పాలస్తీనాను కొన్ని దేశాలు ఎందుకు గుర్తించడం లేదు?

పాలస్తీనా రాజ్యం, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాలస్తీనా జెండా

పాలస్తీనా రాజ్యాన్ని సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ అధికారికంగా గుర్తిస్తుందని అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఇలా ప్రకటించిన మొదటి జీ7 దేశం ఫ్రాన్స్.

న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టులో మేక్రాన్ తెలిపారు.

"గాజాలో యుద్ధం ముగిసేలా చేసి, పౌరులను రక్షించడం నేటి తక్షణ అవసరం. శాంతి సాధ్యమే. తక్షణ కాల్పుల విరమణ, అందరు బందీలను విడుదల చేయడం, గాజా ప్రజలకు భారీ మానవతా సహాయం అవసరం" అని ఆయన తెలిపారు.

పాలస్తీనా అధికారులు మేక్రాన్ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే, ఈ చర్య అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ దాడి తర్వాత 'రివార్డు' ఇస్తున్నట్లుగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయపడ్డారు.

మేక్రాన్ ప్రకటనను అమెరికా 'తిరస్కరిస్తుంది' అని ఆ దేశ మంత్రి మార్కో రూబియో అన్నారు. మేక్రాన్ నిర్ణయం నిర్లక్ష్యపూరితమన్నారు.

జీ7 అనేది ఫ్రాన్స్‌తో పాటు, యూఎస్, యూకే, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌లు ఉన్న ప్రధాన పారిశ్రామిక దేశాల సమూహం.

పాలస్తీనా రాజ్యాన్ని ఇజ్రాయెల్ గుర్తించడం లేదు. వెస్ట్ బ్యాంక్, గాజాలో పాలస్తీనా రాజ్యం ఏర్పడటాన్ని ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది, అలాంటి రాజ్యం ఇజ్రాయెల్ ఉనికికి ముప్పును కలిగిస్తుందని వాదిస్తోంది.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టులో "ఈ పరిస్థితుల్లో పాలస్తీనా రాజ్యమనేది ఇజ్రాయెల్‌ను నిర్మూలించడానికి ఒక లాంచ్ ప్యాడ్. దాని పక్కన శాంతియుతంగా జీవించడం సాధ్యం కాదు. స్పష్టంగా చెప్పాలంటే: పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌తో పాటు ఒక రాజ్యాన్ని కోరుకోరు; ఇజ్రాయెల్‌ స్థానంలో రాజ్యాన్ని కోరుకుంటారు" అని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాలస్తీనా రాజ్యం, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జూలై 2022లో పారిస్‌లో జరిగిన చర్చల సందర్భంగా పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మొహమూద్ అబ్బాస్ (ఎడమ), ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్.

పాలస్తీనా రాజ్యాన్ని ఏ దేశాలు గుర్తించాయి?

ప్రస్తుతం, పాలస్తీనా రాజ్యాన్ని ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాలలో 140కు పైగా దేశాలు గుర్తించాయి, వీటిలో ఐక్యరాజ్యసమితిలోని అరబ్ గ్రూప్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలున్నాయి.

2024 మేలో పాలస్తీనా రాజ్యాన్ని అధికారికంగా గుర్తించిన స్పెయిన్, ఐర్లాండ్, నార్వే వంటి యూరోపియన్ దేశాలు వాటిలో ఉన్నాయి.

దీనికి ముందు, కొన్ని యూరోపియన్ దేశాలు వాటిలో ఎక్కువ భాగం 1988లో సోవియట్ కూటమిలో ఉన్నప్పుడు అంగీకరించాయి.

అయితే, ఇజ్రాయెల్ ప్రధాన మద్దతుదారు అమెరికా, దాని మిత్రదేశాలు - యూకే, ఆస్ట్రేలియా సహా పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించలేదు.

ఐక్యరాజ్యసమితి సభ్య హోదా, పాలస్తీనా రాజ్యం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఏప్రిల్ చివరలో భద్రతా మండలి సమావేశంలో పాలస్తీనా రాజ్యానికి ఐక్యరాజ్యసమితి పూర్తి సభ్య హోదా కల్పించే తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది.

కొన్ని దేశాలు ఎందుకు గుర్తించడం లేదు?

ఇజ్రాయెల్‌తో చర్చించి, ఒప్పందం చేసుకోకపోవడంతో పాలస్తీనాను కొన్ని దేశాలు ఒక రాజ్యంగా గుర్తించడం లేదు.

"పాలస్తీనా రాజ్య స్థాపన అంశంపై అమెరికా మాట్లాడినప్పటికీ, ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగాలని ఆ దేశం పట్టుబడుతోంది. ఇది స్వతంత్రంగా మారాలనుకునే పాలస్తీనా ఆశలను అడ్డుకునే శక్తి(వీటో)ని ఇజ్రాయెల్‌కు ఇస్తుంది" అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ సంబంధాలు, మిడిల్ ఈస్ట్ రాజకీయాల ప్రొఫెసర్ ఫవాజ్ గెర్గెస్ అభిప్రాయపడ్డారు.

