పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్.. అమెరికా, ఇజ్రాయెల్ ఏమన్నాయంటే..

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జరోస్లవ్ లుకివ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రానున్న సెప్టెంబర్‌లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ చెప్పారు. దీంతో పాలస్తీనాను దేశంగా గుర్తించే తొలి జీ7 దేశం ఫ్రాన్స్ కానుంది.
న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు మేక్రాన్ ఎక్స్‌లో చేసిన పోస్ట్ ద్వారా తెలిపారు.
''గాజాలో యుద్ధాన్ని తక్షణమే ముగించి సాధారణ ప్రజలను తక్షణం రక్షించాల్సిన అవసరం ఉంది. శాంతిని నెలకొల్పడం సాధ్యమే. తక్షణమే కాల్పుల విరమణ పాటించాల్సిన అవసరం ఉంది. బందీలందరినీ విడుదల చేయాలి. గాజా ప్రజలకు పెద్దయెత్తున మానవతాసాయం అందించాలి'' అని ఆయన ఆ పోస్టులో రాశారు.
మేక్రాన్ నిర్ణయాన్ని పాలస్తీనా అధికారులు స్వాగతించారు.
అయితే, ఇది 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి తర్వాత ''ఉగ్రవాదానికి దక్కిన బహుమతి'' అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
మేక్రాన్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు అమెరికా తెలిపింది. ఈ నిర్ణయం నిర్లక్ష్యపూరితమైదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అభివర్ణించారు.
జీ7 అనేది ప్రధాన పారిశ్రామిక దేశాల గ్రూప్. దీనిలో ఫ్రాన్స్‌తో పాటు అమెరికా, యూకే, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ ఉన్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
‘గాజాను సురక్షితంగా పునర్నిర్మించాలి’
''మధ్య ఆసియాలో న్యాయమైన, శాశ్వతమైన శాంతి కోసం ఫ్రాన్స్ చారిత్రక నిబద్ధతకు అనుగుణంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని నిర్ణయించుకున్నా'' అని గురువారం(జూలై 24)ఎక్స్‌లో చేసిన పోస్టులో మేక్రాన్ తెలిపారు.
''హమాస్‌ను నిరాయుధంగా మార్చడానికి, గాజాను సురక్షితంగా పునర్నిర్మించడానికి కూడా గ్యారంటీ ఇవ్వాలి.''
''చివరగా, మనం పాలస్తీనాను నిర్మించాలి. ఇజ్రాయెల్‌ను పూర్తిగా గుర్తించడం, పాలస్తీనా నిరాయుధీకరణను అంగీకరించడం ద్వారా దాని మనుగడకు హామీ ఇవ్వాలి. ఇది మధ్యఆసియాలోని అందరి భద్రతకు ఉపయోగపడుతుంది. ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు'' అని మేక్రాన్ అభిప్రాయపడ్డారు.
తన నిర్ణయాన్ని ధ్రువీకరిస్తూ పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్‌కు ఒక లేఖను కూడా మేక్రాన్ ఎటాచ్ చేశారు.
''ఈ చర్య అంతర్జాతీయ చట్టంపై ఫ్రాన్స్ నిబద్ధత, స్వయం నిర్ణయం, స్వతంత్ర దేశ స్థాపన విషయంలో పాలస్తీనా ప్రజల హక్కులకు ఫ్రాన్స్ మద్దతును సూచిస్తోంది'' అని మేక్రాన్ ప్రకటనపై అబ్బాస్ డిప్యూటీ హుస్సేన్ అల్ షేక్ స్పందించినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘శాంతియుతంగా జీవించే పరిస్థితి లేదు’
''అక్టోబర్ 7న జరిగిన మారణహోమం తర్వాత, టెల్ అవీవ్‌కి పొరుగున పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనే అధ్యక్షుడు మేక్రాన్ నిర్ణయాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని ఎక్స్‌లో చేసిన పోస్టులో నెతన్యాహు స్పందించారు.
