‘నాలుగు నెలలుగా తాజా కూరగాయలే తినలేదు.. తింటున్నదంతా గడువు తీరిన క్యాన్డ్ ఫుడ్, పిండి మాత్రమే’.. మానవతా సహాయంపై గాజా ప్రజలు ఏమంటున్నారు?

గాజా ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, రష్దీ అబులౌఫ్
    • హోదా, ఇస్తాంబుల్ నుంచి గాజా ప్రతినిధి

ఇజ్రాయెల్ సైనిక ముట్టడిలో ఉన్న ప్రాంతాల్లో మానవతా సహాయానికి వీలు కల్పించేందుకు గాను దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వస్తున్న రిపోర్టులను గాజా ప్రజలు స్వాగతించారు.

అయితే, ఈ ఉపశమనం ప్రారంభ సంకేతం కావాలని, గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కావాలని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు.

గాజా ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారనే హెచ్చరికలతో పాటు గత కొన్ని వారాలుగా అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితో ఆహారం, వైద్య సరఫరాలు అందించే కాన్వాయ్‌లను అనుమతించేందుకు హ్యుమేనిటేరియన్ కారిడార్లు తెరుస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

బాంబు దాడులు, సరిహద్దులు మూసివేయడంతో గాజా ప్రజల రోజువారీ జీవనం స్తంభించిపోయింది. దీంతో, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న గాజా కొన్ని నెలలుగా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటోంది. శుభ్రమైన నీరు దొరకడం లేదు. ప్రాథమిక వైద్య సరఫరాలు కూడా అందుబాటులో లేవు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘యుద్ధానికి ముగింపు పలకాలి’

''అవును, మళ్లీ కాస్త ఆశ కలిగింది. కానీ, విరామం ముగిస్తే, మళ్లీ ఆకలితో అలమటించాల్సి వస్తుందని బాధేస్తుంది'' అని గాజా నగరంలోని నలుగురు పిల్లల తల్లి 39 ఏళ్ల రాషా అల్-షేక్ ఖాలిల్ చెప్పారు.

''మానవతా సహాయాలను అందించే ఒక కాన్వాయ్ లేదా ఆకాశంలో నుంచి జారవిడిచే కొన్ని ప్యాకేజీలు మాకు సరిపోవు. మాకు అసలైన పరిష్కారం కావాలి. ఈ పీడ కలకు, యుద్ధానికి ముగింపు పలకాలి'' అని ఆమె తెలిపారు.

పిండి, చక్కెర, క్యాన్లలో ఆహారంతో ఉన్న ఏడు ప్యాకేజీలను గాజాలోకి గాల్లోంచి జార విడిచినట్లు ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ ఆదివారం ఈ ప్రకటన చేసింది.

గాజా భూభాగంలోకి ఆహారాన్ని ఆకాశం నుంచి జారవిడిచేందుకు తమ వద్ద ఒక ప్లాన్ ఉందని జోర్డాన్, యూఏఈ తెలిపాయి. ఈ రెండు దేశాలు యూకే సాయంతో ఈ సహాయాలను అందిస్తున్నాయి.

అయితే, ఇలాంటి చర్యలు గాజా ప్రజల ఆకలిని తగ్గించేందుకు అంత ఉపయోగపడవని సహాయ సంస్థలు చెప్పాయి.

''ఇది ఆహార మొత్తానికి సంబంధించిన విషయం కాదు, నాణ్యతకు చెందిన విషయం '' అని ఆరుగురు పిల్లల తల్లి నెవీన్ సలేహ్ చెప్పారు.

'' నాలుగు నెలల్లో మేం కనీసం ఒక్క తాజా పండు కానీ కూరగాయ కానీ తినలేదు. చికెన్ లేదు, మాంసం లేదు, కోడిగుడ్లు లేవు. మా దగ్గర ఉన్నదంతా కేవలం గడువు తీరిన క్యాన్డ్ ఫుడ్స్, పిండి మాత్రమే'' అని తెలిపారు.

మానవతా సహాయ లారీలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

పోషకాహార లోపం పెరుగుతోంది

పోషకాహార లోపం వల్ల డజన్ల సంఖ్యలో గాజా ప్రజలు చనిపోతున్నారని హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి చనిపోయిన వారి సంఖ్య 133 అని, వీరిలో చాలామంది ఇటీవలే చనిపోయినట్లు తెలిపింది.

గాజాలో ఆహార సంక్షోభాన్ని ఫాల్స్ క్లెయిమ్ అంటూ ఇజ్రాయెల్ తోసిపుచ్చింది.

గాజాలో పోషకాహార లోపం పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, ప్రత్యేక ఆహార అవసరాలు ఉన్న వ్యక్తులు ఈ లోపంతో బాధపడుతున్నారని తెలిపారు.

పోషకాహార లోపంతో బాధపడుతున్న వ్యక్తుల్లో గ్లూటెన్ పడని వారు ఉన్నారు. వీరు గోధుమ పిండి ఆహారోత్పత్తులను అంటే బ్రెడ్ లాంటి వాటిని తీసుకోలేరు. గాజాలో ప్రస్తుతం లభ్యమవుతోన్న ఆహారంలో ఇవే ఎక్కువగా ఉన్నాయి.

''నా భార్యకు, ఐదుగురు పిల్లల్లో ఒకరికి సీలియక్ డిసీజ్ ఉంది'' అని సెంట్రల్ గాజాలో నివసించే రమి తాహా చెప్పారు. ఈ వ్యాధి ఉన్న వారు జీవితకాలం గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

'' యుద్ధానికి ముందు నేను గ్లూటెన్ రహిత ఉత్పత్తులనే కొనేవాడిని. కానీ, ఇప్పుడు ఏదీ దొరకడం లేదు. ఐవీ ఫ్లూయడ్స్‌ను ఎక్కించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తుంది'' అని తెలిపారు.

‘శాశ్వత పరిష్కారం కావాలి’

గాజా స్ట్రిప్‌లోకి మానవతా సహాయ లారీలు ప్రవేశించినట్లు ఆదివారం రిపోర్టులు వచ్చాయి. ఎలాంటి నియంత్రణ ఆంక్షలు లేకుండా ఈ లారీలు గాజాలోకి ప్రవేశించాలని, సహాయాలను అందించాలని ఐరాస, ఇతర సహాయ సంస్థలు కోరాయి.

సహాయం అందించిన తర్వాత అంతర్జాతీయ దృష్టి తమపై ఉండదని చాలామంది గాజా ప్రజలు భయపడుతున్నారు.

''ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఇది క్యాన్సర్ రోగికి చికిత్స చేయకుండా పెయిన్‌కిల్లర్స్ ఇచ్చిన మాదిరి '' అని ఉత్తర గాజాలోని ఒక దుకాణదారుడు అహ్మద్ తాహా అన్నారు.

కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరించే ప్రయత్నాలు మసకబారడంతో, గాజా ప్రజలు ఆశకు, నిరాశకు మధ్య కూరుకుపోయారు. వారికి ఏ సహాయం అందినా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. కానీ, గాజా ప్రజలు శాంతి కోసం ఆరాటపడుతున్నారు.

2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేసిన తర్వాత, ఈ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని చేపట్టింది. హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెలీలు చనిపోగా, 251 మందిని బందీలుగా హమాస్ తీసుకెళ్లింది.

గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 59 వేల మందికి పైగా చనిపోయినట్లు హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)