సహాయ కేంద్రాల కాన్వాయిల వద్ద మరణించారు'' అని బీబీసీ వరల్డ్ సర్వీసుకు తమీన్ తెలిపారు.

గాజా నగరంలో జీహెచ్‌ఎఫ్ కేంద్రం వద్ద పంపిణీ చేస్తోన్న ఆహారం కోసం వేచిచూస్తోన్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

పెరుగుతున్న మరణాలు

జీహెచ్ఎఫ్ మే చివరిలో గాజాలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. దక్షిణ, మధ్య గాజాలో పలు కేంద్రాల వద్ద పరిమితి స్థాయిలో మాత్రమే ఆహారాన్ని పంపిణీ చేస్తోంది.

ఇజ్రాయెల్ 11 వారాలపాటు నిర్భంధం విధించిన కారణంగా గాజాలోకి ఎలాంటి ఆహార సరఫరాలు వెళ్లలేదు. ఆ తర్వాత పరిమిత స్థాయిలో జీహెచ్‌ఎఫ్ సేవలను అనుమతించింది ఇజ్రాయెల్. గత 48 గంటల్లో పోషకాహార లోపంతో 12 మంది చిన్నారుల సహా 33 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

గత 72 గంటల్లో తమ భూభాగంలో ఆకలితో, పోషకాహార లోపంతో 21 మంది చిన్నారులు చనిపోయారని గాజా నగరంలోని షిఫా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ అబు సల్మియా చెప్పారు. గాజాలో 9 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని, వారిలో 70 వేల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆయన బీబీసీతో చెప్పారు.

మరణాల సంఖ్య చాలా దారుణంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్, కిడ్నీ రోగులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపారు.

గత 48 గంటల్లో పోషకాహార లోపంతో 12 మంది చిన్నారులతో సహా 33 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికార ప్రతినిధి చెప్పారు.

2023లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పోషకాహార లోపంతో మొత్తంగా 101 మంది చనిపోతే, వారిలో 80 మంది చిన్నారులున్నట్లు తెలిపారు.

పోషకాహార లోపం వల్ల శరీర బరువును మూడింతల మేర కోల్పోయిన బాలుడిని ఎత్తుకున్న తల్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముహమ్మద్ జకారియా అయ్యోబ్ అల్-మతౌఖ్ వంటి పిల్లలు చాలామంది తీవ్రమైన పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు.

ఆకలి కేకలు

గాజాలో మొత్తం జనాభా ఆకలితో అలమటిస్తున్నట్లు వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ (డబ్ల్యూఎఫ్‌పీ) తెలిపింది.

''పోషకాహార లోపం పెరుగుతోంది. 90 వేల మంది మహిళలకు, పిల్లలకు తక్షణమే వైద్యం సాయం అందించాల్సి ఉంది. ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరికి ఎన్నో రోజుల పాటు ఆహారం దొరకక అలమటిస్తున్నారు.'' అని ఆదివారం డబ్ల్యూఎఫ్‌పీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

'' ఆహారం పొందాలంటే చాలామందికి ఉన్న ఏకైక మార్గం ఆహార కేంద్రాలే. కేజీ పిండి గల ఒక బ్యాగు ధర స్థానిక మార్కెట్లలో 100 డాలర్లకు పైగా (రూ.8,641) పలుకుతోంది.

మార్చి నెలలో గాజాలోకి వెళ్లే అన్ని దారులను ఇజ్రాయెల్ మూసివేసింది. ఆహారం, ఇంధనం, వైద్య సరఫరాలు ఏవీ గాజాలోకి ప్రవేశించకుండా అడ్డుకుంది. హమాస్‌తో రెండు నెలల కాల్పుల విరమణ ముగిసిన రెండు వారాలకు ఇజ్రాయెల్ తిరిగి తన సైనిక దాడిని ప్రారంభించింది.

ఈ నిర్భంద సమయంలో గాజా ఆరోగ్య వ్యవస్థకు అత్యంత అవసరమైన వైద్య సరఫరాలను, టీకాలను, వైద్య పరికరాలను కూడా అనుమతించలేదు.

