‘తినడానికి తిండి లేక వీధుల్లోనే కుప్పకూలుతున్నారు’

గాజా, ఇజ్రాయెల్, మానవతాసంస్థలు, ఆహార కొరత

ఫొటో సోర్స్, Getty Images

''మాకు స్వర్గానికి వెళ్లాలని ఉంది. ఎందుకంటే అక్కడ కనీసం ఆహారమైనా దొరుకుతుంది'' - గాజా చిన్నారులు తమ తల్లిదండ్రులతో చెబుతున్న మాటలివి.

ఆహార కొరతతో గాజా ప్రజలు అల్లాడుతున్నారని మానవ హక్కుల సంఘాలు, వందకు పైగా అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

మెడిసన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్(ఎంఎస్ఎఫ్), సేవ్ ద చిల్డ్రన్, ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు సంయుక్త ప్రకటనపై సంతకం చేశాయి.

గాజాలోని ప్రజలతో పాటు అక్కడ వారికి సేవ చేసేందుకు వెళ్లిన సిబ్బంది కూడా ఆకలితో అలమటిస్తున్నారని ఆ ప్రకటనలో తెలిపాయి.

గాజా ప్రాంతంలోకి వచ్చే సరఫరాలన్నింటినీ నియంత్రిస్తున్న ఇజ్రాయెల్ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. హమాస్ ప్రచారానికి ఈ సంస్థలు ఉపయోగపడుతున్నాయని ఆరోపించింది.

పోషకాహార లోపంతో ఒక్క రోజులో మరో పదిమంది పాలస్తీనియన్లు మరణించారని గాజాలో హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన తర్వాత సంస్థల ప్రకటన వెలువడింది.

ఆదివారం నుంచి కేవలం నాలుగు రోజుల్లో 43 మంది ఇలా మరణించారని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గాజా, ఇజ్రాయెల్, మానవతాసంస్థలు, ఆహార కొరత

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజాలో సహాయ సిబ్బంది కూడా తిండి దొరక్క అల్లాడుతున్నారని మానవతా సంస్థలు తెలిపాయి.

‘వీధుల్లో కుప్పకూలిపోతున్నారు’

తిండి లేక, తట్టుకోలేని నీరసంతో ప్రజలు ఆస్పత్రుల్లో చేరారని, కొందరు వీధుల్లోనే కుప్పకూలిపోతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

''ఆహారం అందించే లైన్లలో గాజా ప్రజలతో పాటు సహాయ సంస్థల సిబ్బందీ నిలబడుతున్నారు. కాల్పులకు గురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ తమ కుటుంబాలకు ఆహారం అందించేందుకు ఫుడ్ లైన్లలో నిల్చుంటున్నారు'' అని జులై 23న ప్రచురితమైన ఓ ప్రకటనలో 109 మానవతాసంస్థలు తెలిపాయి.

సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో తమ సహచరులు, భాగస్వాములు తమ కళ్లముందే నీరసించి పోవడాన్ని మానవతాసంస్థలు చూస్తున్నాయి.

మార్చి నెల ప్రారంభం నుంచి గాజాలోకి మానవతాసాయాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా నిలిపివేసింది. రెండు నెలల కాల్పుల విరమణ ఎత్తివేసి గాజాపై మళ్లీ పూర్తిస్థాయి దాడులు ప్రారంభించింది.

రెండు నెలల తర్వాత నిర్బంధం కాస్త సడలించినప్పటికీ ఆహారం, మందులు, ఇంధనం కొరత తీవ్రమైంది.

గాజా, ఇజ్రాయెల్, మానవతాసంస్థలు, ఆహార కొరత

ఫొటో సోర్స్, Reuters

‘స్వర్గానికి వెళ్తాం...అక్కడ తిండయినా దొరుకుతుంది’

''పిల్లలు, వృద్ధుల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. డయేరియా వ్యాపిస్తోంది. మార్కెట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. చెత్త పేరుకుపోయింది. ఆకలి, డీహైడ్రేషన్‌తో ప్రజలు వీధుల్లోనే కుప్పకూలిపోతున్నారు'' అని మానవతాసంస్థలు చెప్తున్నాయి.

''మాకు స్వర్గానికి వెళ్లాలని ఉంది. ఎందుకంటే అక్కడ కనీసం ఆహారమయినా దొరుకుతుంది'' అని పిల్లలు తల్లిదండ్రులతో చెబుతున్నారని, పిల్లలపై ఆకలి ప్రభావం తీవ్రంగా ఉందని మానసికపరమైన మద్దతు అందించే ఓ సహాయ సంస్థ వర్కర్ తెలిపారు.

గాజా జనాభాలో నాలుగోవంతుమంది కరవులాంటి పరిస్థితుల మధ్య ఉన్నారని, లక్షమందికిపైగా మహిళలు, పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వీలయినంత తొందరగా చికిత్స అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

గాజా ప్రజల్లో ఎక్కువమంది సామూహిక ఆహార కొరత ఎదుర్కొంటున్నారని, మనిషి సృష్టించిన ఈ పరిస్థితిని ఇంతకన్నా ఏమనాలో తెలియడం లేదని, నిర్బంధం వల్లే ఇది జరిగిందన్న విషయం స్పష్టమని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ చెప్పారు.