1990లలో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్, పాలస్తీనియన్లు తమ సొంత ప్రత్యేక దేశాలలో శాంతియుతంగా జీవించగలిగే "టు స్టేట్స్ సొల్యూషన్" ఈ చర్చల లక్ష్యం.

అయితే, 2000ల ప్రారంభంలో రెండు దేశాల మధ్య శాంతి ప్రక్రియ క్షీణించడం మొదలైంది. 2014లో వాషింగ్టన్‌లో చర్చలు విఫలమయ్యాయి.

ఇజ్రాయెల్ ఏర్పడటం, 1948-49 యుద్ధం తర్వాత పాలస్తీనా శరణార్థుల పరిస్థితిపై స్పష్టత లేకపోవడం, జెరూసలేం స్థితి, భవిష్యత్ పాలస్తీనా రాజ్యం సరిహద్దులను నిర్ణయించడం వంటి కొన్ని క్లిష్టమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సభ్యత్వ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఐక్యరాజ్యసమితికి ఇజ్రాయెల్ రాయబారి అయిన గిలాద్ ఎర్డాన్ 2024 ఏప్రిల్‌లో ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ, ఈ అంశంపై చర్చించడం 'జాతి విధ్వంసక ఉగ్రవాదానికి విజయం' అని అభిప్రాయపడ్డారు.

ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా సభ్యత్వానికి ఆమోదం దక్కితే అది అక్టోబర్ 7న హమాస్ దాడుల తర్వాత ఇస్తున్న 'రివార్డు'గా ఉండేదని అన్నారు.

మరోవైపు, 1933 మాంటెవీడియో కన్వెన్షన్‌లో నిర్వచించిన రాజ్య హోదా ప్రమాణాలకు పాలస్తీనా సరిపోదని ఇజ్రాయెల్ మద్దతుదారులు సహా కొందరు వాదిస్తున్నారు.

వీటిలో శాశ్వత జనాభా, స్పష్టమైన సరిహద్దులు, ప్రభుత్వం, ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉండే సామర్థ్యం వంటివి ఉన్నాయి.

కానీ, మరికొందరు మాత్రం ఈ నియమాలను సరళంగా అన్వయించుకోవచ్చని, ఇతర దేశాల గుర్తింపు పొందడమే ముఖ్యమని భావిస్తున్నారు.

పాలస్తీనా రాజ్య హోదా

ఫొటో సోర్స్, SHAHZAIB AKBER/EPA-EFE/REX/Shutterstock

ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితిలోని సుమారు 140 దేశాలు పాలస్తీనా రాజ్య హోదాను గుర్తించాయి.

ఐక్యరాజ్యసమితిలో ఎలాంటి హోదా ఉంది?

'సభ్యదేశం కాని పరిశీలక రాజ్యం' హోదాను పాలస్తీనియన్లు కలిగి ఉన్నారు.

ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్య దేశంగా మారడానికి 2011లో పాలస్తీనా దరఖాస్తును సమర్పించింది. కానీ, భద్రతా మండలిలో మద్దతు లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది, ఇది ఓటింగ్‌కూ రాలేదు.

అయితే, 2012లో పాలస్తీనియన్ల హోదాను "సభ్యత్వం లేని పరిశీలక రాజ్యం"గా అప్‌గ్రేడ్ చేయడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది(ఆమోదం తెలిపింది). పాలస్తీనియన్లు తీర్మానాలపై ఓటు వేయలేకపోయినా అసెంబ్లీ చర్చలలో పాల్గొనడానికి ఈ హోదా వీలు కల్పిస్తుంది.

2012 నిర్ణయాన్ని వెస్ట్ బ్యాంక్, గాజాలు స్వాగతించాయి, కానీ అమెరికా, ఇజ్రాయెల్ విమర్శించాయి. అంతేకాదు, 2015లో ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సహా ఇతర అంతర్జాతీయ సంస్థలలో చేరడానికి కూడా పాలస్తీనియన్లకు అనుమతి దక్కింది.

మే 2024లో ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు జనరల్ అసెంబ్లీ మరిన్ని హక్కులను కల్పించింది, చాలా చర్చల తర్వాత దానిని పూర్తి సభ్యదేశంగా అంగీకరించాలని కోరింది.

ఈ తీర్మానం పాలస్తీనా చర్చలలో పూర్తిగా పాల్గొనడానికి, ఎజెండా అంశాలను ప్రతిపాదించడానికి, దాని ప్రతినిధులను కమిటీలకు ఎన్నుకోవడానికి అనుమతించింది, కానీ, ఓటింగ్ హక్కులను మంజూరు చేయలేదు.

యూఎన్ సభ్యత్వాన్ని భద్రతా మండలి మాత్రమే మంజూరు చేయగలదు. పాలస్తీనాను ఒక రాజ్యంగా చేర్చాలని కోరుతూ ఇచ్చిన అల్జీరియన్ తీర్మానాన్ని 2024 ఏప్రిల్‌లో అమెరికా వీటో చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)