మే మధ్య కాలం నుంచి ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి 4,400 లారీల హ్యుమానిటేరియన్ ఎయిడ్ (మానవతా సహాయం) వచ్చినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గాజా వైపునున్న క్రాసింగ్ పాయింట్ల వద్ద మరో 700 లారీల లోడుతో మానవతా సహాయాలు ఎదురుచూస్తున్నాయని, వీటిని ఐక్యరాజ్యసమితి తీసుకోవాల్సి ఉందని చెప్పింది.

గాజా భూభాగంలో మానవతా సహాయాలకు ఎలాంటి కొరత లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ తన ఫైటర్లకు ఇవ్వడానికి, డబ్బును సేకరించడానికి మానవతా సహాయాన్ని దొంగిలించి నిల్వ చేస్తోందని ఆరోపించింది.

గాజా ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

యూకే, కెనడా, ఫ్రాన్స్ సహా 28 దేశాలు వెంటనే గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చాయి. అక్కడ పౌరుల పడుతోన్న బాధలు దారుణంగా మారాయని చెప్పారు.

''ఇజ్రాయెల్ మానవతా సహాయాల పంపిణీ విధానం చాలా ప్రమాదకరంగా ఉంది. కనీస మానవతా సహాయాలు అందకపోవడం కూడా ఖండించదగినది. ఆహారాన్ని, నీటిని కోరుకుంటోన్న పౌరులను హత్య చేయడం అమానవీయం.'' అని ఈ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

అయితే, ఈ దేశాల ప్రకటనను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. వాస్తవానికి దూరంగా, హమాస్‌కు తప్పుడు సందేశాన్ని ఈ ప్రకటన అందిస్తుందని తెలిపింది.

అయితే, అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన జీహెచ్ఎఫ్‌ మే చివరిలో మానవతా సహాయాలను పంపిణీ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆహారం కోసం ఈ సహాయ కేంద్రాల వద్దకు వచ్చే పాలస్తీనియన్లు హత్యలకు గురవుతున్నారని చాలా వార్తా కథనాలు వస్తున్నాయి.

గాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరుచాలా రోజుల పాటు ఆహారాన్ని తినడం లేదని వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ తెలిపింది.

'మేం నిరుపేదలం'

'' ఒక కేజీ పిండి ధర ప్రస్తుతం మార్కెట్లో 90 డాలర్లు పలుకుతోంది. మేం నిరుపేదలం.'' అని మొహమ్మద్ బెఖిత్ బీబీసీ న్యూస్ అరబిక్‌కు చెప్పారు. పిల్లలకు కనీస అవసరాలను కూడా తాము అందించలేకపోతున్నామని తెలిపారు.

మానవతా సహాయ కేంద్రాల వద్ద నిత్యం ప్రజలపై జరుగుతోన్న దాడులపై కూడా ఆమె మాట్లాడారు.

''నాపక్కన ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. ఒక్కసారిగా ఆయన తలపై ఎవరో షూట్ చేశారు.'' అని బెఖిత్ చెప్పారు.

''బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియలేదు. బతికేందుకు మేం ఒకరి వెనుకాల మరొకరం పరిగెట్టాం. కానీ, చాలామంది మేం రక్తంలో తడిసిపోయాం. పిండి సంచీ దొరికినా ప్రతి ఒక్కరికీ బుల్లెట్ గాయాలు తగిలాయి.'' అని తెలిపారు.

గాజాలో జీహెచ్ఎఫ్ నడిపే సహాయ పంపిణీ కేంద్రాలకు వద్దపౌరులపై దాడులు జరుగుతున్నాయని వస్తున్న రిపోర్టులను పరిశీలిస్తున్నామని గత నెలలో ఇజ్రాయెల్ మిలటరీ బీబీసీకి చెప్పింది.

తాజా దాడులు

ఈ వారం ఇజ్రాయెల్‌ ట్యాంకులు తొలిసారి మధ్య గాజాలోని డెయిర్ అల్-బలాలోకి చొచ్చుకు వెళ్లాయి. దీంతో అక్కడి పౌరులు అక్కడి నుంచి మరోప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది.

డెయిర్ అల్-బలాలోని దక్షిణ ప్రాంతంలోని ఆరు నగర బ్లాక్‌లను తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల, వేలాది కుటుంబాలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చింది.

హమాస్‌తో 21 నెలలుగా జరుగుతోన్న యుద్ధంలో ఎలాంటి భారీ ఉపరితల ఆపరేషన్ జరగని ప్రాంతాల్లో డెయిర్ అల్-బలా ఒకటి.