గాజా, ఇజ్రాయెల్, మానవతాసంస్థలు, ఆహార కొరత

ఫొటో సోర్స్, Reuters

‘ఏ పరిస్థితి రాకూడదనుకున్నామో అదే వచ్చింది’

మూడు రోజుల నుంచి ఆహారం దొరకడం లేదని ఖాన్ యూనిస్ నగరంలోని నసీర్ ఆస్పత్రిలో పిల్లల చికిత్స విభాగం అధిపతి డాక్టర్ అహ్మద్ అల్ ఫరా బీబీసీతో చెప్పారు.

ఆకలితో అలమటిస్తూ పిల్లలు ఆస్పత్రికి వస్తున్నారని, కొందరు పోషకాహారలోపంతో మరణించారని, మరికొందరు శరీరం పోషకాలను గ్రహించలేని ఆరోగ్యసమస్యల బారిన పడ్డారని ఆయన తెలిపారు.

ఏ పరిస్థితి వస్తుందని భయపడ్డామో..ఆ పరిస్థితి వచ్చేసిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

సరఫరా కొరతతో స్థానిక మార్కెట్లలో ధరలు ఆకాశాన్నితాకుతున్నాయి. చాలా కుటుంబాలు ఆ ధరల భారాన్ని తట్టుకోలేకపోతున్నాయి.

ప్రతిరోజూ కేవలం పిండి కోసం 90 డాలర్లు(సుమారు రూ.7,500కు పైగా) అవసరమవుతున్నాయని గాజాకు చెందిన ఓ పౌరుడు చెప్పారు.

ఇజ్రాయెల్, అమెరికా మద్దతిస్తున్న వివాదాస్పద సహాయ పంపిణీ వ్యవస్థ గాజా హ్యూమన్‌టేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) కార్యకలాపాలు మొదలైన మే 27 నుంచి ఆహారం పొందేందుకు ప్రయత్నిస్తున్న 1,050 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ మిలటరీ కాల్చిచంపిందని యూఎన్ చెప్పినట్టు మానవతాసంస్థలు తెలిపాయి.

తాము ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని జీహెచ్ఎఫ్ సైట్ల దగ్గరున్న తమ సిబ్బంది హెచ్చరిక కాల్పులు మాత్రమే జరిపారని ఇజ్రాయెల్ అంటోంది.

గాజా, ఇజ్రాయెల్, మానవతాసంస్థలు, ఆహార కొరత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని మానవతా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

‘మానవతా సాయం ఉన్నా పంచే వీలులేదు’

దాదాపు గాజా ప్రజలు మొత్తం చెల్లాచెదురయ్యారని, ఇజ్రాయెల్ కాల్పుల పరిధిలోకి రాని భూభూగం 12శాతం కన్నా తక్కువ ఉందని, ప్రజలంతా అక్కడే ఉండడంతో సహాయ కార్యకలాపాలు అసాధ్యంగా మారాయని మానవతాసంస్థలు తెలిపాయి.

గాజాలో ప్రతిరోజూ సగటున 28లారీ లోడ్‌ల సాయం మాత్రమే పంపిణీ జరుగుతోందని, ఇజ్రాయెల్ నిర్బంధం వల్ల గాజా బయట, వేర్‌హౌసులతో పాటు గాజాలోపల కూడా టన్నుల కొద్దీ ఆహారం, పరిశుభ్రమైన నీళ్లు, ఔషధాలు, ఇంధనం ఉండిపోతున్నాయని వెల్లడించాయి.

మానవతా సాయాన్ని అనుమతించడంలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని అనుసరించాలని ఐక్యరాజ్యసమితి అంటుండగా, తమ చర్యలన్నీ అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ఇజ్రాయెల్ వాదిస్తోంది.

గత రెండు నెలల్లో దాదాపు 4,500 లారీ లోడ్లు గాజాలోకి ప్రవేశించాయని, వాటిలో 2,500 టన్నుల పిల్లల ఆహారం ఉన్నాయని గాజాలోకి సహాయ సామగ్రి సరఫరాను సమన్వయం చేసే ఇజ్రాయెల్ సైనిక సంస్థ కోగాట్ ఓ పోస్టులో తెలిపింది.

మానవతాసాయాన్ని పంపిణీ చేయడానికి, క్రాసింగ్ పాయింట్ల దగ్గర, ఇజ్రాయెల్ మిలటరీ జోన్ల దగ్గర అనుమతులు పొందడానికి తాము ఇబ్బందులు పడుతున్నామని ఐక్యరాజ్యసమితి పదే పదే చెబుతోంది.

ఆహారం కోసం ట్రక్కుల దగ్గరికొచ్చే ప్రజలపై కాల్పులు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు.

తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం పాటించాలని, అన్ని నియంత్రణలను ఎత్తివేయాలని, గాజా ప్రజలకు అన్నీ అందుబాటులోకి వచ్చేలా చేయాలని మానవతాసంస్థలు డిమాండ్ చేశాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)