''ఈ పరిస్థితుల్లో పాలస్తీనా దేశం ఇజ్రాయెల్‌ను నిర్మూలనకు ఓ లాంచ్‌పాడ్‌లా ఉంటుంది గానీ.. పక్కనే శాంతియుతంగా జీవించడానికి కాదు. ఒక విషయం స్పష్టం.. పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ పక్కన ఓ దేశాన్ని కోరుకోరు. ఇజ్రాయెల్‌కు బదులుగా దేశాన్ని కోరుకుంటారు'' అని నెతన్యాహు అన్నారు.
''సరైన దిశగా తీసుకున్న సానుకూల అడుగు''గా హమాస్ ఫ్రాన్స్ నిర్ణయాన్ని అభివర్ణించింది. ఫ్రాన్స్‌ను ప్రపంచంలోని అన్నిదేశాలూ అనుసరించాలని విజ్ఞప్తి చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
యూకే ప్రధాని ఏమన్నారు?
ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న 193 దేశాల్లో 140కి పైగా దేశాలు పాలస్తీనాను గుర్తించాయి.
వాటిలో స్పెయిన్, ఐర్లాండ్‌లాంటి కొన్ని యూరోపియన్ దేశాలున్నాయి.
ఇజ్రాయెల్‌కు ప్రధానంగా మద్దతిచ్చే అమెరికా, దాని మిత్రదేశాలు, యూకే పాలస్తీనాను గుర్తించలేదు.
మరణాలను ఆపేందుకు తక్షణమే ఏం చేయగలమనేదానిపై చర్చించేందుకు ఫ్రాన్స్, జర్మనీ నాయకులతో అత్యవసరంగా మాట్లాడతానని యూకే ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఓ ప్రకటనలో తెలిపారు.
దేశం హోదా అనేది పాలస్తీనా ప్రజల విడదీయలేని హక్కు అని స్టార్మర్ అన్నారు.
పాలస్తీనా దేశాన్ని గుర్తించడానికి, రెండు దేశాల పరిష్కారానికి కాల్పుల విరమణ ఒప్పందం మనకో మార్గాన్ని చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫ్రాన్స్ నిర్ణయాన్ని యూకే అనుసరించాలని సొంత పార్టీ ఎంపీల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్న సమయంలో స్టార్మర్ ప్రకటన విడుదలైంది.
యూకే విదేశాంగ విధానాన్ని పర్యవేక్షించే విదేశీ వ్యవహారాల కమిటీలోని మెజార్టీ ఎంపీలు తక్షణమే పాలస్తీనాను గుర్తించాలని తాజాగా డిమాండ్ చేశారు.
విడదీయరాని హక్కును షరతులతో కూడినదిగా చేయకూడదని కమిటీ రిపోర్టు తెలిపింది.
ఫ్రాన్స్ నిర్ణయాన్ని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.

ఫొటో సోర్స్, Getty Images
గాజాలో ఏం జరుగుతోంది?
దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ మిలిటరీ గాజాపై విస్తృత దాడులు చేస్తోంది. హమాస్ దాడిలో 1,200 మంది చనిపోయారు. 251మందిని బందీలుగా తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడుల్లో 59,106 మంది చనిపోయారని గాజాలోని హమాస్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
గాజాలో చాలా భాగం శిథిలావస్థలో ఉంది.
గాజా నగరంలో ప్రతి ఐదుగురి పిల్లల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థి సంస్థ(యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ)తెలిపింది.
గాజాలో సామూహిక కరవు గురించి వందకు పైగా అంతర్జాతీయ సహాయ సంస్థలు, మానవ హక్కుల గ్రూపులు హెచ్చరించాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరాయి.
పాలస్తీనా భూభాగంలోకి వెళ్లే అన్ని సరఫరాలను నియంత్రించే ఇజ్రాయెల్ మాత్రం.. తాము వేటినీ అడ్డుకోవడం లేదని, పోషకాహరలోపానికి హమాసే కారణమని పదే పదే చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