డెయిర్ అల్-బలా జిల్లాలకు తమ సైన్యం దూరంగా ఉండటానికి కారణం హమాస్ బందీలుగా తీసుకెళ్లిన వారిని అక్కడ ఉంచారేమోనన్న అనుమానమని ఇజ్రాయెల్ వర్గాలు చెప్పాయి. గాజాలో బందీలుగా ఉన్న మిగిలిన 50 మంది ఇజ్రాయెలీల్లో కనీసం 20 మంది అయినా బతికి ఉండొచ్చని భావిస్తున్నారు.

డెయిర్ అల్-బలాను ఖాళీ చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులతో వేలమంది పాలస్తీనా ప్రజలు ప్రభావితమయ్యారని, మానవతా సహాయాలకు ఇది మరో ఎదురుదెబ్బ అని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

ఈ పరిసరాలలో నిరాశ్రయులైన కుటుంబాల కోసం డజన్ల కొద్దీ శిబిరాలు ఉన్నాయి.

అలాగే సహాయ గోదాములు, ఆరోగ్య క్లినిక్‌లు, నీటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

డెయిర్ అల్-బలాలో ఇజ్రాయెల్ ఆపరేషన్ సందర్భంగా ఈ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. తమ ఉద్యోగుల ఇళ్లపై మూడు సార్లు దాడి జరిగిందని చెప్పింది.

ఇజ్రాయెల్ సైన్యం తమ స్థావరాల్లోకి ప్రవేశించి, తమ పురుష సిబ్బందిని అక్కడిక్కడే బంధించి, విచారించిందని, నలుగురిని అదుపులోకి తీసుకుందని, వారిలో ముగ్గుర్ని విడుదల చేసిందని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ తెలిపింది.

ఈ ఘటనలపై ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

గాజాలో ఆహార సదుపాయాల కోసం ప్రజలు పెద్ద పెద్ద లైన్లలో వేచిచూస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాలో ఆహార సదుపాయాల కోసం ప్రజలు పెద్ద పెద్ద లైన్లలో వేచిచూస్తున్నారు.

'మానవ నిర్మిత విధ్వంసం'

తాజాగా కాల్పులు ప్రారంభమైనప్పటికీ డిశాలినేషన్ ప్లాంట్‌ సహా కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడేందుకు తమ సిబ్బంది గాజాలోనే ఉంటారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

గాజాలో ప్రస్తుతం జరుగుతున్నది మానవ నిర్మిత విధ్వంసమని యూఎన్ పాలస్తీనియన్ రిఫ్యూజీ ఏజెన్సీ (యూఎన్ఆర్‌డబ్ల్యూఏ) కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలియట్ టౌమా చెప్పారు.

గాజాలో తమ కార్యకలాపాలను ఇజ్రాయెల్ నిషేధించిందని టౌమా చెప్పారు. మానవతా సహాయాలతో ఉన్న 6 వేల ట్రక్కులను పంపిణీ చేయకుండా అడ్డుకుందని తెలిపారు.

''గత 24 గంటలుగా ఆకలి, పోషకాహార లోపంతో డ్యూటీలో ఉన్న కొంతమంది యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఉద్యోగులు మూర్ఛపోయారని చెప్పినట్లు తమ ఉద్యోగులు కొందరు చెప్పారు.'' అని ఆమె తెలిపారు.

ఆకలిని ఒక యుద్ధ విధానంగా వాడుతున్నందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు, ఆయన మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లే నేరపూరిత బాధ్యత వహించాల్సి ఉందని నమ్మేందుకు సహేతుక కారణాలున్నాయని 2024 నవంబర్‌లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు చెందిన ఒక ప్యానల్ తెలిపింది.

అయితే, ఆకలిని యుద్ధ ఆయుధంగా వాడుతున్నారనే ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. దీన్ని తప్పుడు ఆరోపణగా నెతాన్యాహు చెప్పారు.

2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి 59 వేల మందికి పైగా ప్రజలు చనిపోయారని గాజాలో హమాస్‌ నడిపే ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ దాడులకు ముందు హమాస్ చేసిన దాడుల్లో 1200 మంది ఇజ్రాయెలీలు చనిపోగా, 251 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. అమెరికా, యూకే, ఇజ్రాయెల్ వంటి దేశాలు హమాస్‌ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా పేర్కొంటున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)